TS Assembly Constituencies
-
కేసీఆర్ సన్నిహితుడికి షాక్
జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటమే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన బీబీ పాటిల్ కోటకు బీటలు వారాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీఆర్ఎస్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ స్థానాలను కోల్పోయింది. జహీరాబాద్, బాన్సువాడ స్థానాలను మాత్రమే నిలుపుకొంది. పాటిల్ కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండటంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల నిర్వహణ బాధ్యతలు సైతం చూశారు. అలాగే సొంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ స్థానాలను సైతం నిలుపుకోలేక పోయారు. అంతే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే పాటిల్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయిన జుక్కల్‌లో సైతం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండేపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అందోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నారాయణఖేడ్ స్థానం సైతం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన భూపాల్‌రెడ్డి 6,547 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. బాన్సువాడ, జహీరాబాద్ సిట్టింగ్ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ నిలుపుకొంది. గత ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి 35 వేల ఓట్ల మెజారిటీ రాగా అది 13 వేలకు పడిపోయింది. ఇక్కడే ప్రచారానికి పరిమితం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్ పరిధిలో అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గం అయిన జుక్కల్‌తోపాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. అయినా వారిని ఓటమి నుంచి తప్పించలేక పోయారు. కేసీఆర్, హరీశ్‌రావు జహీరాబాద్‌కు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే పాటిల్ జహీరాబాద్ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోలైన ఓట్లు బీఆర్ఎస్ : 5,30,194 కాంగ్రెస్ : 5,48,348 బీజేపీ : 1,72,575 -
ఐటీ మంత్రిగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు..?
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంత్రి పదవులపై చర్చ మొదలైంది. జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న దానిపై ఊహాగానాలు జోరందు కున్నాయి. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షబ్బీర్‌అలీ గురించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ సంస్థల యజమాని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కాలం కలిసొస్తే ఐటీ మంత్రిగా అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఎల్లారెడ్డి, జుక్కల్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు కూడా తొలిసారి విజయం సాధించారు. ఇందులో మదన్మోహన్రావు ఐటీ కంపెనీల యజమాని. ఆయన కు పార్టీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అదే ఆయనకు ఎల్లారెడ్డి టికెట్టు రావడానికి కారణమైంది. ఆయనకు మంత్రి మండలిలోనూ అవకాశం కల్పిస్తారని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అనుభవంతో పాటు పార్టీలో ఐటీ రంగానికి సంబంధించి వివిధ రకాల సేవలందించినందున ఆయనకు ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మైనారిటీ కోటాలో.. జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అప్పటి చెన్నారెడ్డి మంత్రిమండలిలో అవకాశం దక్కించుకున్నారు. తర్వా త 2004 ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. 2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, శాసన మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించింది. ఆయన 2014, 2018 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆయన నాలుగైదేళ్లుగా జనంలోనే ఉండి నిరంతరం పనిచేశారు. అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీకి దిగడంతో షబ్బీర్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి వచ్చారు. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి షబ్బీర్‌ను బరిలోకి దింపినా గెలవలేకపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షబ్బీర్‌కు మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లానుంచి గెలిచిన కాంగ్రెస్ నేతల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న విషయమై అంతటా చర్చలు నడుస్తున్నాయి. -
ఉద్యమంలో గులాబీ జెండాను ముద్దాడిన నేల.. సీఎం పోటీ చేసినా తప్పని ఓటమి
తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండాను హత్తుకున్న పల్లెలిప్పుడు అదే పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద అసంతృప్తిని ఓట్ల రూపంలో బయటపెట్టాయి. ఆఖరుకు సీఎం కేసీఆర్ పోటీ చేసినా ఆదరించలేదు. దీంతో కామారెడ్డితో పాటు పొరుగునే ఉన్న ఎల్లారెడ్డి నియోజక వర్గం, ఆ పక్కనే ఉన్న జుక్కల్‌లోనూ బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. వరుసగా గెలిపించిన ప్రజలు ఈసారి వద్దనుకుని సాగనంపారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో 2001 లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన సమాజం గులాబీ జెండాను చేతబట్టి ఉద్యమంలో ముందుండి నడిచింది. టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డిలో ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరడంలో కీలకభూమిక పోషించింది ఈ రెండు నియోజకవర్గాలే.. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కామారెడ్డి నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీని ఇక్కడి ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపించారు. తెలంగాణ సాధన కోసమే ఎన్నికల్లో విజయతీరాలకు తీసుకువెళ్లారు. 2008 లో ఎమ్మెల్యేల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డిని ఓడించినా ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయననే గెలిపించారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అయితే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పగానే ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమవడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో మరోసారి ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడం, ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడడంతో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున బరిలో నిలవగా.. ఓటర్లు వారినే తిరిగి ఎన్నుకున్నారు. తరువాత ఉద్యమం తీవ్రమై సబ్బండ వర్ణాలు భాగమయ్యాయి. రైల్‌రోకో, హైవేల దిగ్బంధం వంటి కార్యక్రమాలు, సకల జనుల సమ్మెల్లో జిల్లా ప్రజలంతా పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 2014 జూన్ 2న నూతన రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంతో జిలా ప్రజలంతా సంతోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు..ఈసారి మూడుచోట్ల ఓటమి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందన్న భావన బలపడుతూ వచ్చింది. దీంతో గులాబీ కోట బీటలు వారింది. సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచినా.. ప్రజలు ఆయననూ తిరస్కరించారు. అలాగే ఎల్లారెడ్డిలో బరిలో నిలిచిన జాజాల సురేందర్‌రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హన్మంత్ సింధేలనూ ఓడించారు. బాన్సువాడ నియోజకవర్గంనుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే గెలుపొందారు. కేసీఆర్ ఉద్యమం తొలినాళ్లలో కామారెడ్డి నియోజక వర్గంలో బ్రిగేడియర్‌గా పనిచేశారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలు ఆయనకు తెలుసు. కేసీఆర్ అంటే అభిమానించేవాళ్లు ఇక్కడ వేలాది మంది ఉంటారు. అలాంటిది కేసీఆర్ పోటీ చేసినా ఓడిపోవడం ఉద్యమకారులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ఓటమితో శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో జనం జిల్లాలో గులాబీ పార్టీకి సలాం కొట్టారు. కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ నుంచి హన్మంత్ సింధేలను గెలిపించారు. 2018 ఎన్నికల్లో కూడా కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల నుంచి తిరిగి గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్ సింధేలనే అసెంబ్లీకి పంపించారు. ఎల్లారెడ్డిలో వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఏనుగు రవీందర్‌రెడ్డిని మాత్రం ఓడించి, మరో ఉద్యమ నాయకుడైన కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్‌ను గెలిపించారు. కొద్దిరోజుల్లోనే ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. -
మంత్రి రేసులో సీతక్క, సురేఖ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తొలి కేబినేట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కొత్త సీఎం పరిపాలన చేయనున్న నేపథ్యంలో జిల్లాలో ఎందరికి అవకాశం దక్కనుంది? జిల్లాలో మొత్తం 10 స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రి పదవి వరించనుంది?’ ఇదీ ఉమ్మడి వరంగల్‌లో సర్వత్రా సాగుతున్న చర్చ. 2023 అసెంబ్లీ ఎ న్నికల ఫలితాలు వెలువడిందే తడవుగా ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్‌రావు ఠాగూర్, డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించారు. సాయంత్రం వరకు సీఎల్పీ నేత ఎంపిక పూర్తవుతుందని భావించినా.. అది మంగళవారానికి వాయిదా పడింది. సీఎల్పీ నిర్వహించిన ఏఐసీసీ పరిశీలకులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్పీ నేత ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పు కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో.. ఆజాబితాలో జిల్లా నుంచి ఎవరుంటా రు? ఉమ్మడిజిల్లా నుంచి మంత్రిగా ఎవరికి అవకా శం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి రేసులో సీతక్క, సురేఖ ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ స్థానాలకుగాను 10 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. ఇక్కడి నుంచి ఇద్దరికి అవకాశం లభించవచ్చంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు మంత్రి పదవులు దక్కాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇద్దరికి అవకాశం ఉంటుందంటున్నారు. ములుగు నుంచి వరుసగా రెండోసారి 33,700 పైచిలుకు ఓట్లతో గెలిచిన ధనసరి సీతక్కకు మొదట కీలకమైన మంత్రి పదవి వరించనుందనే చర్చ జరుగుతుండగా.. రెండో మంత్రి కోసం కొండా సురేఖ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ► ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన వ్యవసాయకూలీల కుటుంబంలో పుట్టిన సీతక్క రాజకీయాల్లోకి రాకముందు జనశక్తి పార్టీకి సంబంధించిన అజ్ఞాత దళంలో దళ కమాండర్‌గా పని చేశారు. ఆతర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా వరంగల్ కోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండుసార్లు ము లుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడోసారి గెలిచి కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమెను రేవంత్‌రెడ్డి దేవుడిచ్చిన ఆడబిడ్డగా చెప్పారు. ఏఐసీసీ అధిష్టానంలోనూ మంచిపేరున్న ఆమెకు మంత్రి పదవి ఖాయమైనట్లే అంటున్నారు. ► రెండో మంత్రి పదవి కోసం వరంగల్ తూర్పు నుంచి గెలుపొందిన కొండా సురేఖ ప్రయత్నంలో ఉన్నారు. బీసీ(పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు అనేక పదవుల్లో కొనసాగారు. గీసుకొండ ఎంపీపీగా, 1999, 2004 శాయంపేట ఎమ్మెల్యేగా, 2009 పరకాల, 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త కొండా మురళి సహకారంతో రాజకీయాల్లో రాణించి ఆమె కూడా ఈసారి వరంగల్ తూర్పు నుంచి గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ► టీడీపీ నుంచి 1994, 1999, 2004లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. సీనియర్ నేత, శాసనసభ్యుడిగా ఉన్న రేవూరి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్‌రావు ఠాగూర్, డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలతో భేటీ అయిన నేపథ్యంలో సీఎల్పీ నేత, సీఎం పేరు ప్రకటిస్తారని అందరూ భావించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించిన కొద్ది గంటల్లో సీఎల్పీ నేత ఎంపిక పూర్తయి కొత్త సీఎం రాత్రి 8.30 గంటలకు ప్రమాణస్వీకారం పూర్తవుతుందనకున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గంతో సోనియాగాంధీ జన్మదినం రోజున లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. సీఎల్పీ నేత ఎంపికపై స్పష్టమైన ప్రకటన రాకపోగా.. అందుకు భిన్నంగా ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాగూర్ తదితరులకు ఢిల్లీకే రావాల్సిందిగా అధిష్టానం సూచించడంతో హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోనే మంగళవారం సమావేశం కానున్న ఏఐసీసీ, టీపీసీసీ నేతలు.. సీఎంతో పాటు మంత్రి వర్గం కూర్పుపై తేల్చనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైందని, 5, 6 తేదీల్లో మంచిరోజులు లేకపోవడంతో 7న ఉదయం 10 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఎంపికయ్యే మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. -
ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే పడ్డాయి. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాలలో మూడు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 15,418 రాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 12,824 వచ్చాయి. హైదరాబాద్‌లో నోటాకు 16,222 ఓట్లు పోలయ్యాయి. అత్యధికం కుత్బుల్లాపూర్, అత్యల్పం నాంపల్లి.. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో నోటాకు 4,079 ఓట్లు రాగా.. అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లొచ్చాయి. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలిచిన మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉండటం కొసమెరుపు. ఇక్కడ యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్‌పై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నోటాకు వచి్చన ఓట్లు 1,423 కావడం గమనార్హం. యాకుత్‌పురలో 878 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 704. నోటా ఓట్లు గతంలో కంటే తక్కువే.. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు నోటా ఓట్లు తక్కువే పోలయ్యాయి. గత ఎన్నికలలో మూడు జిల్లాలతో కూడిన గ్రేటర్లో నోటాకు 44,935 ఓట్లు రాగా.. తాజా ఫలితాల్లో 471 తగ్గి నోటాకు 44,464 ఓట్లొచ్చాయి. గతంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నోటాకు 17,078 ఓట్లు రాగా.. ఈసారి 16,222కు తగ్గాయి. రంగారెడ్డిలో గతంలో 13,242 ఓట్లు పోలవగా.. ఇప్పుడు 12,824 వచ్చాయి. మేడ్చల్–మల్కాజ్‌గిరిలో గతంలో 14,615 ఓట్లు రాగా.. ఈసారి 803 ఓట్లు ఎక్కువొచ్చాయి. తాజా ఫలితాల్లో నోటాకు 15,418 ఓట్లు వచ్చాయి. -
Nalgonda: నోటాకు 11,297 ఓట్లు
నల్గొండ: ఉమ్మడి జిల్లాలో నోటాకు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 11,297 ఓట్లు నోటాకు వచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో 882, ఆలేరు 659, సూర్యాపేట 760, నకిరేకల్ 969, తుంగతుర్తి 1,351, మునుగోడు 849, నాగార్జునసాగర్ 1,056, మిర్యాలగూడ 527, కోదాడ 887, హుజూర్నగర్ 843, దేవరకొండ 1,613, నల్లగొండలో 901 ఓట్లు పడ్డాయి. -
పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియర్లు ఉన్నప్పటికీ టికెట్ దక్కించుకుని వర్ధన్నపేట నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై విజయం సాధించారు. ప్రచారంలో కూడా వెనుకే.. నాగరాజు ఎన్నికల ప్రచారం అంతంతమ్రాతమే చేశారు. ఆయన గెలుపునకు నాయకులు, కార్యకర్తలే కష్టపడ్డారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తమకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ప్రభుత్వంపై వ్యతిరేకత నాగరాజు గెలు పునకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. -
తొలిసారి అసెంబ్లీకి..
సాక్షి, యాదాద్రి, తిరుమలగిరి, హాలియా : భువనగిరి, ఆలేరు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. వీరంతా కాంగ్రెస్‌పార్టీ నుంచే విజయం సాధించడం విశేషం. ► వలిగొండ మండల కేంద్రానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అనిల్‌కుమార్‌రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పైళ్ల శేఖర్‌రెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ► యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన బీర్ల అయిలయ్య తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్నాయకునిగా పని చేసిన అయిలయ్య సైదాపురం పాల సొసైటీ చైర్మన్‌గా, సైదాపురం సర్పంచ్‌గా, యాదగిరిగుట్ట ఎంపీటీసీగా పని చేశారు. ► తుంగతుర్తి నుంచి పోటీ చేసిన మందుల సామేల్ తొలిసారి విజయం సాధించారు. చివరి నిమిషం టికెట్ దక్కించుకున్న సామేల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌పై 51,094 భారీగా మెజార్టీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ► మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్‌రెడ్డి 41 వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బరి నుంచి తప్పుకుని ఆయన వారసుడైన కుందూరు జయవీర్‌రెడ్డిని పోటీలో నిలిపారు. ఈ ఎన్నికల్లో కుందూరు జయవీర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ► మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్‌ను చివరి నిమిషంలో దక్కించుకున్న బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పటికే మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. -
నాడు ‘యతి’ ట్రిక్స్.. నేడు ‘ఝాన్సీ’ పాలిటిక్స్
దేవరుప్పుల: అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో చెన్నూరు (పాలకుర్తి) నియోజకవర్గంలో అప్పట్లో పలు కారణాలతో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యే బరిలో నిలిచే అర్హత కోల్పోయిన యతి రాజారావు అనూహ్యంగా తన సతీమణి విమలాదేవిని నిలిపి విజయం సాధించిన ఘటన నేడు పునరావృతం కావడం సర్వత్రా చర్చించుకుంటున్నారు. 1967లో సోషలిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యతి రాజారావు పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన తరుణంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి ఆశించిన ఆయనకు పార్టీ టికెట్ కేటాయించిన చిక్కులు రావడంతో పట్టువీడని యతి తన భార్య విమలాదేవికి టికెట్టు సంపాదించారు. ప్రత్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విస్నూర్ దేశముఖ్‌ల విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సింహస్వప్నంగా పేరొందిన నల్లా నర్సింహ్ములు (కడవెండి)పై ఆమె విజయం సాధించడం సంచలనాన్ని కలిగించింది. తాజాగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రత్యర్థి పార్టీ నుంచి ఎదురులేదనుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానికురాలుగా ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని ఆరు నెలల కిందట రంగంలోకి దింపడంతో రాజకీయ రణరంగం మొదలైంది. అయితే నామినేషన్ ప్రక్రియ నాటికి ఝాన్సీరెడ్డికి పౌరసత్వం చిక్కులతో ఎన్నికల బరిలో నిలువని పరిస్థితి వచ్చిన విధితమే. ఈ సంఘటనతో ఇక పాలకుర్తిలో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి కరువనుకున్న తరుణంలో అనూహ్యంగానే తన కోడలు మామిడాల యశస్వినిరెడ్డికి టికెట్టు సంపాందించి తన రాజకీయ అరంగేట్రాన్ని చాటడంతో నిరాశనిస్పృహలకు గురైన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ అందుకుంది. పదిహేను రోజుల్లోనే ఎర్రబెల్లికి దీటుగా విస్తృత ప్రచారం చేపట్టే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా రాజకీయ ఆధిపత్యపోరులో నాడు ఎన్నికల బరిలో నిలిచే అర్హత కోల్పోయిన యతి బాటలో నేడు ఝాన్సీరెడ్డి చేసిన పాలిటిక్స్ తీరు ఫలించడంతో వరుస విజయాలతో రాజకీయ సంచలన చరిత్ర కలిగిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కాంగ్రెస్ హవాతో చుక్కెదురు తప్పలేదు. గత ఎన్నికల్లో ఆయన గెలిచిన మెజార్టీతో దగ్గరలో మామిడాల యశస్వినిరెడ్డి గెలవడం గమనార్హం. -
అనూహ్యంగా వచ్చి మంత్రినే ఓడించిన యశస్విని
జనగామ/తొర్రూరు/దేవరుప్పుల: రాజకీయాలతో ప్రత్యక్షంగా అనుభవం లేని యువతి అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించారు. తొలి ఎన్నికలోనే 66 ఏళ్ల రాజకీయ నేత ఎర్రబెల్లిని 26 ఏళ్ల యశస్వినిరెడ్డి మట్టి కరిపించి.. విజయకేతనం ఎగురవేశారు. పాలకుర్తి నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన మామిడాల యశస్వినిరెడ్డి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ కొంతకాలం అత్తామామలకు సహకారంగా సొంత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. వాస్తవానికి పార్టీ అధిష్టానం తొలుత యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. పౌరసత్వం విషయంలో అడ్డంకులు రావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె కోడలు యశస్వినిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో కోడలు యశస్వినిరెడ్డికి అవకాశమివ్వాలని ఝాన్సీరెడ్డి పార్టీని కోరడంతో అధిష్టానం టికెట్ ఇచ్చింది. పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు. పాత చెన్నూరు ప్రస్తుత పాలకుర్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండో మహిళగా యశస్వినిరెడ్డి నిలిచారు. నాడు 26.. నేడూ 26 పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నిక చిత్రవిచిత్రాలకు నెలవుగా మారింది. గెలిచినా, ఓడినా అభ్యర్థులకు 26 సంఖ్యతో అనుబంధం ఉంది. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా దయాకర్‌రావు రాజకీయం నడిపారు. ఆయనపై 26 ఏళ్ల యువతి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల రాజకీయ ఉద్ధండుడు 26 ఏళ్ల యువతి చేతిలో ఓడడం, ఏ వయసులో రాజకీయం ప్రారంభించాడో అదే వయసు యువతిపై ఓటమి పాలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో ఐదేళ్లుగా చేస్తున్న అలుపెరగని పోరాటం ఆయనను నాయకుడిగా నిలబెట్టింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అదే విశ్వాసం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది. అది కూడా ఇద్దరు ఉద్ధండులను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంతగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్).. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి జాయింట్ కిల్లర్ అన్న పేరు సాధించారు. అయితే ఆయనకు ఈ విజయం అంత సులువుగా దక్కలేదు. దీని వెనుక కఠోర శ్రమ ఉంది. ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి.వెంకటరమణారెడ్డి 2018లో జిల్లా కేంద్రంలో నవయువ భేరి పేరుతో ఓపెన్ డిబెట్ కార్యక్రమాన్ని నిర్వహించి, యువతకు రాజకీయాలపై అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలు, నాయకుల మీద యువతలో ఉన్న అపోహలకు సమాధానాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం అప్పట్లో సంచలనం కలిగించింది. మహిళా సంఘాల వడ్డీ బకాయిల కోసం... స్వయం సహాయక సంఘాల మహిళలకు రావలసిన పావలా వడ్డీ బకాయిల కోసం 2018 లో వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఉద్యమం లేవదీశారు. కామారెడ్డి పట్టణంలో ర్యాలీ తీశారు. బకాయిల కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రావలసిన బకాయిలను విడుదల చేసింది. ధాన్యం, మక్కల కొనుగోళ్ల విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై ఆయన రైతులతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. ధరణి పోర్టల్ ద్వారా తలెత్తిన సమస్యలపైనా పోరుసలిపారు. బల్దియాలో అక్రమాలు, మాస్టర్ ప్లాన్‌పై.. కామారెడ్డి బల్దియాలో అక్రమాలపై ఆయన ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో విచారణ జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపై మున్సి పాలిటీ ముందు ప్రజా దర్బార్ నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌తో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆయ న చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. 45 రోజుల పాటు ఆందోళనలు కొనసాగా యి. ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆలయాలు, కుల సంఘాలకు.. నియోజకవర్గంలోని ఆయా గ్రామా ల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధితో పాటు కుల సంఘాలు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి వెంకటరమణారెడ్డి సాయం చేశారు. ఆయా అభివృద్ధి పనులకు ఆయన సొంత డబ్బు దాదాపు రూ.60 కోట్లు వెచ్చించారు. ఒకవైపు ప్రజల సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఏటా శివరాత్రి మహాజాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఇలా పోరా టాలు, ఉద్యమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన నిత్యం జనం నోళ్లలో నానుతూ వచ్చారు. అదే ఆయన విజయానికి బాటలు వేసిందని చెబుతున్నారు. సొంత మేనిఫెస్టోతో ముందుకు.. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని మరోసాహసం వెంకటరమణారెడ్డి చేశారు. ఉచిత విద్య, వైద్యం అందించాలన్న తపనతో రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ బడి, కార్పొరేట్ ఆస్పత్రి నిర్మాణం, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, కార్పొరేట్ స్కూల్, కాలేజీ నిర్మాణం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం, రైతులకోసం రైతు సేవా కేంద్రాలు, ఊరూరా సీసీ కల్లాల నిర్మాణం ఆయన మేని ఫె స్టోలో ముఖ్యమైనవి. తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా ఈ మేనిఫెస్టో అమలు చేస్తా నని ప్రకటించారు. మేనిఫెస్టోకు సంబంధించిన బుక్‌లెట్‌ను ప్రతి ఇంటికి చేర్చారు. -
బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం. బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్‌ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్‌ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్‌ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు. -
కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్ సీనియర్లు’
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల కుమారులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డికి ప్రచారంలో అగ్రబాగాన నిలిచారు. సీనియర్ నాయకుడు యడవెల్లి రంగశాయిరెడ్డి కుమారుడు యడవెల్లి వల్లభ్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ, నిడమనూరు సర్పంచ్ మేరెడ్డి పుష్పలత కుమారుడు శ్రీనివాసరెడ్డి కుమారుడు మేరెడ్డి వెంకట్, కుందూరు లక్ష్మారెడ్డి కుమారుడు దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ చేకూర హన్మంతరావు కుమారుడు చేకూరి శంశీచరణ్ కాంగ్రెస్‌లో చేరి జయవీర్ తరఫున విస్తృ త ప్రచారం ఇర్వహించారు. నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్ అమెరికా నుంచి, కుందూరు దేవేందర్‌రెడ్డి కెనడా నుంచి వచ్చి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనుముల మండలం ఇబ్రహీంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యడవెల్లి నరేందర్‌రెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి సైతం జయవీర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ ప్రచారంలో ఎంతో కలివిడిగా ప్రజలతో మమేకమయ్యాడు. కొన్ని గ్రామాల్లో ఓటర్లు కుందూరు జానారెడ్డి కుమారుడు ఎవరు, ఏడీ అని అడిగిన వారికి వారిని వాహనం వద్దకు తీసుకెళ్లి ఇతనే కుందూరు జయవీర్‌రెడ్డి అని చెప్పి పరిచయం చేశాడు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకతి సత్యం కూడా దివంగత సీనియర్ నేత అంకతి వెంకటయ్య కుమారుడే, మండల యూత్ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్ కుమార్‌గౌడ్ కూడా సీనియర్ నాయకుడు నర్సింగ్ కృష్ణయ్య కుమారుడే కావడం గమనార్హం. యువ రక్తంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆకట్టుకున్నారు. ఆదివారం వెబడే ఫలితాలపై వీరి ప్రభావం ఎంత ఉంటుందో వేచి చూడాల్సిందే. -
రూ.500 నోట్ల హవా..!
భద్రాద్రి: అసెంబ్లీ ఎన్నికల పూణ్యమా అని ప్రస్తుతం మార్కెట్లో రూ.500 నోటు హవా కొనసాగుతోంది. ఎవరి చేతిలో చూసినా ఈ నోటే సందడి చేస్తోంది. రెండు, మూడు రోజులుగా సాధారణ వ్యక్తులతో పాటు అన్ని వర్గాల ప్రజల వరకు రూ.500 నోట్లు జోరుగా చేతులు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటీవల జోరుగా నగదు పంపిణీకి తెర లేపినట్లు తెలిసింది. ఓటర్లకు పంచడానికి ఈ పెద్ద నోట్లనే పెద్ద సంఖ్యలో వాడినట్లు కూడా సమాచారం. ఓటుకు నోటు పంపిణీలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు రూ.500 నోట్లను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండా పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేసినట్లు అన్ని చోట్లా ఆరోపణలు వినిపించాయి. ఈసారి ఎన్నికల్లో అన్ని చోట్లా రూ.500 నోట్ల కట్టలు పెద్దఎత్తున చేతులు మారినట్లు తెలిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటుకు రూ.1,000 నుంచి 2,000 చొప్పున పంపిణీ చేసినట్లు పలువురు చెబుతున్నారు. అక్కడక్కడా పోటీ తీవ్రతను బట్టి ఓటర్లకు కొంత అదనంగా కూడా ముట్టజెప్పినట్లు కూడా వినిపించింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ తంతు గత నెల 27 నుంచి 30 వరకు రాత్రింబవళ్లు కొనసాగగా.. ఈ పంపిణీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.500 నోట్లనే పెద్ద మొత్తంలో సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. ప్రతి గ్రామ పరిధిలో 70 శాతం చొప్పున ఈ పెద్దనోటు చేరింది. ఒకే ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే ఇక వారి పంట పండింది. కనీసం నాలుగు ఓట్లు ఉన్నవారికి దాదాపు 10 వేలకు పైగా చేతికందినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బును పంచారనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో దాదాపు రూ.300 కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ జరిగినట్లు అంచనా. అధికార పార్టీ అభ్యర్థులు ఓటుకు రూ.1,500 నుంచి రూ.2,000 వేల చొప్పున నగదును పంపిణీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున 70 శాతం ఓటర్లకు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క అభ్యర్థికి నియోజకవర్గ పరిధిలో రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు పంచడానికి ఖర్చయినట్లు సమాచారం. డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి చేతికి నగదు చేరింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో దండిగా కరెన్సీ ఉంది. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటే రూ.500 నోట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరగాయలతో పాటు చిన్నాచితకా అవసరాలకు సైతం ఈ పెద్దనోటునే తీస్తున్నారు. అన్ని అవసరాలకు ఈ రూ.500 నోటే అధారంగా నిలుస్తోంది. రెండు రోజులుగా డిజిటల్ లావాదేవీలు సైతం తగ్గిపోయాయని బ్యాంకు అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ అవసరాల నిమిత్తం చేతి నుంచే నగదు అందజేస్తున్నారని ఇందుకోసం ఎన్నికల వేళ ఇచ్చిన రూ.500 నోట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్కెట్లో రూ.500 నోట్ల తాకిడితో రూ.100, రూ.200 నోట్ల చెలామణి అంతగా కనిపించడం లేదు. అంతటా పెద్దనోట్లు వాడటంతో అటు చిల్లర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు ఫోన్–పే, గూగూల్–పే వినియోగం సగానికి తగ్గిపోగా, అటు ప్రధాన బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో వినియోగదారుల సందడి కనిపించడం లేదు. అందరికీ చేతినిండా నగదు ఉండటంతో అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో పలు ఏటీఎం సెంటర్లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోయి కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పెద్దనోట్ల చలామణి పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటుండగా, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు సైతం కండక్టర్లకు రూ.500 నోటునే ఇవ్వటంతో చిల్లర లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు అంతగా కనిపించని రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అందరూ పెద్ద నోట్లే ఇస్తున్నారు.. తాజాగా ఓటుకు నోటు పంపకాల్లో ప్రతి ఒక్కరికీ ఈ పెద్దనోట్లనే అందించినట్లున్నారు. దీంతో అందరి దగ్గర రూ.500 నోట్లే ఉంటున్నాయి. రెండురోజులుగా షాపునకు వచ్చే కస్టమర్లు చిన్న అవసరానికి కూడా ఈ నోటునే తీస్తున్నారు. మొన్నటివరకు చిన్న నగదుకు సైతం ఫోన్–పే, గూగుల్–పే వంటివి చేసేవారు. ఇప్పుడు అవి సగానికి సగం తగ్గిపోయాయి. అందరూ డబ్బులే ఇస్తున్నారు. – బల్దేవ్, చిరు వ్యాపారి -
పరకాలలో 84.61 శాతం పోలింగ్
పరకాల: పరకాల నియోజకవర్గంలో 84.61 శాతం పోలింగ్ నమోదైనట్లు పరకాల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పరకాల నియోజకవర్గంలో 2,21,436 మంది ఓటర్లుండగా.. వారిలో పురుషులు 1,08,280 మంది ఉన్నా రు. 1,13,154 మంది మహిళలున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,84,362 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. పురుషులు 91,917 మంది, మహిళలు 95,445 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరు థర్డ్ జెండర్స్ ఉన్నప్పటికీ వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నియోజకవర్గంలో అత్యధికంగా ఆత్మకూరు మండలం దుర్గంపేట గ్రామ పంచాయతీ జీపీ(113)లో పోలింగ్ 94.76 శాతం నమోదైంది. అంటే.. 706 మందికి 669 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా 63.23 పోలింగ్ శాతం నమోదైంది. పరకాలలోని బాలుర ఉన్నత పాఠశాల(45)లో 1,214 మందికి 830 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మళ్లీ నేనే ఎమ్మెల్యేను
గోదావరిఖని: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు ఈఎన్నికల్లో తనను గెలిపిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నిర్విరామ కృషితో తిరిగి తానే ఎమ్మెల్యేగా గెలువబోతున్నానన్నారు. రానున్న అయిదేళ్లలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు రెండు నెలల పాటు పథకాలను గడపగడపకూ తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారని అన్నారు. రామగుండం నియోజకవర్గం చైతన్యానికి మారుపేరని, ఉద్యమకారులను కన్నగడ్డ అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ అభ్యర్థి అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. తాను ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఓటర్లకు మద్యం, మాంసం పంచలేదని, ఒక్కరూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. ప్రజలు ధర్మం, న్యాయం వైపే ఉన్నారని పేర్కొన్నారు. నాయకులు ఆముల నారాయణ, కుమ్మరి శ్రీనివాస్, బాదే అంజలి, తస్నీమ్ భాను, పీటీ స్వామి, కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్, పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు పండ్లు పంపిణీ రామగుండం: కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ గెలుపును కాంక్షిస్తూ అభిమానులు శుక్రవారం పట్టణంలోని తబితా ఆశ్రమంలో చిన్నారులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జూల విజయ్, రవీందర్, లంక రాజలింగు, జూల అజయ్ పాల్గొన్నారు. -
ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అభ్యర్థుల ఓట్లు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం.. కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఆయన తన ఓటును అక్కడే వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్ నగరంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్మోహన్రావు ఓటు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. -
నీతిగా ఓటు వేయండి.. పనిమంతులకే పట్టం కట్టండి
ఇల్లెందురూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. సమాజ గతిని మార్చే ఓటును ప్రతి ఒక్కరూ నిజాయితీగా వినియోగించుకోవాలి. సమర్థులను ఎన్నుకుంటేనే ప్రజా సమస్యలపై చట్టసభల్లో పోరాడుతారు. మంచి పాలన అందాలంటే ప్రతినిధులు ఉత్తములై ఉండాలి. ‘నేనున్నా’ అనే భరోసా కలిగించేలా పనిచేసే వారినే ఎన్నుకోవాలి తప్ప ఆయా పార్టీల వారు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఓటు అమ్ముకుంటే ఇక ఐదేళ్ల పాటు ప్రజలకు సమస్యలు తప్పవు. ఆ తర్వాత ప్రశ్నించే అవకాశం కూడా ఉండదు. డబ్బుంటేనే రంగంలోకి..? ప్రస్తుతం ఎన్నికలను డబ్బులు శాసిస్తున్నాయి. ఎన్నికల పోరు మొదలు కాగానే డబ్బున్నోళ్లే రంగంలోకి దిగుతున్నారు. కార్యకర్తలు, ప్రజలకు మందు, విందు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. చివరకు ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. తీరా గెలిచాక ఇక ప్రజల గురించి పట్టించుకునే నాథులే ఉండరు. అందుకే ఎన్నికల్లో నోటుకు ఓటు వేయొద్దంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అంతకంటే హీనమా.. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను యాచకుడి కంటే హీనంగా లెక్కకడుతున్నారు. ఓ అభ్యర్థి ఓటుకు రూ.1000 ఇచ్చినా.. గెలిస్తే ఐదేళ్లు.. 1,825 రోజులు అధికారంలో ఉంటారు. అంటే రోజుకు 54 పైసల చొప్పున ఇస్తారు. ప్రస్తుత రోజుల్లో యాచకుడు సైతం రూ.1 ఇస్తే తీసుకోవడం లేదు. ఇక ఓటర్లను యాచకుడి కంటే హీనంగా అభ్యర్థులు చూస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా ఓటర్లు 51శాతం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓట్లు 21,83,235 ఉంటే అందులో 51 శాతం మంది మహిళలు ఉన్నారు. గెలుపోటములను శాసించే సత్తా వారికే ఉంది. ఓట్లు వచ్చాయంటే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తారు. మహిళా సంఘాలకు ఇంత మొత్తం అని బేరాలు చేస్తారు. ఇంకా చీరలు, ఇతర వస్తువులు పంచుతారు. ఆయా పార్టీలు ఇచ్చే కానుకలకు ఆశ పడకుండా మంచి వారిని ఎన్నుకుంటే ఆ తర్వాత మన జీవితాలు బాగుంటాయని గ్రహించాలి. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరల గురించి రాజకీయ నాయకులను నిలదీయాలి. జిల్లాలో ఒకే ఒక్క మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రశ్నించండి. -
పాలకుర్తిని వీడాలని ఝాన్సీరెడ్డికి నోటీసులు
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి డీఎస్పీ వెంకటేశ్వరబాబు తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఝాన్సీరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. తన కోడలు యశస్వినిరెడ్డిని బరిలో నిలిపానని, తాను నియోజకవర్గంలోని చెర్లపాలాన్ని దత్తత తీసుకున్నానని, ఇక్కడ పన్నులు కడుతున్నానని, తనను నియోజకవర్గం వీడాలనడం సరికాదన్నారు. కుట్ర పూరితంగా తనకు నోటీసులు జారీ చేశారన్నారు. దీనికి మంత్రి దయాకర్‌రావు బాధ్యత వహించాలన్నారు. కనీసం ఆడవాళ్లు అని చూడకుండా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. -
కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించండి: కౌశిక్ రెడ్డి భార్య
ఇల్లందకుంట/వీణవంక/కమలాపూర్: ‘ఓ వ్యక్తిని నమ్మి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేంటీ.. కేసీఆర్ దయతో మంత్రి పదవి అనుభవించిండు.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేసిండు. ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఇక్కడి ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా పని చేసి కూడా సొంత మండలం, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఉపఎన్నికల్లో గెలిచి ఒక్కసారి మండలానికి రాలేదని, మంత్రిగా ఉండి మహిళా సంఘం భవనం కట్టించలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోవద్దన్నారు. ‘మీ దయ, దండం పెట్టి, గదవ పట్టుకొని, మీ కడుపులో తలపెట్టి మరీ అడుగుతున్న నన్ను గెలిపించండి.. చేసిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తా’నని అన్నారు. వేరేవారు గెలిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది, తనను గెలిపిస్తే కమలాపూర్‌ను దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మీ ఆడబిడ్డగా కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించాలని కౌశిక్‌రెడ్డి భార్య షాలిని కోరారు. మా డాడీని భారీ మెజార్టీతో గెలిపించాలని కూతురు శ్రీనిక ఓటర్లను వేడుకున్నారు. అనంతరం కార్యకర్తలు, మహిళలతో కలిసి కౌశిక్‌రెడ్డి డ్యాన్స్ చేశారు. కౌశిక్‌రెడ్డికి మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ రాణిశ్రీకాంత్, జెడ్పీటీసీ కల్యాణిలక్ష్మణ్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, వైస్ ఎంపీపీ శైలజఅశోక్, సర్పంచ్ విజయతిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, రాధికారమే‹శ్, నాయకులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి ఇల్లందకుంట మండలంబూజునూర్ గ్రామంలో ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేశ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పాడి కౌశిక్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొమురెల్లి, ఎంపీటీసీ విజయ–కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు విక్రమ్, మాజీ ఎంపీటీసీ రామ్ స్వరణ్‌రెడ్డి, నాయకులు,తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం వీణవంక మండలంలోని చల్లూరు, ఇప్పలపల్లి, బేతిగల్, కనపర్తి, ఘన్ముక్కుల గ్రామాలలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు ప్రచారం జమ్మికుంట పట్టణంలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ ఆర్యవైశ్యుల సంఘం అ«ధ్యక్షుడు ఐత మహేశ్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ఒక్కసారి పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పించాలని కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందన్నారు. -
బాన్సువాడ బాద్షా ఎవరో?
సాక్షి, కామారెడ్డి: మంజీర నది తీరాన ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేయడలో ముగ్గురూ ముగ్గురే అన్నట్టుగా ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముగ్గురు అభ్యర్థులు రాజకీయంగా అనుభవం ఉన్నవారు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు. ఆయన మంత్రిగానూ పలుమార్లు పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి మూడు పర్యాయాలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో మున్నూరు కాపులు, ఆంధ్ర సెటిలర్లు, మైనారిటీలు, ముదిరాజ్‌లు ఎక్కువగా ఉంటారు. ఎవరి ఓట్లు ఎటు వెళ్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ప్రభావం చూపే అంశాలన్నీ బాన్సువాడ నియోజకవర్గంలో కనిపిస్తాయి. బాన్సువాడ నియోజకవర్గం రెండు జిల్లాల్లో కలగలిసి ఉంటుంది. బాన్సువాడ పట్టణం, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు కామారెడ్డి జిల్లాలో ఉండగా, కోటగిరి, వర్ని, రుద్రూర్, చందూర్, పొతంగల్, మోస్రా మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వస్తాయి. వరుస విజయాలతో.. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వరుస విజయాలతో ఊపు మీదున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఐదేళ్లలో మంత్రిగా, తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గా నియోజకవర్గంలో అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చారు. బాన్సువాడను మున్సిపాలిటీని చేసి, పురపాలక శాఖ ద్వారా భారీ ఎత్తు నిధులను రాబట్టి అభివృద్ధి చేశారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించారు. సాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిచ్చారు. సిద్దాపూర్, జకోరా వంటి ఎత్తిపోతల పథకాలు పురోగతిలో ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ముందువరుసలో నిలిచారు. పదకొండు వేలకు పైగా ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఇసుక దోపిడీపై ఆరోపణలు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నీతివంతమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంజీర ఇసుక దోపిడీపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు అంతా తెలుసని, ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. స్థానికంగా హిందుత్వ నినాదంతో పనిచేసిన వారంతా ఆయనకు సహకరిస్తున్నారు. -
ప్రజల మద్దతు నాకే..
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ప్రాంత బిడ్డగా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై ప్రతి నిత్యం కొట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతా’నని కాంగ్రెస్ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మా ర్పు కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు. భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. నియోజకవర్గానికి మా నాన్న చేసిన అభివృద్ధి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నేను గెలిచాక స్థానికంగానే ఉండి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతా. జానారెడ్డి హయాంలోనే అభివృద్ధి.. సాగర్ నియోజకవర్గంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మా నాన్న కుందూరు జానారెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలకు రోడ్లు, కరెంట్ సౌకర్యంతో పాటు 34 వేల ఇళ్లు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 1048 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు మా వద్ద లెక్కలతో సహా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. యువత చెడ్డదారిలో పోకుండా చదువుపై మనస్సును నిలిపి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేయనున్నాం. ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించడానికి నేను సొంతంగా కృషి చేస్తాను. యువత మేధస్సును పరిపూర్ణంగా వినియోగించుకుంటాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. నియోజకవర్గంలో ప్రజలు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండల, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు కావాలి్సన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. టీచర్ల కొరత తీర్చడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతు చేయించి ప్రైమరీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. -
కొడంగల్.. ఎవరో జిగేల్
కొడంగల్: కొడంగల్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాంత ఓటర్లు ఆరు సార్లు హస్తానికి పట్టం కట్టారు. ఆ తర్వాత టీడీపీ ఐదు సార్లు విజ యం సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. 2018 ఎన్నికల్లో హోరా హోరీ పోరులో టీఆర్ఎస్ గెలిచింది. ప్రస్తుత ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇక్కడి ఓటర్ల నాడి నాయకులకు అంతుపట్టక ఆగమవుతున్నారు. ఒక్కసారి మంత్రి పదవి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే కొడంగల్‌కు మంత్రి పదవి వరించింది. పీఎన్ఆర్ గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు. నరేందర్‌రెడ్డి మంత్రి పదవి చేపడితే తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని జిల్లా నేతలు భావిస్తున్నట్లు వినికిడి. 1956లో నియోజకవర్గం ఏర్పడగా నాటి నుంచి 2018 సార్వత్రిక ఎన్నికల వరకు కొడంగల్ అసెంబ్లీ స్థానానికి 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో ఆరు పర్యాయాలు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ, మూడు సార్లు స్వతంత్రులు, ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. 1957లో తొలి ఎమ్మెల్యేగా అచ్యుతారెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 1962లో రుక్మారెడ్డి, 1972లో నందారం వెంకటయ్య, 1978లో గురునాథ్‌రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే గురునాథ్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. 1983లో టీడీపీ ప్రభంజనలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా గురునాథ్‌రెడ్డి గెలిచారు. 1985, 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి నందారం వెంకటయ్య అసెంబ్లీ మెట్లెక్కారు. ఎమ్మెల్యేగా ఉండగానే నందారం వెంకటయ్య చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. 1996లో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ నుంచి నందారం వెంకటయ్య రెండో కువూరుడు సూ ర్యనారాయణ టీడీపీ నుంచి గెలిచారు. 2004 లో గురునాథ్‌రెడ్డి, 2009, 2014లో రేవంత్‌రెడ్డి, 2018లో పట్నం నరేందర్‌రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు తమకు కంచుకోటగా మార్చుకునేందుకు యత్నించారు. ఉద్యమ కాలంలోనూ ‘సైకిల్’కే జై నియోజకవర్గ ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వడంలో నిష్ణాతులు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో తెలంగాణా ఉద్యమాన్ని లెక్కచేయకుండా కొడంగల్ ప్రజలు టీడీపీ పట్టం కట్టారు. ఇక్కడ గురునాథ్‌రెడ్డికి ఐదుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజలు నందారం వెంకటయ్యను మూడు సార్లు అసెంబ్లీకి పంపించారు. ఈ ప్రాంతంలో ఒకసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరోసారి టీడీపీని గెలిపించేవారు. 2018 వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యనున్న పోరు 2018 నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండింది. అప్పట్లో టీఆర్ఎస్ అధినేతల చాకచక్యం.. రాజకీయ చతురతను ప్రదర్శించి అత్యంత క్టిష్ట పరిస్థితుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నె లకొంది. కాగా 2018 ఎన్నికల మాదిరిగా బీఆర్ ఎస్ నేతల రాజకీయ ఎత్తుగడలు పారడం లేదు. అధినేతలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నరేందర్‌రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోనున్న నియోజకవర్గం. ప్రతీ ఎన్నికలోతమదైన తీర్పునిస్తున్న ఓటర్లు. ఈ ఎన్నికల్లో ఎవరిని ఆశీర్వదిస్తారో అంతుపట్టడం లేదు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా.. కారు, కాంగ్రెస్ మధ్యే టఫ్ ఫైట్ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. కొడంగల్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు సంవత్సరం పేరు పార్టీ ► 1957 అచ్యుతారెడ్డి కాంగ్రెస్ ► 1962 రుక్మారెడ్డి స్వతంత్ర ►1967 అచ్యుతారెడ్డి స్వతంత్ర ►1972 నందారం వెంకటయ్య స్వతంత్ర ►1978 గురునాథ్‌రెడ్డి స్వతంత్ర ►1983 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ ►1985 నందారం వెంకటయ్య టీడీపీ ►1989 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ ►1994 నందారం వెంకటయ్య టీడీపీ ►1996 ఉప ఎన్నిక/ సూర్యనారాయణ టీడీపీ ►1999 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ ►2004 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ ►2009 రేవంత్‌రెడ్డి టీడీపీ ►2014 రేవంత్‌రెడ్డి టీడీపీ ►2018 నరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ -
అరగుండు.. అరమీసం..
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎల్ఎఫ్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి మేత్రి రాజశేఖర్ అరగుండు, అరమీసం, అరగడ్డంతో పాటు బిచ్చగాడి వేషధారణతో శనివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల తీరు ప్రతిబింబించేలా తనీ వేషధారణతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఆ పార్టీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు మేలుకోవాలని, ప్రజలు కండ్లు తెరవాలని అన్నారు. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ భిక్షాటన చేశారు. కొల్లాపూర్‌లో బర్రెలక్క శిరీషపై దాడికి పాల్పడం సరైంది కాదన్నారు. ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దతు తెల్పుతున్నట్లు చెప్పారు. యువతీ, యువకులు చట్టసభలకు రావాలన్నారు. -
జెడ్పీ చైర్మన్ మొదలు సీఎం పదవి వరకు సొంతం
సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ జలగం వెంగళరావు పరిచయం అక్కరలేని పేరు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, హోంమంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్.. ఇలా చెబుతూ పోతే ఎన్నో పదవులు అలంకరించి జిల్లా రాజకీయాలపై ఆయన చెరగని ముద్ర వేశారు. తద్వారా జలగం కుటుంబం ఉమ్మడి జిల్లాలో అందరికీ సుపరిచితమనే చెప్పాలి. డీసీసీబీ చైర్మన్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, పంచాయితీరాజ్ మంత్రి తదితర పదవులను ఈ కుటుంబంలోని నేతలు నిర్వర్తించారు. జలగం వెంగళరావు సహా కొండలరావు, ప్రసాదరావు, వెంకటరావు ఆ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించారు. జలగం కొండలరావు జలగం వెంగళరావు కుటుంబం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది ఆయన సోదరుడు జలగం కొండలరావు. 1957లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఒకసారి, ఖమ్మం ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచారు. జలగం వెంగళరావు జలగం వెంగళరావు తొలిసారి 1959లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే, 1962లో వేంసూరు(ప్రస్తుత సత్తుపల్లి) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేశారు. ఆతర్వాత 1973 డిసెంబర్ 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1978మార్చి వరకు కొనసాగారు. ఆ సమయాన దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోగా, జలగం వెంగళరావు ఇందిరాగాంధీతో విబేధించి కాంగ్రెస్(ఆర్)ను స్థాపించారు. 1978 ఎన్నికల్లో గెలుపొందినా రాష్ట్రంలో 30సీట్లకే పరిమితం కావడంతో రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1986లో ఖమ్మం ఎంపీగా గెలిచి కేంద్ర పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లోనూ ఖమ్మం ఎంపీగా రెండోసారి గెలిచిన వెంగళరావు రాజకీయాల నుంచి విరమించుకోగా, 1999జూన్ 12న కన్నుమూశారు. -
ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్!
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. -
నియోజకవర్గాల్లో నోట్ల వరద..
హన్మకొండ: తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో విజయమే లక్ష్యంగా పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందు పడరాని పాట్లు పడుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ప్రలోభాలు మొదలు పెట్టారు. నగరం, పట్టణాల్లోని వార్డులు, కాలనీలు, గ్రామాల్లో పురవీధుల్లో అభ్యర్థులు పాదయాత్ర చేస్తూ ఇంటింటికీవెళ్లి నేరుగా ఓటర్లను కలుస్తూ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి తమ ప్రసంగాల ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతలను తమ నియోజకవర్గాలకు రప్పించుకుంటున్నారు. ప్రధానంగా ప్రజాకర్షణ ఉన్న నేతలను తీసుకువచ్చేందుకు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో నోట్ల వరద.. ప్రజల్లో తమ బలం చూపించుకునేందుకు అభ్యర్థులు ప్రచారం నుంచి మొదలు.. ప్రలోభాల వరకు పోటీ పడుతున్నారు. ప్రచార సమయంలో ప్రజలను పెద్ద ఎత్తున పోగు చేస్తున్నారు. అక్కడి నుంచే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న వారికి కూడా ఎంతో కొంత సొమ్ము ముట్ట చెప్పుతున్నారని బహిరంగ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా మరో వైపు కమ్యూనిటీ వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కుల వృత్తులు, ఉద్యోగ, కార్మిక, అసోసియేషన్లు, కాలనీ కమిటీల వారీగా కమ్యూనిటీ సమావేశాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పగలు మధ్యాహ్న భోజనం, రాత్రి విందు రాజకీయాలు జోరందుకున్నాయి. కమ్యూనిటీ మీటింగ్‌లకు వచ్చిన వారికి స్థాయికి తగ్గట్టు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.5వేల వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. కమ్యూనిటీ మీటింగ్‌ల్లో ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి ఉన్న వారికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వ్యక్తిగతంగా అందజేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల్లో నోట్ల వరద పారుతోంది. ఎత్తుకు పైఎత్తులు.. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు కోవర్టులను ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థి ఎత్తుగడలను తెలుసుకుంటూ వారికి దీటుగా మరో ఎత్తుగడ వేస్తూ ముందుకెళ్తున్నారు. ఎదుటి పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో వారు కోరుకున్న మేరకు.. చేసిన డిమాండ్ మేరకు సమర్పించుకుంటూ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకున్నారు. వ్యూహాలకు పదును.. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల వారీగా, నగరాలు, పట్టణాల్లో వార్డులు, కాలనీ వారీగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుని అభ్యర్థులు వారికి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా తమ వ్యూహాలు మారుస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వారికి అవసర హామీలు ఇవ్వడం.. అవసరమైన ప్రలోభాలకు గురి చేయడం ద్వారా తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే క్రమంలో పార్టీ క్యాడర్‌ను పూర్తిగా నమ్మకుండా, తమకు నమ్మకమైన వ్యక్తుల ద్వారా కార్యాన్ని కానిస్తున్నారు. ఎదుటి పార్టీలు, అభ్యర్థులపై నిఘా పెడుతూ ప్రత్యర్థి పార్టీ ఎంత ఇస్తుంది.. మనమెంత ఇవ్వాలని లెక్కలు తీస్తున్నారు. -
నాపై పోటీకి అభ్యర్థులే లేరు
రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్‌పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్‌నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు. తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్‌రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్‌పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు, బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్‌రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్, కర్ర సరితరవీందర్రెడ్డి, కుక్కల భాస్కర్, గాదె హేమలత పాల్గొన్నారు. పద్మశాలి సంఘం మద్దతు కొడకండ్ల: బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సొంత గూటికి చేరిన కార్యకర్తలు పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్‌రావు సతీమణి, ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు దేవరుప్పుల : పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్ రసూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, పాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
సుమన్‌కు సుడిగుండమే.. ‘చెన్నూరు’ ఆయన పట్టుతప్పుతోందా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఈ ఎన్నికలు సుడిగుండంలా మారాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కొడుకులాంటి వాడినని చెప్పుకునే ఈ విద్యార్థి నాయకుడికి నియోజకవర్గంలో తన పట్టు తప్పుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆశించిన మైలేజీ రాక సొంత పార్టీలోనే విస్మయం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి అప్పటి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్‌పై అనూహ్యంగా గెలవడంతో సుమన్ ప్రజాప్రాతినిధ్య జీవితానికి తొలి అడుగు పడింది. 2018 ఎన్నికల్లో చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో టికెట్‌పై పెట్రోల్ ‘మంటల’ మధ్యలోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. చివరికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వెంకటేష్నేతపై 28వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం రెండోసారి చెన్నూర్ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్నారు. అభివృద్ధి చెప్పినా.. వ్యతిరేకతేనా? జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూర్‌లోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఎమ్మె ల్యే సుమన్, పార్టీ శ్రేణులు చెబుతుంటారు. ప్రత్యేక బుక్లెట్ వేసి మరీ ప్రచారం చేస్తున్నా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ప్రచారం మొదలైన తొలి రోజు నుంచే ఓటర్లు తిరగబడుతున్నారు. ఆర్కేపీ, ఊరు మందమర్రి, చెన్నూరు, గంగారంలో నిరసనలు ఎదురయ్యాయి. చిత్రంగా మందమర్రి, ఆర్కేపీ, చెన్నూరు ఈ మూడు పట్టణాలకు రెండు వందల కోట్ల చొప్పున నిధులు తెచ్చామని చెప్పినా ఆ మే రకు ఓట్లు రాలుతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. సుమన్ ప్రజలకు అందుబాటులో లేక, ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో కొందరు నాయకుల దందాలే కొంపముంచే పరిస్థితికి తెచ్చాయని అంటున్నారు. కోటపల్లి పరిధిలో ఓ నాయకుడు చేస్తు న్న భూ కబ్జాలు, బెదిరింపులు, మద్యం దందాలు, సెటిల్మెంట్లు అక్కడి ఓట్లపై దెబ్బ పడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ వర్గీయులను పక్కకు పెట్టి, కేసులు పెట్టించడంతో వారంతా దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే రెండో సెట్ నామినేషన్ వేసే సందర్భంలో ఎమ్మెల్సీని బతిమాలినా రాకపోతే, చివరకు పార్టీ హైకమాండ్‌తో చెప్పించుకోవల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గ సీనియర్ నాయకుడినే ఆయన లెక్క చేయకపోగా కార్యకర్తలు, నాయకులకు ఫోన్లోనైనా అందుబాటులో ఉండరనే అపవాదు సామాన్య కార్యకర్తల్లో ఉంది. మందమర్రి, ఆర్కేపీలో సింగరేణి క్వార్టర్లు, భూములు ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, ఆయన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడడంతో వందల కోట్ల అభివృద్ధి ఈ వ్యతిరేకత ముందు నిలవడం లేదు. -
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. టెకీలతో పాటు ఐటీ నిపుణులు, అక్షరాస్యుల సంఖ్య కూడా ఎక్కువే. 600కుపైగా ఐటీ కంపెనీలు వందలాది హోటళ్లు ఉన్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులు, ఆతిథ్య రంగంలోనూ ఉద్యోగులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. దేశలోని అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు చెందిన వారు నియోజకవర్గంలో ఉన్నారు. దేశంలోని అన్ని భాషలు మాట్లాడే వారు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ కోర్టులు ఉన్నాయి. భిన్న సంస్కృతులకు నిలయమైన శేరిలింగంపల్లి మినీ భారత్‌గా చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులే కాదు కుబేరులైన ఓటర్లకూ కొదవలేదు. పారిస్ నగరాన్ని తలపించే ఆకాశ హర్మ్యాలు, కేబుల్ బ్రిడ్జి, లింకు రోడ్లు, సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఉర్థూ యూనివర్సిటీ, సైబరాబాద్ కమిషనరేట్, స్టార్ హోటళ్లకు కేంద్రం. నియోజకవర్గంలో 852 కాలనీలు ఉన్నాయి. 100కు పైగా స్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్లమ్స్ కాలనీలుగా రూపాంతరం చెందాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. గెలుపు తమదంటే తమదంటూ మూడు పార్టీల అభ్యర్థులూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఒక్కసారి ఈ నియోజవర్గంపై దృష్టి సారిస్తే.. అందరి చూపూ.. శేరిలింగంపల్లి వైపే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఒకటి. ఇక్కడ మొత్తం 7,32,506 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,88,482, మహిళలు 3,43,875, ఇతరులు 149 మంది ఉన్నారు. ఉత్తర భారతీయుల ఓట్లు దాదాపు లక్షన్నర ఉన్నట్లు అంచనా. సీమాంధ్రకు చెందిన దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక ఓటర్లు, మైనార్టీ ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన శేరిలింగంపల్లిలో గెలిచేదెవరనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరి ధీమా వారిదే.. ► బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ తన సామాజిక ఓటర్లతో పాటు, మైనార్టీ ఓటర్లపై నమ్మకం పెట్టుకున్నారు. ఆయన 2014లో టీడీపీ నుంచి 80 వేల మెజారిటీతో, 2018లో టీఆర్ఎస్ నుంచి 42 వేల ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మూడు సార్లు కార్పొరేటర్‌గా పని చేయడంతో మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో మంచి పట్టు ఉంది. ఆ రెండు డివిజన్లలోని మైనార్టీలు, తన సొంత సామాజికవర్గంతో పాటు మారిన పరిస్టితుల్లో సెటిలర్స్ ఓట్లపై నమ్మకం పెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఎం.రవి కుమార్ యాదవ్ నార్త్ ఇండిన్స్ ఓట్లపై నమ్మకం పెట్టుకున్నారు. 50 వేలకు పైగా నార్త్ ఇండియన్స్ ఓట్లను ఎన్రోల్ చేయించారు. నార్త్ ఇండియన్స్‌తో పాటు తన సామాజిక వర్గం ఓట్లు, తన తండ్రి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అదనపు బలంగా చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా తమిళ, కన్నడ ఓటర్లపై ఫోకస్ చేస్తున్నారు. ఎవరికి వారే గెలుపు తమనే వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటున్న ముగ్గురు కుబేరులు శేరిలింగంపల్లిలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు కుబేరులే. బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ రూ.44 కోట్ల స్థిరాస్తులు, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తన పేరిట రూ.113 కోట్ల అస్తులు, బీజేపీ అభ్యర్థి ఎం.రవి కుమార్ యాదవ్ రూ.151 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అభ్యర్థులు ప్రచారంలో పోటీ పడుతూ ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్ షోలకు పోటీపడి జన సమీకరణ చేయడం గమనార్హం. పెద్ద నియోజకవర్గం కావడంతో అభ్యర్థుల ఖర్చు కూడా భారీ మొత్తంలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రోడ్ షోను బీజేపీ అభ్యర్థి ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ కేటీఆర్ రోడ్ షోలో భారీ జన సమీకరణ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ రాహుల్ గాంధీ రోడ్ షో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలిపిస్తారా అని చైర్‌పర్సన్‌ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్‌పర్సన్‌ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం
వికారాబాద్: మండల పరిధిలోని గ్రామాల్లో కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రచారానికి ఆరు రోజుల సమయమే ఉంది. కానీ బీజేపీ, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు నేటికీ మండలంలో ప్రచారం ప్రారంభించలేదు. ‘హస్త’గతం చేసుకునేందుకు ప్రసాద్‌కుమార్ నియోజకవర్గంపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు మాజీ మంత్రి, పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 18న ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఆయన పది గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. 21న తిరిగి ప్రచారం ప్రారంభించిన గడ్డం 11 గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక ఒక్క గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే ఆయన మండల పర్యటన పూర్తవుతుంది. ఆయన ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటుగా మేనిఫెస్టోను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయన ప్రచా రానికి ఏఐసీసీ సభ్యులు సైతం విచ్చేసి స్నేహ హస్తం అందిస్తున్నారు. నిరుద్యోగులపై ప్రభు త్వం నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ యువతను ఆకర్శించే యత్నం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండడంతో ఒకింత విమర్శలను ఎదుర్కుంటున్నారు. మళ్లీ ఆశీర్వదించాలని ఆనంద్ ప్రచారం ప్రారంభించిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మొదటి విడతలో నాలుగు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన ప్రచారంలో మరో నాలుగు గ్రామాలను చుట్టేశారు. కాగా పది గ్రామాల్లో ఇంకా ఆనంద్ ‘కారు’ తిప్పాల్సింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని తనదైన శైలిలో వివరిస్తూ ఓటర్లను జారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. భగీరథ తాగునీరు, 24గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, బీమా, రుణమాఫీ, దళారులు లేని పంటల కొనుగోళ్లు, పరిశుభ్రమైన పల్లెలు తదితర అంశాలను వివరిస్తూ వ్యతిరేక ఓటరులు ఇతర పార్టీల వైపు చూడకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అగం కావద్దని తెలియజేస్తూ మరో సారి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.నియోజకవర్గ ఏర్పాటు నుంచి మోమిన్‌పేటలో మెజార్టీ సాధించిన వారే అసెంబ్లీ నుంచి గెలుపొందుతున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలకు పట్టం కట్టిన ఓటర్లు గత రెండు ఎన్నికల్లో ‘కారు’కు జైకొట్టారు. దీంతో ఇక్కడ అధిక ఓట్లను రాబట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. -
భద్ర గిరిలో జోరు తగ్గిన కారు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. భద్రాచలం అభివృద్ధి కోసం స్థానికుడైన తెల్లం వెంకట్రావును గెలిపిద్దామనే నినాదంతో టాప్ గేర్‌లో పరుగెత్తిన ‘కారు’ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ హైవేను వీడి గతుకుల రోడ్డు మీదకు వచ్చినట్టుగా తయారైంది. తెల్లం ఇమేజ్ పనిచేసేనా..? భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలందరికీ తెల్లం వెంకట్రావు వ్యవహారశైలిపై ఒక అంచనా ఉంది. వైద్యుడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆపదలో ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తారని, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే బాధితులు అడగకుండానే ఫీజులో రాయితీ ఇస్తారనే ఇమేజ్ ఆయన సొంతం. అందుకే రాజకీయంగా పెద్దగా చొరవ చూపించకపోయినా, అంచనాలను అందుకోలేని వ్యూహాలు అమలు చేయకున్నా, తెల్లానికి ఉన్న మంచి పేరు తమకు ఓట్లు తెస్తాయనే నమ్మకం బీఆర్ఎస్ నేతలు, కేడర్‌లో ఉంది. ఆ నమ్మకంతోనే పార్టీ అధిష్టానం కూడా టికెట్ కేటాయించింది. తలకుమించిన భారంగా.. భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం తలకు మించిన భారంగా మారుతోందని ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గతంగా మథనపడుతున్నారు. ప్రచార షెడ్యూల్ వివరాలు తమకు తెలపడమే తప్ప అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం నయా పైసా ఇవ్వకుండా నియోజకవర్గంలోని పార్టీ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని కిందిస్థాయి నాయకులు వాపోతున్నారు. తమ సమస్యను అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు చెబితే..‘అన్ని విషయాలు నియోజకవర్గ ఇన్చార్జ్ తాతా మధు చూస్తారు’ అంటూ బదులిస్తున్నారని, మధు దగ్గరకు వెళితే వెంకట్రావునే అడగాలంటూ బంతిని తన కోర్టులో నుంచి బయటకు నెటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య తాము ఇబ్బంది పడుతున్నామని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కొత్త వారికే ప్రాధాన్యం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వెంకట్రావు ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో ఉంటూనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో కొనసాగారు. అనంతరం పార్టీని సైతం వీడారు. దీంతో భద్రాచలం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేందుకు బోదబోయిన బుచ్చయ్య, మానె రామకృష్ణ వంటి నేతలు ఆసక్తి చూపించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య తిరిగి వెంకట్రావుకే టికెట్ దక్కింది. తమ ఆశలు ఆడియాసలు అయినప్పటికీ బుచ్చయ్య, రామకృష్ణతో పాటు వారి మద్దతుదారులంతా పార్టీ కోసం శ్రమిస్తున్నారు. అయితే వీరితో పాటు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న పాతవారికి ప్రస్తుతం తగు రీతిలో ప్రాధాన్యత లభించడం లేదనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి కొత్తగా బీఆర్ఎస్లో చేరిన వారికే పెద్ద పీట వేస్తున్నారనే చర్చ భద్రాచలం గులాబీ వనంలో జరుగుతోంది. ఇద్దరూ ఇద్దరే.. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావుతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్ సైతం పార్టీ కార్యక్రమాల పట్ల చొరవ చూపించకుండా, కింది స్థాయి నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల అవగాహన లేకుండా వ్యవహరించడం మొదటికే మోసం తెస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం నోటిమాటగా ఆదేశాలు జారీ చేస్తేనే క్షేత్రస్థాయిలో పనులన్నీ చక్కబడిపోతాయి అన్నట్టుగా ఉన్న వారి వైఖరి చివరకు పార్టీకే చేటు తెస్తోంది. దీంతో ‘కారు’కు నామినేషన్ వేసిన రోజున్న సానుకూల వాతావరణం క్రమంగా బలహీనపడుతోందనే భయాందోళన పార్టీ అభిమానుల్లో కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీకి రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. రెండుసార్లూ పది సీట్లలో ఒక్కో స్థానంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా గులాబీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలు, అంతర్గత కుమ్ములాటలు ఉన్న నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట స్థానానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాచలానికి ఎమ్మెల్సీ తాతా మధు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరి నియామకం తర్వాత ఇల్లెందు, కొత్తగూడెంలో సానుకూల ఫలితాలు కనిపిస్తుండగా భద్రాచలంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయనే భావన ఆ పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది. -
గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: జైవీర్‌రెడ్డి
నిడమనూరు: తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాన్‌ఆయకట్టు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని ఊట్కూర్‌లో ఉదయం మొదలైన ప్రచారం రాత్రి వెంగన్నగూడెంలో ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ముప్పారం, ఊట్కూర్, బంటువారిగూడెం, ఎర్రబెల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గర్భిణులు డెలవరీ కోసం వాహనాల్లో వెళ్తే ఈ రోడ్లపైనే పరుడు అవుతుందనే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నందికొండవారిగూడెంలో గోవు పిచ్చమ్మ అనే వృద్ధురాలు జైవీర్‌రెడ్డి ప్రచారం రథం వద్దకు వచ్చి జానారెడ్డి కొడుకు ఏడయ్యా అంటూ అడిగింది. అక్కడ ఉన్న వారు ఆమెను తీసుకెళ్లి జానారెడ్డి కొడుకు జైవీర్‌రెడ్డి అంటూ చూపించారు. తనను వెతుకుంటూ వచ్చిన వృద్ధురాలిని ఆయన ఆప్యాయంగా పలకరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, రంగశాయిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటరమణ, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు సత్యం, శివమారయ్య, పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే పేదలు, రైతులకు మేలు పెద్దవూర : కాంగ్రెస్ పార్టీతో నిరుపేదలకు, రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జయరాంతండాకు చెందిన బీజేపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమావత్ దేవ్‌సింగ్‌తో పాటు పలువురు మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, శ్రీనునాయక్, సోమ్లా, భీమా పాల్గొన్నారు. -
గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తా: సీతక్క
మహబూబాబాద్: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తా అని ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపూర్, రామారావుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బుర్గుపేట, రామకృష్ణాపూర్, ఆనందపూర్, పట్వారుపల్లి, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసి రూ.కోట్లు ఖర్చు చేసిన ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్ సీతక్కకు మద్దతు పలికి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, మండలాధ్యక్షుడు సుర్యనారాయణ, నాయకులు బండి శ్రీనివాస్, అయిలయ్య, రవి పాల్గొన్నారు. సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి గోవిందరావుపేట: సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని బుస్సాపూర్ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలెం యాదగిరి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తరఫున మండల నాయకుడు మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. నర్సయ్య, లక్ష్మణ్, భాగ్య పాల్గొన్నారు. మంగపేట: మండలంలోని కమలాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య సమక్షంతో చైతన్య ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు ఎండి మైమూద్ ఆధ్వర్యంలో 70 మంది మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని సోమయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు తూడి భగవాన్‌రెడ్డి, నర్సింహారావు, సంపత్, శివ, నూకల రాజేష్, అశోక్ పాల్గొన్నారు. -
పోల్ చీటీల్లో కొత్తదనం
నారాయణఖేడ్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా జిల్లా అధికారులు ఓటరు స్లిప్‌లు, ఎపిక్ కార్డుల పంపిణీ ముమ్మరం చేశారు. ఓటర్ల తుదిజాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 13,93,711 మంది. వీరందరికీ పోల్ చీటీలు, కొత్తగా ఓటుహక్కు పొందిన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ మొదలు పెట్టారు. పోస్టల్ సిబ్బంది, బీఎల్వోలు ఇంటింటికీ వాటిని పంపిణీ చేస్తున్నారు. పూర్తి వివరాలతో.. పోల్ చీటీలపై ఓటరు పేరు, చిరునామా, ఓటరు సంఖ్య, పోలింగ్ కేంద్రం, పోలింగ్ తేదీ, సమయం, హెల్ప్‌లైన్ నంబర్, పలు సూచనలతో పూర్తి వివరాలు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఓటర్లు సులువుగా కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో వాటిని పార్టీల వారే ముద్రించి పంపిణీ చేసేవారు. అయితే ప్రచారం ముగిసినా తర్వాత పోల్ చీటీల పంపిణీ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా ఆయా పార్టీల శ్రేణులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని గమనించిన ఎన్నికల సంఘం దానిని నివారించింది. గత ఎన్నికల నుంచి అధికారికంగానే వీటిని పంపిణీ చేస్తున్నారు. అడ్రస్ చూపే మ్యాప్ గతంలో పోల్ చీటీలో కేవలం ఓటరు ఫొటో, వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఎన్నికల్లో నూతన విధానంలో పోల్ చీటీలను రూపొందించారు. ఫొటో స్థానంలో క్యూఆర్ కోడ్ ఉంది. పోలింగ్ తేదీ, పోలింగ్ ప్రారంభం, ముగింపు సమయం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, గ్రామం, పోలింగ్ కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్ ముద్రించారు. దాని వెనుక వైపు పోలింగ్ కేంద్రానికి సులువుగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ప్రింట్ చేశారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బూత్‌స్థాయి అధికారి పేరు, మొబైల్ నంబరు ప్రింట్ చేశారు. ఓటరు తెలుసుకోవాల్సిన నిబంధనలు అందులో వివరించారు. అయితే బూత్‌లెవల్ అధికారులు తమ బూత్ పరిధిలో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో కుటుంబంలో ఓటరుగా నమోదైన వ్యక్తికి మాత్రమే ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న ఓటర్లు అందరికీ ఓటరు పత్రాలు తీసుకున్నట్లు రసీదుగా రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్రలను తీసుకుంటున్నారు. స్లిప్పులు ప్రతి ఓటరుకు అందేలా సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లిన సమయంలో ఎవరైనా తాళం వేసి ఉంటే అలాంటి వారికి పోలింగ్ రోజున బూత్‌లెవల్ అధికారులు హెల్ప్‌లైన్ సెంటర్లో అందించనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఈ స్లిప్పుతోపాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళితేనే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తారు. నియోజకవర్గం బూత్‌లు మొత్తం ఓటర్లు నారాయణఖేడ్ 296 2,31,188 అందోల్ 313 2,49,248 జహీరాబాద్ 314 2,70,785 సంగారెడ్డి 281 2,45,253 పటాన్చెరు 405 3,97,237 -
బర్రెలక్క తమ్ముడిపై దాడి
మహబూబ్‌నగర్: కొల్లాపూర్‌లో బర్రెలక్క అలియాస్ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం కోడేరులో ప్రచారం ముగించుకుని వెన్నచర్ల గ్రామానికి వెళ్లగా.. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు శిరీష తమ్ముడు భరత్‌కుమార్‌పై దాడికి యత్నించారు. విషయాన్ని గమనించిన శిరీష తన మద్దతుదారులతో కలిసి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తన తమ్ముడిపై దాడి చేసిన వారిని శిక్షించాలని, తనకు పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్ఐ రాజు శిరీషతో మాట్లాడి శాంతింపజేశారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు తీసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ సెక్యూరిటీ విషయంలో జిల్లా ఎస్పీతో మాట్లాడుతామని చెప్పారు. దారుణం.. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నిరుద్యోగి శిరీష అలియాస్ #Barrelakka తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజల చందాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్న శిరీషకు సోషల్ మీడియాతో విస్తృత స్పందన వస్తోంది. గతంలో కేసులు, బెదిరింపులతో… pic.twitter.com/UopywJvMdA — ThulasiChandu (@thulasichandu1) November 21, 2023 -
మన ఎన్నికల్లో ఈ ఓట్లను వాడిన సందర్భాలు లేవేమో..!
జడ్చర్ల టౌన్: ఏ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లడం.. ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు చూపడం.. ఓటు వేయడం అంతే. కానీ, ఓటు వేయడంలోనూ చాలెంజ్, టెండరు ఓటు అనేవి ఉంటాయి. చాలెంజ్ ఓటు అంటే.. ఎవరైనా ఓటరు తన ఓటును ముందే వేశారని గుర్తిస్తే అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ టెండరు ఓటుకు అవకాశం కల్పించింది. చాలెంజ్ ఓటు పోలింగ్ కేంద్రంలో అధికారులతో పాటు ఆయా పార్టీలు నియమించుకున్న పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక ఓటరు ఓటు వేయటానికి వచ్చినపుడు సదరు ఓటరు నకిలీ అని ఏజెంట్ సందేహించినపుడు పోలింగ్ ఏజెంట్ చాలెంజ్ చేయటానికి వీలు కల్పించారు. ఓటరు సరైన వ్యక్తి కాదని ప్రిసైడింగ్ అధికారితో చాలెంజ్ చేసి రూ.5 రుసుం చెల్లించి సదరు ఓటును చాలెంజ్ చేస్తాడు. దాంతో ప్రిసైడింగ్ అధికారి ఓటరుకు సంబంధించిన పత్రాలు అన్ని పరిశీలించి నిర్ధారణ చేసుకుని సరైన ఓటరుగా నిరూపణ అయితే ఓటు వేయటానికి అవకాశం కల్పిస్తాడు. లేదంటే వెనక్కి పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఓటరుకు బ్యాలెట్ అందించి దానిద్వారా ఓటు వేయించి కవర్లో ఉంచి సీల్ చేస్తారు. ఓటరు సక్రమం అని తేలితే కౌంటింగ్ సమయంలో కవర్ ఓపెన్ చేసి దానిని లెక్కించటం జరుగుతుంది. టెండరు ఓటు పోలింగ్ రోజున ఓటరు తన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికి అప్పటికే మరెవరో తన ఓటు వేశారని గుర్తిస్తే టెండరు ఓటు వేస్తానని అధికారులను కోరవచ్చు. తన స్థానంలో ఇంకెవరో ఓటు వేశారని ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అప్పుడు ఆ అధికారి విచారణ జరిపి గుర్తింపును నిర్ధారిస్తారు. అయినప్పటికి ఓటు వేయటానికి అవకాశం కల్పించకుండా ఉంటే టెండరు ఓటు వేస్తానని ఓటరు డిమాండ్ చేయవచ్చు. రూ.2 రుసుము చెల్లించి టెండరు ఓటు వేసుకోవచ్చు. టెండరు ఓటు సైతం బ్యాలెట్ ద్వారానే వేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు వేసిన టెండరు ఓటును సీల్డ్ కవర్లో ఉంచుతారు. ఇలా చాలెంజ్, టెండరు ఓట్లను ఓటరు వినియోగించుచుకునే వెసులుబాటు ఎన్నికల కమిషన్ కల్పించింది. కాగా ఎన్నికల్లో చాలెంజ్, టెండరు ఓట్లు వినియోగించుకున్న సందర్భాలు మన ప్రాంతంలో లేవనే చెప్పాలి. -
పంచ అస్త్రాలకే ప్రాధాన్యం.. ఎన్నికలంటేనే అంతే కదా..!
అచ్చంపేట: ఎన్నికల్లో గెలుపొంది ప్రజాప్రతినిధిగా పేరు పొందాలని అనుకోని రాజకీయ నాయకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అందుకోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేయడం పరిపాటి. ప్రస్తుత ఎన్నికల్లో తమదే పైచేయి కావాలనే తలంపుతో కొందరు అభ్యర్థులు పంచాస్త్రాలను సంధిస్తున్నారు. ప్రధానంగా డబ్బు, మద్యం, అంగబలం, వాగ్దానం, ఫిరాయింపులను నమ్ముకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇవి రాజకీయాలను శాసిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇవి రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. ఓటర్లను నాయకులు అనేక రకాలుగా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఈ పంచాస్త్రాలను పావులుగా వాడుకున్నవారే రాజకీయాల్లో నెగ్గగలడు అనే స్థాయిలో నేటి రాజకీయాలు ఉన్నాయి. డబ్బు: డబ్బుకు ఓటరు దాసోహం అన్నట్లుగా నోటు ఇచ్చి ఓటు వేయించుకునే పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మనిషికి పంచభూతాల్లో భూమి ఎంత అవసరమో రాజకీయాల్లో డబ్బుకు అంత ప్రాధాన్యం ఉంది. కోట్లను మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ఎన్నికల్లో గెలువడానికి యత్నిస్తున్నారు. అధికారం కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి వెనకాడటంలేదు. మద్యం: పంచభూతాల్లో నీరు ఎంత ముఖ్యమో రాజకీయాస్త్రాల్లో మద్యానికి అంతకుమించి ప్రాధాన్యం ఉంది.పోటీల్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంతో ఆరంభించి, విజేతలయ్యే వరకు మద్యాన్ని ఏరులా పారించడం పరిపాటిగా మారింది. ఓటరుకు మద్యం బాటిల్స్ ఇచ్చి ఓటు వేయించుకునే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. అంగబలం: బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా రాజకీయ నాయకులకు అంగబలం లేకపోతే అన్ని చచ్చుబడినట్టే. అందుకే తమ చుట్టూ 10మంది ఉండేలా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తుంటారు నాయకులు. టికెట్ వస్తే ప్రచారానికి, రాకపోతే దిష్టిబొమ్మలు తగలబెట్టడానికి ఉపయోగపడ్తారు. లేదంటే ఎదుటి వ్యక్తులపై విమర్శలు చేస్తారు. మొత్తమ్మీద లీడర్‌కు అంగుబలం ప్రాణవాయువుతో సమానం. వాగ్దానం: అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడంలో మన నాయకులు ఆరితేరారు. అధికారం చేజెక్కిన తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కనిపించకుండాపోవడం ఈ వాగ్దానభూత రాజకీయ లక్షణం. పక్కా ఇళ్లు, స్థలాలు, ఉచిత బీమా ఇతర ఉచిత పథకాలపై అనేక వాగ్దానాలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ అస్త్రం నాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫిరాయింపులు: ఈ అస్త్రంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియకుండా పోతోంది. రాజకీయాల్లో ఈ అస్త్రానికి ప్రత్యేక స్థానం. గోడమీది పిల్లిలా, తక్కెడలోని కప్పలాంటి లక్షణాలతో టికెట్ రాకపోయినా, సరైన ప్రాధాన్యం దక్కకపోయినా లేదా తమ స్వప్రయోజనాల కోసమో నాయకులు ఈ అస్త్రాన్ని ఎక్కువగా వాడతారు. -
గంగాపూర్ ఓటు... ఎటో?
కడెం: కనీస సౌకర్యాలు లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు కడెం మండలం మారుమూల ఉమ్మడి గంగాపూర్ వాసులు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా మా తలరాతలు మారడం లేదని, ఎన్నికలపుడు ఇచ్చే హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయని విసిగిపోయి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఉట్నూర్ ఆర్డీవో, ఈఆర్వో జివాకర్‌రెడ్డి, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి ఇటీవలే గ్రామంలో పర్యటించి ఎన్నికలను బహిష్కరించొద్దని, ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. మరోవైపు గ్రామస్తులు తమ హామీలను నమ్మడం లేదని, మూడు పార్టీల నాయకులు గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇవీ ప్రధాన సమస్యలు.. గ్రామానికి ప్రధాన సమస్య రోడ్డు, కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో వంతెన నిర్మాణం పూర్తి కావాలి, దీంతోపాటు ఎత్తిపోతల పథకం, గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయిస్తామని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్, బీజేపీ అభ్యర్థి రాఽథోడ్ రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఓటు.. ఎటో? ముగ్గురు అభ్యర్థులు సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ రాసివ్వడంతో.. గంగాపూర్, రాణిగూడ, కొర్రతండా మూడు గ్రామ పంచాయతీల ఓటర్లు ఏటు వైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది. రాణిగూడలో మొత్తం 494 ఓటర్లు ఉండగా ఇందులో 244 మంది పురుషులు, 250 మంది సీ్త్రలు ఉన్నారు. మొత్తం ఎస్టీ గోండ్ సామాజిక వర్గానికి చెందిన వారే, ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు పడే ఆవకాశం ఉంది. ఇక గంగాపూర్ పంచాయతీలో మొత్తం 764 ఓటర్లు ఉన్నారు. ఇందులో 376 మంది పురుషులు, 388 మంది సీ్త్రలు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు పడే ఆవకాశం ఉంది. కొర్రతండా పంచాయతీలో మొత్తం 411 ఓటర్లు కాగా, 202 మంది పురుషులు, 209 మంది సీ్త్రలు ఉన్నారు. ఇక్కడ లంబాడ సామాజికవర్గానికి చెందిన వారే అధికం. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉంది. -
‘రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్ తమ్మీ..’
నిర్మల్:‘రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్ తమ్మీ..’ ఓ సినిమాలో డైలాగ్ ఇది. ఈ మాట కూడా వాస్తవమే. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఎవరెవరు శత్రువులు.. ఎవరికి ఎవరు మిత్రులు.. అని చెప్పడమూ అసాధ్యమే. ఒకప్పుడు ఒకరిపై ఒకరు పోటీచేసి, కత్తులు దూసుకున్న వాళ్లే.. ఇప్పుడు చెట్టాపట్టాల్ వేసుకు తిరగొచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా జిల్లా రాజకీయాల్లోనూ మిత్రులనుకున్న వాళ్లు.. ప్రత్యర్థులయ్యారు. శత్రువులనుకున్న వాళ్లు మిత్రులుగా మారారు. జిల్లా వినూత్నం.. నిర్మల్ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌కు రాజకీయ కేంద్రంగా గుర్తింపు ఉంది. ఇలాంటి చోట రాజకీయ సమీకరణలు ఎప్పుడెలా మారుతాయో.. సాధారణ ఓటర్‌కు అంతుచిక్కదు. కొంతమంది ఐదేళ్లపాటు ఒకపార్టీలో ఉండి.. ఎన్నికల వేళకు మరోపార్టీలోకి మారారు. కొత్తపార్టీ నుంచి.. ప్రజలకు పూర్తిగా పరిచయం కాని పార్టీ నుంచి.. విజయాలను అందుకున్నారు. రాజకీయ జీవితాన్నిచ్చిన వారిపైనే పోటీ చేసి నెగ్గారు. చిరకాల ప్రత్యర్థులు అనుకున్నవారు ఏకమై పార్టీ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. ఒకప్పుడు తమ ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నారు. ఇలా జిల్లా రాజకీయాలు ఎవరికీ అంతుబట్టకుండా సాగుతున్నాయి. మిత్రులు.. ప్రత్యర్థులు.. నిర్మల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నేతల్లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి ఇద్దరూ ఒకరితర్వాత ఒకరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగుదేశంలో కలిసి పనిచేశారు. 1985లో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్‌గా, 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991లో ఎంపీగా టీడీపీ నుంచి అల్లోల పనిచేశారు. ఇదే పార్టీలో ఉన్న చారి 1985 నుంచి1994 వరకు నిర్మల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 1991లో ఎంపీగా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి పరిస్థితుల్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్‌లో కొనసాగారు. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వీరిద్దరు 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇందులో టీడీపీ నుంచి పోటీ చేసిన చారి గెలుపొందారు. 2008 లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో మరోసారి వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా ఈసారి చారిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంద్రకరణ్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు చారి బీఆర్ఎస్లో చేరి, ముధోల్ నుంచి పోటీచేసి ఓడారు. ఇదే ఎన్నికల్లో నిర్మల్‌లో బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచి, బీఆర్ఎస్లో చేరారు. అలా మళ్లీ పాత మిత్రులు ఒకే పార్టీలో కలిశారు. ప్రస్తుతం ఇద్దరూ జిల్లాలో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు. గురుశిష్యుల పోటీ.. నిర్మల్ నియోజకవర్గ రాజకీయాల్లో గురుశిష్యులు గా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావు ఆ తర్వాత ప్రత్యర్థులుగా, మళ్లీ మిత్రులుగా ఇటీవల మళ్లీ ప్రత్యర్థులుగా మారారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, మహాకూటమిలో భాగంగా బీఆర్ఎస్ నుంచి శ్రీహరిరావు పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో వీరిద్దరూ కాకుండా ప్రజా రాజ్యం నుంచి పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ నుంచి శ్రీహరి రావు, బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి మళ్లీ తలపడగా, అల్లోల గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీ ఆర్ఎస్లో చేరి మంత్రి కావడం, మొదట్లో శ్రీహరి రావుతో విభేదాలు కొనసాగడం నడిచాయి. 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధిష్టానం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. ఆ ఎన్నికల్లో శ్రీహరిరా వు పోటీ నుంచి తప్పుకుని అల్లోల గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ వారిద్దరి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. కొన్ని నెలల క్రితం పార్టీ ని వీడిన శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరి మరోసారి ఎన్నికల్లో అల్లోలకు ప్రత్యర్థిగా నిలిచారు. ప్రత్యర్థులు.. ప్రచారకర్తలు.. ► నిర్మల్ నియోజకవర్గంలో గతంలో ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఇప్పుడు ఒకే అభ్యర్థి కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లకొండ సత్యనారాయణగౌడ్ పోటీచేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న అల్లోల గెలిచారు. అనంతరం సత్యనారాయణగౌడ్ బీఆర్ఎస్లో చేరారు. ఆయన సతీమణి శోభారాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ప్రస్తుతం సత్యనారాయణగౌడ్ అల్లోల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ► 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి స్వతంత్ర అభ్యర్థి అర్గుల కమలాధర్గుప్తాపై గెలుపొందారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే బరిలో దిగిన నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీలో చేరి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ► ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు అప్పటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి కొన్నిరోజులు ఒకే పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. ► ఖానాపూర్ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన హరినాయక్ రమేశ్‌రాథోడ్‌కు ప్రత్యర్థిగా ఉండేవారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాథోడ్ కోసం హరినాయక్ ప్రచారం చేస్తున్నారు. ► ముధోల్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి విఠల్‌రెడ్డి భంగపడ్డారు. కాంగ్రెస్ నారాయణరావుపటేల్ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో విఠల్‌రెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీచేశారు. వేణుగోపాలచారి బీఆర్ఎస్ నుంచి పోటీపడ్డారు. కేవలం 180 ఓట్ల తేడాతో చారి చేతిలో విఠల్‌రెడ్డి ఓడిపోయారు. 2014 ఎన్నిక సమయంలో విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకోగా, బీఆర్ఎస్ నుంచి వేణుగోపాలచారి, బీజేపీ నుంచి పడకంటి రమాదేవి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో నారాయణరావు పటేల్ బరిలో దిగలేదు. ఇందులో విఠల్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం విఠల్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఇటీవల బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ రమాదేవి కూడా కారెక్కారు. దీంతో ప్రత్యర్థులుగా ఉన్న విఠల్‌రెడ్డి, వేణుగోపాలచారి, రమాదేవి ఒకే పార్టీ సభ్యులయ్యారు. ఇప్పుడు విఠల్‌రెడ్డి కోసం రమాదేవి ప్రచారం చేస్తున్నారు. వేణుగోపాలచారి వర్గం మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం విశేషం. -
ఖమ్మంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే..
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు...ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్లు పోటాపోటీగా బరిలో నిలిచాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఎన్నికల కోసం సీపీఐ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. సీపీఎం మాత్రం ఒంటరిపోరుకే సై అంది. ఇక ఖమ్మంలో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాల్ని గమనిస్తే.. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి...ఖమ్మం సీటు పై కీలక నేతలు గురిపెట్టారు...దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన ఫైట్ నెలకోనే అవకాశం ఉంది..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ బరిలో నిలవనున్నారు...వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు...ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు...ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన ఢీకొనడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు . అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడ కు చెక్ పెట్టేందుకు బీజేపీ,కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది.. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడ వినిపిస్తోంది..అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు .. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు పొంగులేటి..పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటి పై ఒత్తిడి తెస్తున్నారట. అటు కాంగ్రెస్ నుంచి జావిద్, బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద ఖమ్మం నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలున్నాయి? ఎన్ని మండలాలున్నాయి? రెండు మండలాలు ఉన్నాయి.. ఖమ్మం అర్బన్, రఘనాథపాలెం మండలాలు.. అతి పెద్ద మండలం ఏది? అత్యంత ప్రభావం చూపే పంచాయతీ ఏది? ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్ పెద్దది.. ఇక్కడే 2,50,000 ఓట్లుపైనే ఉన్నాయి.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మొత్తం ఓటర్లు- 3,11,693 పురుషులు- 1,50,552 స్త్రీలు- 1,61,095 వృత్తిపరంగా ఓటర్లు? పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు,వ్యాపారులు ఎక్కువగా ఉంటారు.. రఘనాథపాలెం మండలంలో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతూ ఉంటారు.. కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి.. మతం/కులం పరంగా ఓటర్లు? యాదవులు 45,000 ఓట్లు, కమ్మ 48,000 ఓట్లు, మైనార్టీ ఓట్లు 30,000 ఓట్లు.. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు వీరివే ఉంటాయి.. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..? ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఖమ్మంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు. ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు. పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్, చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు ఉంటే? ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరో వైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని వర్షపు నీరు ముంచేత్తుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు అంటున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులకు అందటం లేదన్న విమర్శలున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం. ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చూపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్ తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు . రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు.కానీ, ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది.. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ ,8 కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు. రూ. 21కోట్లతో నూతన బస్టాండ్,రూ. 25కోట్లతో ఐటీ హబ్,రూ.110 కోట్ల రూపాయల తో గొల్లపాడు చానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు.నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు.దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా.. 2004లో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్ గా మారనుంది. బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా.. బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సామ భేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి. -
Praja Ashirvada Sabha: కాంగ్రెస్‌కు అధికారమిస్తే అంధకారమే.. కేసీఆర్
నాగర్‌కర్నూల్/అలంపూర్/కొల్లాపూర్/కల్వకుర్తి రూరల్: కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆదివారం సీఎం కేసీఆర్ అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఒకప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ పరిస్థితులను ప్రజలకు వివరించారు. అభివృద్ధిని చూపి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సభలకు అన్ని చోట్లా వేలాదిగా గులాబీ శ్రేణులు తరలివచ్చారు. సీఎం ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం వస్తోందని.. ఆ పార్టీ ఉన్నన్ని రోజులు మన బతుకులు ఏం అయ్యాయో అందరికీ తెలుసని, పేదల ఆకలి బాధలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదని, ఆగం పట్టించి బతులకు నాశనం చేశారన్నారు. ఆనాడు జరిగిన అన్యాయాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వస్తున్నామన్నారు. కాంగ్రెస్‌కు మరిచిపోయి ఓటేస్తే ధరణి తీసి బంగాళఖాతంలో కలుపుతామని చెబుతున్నారని విమర్శించారు. బోయలను బీసీలో పెడితే మాట్లాడలేదని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పెండింగ్ పెడితే పట్టించుకోదని ఆరోపించారు. అదే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే.. నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని కింద పడేసి కూర్చుంది తప్ప ముందుకు కదల్చలేదన్నారు. ఈసారి కేంద్రం మెడలు వంచైనా వాల్మీకులను గిరిజనులుగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆర్డీఎస్ మీద తుమ్మిళ్ల కట్టుకున్నామని, దీని ద్వారా 30– 35 వేల ఎకరాలకు నీళ్లొస్తున్నాయన్నారు. మిగిలిన వాటికి నీళ్లందించడానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ కావాలని, తప్పకుండా రిజర్వాయర్ నిర్మిస్తామని, త్వరలోనే చిన్నోనిపల్లిని పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బతుకు పోరాటం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని కేసీఆర్ అన్నారు. ‘ఇందిరమ్మ మనువడు రాహుల్‌గాంధీ మొన్న కొల్లాపూర్‌కు ఎందుకు వచ్చిండు.. మనల్ని ఆగం పట్టించేందుక.. మళ్ల కరెంట్ బంద్ పెట్టేందుక.. మనకు ముళ్ల కిరీటం పెట్టేందుక అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు. ఇప్పుడు మనమే ఇతరులకు తిండి పెట్టే స్థితికి చేరుకున్నాం. కొల్లాపూర్‌లో ఒకప్పుడు గుంపు మేసీ్త్రలు ఉండేవాళ్లు.. ఇక్కడి నుంచి బొంబాయికి పనులకు వెళ్లే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మనమే ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నాం. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. తెలంగాణ బతుకుదెరువు పోరాటం అని.. మన బతుకు, మన తలరాత రాసే ఓట్లు ఇవి. హర్షవర్ధన్‌రెడ్డి ఏం పని చేసిండు.. ఇంతకు ముందున్న ఆయన ఏం పని చేసిండు.. అనేది మీకు తెల్వదా.. పోలీసోళ్లకు పట్టిచ్చుడు. కేసులు పెట్టుడు. ముఠా రాజకీయాలు కట్టుడు. కక్ష తీసుకొనుడు. ఇవి తప్ప వేరే పనేమైనా చేసిండా’ అని పరోక్షంగా మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. ‘ఐదేళ్లు మంత్రిగా ఉండే అందుకే మీరు కోపంతో ఆయనను ఓడగొట్టేసిండ్రు. మళ్ల ఇప్పుడు కొత్త వేషం వేసుకొని వస్తడు. మళ్ల మాట్లాడతడు. వారు ఇంతకుముందు పెట్టిన వెలుగులేంటి.. హర్షవర్ధన్‌రెడ్డి ఖరాబ్ చేసిందేంది. ఆయనకు ఎందుకు ఎయ్యాలె ఓటు. ఓట్లు ఒట్టిగనే ఏయొద్దు. దయచేసి మీ గ్రామాల్లో చర్చించండి అని ఓటర్లను కోరారు. మీ ఎమ్మెల్యే హర్ష నన్ను అ డుగుతుంటడు. కాల్వల బాగుకు, అభివృద్ధి పనుల కు నిధులు ఇవ్వండని కోరుతుంటడు. సింగోటం– గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పూర్తిచేస్తం. బాచారం హైలెవెల్ కెనాల్ త్వరలోనే పూర్తవుతది. మామిడి మార్కెట్‌ను పెట్టుకొని దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతం. మీ ఎమ్మెల్యే మామూలోడు కాదు. బీజేపోళ్లు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందామని, వంద కోట్లకో ఎమ్మెల్యేను కొంటామని లంగ దుకాణం పెట్టిండ్రు. మీ ఎమ్మెల్యే నిజాయితీగా నిలబడి ఆ దొంగలను పట్టిచ్చి జైళ్ల పెట్టిచ్చిండు. ఇంత న్యాయంగా, నిజాయితీ ఉండే మీ ఎమ్మెల్యే కొల్లాపూర్‌లో కొన్ని కాలేజీలు పెట్టిచ్చిండు. మొన్ననే కొన్ని పనులకు నిధులు ఇచ్చాం. వంద పడకల ఆస్పత్రి తెప్పిచ్చిండు. మున్సిపల్ అభివృద్ధికి రూ.25 కోట్లు ఇచ్చాం. హర్ష కోరిన మరిన్ని పనులు కూడా చేస్తాం. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించండి.’అని కోరారు. పదేళ్ల క్రితం ఎట్లుండె..ఇప్పుడెట్లుందో చూడండి.. రైతులకు ప్రాజెక్టు కాల్వల ద్వారా సాగునీరందిస్తే ఏ రాష్టంలో అయినా పన్నులు వసూలు చేస్తారు.. కానీ, కేఎల్ఐ ద్వారా పారే నీటికి పన్ను లేదని, పాతబకాయిలు కూడా రద్దు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో పాలమూరుకు పెండింగ్ జిల్లా అనే పేరు పెట్టారని, ప్రతి ప్రాజెక్టు పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని, ఫలితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వరికుప్పలే కనిపిస్తున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం పాలమూరు ఎట్లుండె.. ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలన్నారు. పాలమూరు చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా.. కనీసం మంచినీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. నిజాం కాలంలోనే నాగర్‌కర్నూల్ జిల్లాగా ఉండేదని, కాంగ్రెస్ హయాంలో ఆగం చేస్తే.. తెలంగాణ వచ్చాక మళ్లీ జిల్లా చేశామని కేసీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మార్కండేయ లిఫ్టు మంజూరు చేశామని, నాలుగు రోజుల క్రితం నీరు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ఇటీవల పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పంపు ప్రారంభించామని, వట్టెం రిజర్వాయర్ పూర్తయితే మరో 40– 50 వేల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ ప్రభుత్వమే మన తలరాత ఐదేళ్లు రాస్తుందన్నారు. సాగునీటి కష్టాలు తీరుస్తా.. కల్వకుర్తి రైతుల సాగుకష్టాలు తీర్చే బాధ్యత తనదేనని సీఎం అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ రైతుల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కల్వకుర్తిలో ఇంజినీరింగ్ కళాశాల, ఐటీ హబ్, కొత్తమండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా సభల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామ్రెడ్డి, ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వెంకటేశ్, నాయకులు ఎడ్మ సత్యం, విష్ణు వర్ధన్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, రంగినేని అభిలారావు, గౌరారం వెంకట్‌రెడ్డి, విజయ్, తిరుపతమ్మగౌడ్, రఘువర్ధన్‌రెడ్డి, విజయలక్ష్మీ, కిషన్‌నాయక్, బోజ్యానాయక్, నరేందర్‌రెడ్డి, చంద్రశేఖరాచారి, జాఫర్, రుక్మద్దీన్, సురేందర్‌రావు పాల్గొన్నారు. -
అన్నా జర గుర్తుపెట్టుకో..
ఆర్మూర్: అన్నా మనోళ్లను మన పార్టీకే ఓటు వేయ మని ఫోన్ చేసి చెప్పన్నా అంటూ పలు రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు గల్ఫ్ దేశాల్లో ఉ పాధి కోసం వెళ్లిన వారికి ఫోన్లు చేసి చెబుతున్నారు. స్థానికంగా ఉన్న పరిచయాలను వినియోగించుకొని బంధు, మిత్రుల ఓట్లు తమ పార్టీకి రాబట్టుకొనే ప నిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొననుంది. ఆయా పార్టీల నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూ సు కు పోతున్నారు. అయితే వారి గెలుపు కోసం పని చే స్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు గ్రామాల్లో నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి వివరా ల ను సేకరిస్తున్నారు. వారికి ఫోన్లు చేసి తమ పార్టీ అ భ్యర్థి విజయం సాధిస్తే వారి కుటుంబ సభ్యులకు పింఛన్ ఇప్పిస్తామని, ఇంటికి రోడ్డు వేయిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. గల్ఫ్‌లో ఉన్న వారు గ్రామాల్లో ఉన్న సమయంలో తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ వారి కుటుంబ సభ్యుల కు ఫోన్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీ ఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువు రు ద్వితీయ శ్రేణి నాయకులు ఒక అడుగు ముందు కు వేసి గల్ఫ్ దేశాల్లో ఆర్మూర్ ప్రాంతీయులు ఉండే ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయా లని సంకల్పించారు. అందులో భాగంగా ఆ యా పార్టీలకు చెందిన పలువురు నాయకులు దు బాయి కి వెళ్లనున్నారు. అక్కడ ప్రవాస భారతీయులతో స మావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు పది లక్షల మంది గ్రామీణులు గల్ఫ్ దేశా ల్లో ఉంటున్నందున వారితో చెప్పించి కు టుంబ స భ్యుల ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇందు కోసం ఆయా పార్టీల నాయకులు బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. -
మునుగోడు ఓట్ల వివరాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..
మునుగోడు నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: భువనగిరి రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524 పురుషులు: 124,473 మహిళలు: 123,996 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి: నల్గొండ జిల్లా మునుగోడు చందూర్ మర్రిగూడ నాంపల్లి ఘాటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపూర్ చౌటుప్పల్ నియోజకవర్గం ముఖచిత్రం సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఇప్పటి వరకు మునుగోడులో పదకొండుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఐదుసార్లు, సీపీఐ ఐదుసార్లు విజయం సాధించాయి. 1967 వరకు ఈ స్థానం చిన్నకొండూరుగా ఉంది. తెలంగాణ ప్రముఖ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు. పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. -
గడప దాటని నాంపల్లి బ్రదర్స్
మరో రెండు వారాల్లోనే పోలింగ్ జరగనుంది. కానీ ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు రాష్ట్రస్థాయిలో ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే కూర్చొని ప్రతీరోజు మీడియా సమావేశాలతోనే కాలం వెళ్లబుచ్చుతుండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నాయకులకు ఏకంగా నాంపల్లి బ్రదర్స్ అంటూ పార్టీలోని కేడర్ ముద్దు పేరు కూడా పెట్టేసింది. జాతీయ నాయకులు పర్యటనకు వచ్చినప్పుడు మినహా వారు బయట పర్యటనలకు ఎక్కువగా సమయం కేటాయించడం లేదట. అదేమంటే..ఇక్కడ కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారట. జాతీయస్థాయిలో సీనియర్ నేతలైన ఆ ఇద్దరూ కనీసం తమ జిల్లాల్లోని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మోయాల్సి ఉన్నా.. కనీసంగా పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తుండటంతో ఆయా జిల్లాల పార్టీ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారట. ఇక పార్టీ ఆఫీసులోనే కూర్చొని అప్పుడే అధికారంలోకి వచ్చేశామన్నట్టుగా వారిద్దరూ ఇచ్చే బిల్డప్ చూస్తుంటే పార్టీ శ్రేణులకు మాత్రం ఎక్కడో కాలుతోందట. -
ఈసారి పాగా వేసే పార్టీ ఏదో!
శ్రీరాంపూర్: ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న సింగరేణిలో కార్మికవర్గం ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఎలా ఉన్నా కార్మిక క్షేత్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటోంది. దీనికి గత 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా కారు జోరు కొనసాగినా కోల్‌బెల్ట్ ప్రాంతానికి వచ్చేసరికి భిన్నమైన తీర్పు వచ్చింది. నాడు ఈ ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ మెజార్టీ సీట్లు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఈసారి తీర్పు ఎలా ఉంటుంది? ఏ పార్టీకి పట్టం కడతారు? అని అంతటా చర్చ సాగుతోంది. కార్మి కుల అండ ఏ జెండాకు ఉంటుందనే దా నిపై పార్టీలన్నీ దృష్టి సారించి ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. పార్టీలు.. వాటి అనుబంధ కార్మిక సంఘాలకు సింగరేణిలో ఉన్న బలంతో గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో గత వైభవాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్, గులాబీ మయం చేయడానికి బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి ఆరు జిల్లాలు.. 11 స్థానాలు.. తెలంగాణలో సింగరేణి ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 11 అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యక్షంగా, మరో మూడు అసెంబ్లీ స్థానాల్లో పరోక్షంగా సింగరేణి ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఆరు స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మిగతా రెండింటిని టీడీపీ, ఆలిండియా ఫార్మర్డ్ బ్లాక్ కై వసం చేసుకున్నాయి. వీరిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మినహా మిగతా వారంతా ఆ పార్టీని వీడి కారెక్కారు. నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారే నేడు బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలవడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన అభ్యర్థుల బలం గెలుస్తుందా? పార్టీ బలం గెలుస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. చేసిన మేలే గెలిపిస్తుందని బీఆర్‌ఎ్‌స్.. కార్మికులకు తమ హయాంలో చేసిన మేలు, కల్పించిన హక్కులు, సదుపాయల గురించి బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు. కార్మికుల చిరకాల కోరిక అయిన కారుణ్య ఉద్యోగాల కల్పన, టీబీజీకేఎస్ సాధించిన విజయాలు లాభం చేస్తాయని బీఆర్ఎస్ నాయకత్వం విశ్వసిస్తోంది. ఆదాయ పన్ను కూడా మాఫీ చేయిస్తానని ఇటీవల మందమర్రిలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి కార్మికుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సింగరేణికి చేసిన అన్యాయాన్నే బీఆర్ఎస్ నేతలు నేటి ప్రచారంలో ఏకరువు పెడుతున్నారు. అందుకే కేసీఆర్ సింగరేణి మంచిర్యాల, కొత్తగూడెంలో ఇటీవల నిర్వహించిన సభల్లో సింగరేణి ఓట్లు రాబట్టేందకు తన ఉపన్యాసంలో నాటి సింగరేణి దుస్థితికి కారణం కాంగ్రెస్ అని, కాంగ్రెస్‌తోనే సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానిది అయ్యిందంటూ తుర్పారబడుతున్నారు. పూర్వవైభవం కోసం కాంగ్రెస్.. 2018 ఎన్నికల్లో సింగరేణి ఆరు జిల్లాల్లో గెలిచిన మూడు బీఆర్ఎస్ స్థానాలు కూడా మంచిర్యాల జిల్లా నుంచి కావడం విశేషం. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల స్థానాలు మినహా మిగతా చోట్ల బీఆర్ఎస్ గెలవలేదు. కొత్త గనులు రాకపోవడం, సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణ, సంస్థలో పెరిగిన రాజకీయ జోక్యం, రూ.వేల కోట్లు ప్రభుత్వ సంస్థలు సింగరేణికి బాకీ పడటం తదితర సమస్యలను కాంగ్రెస్ ఏకరువు పెట్టి గత వైభవాన్ని కాపాడుకునేలా ప్రచారం చేస్తోంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర పోటీలో ప్రస్తుతం ఈ 11 స్థానాలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ తరుణంలో కార్మికులు ఇచ్చే తీర్పు ఎంతో కీలకం కానుంది. వివిధ పార్టీల నుంచి గెలిచి కారెక్కి.. గత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలిచిన నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు, రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి విజయం సాధించిన కోరుకంటి చందర్, భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్రావు, ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోత్ హరిప్రియ, పినపాకలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన రేగా కాంతారావు, సత్తుపల్లిలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నియోజకవర్గం పార్టీ గెలిచిన అభ్యర్థి ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఆత్రం సక్కు బెల్లంపల్లి బీఆర్ఎస్ దుర్గం చిన్నయ్య చెన్నూరు బీఆర్ఎస్ బాల్క సుమన్ మంచిర్యాల బీఆర్ఎస్ ఎన్.దివాకర్‌రావు రామగుండం ఫార్వర్డ్ బ్లాక్ కోరుగంటి చందర్ మంథని కాంగ్రెస్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భూపాలపల్లి కాంగ్రెస్ గండ్ర వెంకటరమణారెడ్డి కొత్తగూడెం కాంగ్రెస్ వనమా వెంకటేశ్వర్రావు ఇల్లందు కాంగ్రెస్ బానోత్ హరిప్రియ పినపాక కాంగ్రెస్ రేగా కాంతారావు సత్తుపల్లి టీడీపీ సండ్ర వెంకటవీరయ్య -
పోటీలో లేని గద్వాల జేజమ్మ
సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఉమ్మడి పాలమూరులోని సీనియర్ రాజకీయ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల పాటు ఎన్నికల పోరులో తలపడుతూ వచ్చిన పలువురు రాజకీయ ఉద్దండులు అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వీరంతా ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు. గద్వాల ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ గద్వాల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే అరుణ ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. సమజ్వాదీ పార్టీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అనంతరం బీజేపీలో చేరారు. ఆపార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొ నసాగుతున్నారు. అయితే అ నూహ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె దూ రంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇ ప్పుడు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. చివరి నిమిషంలో జిల్లెల చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న జిల్లెల చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించినా చివరి నిమిషంలో అభ్యర్థిత్వంలో మార్పు చేసింది. ఆయన స్థానంలో మరో నేత మేఘారెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో వెలుగొందిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కందనూలు పోరుకు నాగం వీడ్కోలు.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 1983 నుంచి సుమారు 40 ఏళ్లుగా ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 1983లో వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగం కందనూలుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 ఉపఎన్నికలోనూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. ఈ అనూహ్య పరిణామానికి కలత చెందిన నాగం కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. 2009లో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 1508 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించగా, జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించడంతో జగదీశ్వరరావు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. -
ఆమెకు అవకాశం ఏది?
అలంపూర్: మహిళలు మహారాణులు అంటూ కీర్తిస్తుంటాం. పురుషులతో సమానంగా అవకాశం కల్పిస్తాం అంటారు. విద్య, ఉద్యోగాల్లో ప్రస్తుతం మహిళలు రాణిస్తున్నా.. రాజకీయాల్లో మాత్రం వారికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. ద్వితీయ శ్రేణి పదువుల్లో మహిళలు అవకాశం దక్కించుకుంటున్నారు. కానీ పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ వంటి చట్టసభలు చేసే కీలక పదవుల్లో మహిళలు రాణించలేకపోతున్నారు. కొన్ని సార్లు మహిళలు బరిలో నిలిచినప్పటికి ఫలితాలు తక్కువగానే వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టంబర్లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును ఏకగ్రీవంగా అమోదించింది. ఈ బిల్లు ఆధారంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం దక్కుతుంది. బిల్లు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్ధి మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహిళలు పోటీపడినా రెండవ స్థానానికి పరిమితం అయ్యారు. ఇలా నామినేషన్.. అలా విత్‌డ్రా ఈ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అలంపూర్ అసెంబ్లీ స్థానంలో మహిళా అభ్యర్థులు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయదలిచిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయిజకి చెందిన మేరమ్మ బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా అయిజ మండలం సంకాపురానికి చెందిన ప్రేమలత బీఆర్ఎస్, తెలంగాణ రాజ్య సమితి పార్టీ, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదిన జరిగిన నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం మేరమ్మ స్వతంత్ర అభ్యర్ధిగా, ప్రేమలత తెలంగాణ రాజ్య సమితి తరపున వేసిన నామినేషన్లు స్వీకరించారు. కానీ అనుహ్యంగా ఈ నెల 15వ తేదిన తమ నామినేషన్లను ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పేర్లు ఎక్కడ కనిపించకుండా పోయాయి. -
మనమంతా పొలిటికల్ జాతిరత్నాలం!
సినిమాలో... ‘‘తిన్నవా?’’ ‘‘ఆ... తిన్న...నువ్వు?’’ ‘‘నేనూ తిన్న... మీ ఇంట్ల ఏం కూర?’’ ‘‘తమాట పప్పు..ఇప్పుడు మీ గడియారంల టైమెంతయ్యింది?’’ ‘‘మా తాన పదకొండున్నరయ్యింది’’ ‘‘అరె... మాతన ఇంకా పదకొండు ఇరవైయయ్యిదే !!’’ సినిమాలోని ‘జాతిరత్నాలు’ ఇలా మాట్లాడుకుంటుంటారు కదా. బయట కూడా ఈ ఎలక్షన్ సీజనంతా ఓటర్లంతా ఇంచుమించూ ఇదే తరహాలో మాట్లాడుకుంటూ ఉంటారు. ‘‘అవ్... మీకాడ ఎవరొస్తున్రు?’’ ‘‘మాకాడ బీఆర్ఎస్ జోరుగున్నది. మల్ల మీ కాడ?’’ ‘‘మాకాడ కాంగ్రెస్ ఊపుమీదున్నది గని... బీఆర్ఎస్ను కొట్టలేస్తరా ఎవరన్న?’’ ‘‘హంగొస్తదా?’’ ‘‘హంగొచ్చిందంటే బీఆర్ఎస్ గెలిసినట్టేనాయ్’’ సినిమాల మాటలతోని కామెడీ అనిపిస్తదేమోగానీ..ఈ ఎలక్షన్ సీజన్ల అది కామెడీ కాదు..ఎవరేందో తెలుస్తది. ఎవరి అవాకులూ, చెవాకులూ, బలాలూ, బలహీనతలూ, కవర్ చేయనీకి మేకపోతులూ...గాంభీర్యాలూ ఇయన్నీ ఉంటయ్. మొదట ఇట్లాంటి లైట్ లైట్ సంభాషణతోనే మొదలైతది. తర్వాత్తర్వాత కొంచెం కొంచెం లోపలికి వెళ్తరు. చిన్నగ క్లారిటీ వస్తది. తర్వాత అభిప్రాయ పరికల్పన జరుగుతది. ఆ ఎమ్మట్నే ఎవరికి ఓటేస్తె మంచిదో ఒక నిర్ణయం జరుగుతది. ఇదో అంచెలంచెల ప్రక్రియ. ఈ యాంగిల్ల చూస్తె..జనాలందరూ జాతిరత్నాలే. సేమ్‌టుసేమ్..ఇట్లనే మాట్లాడుకుంటరు. మనం సినిమాలల్ల మాటలు చూసి ఓన్లీ కామెడీ అనుకుంటం. బయట కూడా ఉబుసుపోని కబుర్లు అనుకుంటం. కానీ ఇక్కడిది సీరి‘యస్’. ఎందుకంటే యోగిపేట శ్రీనాథ్ అనేటోడు ఒకడు... ‘జాబు సంపాయిస్త, కంపెనీ ట్యాగు మెళ్ల ఏసుకుంట’..అనుకుంట యోగిపేట నుంచి వస్తడు. ఇంకోడు రైసు పెట్టి..కడుపుల ఆకలి గుర్‌గుర్‌లు కుక్కర్ సీటీల లెక్క కొడుతుంటే..బీఆర్ఎస్ వాళ్లు ఇచ్చే నాలుగొందల సిలిండరు కోసమో, కాంగ్రెస్ ఇచ్చే ఐదొందల గ్యాసు కోసమో వెయిట్ చేస్తూ..వెయిట్ తగ్గుతుంటడు. కానీ నాయకుల మాటల్తోని తెలిసేదేందంటే..వాళ్ల ఇంటర్వ్యూలతోనీ, వాళ్ల స్పీచ్‌లతోనీ, రోడ్‌షోల వాళ్ల ప్రసంగాలతోనీ తెలిసేదేంటంటె..వాళ్లెప్పుడూ కరెక్టే అన్నట్టు మాట్లాడతరు. ఎవరైనా ఏదైన అడిగితే అడిగినోడిదే తప్పన్నట్టు అదరగొడతరు. వాళ్లు చేసేదే రైటు. కావాలంటే..ఆ తప్పును ఎదుటి పారీ్టవాళ్ల మీదికి నెడతారే తప్ప..వాళ్లదే తప్పూ ఉండదు..అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ, మరింకేపార్టీ అయినప్పటికీ ఇదే ధోరణి. అందుకే చివరకు ఓటరే అంటడు... ‘‘తప్పు నా నుంచే అయ్యిందంటే ఎల్లిపోతరా..ఈడికెల్నుంచీ..’’ అంటడు. ఊకె పోకుండ..పోతపోత వాడు ఓటేసి పోతడు. గెలిసినోడికి తప్ప మిగతా అందరికీ ఓటరుగాడు పెంటపెంట చేసి పొయ్యిండనిపిస్తంది. ఎట్టకేలకు జాతిరత్నాల్లాంటి మనమందరమూ క్లైమాక్స్‌ల చెప్పుకోవాల్సిన రత్నం లాంటి సూక్తీ, తెలిసే సత్యం ఏమిటంటే... ఓటో ఓటరు రక్షితహ! దీని అర్థం... ఓటరేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తది. ఆ ప్రజాస్వామ్యమే మల్ల ఓటర్ని కాపాడతది. బస్ అంతే. -
213 మందికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. చిన్న తండాకు పెద్ద తంటాలు!
హన్మకొండ: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 71 ఇళ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐదవ వార్డు పరిధి లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది. తండాలోకి వెళ్తుండగా కుడివైపున డోర్నకల్ మున్సిపాలిటీ ఐదవ వార్డు పరిధిలో 40 ఇళ్లు ఉండగా, 140 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. రోడ్డుకు ఎడమ వైపున లచ్చాతండా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, బర్లగూడెం పరిధిలోని 10వ వార్డులో ఉండగా ఇక్కడ 31 ఇళ్లు, 73 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఓటర్లంతా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. తండాలో ఒకే కుటుంబానికి చెందిన వారు విడిపోయి రోడ్డుకు ఇరు పక్కల ఇళ్లు నిర్మించుకోవడంతో తండ్రి కుటుంబం ఓ నియోజకవర్గంలో, కుమారుడి కుటుంబం మరో నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ తండాకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్, ఇల్లెందు నుంచి హరిప్రియ ప్రాతినిథ్యం వహించారు. ఎర్రమట్టితండా.. డోర్నకల్ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎర్రమట్టి తండా, గార్ల మండలం రాజుతండా గ్రా మపంచాయతీలు కలిసి ఉన్నాయి. రోడ్డుకు ఓ వైపు ఎర్రమట్టితండా, మరో వైపు రాజుతండా ఉండగా రెండు తండాలను విడదీస్తూ మధ్యలో రోడ్డు ఉంది. అయితే తండాలు కలిసి ఉన్నా డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఉండడం గమనార్హం. -
ఇప్పుడు మీ పాత్రే చాలా కీలకం.. కలెక్టర్..!
నల్లగొండ: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్, ఆర్.కన్నన్, కె.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో వారు మాట్లాడారు. పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ తప్పిదాలు, కోడ్ ఉల్లంఘనలు జరిగితే వెంటనే రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకుల దృష్టికి తేవాలన్నారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధానాన్ని, ఈవీఎం వీవీప్యాట్లను ఉపయోగించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయింపు నియోజవర్గాల వారీగా వివిధ పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఓపీఓలు బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని సిబ్బందికి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల వారీగా విధులు కేటాయించారు. -
Mahabubnagar: సమస్యాత్మక కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరింవచాలి
మహబూబ్‌నగర్: జిల్లాలోని ఓటర్లకు బుధవారం నుంచి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్ ఆదేశించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, వెబ్ కాస్టింగ్ తదితర అంశాలపై మంగళవారం ఆయన ఐడీఓసీ నుంచి సెక్టోరల్ అధికారులు, ఏఆర్వోలు, బీఎల్వోలు తదితరులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే ఐదు రోజుల ముందే అంటే 25వ తేదీలోగా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు ప్రతిరోజు ఏ ప్రాంతంలో ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేస్తున్నది ముందుగానే షెడ్యూల్లో పేర్కొనాలని, సదరు షెడ్యూల్‌ను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని, బీఎల్ఓలతో పాటు, బీఎల్ఏలకు ఈ విషయం చెప్పాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీపై తక్షణమే బీఎల్వోలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించాలని, అదేవిధంగా సెక్టోరల్ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఏ రోజుకు ఆ రోజు ఎన్ని స్లిప్పులు పంపిణీ చేసింది నివేదిక సమర్పించాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను, ఓటరు గైడ్, సీ–విజిల్ పోస్టర్లను తక్షణమే సేకరించుకోవాలని ఆదేశించారు. ఒకసారి ఓటరు ఇంటికి వెళ్లినప్పుడు ఓటరు లేనట్లయితే మరోసారి వెళ్లాలని సూచించారు. ఓటరు సమాచార స్లిప్పులు కేవలం బీఎల్ఓలు మాత్రమే పంపిణీ చేయాలని, ఎట్టి పరిస్థితులలో ఇతరులు పంపిణీ చేయకూడదని, ఇంట్లో ఓటరు లేనట్లయితే పెద్ద వారికి మాత్రమే ఇచ్చి సంతకం తీసుకోవాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులు బీఎల్ఓ దగ్గర కాకుండా ఇతరుల వద్ద కనబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించేందుకు సెక్టోరల్ అధికారులు సరాసరిన తనిఖీ చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు ఓటరు సమాచార స్లిప్పులపై హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని, ఫోన్ నంబర్ ఏర్పాటు చేసి ఓటరు సమాచార స్లిప్పులపై వచ్చే ఫిర్యాదు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వెబ్‌కాస్టింగ్‌పై కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమైన, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించాలని, ఇందుకు తక్షణమే ఏఆర్వోలు పోలింగ్‌కేంద్రాల లేఔట్లను రూపొందించి పంపించాలని ఆదేశించారు. కేంద్రాలలో కరెంటు సరఫరా, త్రీ పిన్ ఫ్లగ్ వంటివి ఉన్నాయో లేదో చూడాలని, ఏజెన్సీ వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసే సమయంలో పూర్తిగా సహకరించి లే ఔట్ ప్రకారం కెమెరా ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియజేయాలని ఆదేశించారు. ఆబ్సెంట్ ఓటర్లను సమీక్షిస్తూ ఫామ్–12–డీ ప్రకారం ఏ పోలింగ్ కేంద్రంలో ఎంతమంది హోం ఓటర్లు ఉన్నారో చూసుకుని అందుకు తగ్గట్టుగా రూట్ మ్యాప్ తయారు చేయాలని, ఎంత మంది పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుందో ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. -
ప్రత్యర్థులకు సవాల్ విసిరిన కేసీఆర్.. షెడ్యూల్ రాక ముందే అభ్యర్థుల ప్రకటన
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల కంటే ముందే గులాబీ బాస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. గతంలో మాదిరిగానే షెడ్యూల్ రాకుండానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు కేసీఆర్. అభ్యర్థులంతా ఎప్పటినుంచో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ప్రతి రోజూ మూడు నాలుగు సభల్లో ప్రసంగిస్తూ దూకుడు పెంచారు. నామినేషన్లును పూర్తిచేసిన అభ్యర్థులు.. అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులంతా నామినేషన్లు వేసేశారు. ఇక ప్రచార జోరు తీవ్రం కానుంది. రెండు నెలల క్రితమే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం..ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అభ్యర్థులందరికీ బి ఫామ్స్ కూడా అందజేయటం పూర్తి చేసింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలుండగా...తొలి విడతలోనే 115 స్థానాలకు సెప్టెంబర్ 21న అభ్యర్థులను ప్రకటించించారు. నాంపల్లి, గోషామహల్, జనగామ, నర్సాపూర్ అభ్యర్థులను మాత్రం అప్పుడు పెండింగ్‌లో ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. మరికొద్ది రోజులకు నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డికి, ఇంకో రెండు స్థానాలకు టిక్కెట్లు కేటాయించారు. రెండుస్థానాల్లో మార్పులు.. అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగించి...వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి...భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ...గులాబీ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళుతోంది. అందరికంటే ముందుగా జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అందులో రెండు స్థానాల్లో మాత్రమే మార్పులు చేసింది. మల్కాజ్గిరి స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ కేటాయించినప్పటికీ..ఆయన కొడుక్కి మెదక్ టిక్కెట్ రాకపోవడంతో పార్టీ మీదు బురద జల్లి...బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరి తనకు మల్కాజ్గిరి, తన కొడుక్కి మెదక్ టిక్కెట్ తెచ్చుకుని బరిలోకి దిగారు. దీంతో మల్కాజ్గిరి స్థానం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్‌ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించింది. అలాగే ఆలంపూర్ నియోజకవర్గానికి మొదటి లిస్టులోనే అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ అక్కడి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవని గ్రహించి విజయుడుకు అవకాశం కల్పించారు. ఇలా రెండు స్థానాల్లో మినహా గులాబీ పార్టీలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బీ ఫార్మ్స్ నింపాలి.. 2018లో ఎదురైన సమస్యలు.. అనుభవాల దృష్ట్యా నామినేషన్ల దాఖలు, బీ ఫామ్స్ భర్తీ విషయంలో గులాబీ పార్టీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నిపుణుల సమక్షంలోనే ఫార్మ్స్ నింపాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల పేపర్లు నింపేటప్పుడు ఏమరుపాటు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే నింపాలని కూడా ఆదేశించారు. గతంలో గెలుపొందిన అభ్యర్థుల్లో పది మందికి పైగా అనర్హత కేసులు ఎదుర్కొనడమే గాకుండా వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావటంతో ఈ అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది పార్టీ. వాటి వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కచ్చితంగా ఈసారి ఏ చిన్న అవకాశం కూడా పక్క పార్టీలకు ఇవ్వకూడదని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ఇక ప్రచారం విషయంలో కూడా రాబోయే 15 రోజులు గులాబీదళం కీలకంగా వ్యవహరించనుంది. కేసీఆర్ రాకతో గ్రౌండ్ లెవెల్లో మార్పులు.. పార్టీ అభ్యర్థుల కోసం గులాబీ బాస్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికి తొలివిడత ప్రచారం ముగిసింది. దీపావళి తర్వాత రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. గ్రౌండ్ లెవెల్ లో మొదటి విడత షెడ్యూల్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఏ విధంగా ఉందనే దానిపై కేసీఆర్ ఆరా తీశారు. అంతకుముందున్న కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ.. కేసిఆర్ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే పరిస్థితిలో మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
Oath To Vote: ఓటుతో దుమ్ము రేపుదాం
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఓటరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసలు "ఓత్ టు వోట్" (OATH TO VOTE) నినాదం ఏమిటంటే.. 'ఓటు హక్కు కలిగిన ఓటరు ఈ వెబ్ సైట్ https://o2v.sakshi.com/?utm_source=sakshio2v కు లాగిన్ అయి తమ ఓటు హక్కును 2023 ఎన్నికలలో తప్పకుండా వినియోగించుకుంటామని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) ద్వారా ప్రమాణం చేయాలి. అంతేకాదు ఆ ప్రమాణానికి సంబంధించి ప్రమాణపత్రం కూడా ఇమెయిల్ రూపంలో వెంటనే పొందవచ్చు.' ఎన్నికల్లో ప్రతిసారి ఎవరో ఒకరు తమ విలువైన ఓటు హక్కును వాడుకోక పోవడం వల్ల ఆ ఓటు కాస్త మురిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాలతోపాటు మన జీవితాలూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ‘‘ఏం ఓటు మీ హక్కు కాదా? మీకు తగిన అభ్యర్థిని మీరు ఎన్నుకోలేరా?’’ ఒక్కసారి ఆలోచించండి. గెలిచేది వారైతే గెలిపించేది మనమని అర్థం చేసుకోండి. వారు గెలిచి చేసే పాలన కన్నా మనం గెలిపించుకుని చేయించుకునే పాలనే మిన్న అని గుర్తించండి. ఓటు హక్కును వాడుకునే అవకాశాలు మున్ముందూ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనముందున్న ఎన్నికలు మనకొచ్చిన తాజా అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరనుకున్న రేపటి భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకంతో ముందుకు కదలండి. ‘ఓత్ టు వోట్’ ద్వారా మీరేంటో నిరూపించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి.. -
సెలబ్రిటీ కామెంట్
పాత బస్తీని హెరిటేజ్ సిటీగా మార్చాలి సాక్షి, సిటీబ్యూరో: ఇది మన కలల నగరం కావాలంటే రాకెట్ సైన్స్ అవసరం లేదు. ప్రభుత్వ సంకల్పం పౌరుల సహకారం ఉంటే చాలు. పాతబస్తీని పరిశుభ్రంగా మార్చి వారసత్వ నగరంగా పునరుద్ధరించాలి. తద్వారా గొప్ప పర్యాటక ఆకర్షణగా మారుతుంది. ఫుట్‌పాత్‌లు జీబ్రా క్రాసింగ్‌లు వంటివి పెరిగితే పాదచారులు నడవడానికి సిటీ రోడ్లు అనువుగా మారతాయి. తగినన్ని ఉద్యానవనాలు, నీటి వనరులను కూడా అభివృద్ధి చేయాలి. వాక్‌వేలు సరిపడా ఉంటే అవి స్వచ్ఛమైన గాలిని పొందడానికి వీలు కల్పిస్తాయి. మెట్రో స్టేషన్లకు చివరి మైలు కనెక్టివిటీ ఉంటే.. మరింత ఎక్కువ మంది వినియోగించుకుంటారు. చాలా చోట్ల రోడ్ల పక్కన దుర్వాసనతో కూడిన చెత్త కుప్పలు వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. డివైడర్లు రాత్రిపూట డ్రైవర్లకు కనిపించేలా రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి. కళ, సంస్కృతి, రంగస్థలం, యాంఫిథియేటర్లు, ఆడిటోరియాలు పెరిగితే అవి నగరాన్ని వైవిధ్యభరిత కార్యక్రమాలతో సందడిగా మారుస్తాయి. అన్నింటికి మించి మహిళలు, చిన్నారులకు తగినంత భద్రత సంపూర్ణంగా లభిస్తే అంతకు మించిన కలల నగరం ఇంకొకటి ఉండదు. – చందనా చక్రవర్తి, సినీ నటి ఒవైసీ బ్రదర్స్.. ఆన్ ఫీల్డ్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో శుక్రవారం ఒవైసీ సోదరులు ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్యేఅక్బరుద్దీన్‌లు ఉప్పుగూడ డివిజన్లో గాలిపటం గుర్తుకు ఓటు వేసి మజ్లిస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. – చాంద్రాయణగుట్ట తలపాగా చుట్టాం.. పాగా వేస్తాం ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్‌ను దాఖలు చేశారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో విజయవాడ జాతీయ రహదారి హయత్‌నగర్ నుంచి కోత్తపేట వరకు జనసంద్రంగా మారింది. చింతలకుంట వద్ద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై కార్యకర్తలు, అభిమానుల్లో హుషారు నింపారు. – మన్సూరాబాద్ ఆలస్యంగా వచ్చానటా! సమయానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోయిన భారత చైతన్య యువజన పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ అభ్యర్థి వి.చంద్రశేఖర్ గౌడ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల దాటిన తర్వాత కార్యాలయానికి వచ్చారంటూ ఆయనను నామినేషన్ వేయకుండానే వెనక్కు పంపించారు. కాగా.. తాను 11 నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనే ఉన్నానని.. తన ముందు వచ్చిన వారి నామినేషన్లు తీసుకొని తనది పక్కన పెట్టారని చంద్రశేఖర్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. తాను 3 గంటలకు సమయం ముగుస్తుందనే విషయాన్ని 10 నిమిషాల ముందుగానే అనౌన్స్ చేయించానని రిటర్నింగ్ అధికారి వివరణ ఇచ్చారు. – రాజేంద్రనగర్ కూటి కోసం.. కూలి కోసం.. బడుగు జీవులకు, అడ్డా కూలీలకు ఎన్నికల ప్రచారాలు నిత్యం ఉపాధితో పాటు కడుపు నింపుతున్నాయి. బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్‌లో శుక్రవారం ఓ పార్టీ ప్రచారంలో భాగంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అందరూ ఒకేసారి మీదపడితే తమకు దొరుకుతుందో లేదోనన్న భయంతో కొంత మంది అక్కడికి చేరుకొని ఇలా అల్పాహారాన్ని పట్టుకెళ్లారు. తాము ఇంత తినేసి ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తున్నామంటూ చెప్పారు. – బంజారాహిల్స్ నాడు బల్దియా.. నేడు అసెంబ్లీ ప్రత్యర్థులు.. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకే డివిజన్ నుంచి పోటీ పడిన బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ ప్రత్యర్థులుగా దిగారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని జంగమ్మెట్ డివిజన్ నుంచి అప్పటి టీఆర్ఎస్ తరఫున ముప్పిడి సీతారాంరెడ్డి, బీజేపీ నుంచి కౌడి మహేందర్‌లు పోటీ పడి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ముప్పిడి సీతారాంరెడ్డికి 5,934 ఓట్లు రాగా.. మహేందర్‌కు 5,359 ఓట్లు పోలయ్యాయి. ఆ ఇద్దరే ప్రస్తుతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. – చాంద్రాయణగుట్ట -
దటీజ్... నాగన్న!
డాక్టర్ నాగన్న.. ఉమ్మడి జిల్లాలో పాతతరం రాజకీయ నాయకుల్లో ఈ పేరు తెలయనివారు ఉండరు. ఆయన రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోరులో నిలిచినా విజయాన్ని దక్కించుకున్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన డాక్టర్ నాగన్న 1952లో మొదటి సారి అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. 1957లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. 1962 ఎన్నికల్లో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నాగన్న సీపీఎం అభ్యర్థి ఎస్.చలంపై 5,413 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1967 షాద్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ విధంగ ఆయన నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. – మహబూబ్‌నగర్ డెస్క్ -
TS Elections 2023: అభ్యర్థుల ఆస్తులు – అప్పులు.. ఇంకా..!
ఎన్నికల నామినేషన్లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల చేతిలో నగదు అంతంతమాత్రంగా ఉంది. కొందరు అభ్యర్థులతో సమానంగా వారి సతీమణుల పేరుపై చర, స్థిరాస్తులు ఉన్నాయి. కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్రావులకు స్వంత ఇల్లు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. – సాక్షి నెట్వర్క్ శ్రీనివాస్‌గౌడ్: మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పులు రూ.44,776 ఉన్నాయి. చరాస్తులు రూ.1,14,15,781, స్థిరాస్తులు రూ.51,55,000, చేతిలో నగదు రూ.19,31,480 ఉండగా.. ఆయన సతీమణి శారద పేరుపై చరాస్తులు రూ.2,82,36,165, స్థిరాస్తులు రూ.2,42,43,085, నగదు రూ.53,743, అప్పులు రూ.3,02,72,101 ఉన్నాయి. 2018లో శ్రీనివాస్‌గౌడ్ చరాస్తులు రూ.71,94,203, స్థిరాస్తులు రూ.15,46,100 ఉన్నాయి. చేతిలో నగదు రూ.2,50,000 ఉండగా, అప్పులు లేవు. శారద పేరు మీద చరాస్తులు రూ.2,16,55,711, స్థిరాస్తి రూ.37,47,826లతో కొనుగోలు చేయగా.. స్థిరాస్తుల విలువ రూ.96,00,000, నగదు రూ.1,00,000 అప్పులు రూ.35,29,285 ఉన్నాయి. లక్ష్మారెడ్డి: జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డికి రూ.2,54,20,385 విలువగల చరాస్తులు, రూ.4,58,43,750 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.2,50,000, బంగారం 1,041 గ్రాములు, వ్యవసాయ భూమి 20.20 ఎకరాలు ఉంది. రూ.1,03,62,926 అప్పులు ఉన్నాయి. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత పేరు మీద రూ.14,09,19,271 విలువజేసే చరాస్తులు ఉన్నాయి. రూ.11,40,00,000 విలువగల స్థిరాస్తులతో పాటు చేతిలో నగదు రూ.5లక్షలు, బంగారం 4,053 గ్రాములు, 12.37 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. రూ.14,09,19,271 అప్పులు ఉన్నాయి. జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి: జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ జడ్చర్ల అభ్యర్థి జనుంపల్లి అనిరు«ద్‌రెడ్డికి రూ.51,32,392 విలువజేసే చరాస్తులు, రూ.1,93,25,948 విలువగల స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.33,450 ఉండగా, అప్పులు రూ.9,96,29,800 ఉన్నాయి. 53 ఎకరాల వ్యవసాయ భూమి, ఉంది. 5 పోలీస్ కేసులు ఉన్నాయి. అతడి సతీమణి మంజూష పేరు మీద రూ.11,47,34,486 విలువగల చరాస్తులు, రూ.6,64,10,653 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.21,595, బంగారం 1,215 గ్రాములు 18ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బీరం హర్షవర్ధన్‌రెడ్డి: కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ కొల్లాపూర్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డికి రూ.5,75,00,000 విలువజేసే స్థిరాస్తులతోపాటు రూ.3,84,21,944 విలువైన చరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.2,00,000 ఉండగా, రూ.2,57,81,684 అప్పు ఉంది. మూడు కార్లు ఉన్నాయి. బంగారం 370 గ్రాములు, సింగోటం, ఎత్తం గ్రామాల్లో భూములు ఉన్నాయి.కొల్లాపూర్, బంజారాహిల్స్‌లో నివాసగృహాలు, వనపర్తిలో కమర్షియల్ భవనం ఉంది. ఆయన భార్య విజయ పేరు మీద రూ.1,72,000 విలువజేసే స్థిరాస్తులు, రూ.61,45,944 విలువగల చరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.1,40,000, బంగారం 650 గ్రాములు, రూ.47,98,339 అప్పు ఉంది. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి: మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ మహబూబ్‌నగర్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి రూ.1,18,42,292 విలువగల చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు రూ.1,48,00,000 విలువగలవి ఉండగా, చేతిలో నగదు రూ.2,00,000 ఉంది. రూ.24,69,314 అప్పులు ఉన్నాయి. ఆయన భార్య తూము ప్రసన్న పేరు మీద రూ.1,22,10,908 విలువైన చరాస్తులు ఉన్నాయి. రూ.9,31,000లతో స్థిరాస్తి కొనుగోలు చేశారు. స్థిరాస్తుల విలువ రూ.96,00,000లుగా ఉంది. చేతిలో నగదు రూ.1,50,000 ఉండగా, రూ.6,47,869 అప్పులు ఉన్నాయి. నిరంజన్‌రెడ్డి: వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2018 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.1.64కోట్లు కాగా.. 2023లో మొత్తం ఆస్తుల విలువ రూ. 5.10కోట్లకు చేరింది. రూ.1.08కోట్ల విలువజేసే చరాస్తులతో పాటు రూ.4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.06 కోట్ల అప్పు ఉంది. ఆయన భార్య వాసంతి పేరుపై రూ. 2.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి: గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ గద్వాల అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై రెండు కేసులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.2లక్షలు ఉండగా, రూ.4,11,56,750 విలువజేసే స్థిరాస్తులు, రూ.8,20,7464.43 విలువగల చరాస్తులు ఉన్నాయి. రూ.1,82,20,722 అప్పు ఉంది. ఆయన భార్య జ్యోతి చేతిలో రూ.2లక్షల నగదు ఉండగా, రూ.4,19,10,500 విలువజేసే స్థిరాస్తులు, రూ.49,48,855 విలువైన చరాస్తులు ఉన్నాయి. కుమారుడు సాకేత్‌రెడ్డి పేరుపై రూ.60వేల విలువైన స్థిరాస్తులతో పాటు రూ.60,904 విలువైన చరాస్తులు ఉన్నాయి. చిక్కడు వంశీకృష్ణ: అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అచ్చంపేట అభ్యర్థి చిక్కడు వంశీకృష్ణకు రూ.76,09,198 విలువజేసే చరాస్తులతో పాటు రూ.1,88,39,500 విలువగల స్థిరాస్తులు ఉన్నాయి. పూరి్వకుల ఆస్తి రూ.18,39,500 ఉండగా, రూ. 2,36,53,825 అప్పు ఉంది. ఆయన భార్య అనురాధ పేరు మీద రూ.72,59,608 విలువజేసే చరాస్తులతో పాటు రూ.2,23,05,625 విలువజేసే స్థిరాస్తులు ఉ న్నాయి. పూరి్వకుల ఆస్తి రూ.3,65,625 ఉండగా, రూ. 2,12,33,502 అప్పు ఉంది. కుమారుడు యశ్వంత్ పే రుపై రూ.4,60,947 విలువైన చరాస్తులు ఉండగా, కూ తురు యుక్తాముఖి పేరుపై రూ. 39,26,616 విలువజే సే చరాస్తులు ఉన్నాయి. రూ.2.75లక్షల అప్పు ఉంది. బోయ శివారెడ్డి: గద్వాల బీజేపీ అభ్యర్థి బీజేపీ గద్వాల అభ్యర్థి బోయ శివారెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. రూ.22.50లక్షల విలువజేసే స్థిరాస్తులు ఉండగా, చేతిలో నగదు రూ.5లక్షలు ఉన్నాయి. రూ.90,386 అప్పు ఉంది. ఆయన భార్య జానకమ్మ పేరుపై రూ.23.41లక్షల విలువజేసే స్థిరాస్తులతో పాటు రూ.5లక్షల నగదు ఉంది. నిరంజన్‌రెడ్డి: వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2018 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.1.64కోట్లు కాగా.. 2023లో మొత్తం ఆస్తుల విలువ రూ. 5.10కోట్లకు చేరింది. రూ.1.08కోట్ల విలువజేసే చరాస్తులతో పాటు రూ.4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.06 కోట్ల అప్పు ఉంది. ఆయన భార్య వాసంతి పేరుపై రూ. 2.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. జూపల్లి కృష్ణారావు: కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ కొల్లాపూర్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు స్వంత ఇల్లు లేదు. చౌటబెట్ల శివారులో నూతనంగా ఇంటి నిర్మాణం సాగుతోంది. జూపల్లికి రూ.2,50,36,336 విలువగల స్థిరాస్తులతో పాటు రూ.29,70,049 చరాస్తులు ఉన్నాయి. చేతలో నగదు రూ.4,80,100 ఉండగా, రూ.1,50,00,000 అప్పు ఉంది. బంగారం 10 గ్రాములు, ఒక కారు ఉన్నాయి. చిన్నంబావి, పెద్దకొత్తపల్లి, సైబరాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. పెద్దదగడ, చౌటబెట్ల శివార్లలో భూములు ఉన్నాయి. ఆయన భార్య సృజన పేరు మీద స్థిరాస్తులు లేవు. రూ.38,82,786 విలువగల చరాస్తులతో పాటు చేతిలో నగదు రూ.52,540, బంగారం 450 గ్రాములు, వెండి 3.5 కేజీలు ఉంది. ఎల్లేని సుధాకర్‌రావు: కొల్లాపూర్ బీజేపీ అభ్యర్థి బీజేపీ కొల్లాపూర్ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు స్వంత ఇల్లు లేదు. మహాసముద్రం, గగ్గలపల్లి, ఇబ్రహీంపట్నంలో భూములు ఉన్నాయి. పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, పాన్‌గల్, కొల్లాపూర్, చైతన్యపురి, నాగర్‌కర్నూల్, శంషాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. రూ.1,19,20,000 విలువజేసే స్థిరాస్తులతో పాటు రూ.16,98,326 విలువజేసే చరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.1,00,000 ఉంది. ఆయన భార్య భార్య భారతి పేరు మీద రూ.1,64,40,000 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. రూ.4,16,29,464 విలువజేసే చరాస్తులతో పాటు చేతిలో నగదు: రూ.50,000, ఒక కారు, 70 తులాల బంగారం ఉంది. ఎపి.మిథున్‌కుమార్‌రెడ్డి :మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి బీజేపీ మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎపి.మిథున్కుమార్రెడ్డికి చరాస్తులు లేవు. రూ.16,35,76,683 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.80,000 ఉండగా, రూ.38, 78,000 అప్పులు ఉన్నాయి. మిథున్‌కుమార్‌రెడ్డి సతీమణి రిషిక పేరు మీద చరాస్తులు, స్థిరాస్తులు లేవు. చేతిలో రూ.95వేల నగదు మాత్రమే ఉంది. చిట్టెం రామ్మోహన్‌రెడ్డి: మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి రూ.98,30,000 చరాస్తులతో పాటు రూ.57,35,000 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మూడు వాహనాలు ఉండగా, రూ.9లక్షల అప్పు ఉంది. ఆయన సతీమణి సుచరిత పేరు మీద రూ.కోటి 31లక్షల విలువైన చరాస్తులతో పాటు రూ.89లక్షల విలువజేసే స్థిరాస్తులు, రూ.6లక్షల అప్పు ఉంది. రెండు కార్లు ఉన్నాయి. గువ్వల బాలరాజు: అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుకు రూ.2,70,54,162 విలువజేసే చరాస్తులతో పాటు రూ.7,20,17,187 విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. అప్పు రూ.2,69,73,180 ఉంది. గువ్వల భార్య అమల పేరు మీద రూ.69,06,711 విలువజేసే చరాస్తులతో పాటు రూ.53,07,813 విలువగల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.2,31,29,600 అప్పు ఉంది. సరిత: గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ గద్వాల అభ్యర్థి సరితకు రూ.45,45,487 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో బంగారం విలువ రూ.35లక్షల వరకు ఉంటుంది. చేతిలో రూ.2లక్షల నగదు ఉంది. రూ.5కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 60 తులాలు బంగారం ఉంది. సతీష్ మాదిగ:అచ్చంపేట బీజేపీ అభ్యర్థి బీజేపీ అచ్చంపేట అభ్యర్థి సతీష్మాదిగకు రూ.10.10లక్షలు, ఆయన భార్య సుగుణ పేరుపై రూ.3లక్షల విలువజేసే చరాస్తులు ఉన్నాయి. తూడి మేఘారెడ్డి: వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ వనపర్తి అభ్యర్థి తూడి మేఘారెడ్డి మొత్తం ఆస్తులు విలువ రూ.10.90 కోట్లు కాగా.. అందులో రూ.2.37కోట్ల విలువైన చరాస్తులు, రూ.8.53కోట్ల విలువజేసే స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.41కోట్ల అప్పు ఉంది. ఆయన భార్య తూడి శారద పేరుపై రూ.7.24 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. రూ. 1.98 కోట్ల అప్పు ఉంది. అనూజ్ఞరెడ్డి: వనపర్తి బీజేపీ అభ్యర్థి బీజేపీ వనపర్తి అభ్యర్థి అనూజ్ఞరెడ్డికి రూ. 2.37 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.1.18 కోట్ల చరాస్తులు కాగా, రూ.1.20కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.93లక్షల అప్పు ఉంది. స్వాతిరెడ్డి పేరుపై రూ.11.08లక్షల విలువజేసే చరాస్తులు ఉన్నాయి. -
TS Elections 2023: ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు
పరకాల: ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గురువారం ఏకాదశి కావడంతో మంచిరోజు అని.. నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కార్యకర్తల కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి నామినేషన్ వేసి బయటకు రాకముందే.. బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లారు. ఇరువురి నామినేషన్ల కోసం బయట వేచి చూస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు విజయం తమదే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏసీపీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు వారిని దూరంగా వెళ్లగొట్టారు. నియమావళిని ఉల్లంఘించిన అరూరి! ఐనవోలు: ఐనవోలు ఆలయంలో గురువారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు ఉదయం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. పార్టీ ఇచ్చిన బీ ఫాంతో పాటు నామినేషన్ పత్రాల్ని మల్లన్న పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే అరూరి రాజకీయ విమర్శలు చేశారు. పార్టీ పథకాలను ప్రస్తావించి మూడోసారి గెలిపించాలని కోరారు. ఈక్రమంలో కార్యకర్తలు జై బీఆర్ఎస్, జై అరూరి అంటూ నినదించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరూరి నియంత్రణ కోల్పోయి.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడడం తగదని పలువురు చర్చించుకున్నారు. -
TS Elections 2023: త్వరపడండి.. నామినేషన్లకు రేపే ఆఖరు..!
నల్లగొండ: జిల్లాలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో పూర్తవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజక వర్గాల పరిధిలో ఇప్పటి వరకు కొద్ది మంది మాత్రమే అధికార, ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 9వ తేదీ గురువారం ఏకాదశి కూడా కావడంతో అంతా మంచి రోజని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు నామినేషన్లు వేయని వారితో పాటు వేసిన వారు కూడా మరో సెట్ సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్య నాయకులంతా నేడే.. అన్ని నియోజకవర్గాల్లో గురువారం బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ, ఫార్వర్డు బ్లాక్, ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు ఫార్వర్డు బ్లాక్ పార్టీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సూర్యాపేట నుంచి అధికార పార్టీ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా నామినేషన్ వేయనున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి కూడా గురువారం నామినేషన్లు వేయనున్నారు. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు పద్మావతి, తుంగతుర్తిలో బీఆర్ఎస్ గాదరి కిషోర్‌కుమార్, బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య నామినేషన్లు వేయనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి నామినేషన్లు వేయనున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషను వేయనుండగా, నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కూడా గురువారం నామినేషన్లు వేయనున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి , సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి , బీజేపీ నుంచి సాధినేని శ్రీనివాసరావు నామినేషన్ సమర్పించనున్నారు. హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ సమర్పించనున్నారు. దేవరకొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలు నాయక్ నామినేషన్లు వేయనున్నారు. ఆలేరు నియోజక వర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునితతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య నామినేషన్లు సమర్పించనున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా గురువారమే నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లు చివరి రోజు శనివారం తక్కువగానే దాఖలు కానున్నాయి. -
TS Elections 2023: ఎమ్మెల్యే మర్రి ఆస్తుల విలువ రూ.200 కోట్లు
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.116.66 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే రూ. 12.58 కోట్లు అప్పులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆయన భార్య జమున పేరిట మొత్తం రూ. 83.67 కోట్ల ఆస్తులు ఉండగా, రూ. 13.93 కోట్లు అప్పులు ఉన్నట్టుగా బుధవారం నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. కాగా 2018 ఎన్నికల అఫిడవిట్లో మొత్తం ఆస్తుల విలువ రూ.118.02 కోట్లుగా ప్రస్తావించగా ప్రస్తుత అఫిడవిట్లో ఆస్తుల విలువ సుమారు రూ.2కోట్లు తగ్గింది. అలాగే అప్పులు రూ.36.91 కోట్ల నుంచి రూ.12.58 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం భార్యాభర్తల మొత్తం ఆస్తుల విలువ రూ.200.33 కోట్లు కాగా, మొత్తం అప్పులు రూ. 26.51 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఎమ్మెల్యే మర్రిపై ఎలాంటి కేసులు లేవని పేర్కొనగా, ప్రస్తుత అఫిడవిట్లో తనపై తెలకపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నంబరు 113/2023 కేసులో ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదైనట్టు వెల్లడించారు. -
తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులకు ప్లాన్ రెడీ: పొంగులేటి వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చే తామే అంటూ కామెంట్స్ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఎన్నికల వేళ తెలంగాణలో ఐడీ, ఈడీ దాడులు జరుగుతాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి. దీంతో, ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. పొంగులేటి శ్రీనివాస్ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు జరుగుబోతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై దాడికి సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే దాడులకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీఆర్ఎస్ సూచనల మేరకు కేంద్ర సంస్థలు నామీద, నా కుటుంబ సభ్యుల మీద, నాకు మద్దతిచ్చే వారిపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నారు. కాళేశ్వరం ఖేల్ ఖతం.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ, కాళేశ్వరం నిజ స్వరూపమేంటో కేంద్రం నివేదికల్లో వెల్లడించింది. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ఏదో ఒకరోజు కూలిపోతాయి. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. కేసీఆర్‌ను ఎందుకు విచారించడం లేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను మాయం చేసే అవకాశం ఉంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజల పాలన కావాలి. ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు. తెలంగాణ పోలీసులు వారి పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: తప్పు చేసిన వారిని వదలం.. మోదీ ఫైర్ -
తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం
యాదాద్రి: ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రి పదవులు పొందిన ఇద్దరు నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969లో అప్పటి భువనగిరి ఎమ్మెల్యే కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉండి తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2011లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండి తన పదవికి రాజీనామా చేశారు. కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు నుంచి, 1965 ఉప ఎన్నికలో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటిసారి 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 2004, 2009, 2014లోనూ గెలిచారు. -
TS Elections 2023: సొంత ఇల్లు లేదు.. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న భువనగిరి ఎంపీ
నల్లగొండ: తనకు సొంత ఇల్లు కూడా లేదని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆస్తులతో పాటు అప్పులు కూడా పెరిగాయి. 2018 ఎన్నికల్లో స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.68,37,727 ఉండగా.. ప్రస్తుతం స్థిర, చరాస్తులు కలిపి రూ.1,61,47,070గా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన పేరిట అప్పు ఏమీ చూపని ఆయన ప్రస్తుతం రూ.1,70,00,000 అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా 9.39 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉన్నట్లు చూపించారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత పేరు మీద 2018 ఎన్నికల సందర్భంగా రూ.15,75,71,331 ఆస్తులు ఉండగా ప్రస్తుతం అవి రూ.37,62,25,329కు పెరిగాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. గతంలో ఆమె పేరు మీద రూ.2,41,88,856 అప్పు ఉండగా ప్రస్తుతం రూ.4,74,77,630కి అప్పు పెరిగిందని అఫిడవిట్లో చూపించారు. -
సిట్టింగ్ అభ్యర్థికి షాకిచ్చిన గులాబీబాస్..!
అలంపూర్: బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థికి గులాబీబాస్ షాకిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21న సిట్టింగ్ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. తన అనుచరుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. మారిన రాజకీయ పరిణామాలతో అబ్రహంకు బీఫాం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో అనిశ్చితికి దారితీసింది. ఎట్టకేలకు ఎమ్మెల్సీ తన పంతాన్ని నెగ్గించుకోవడంతో 20 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ అనుచరుడు విజయుడికి బీఫాం దక్కింది. మంగళవారం హైదరాబాద్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా విజయుడు బీఫాం అందుకున్నారు. -
దొరల పాలన కావాలా.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్: ‘కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లాలో ఉంది.. ఈ ప్రాంత బిడ్డనైన నేను టీపీసీసీ అధ్యక్షుడినయ్యా.. పాలమూరులో 14 సీట్లు గెలవకపోతే ఎక్కిరిస్తరు.. ఈ గడ్డ మీద గ్రూపులు లేవు.. ముఠా తగాదాలు లేవు.. మనమందరం ఏకం కావాలి.. పాలమూరు 14 సీట్లు గెలవాలి.. వలసలు ఆగుతాయ్.. బీడు భూములు పండుతాయ్.. నారాయణపేట, కొడంగల్ పథకం తెస్తే పడావు పెట్టిండు.. ఆ పథకం రావాలంటే 14 సీట్లు గెలవాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్, గద్వాల, మక్తల్‌లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజా గర్జన’ బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు అలంపూర్ జోగళాంబ అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్‌తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే షా–అలీ పహిల్వాన్ దర్గాలో ప్రార్థనలు జరిపారు. అనంతరం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో ప్రచార రథంలో రోడ్‌షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దొరల పాలన కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. అలంపూర్‌ను ఎడారిగా మార్చారు పదేళ్ల పాలనలో అలంపూర్‌ను ఎడారిగా మార్చిన బీఆర్ఎస్ను బొందపెట్టాలనే పట్టుదల ఇక్కడున్న అందరిలో కనిపిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. 2014లో కేసీఆర్ తుమ్మిళ్ల ప్రాజెక్టు ఇస్తానని మాట ఇవ్వడంతో పాటు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆర్డీఎస్‌పై కుర్చీ వేసుకొని నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని దుయ్యబట్టారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సంపత్‌కుమార్ సింధనూరు వద్ద ఆర్డీఎస్ కాల్వలో కేసీఆర్ కోసం కుర్చీ వేసి దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతలు మంజూరు చేసినా పూర్తిస్థాయిలో నిర్మించలేదని, అలంపూర్‌కు వంద పడకల ఆస్పత్రి నిర్మించి ప్రారంభిస్తే డాక్టర్లు, సిబ్బంది లేక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని విమర్శించారు. నడిగడ్డలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే మంచి సంకల్పంతో సంపత్ కొట్లాడుతున్నారని, ఆయన ఓటేసి అండగా ఉండాలని కోరారు. 2009లో సంపత్‌కు కాంగ్రెస్ బీఫాం ఇస్తే.. చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబట్టి టికెట్ అబ్రహంకు ఇప్పించాడన్నారు. నామినేషన్ వేసిన సంపత్ తనకు బీఫాం ఇచ్చి వెనక్కి తీసుకుంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం కట్టుబడి పని చేశారని గుర్తు చేశారు. ఆ రోజు సంపత్ వద్దని అబ్రహంను తెచ్చావ్. ఈ రోజు అబ్రహం వద్దని ఇంకొకరిని తీసుకొస్తున్నావ్.. ఏంది నీ కుట్ర అని చల్లానుద్దేశించి ప్రశ్నించారు. ఎందుకోసం పార్టీ మారావని, ఆ మాత్రం ఎమ్మెల్సీ పదవీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండేనా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మీ తాతను రాష్ట్రపతిని చేసింది.. మీ తండ్రిని ఈ ప్రాంత ప్రజలు భుజాలపై మోశారన్నారు. కాంగ్రెస్ చల్లా వెంకట్రామిరెడ్డికి ఏం తక్కువ చేసిందని దుయ్యబట్టారు. నిండు మనసుతో ఆశీర్వదించండి.. వేలాది మంది రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు నిండు మనసుతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. మా సీతక్క, ప్రశాంత్‌రెడ్డి, మల్లురవి, జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా పార్టీ నాయకులు సభ విజయవంతానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు. కొత్తకోట దయాకర్‌రెడ్డి తనకు పెద్దన్న అని.. ఆ కుటుంబం కూడా పెద్ద మనసు చేసుకొని శ్రీహరిని గెలిపించేందుకు ముందుకు వచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి తనయుడు ప్రశాంతరెడ్డి టికెట్ ఆశించి కూడా శ్రీహరి గెలుపుకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారని కొనియాడారు. -
అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయుడు
అలంపూర్: బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజేయుడిని ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ విజేయుడి పేరును ప్రకటించారు. ప్రొఫైల్.. పేరు: కోడెదూడ విజయుడు (కె.విజయ్) తల్లిదండ్రులు: సవారమ్మ, సవారన్న భార్య: అనిలా పిల్లలు: హర్షవర్ధన్, గణేష్ పుట్టిన తేది: 10–06–1977 స్వస్థలం: పుల్లూరు, ఉండవెల్లి మండలం రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు -
బస్సులకూ... ఎన్నికలకూ సంబంధమేమిటి?
‘‘ఆర్టీసీ బస్సులకూ..ఎన్నికలకూ ఎంతో సంబంధముంది. మరీ ముఖ్యంగా బస్సుల్లో రాసి ఉండే సూక్తులు, ఉపదేశాలతో’’ ఓ పెద్ద బాంబునే పేల్చాడు మా రాంబాబుగాడు. ‘‘మా మానాన మేము మాడిపోయిన మసాలా దోశె తింటుంటే..నువ్వొచ్చి ఎలక్షన్లకూ, బస్సులకూ ముడిపెడతావా? అలాంటి సంబంధాలకు ఆస్కారమే లేని చోట నువ్వు సృష్టిస్తున్న ఈ రా.కీ.వాహన సంబంధాలేమిటి? ఈ సంగతేమిటో నాకిప్పుడే తెలియాలి. తెలిసితీరాలి’’ అంటూ కోప్పడ్డాడు మా బావ. అప్పుడు మా రాంబాబుగాడు చెప్పిన ఉదంతాలూ, ఉదాహరణలు అపూర్వం, అనిర్వచనీయం, అవిస్మరణీయం. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం..వాళ్ల సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం. బస్సుల్లో మహిళలుగానీ..ఎన్నికల్లో మహిళలంటే ఇక్కడ జెండర్‌గా తీసుకోకూడదు. స్త్రీలంటేనే చాలా స్పెషల్. అలాంటివారే కీలకమైన కొందరు అభ్యర్థులు కూడా. దేవతల్లో అమ్మవారి లాంటివారే..రాజకీయాల్లో ఈ అయ్యవార్లు! ప్రస్తుతానికి వాళ్లు మన పార్టీలో లేరు. పక్క పార్టీ నుంచి... ఆల్ ద వే..పార్టీ మారి మరీ రావాలి. అందుకే..ఎన్ని జాబితాలు వెలువడ్డా..ఆయనొచ్చేవరకూ ఆ సీటును మాత్రం ఖాళీగా ఉంచాల్సిందే. ఉదాహరణకు ఓ అభ్యర్థి పేరు రాజగోపాల్‌రెడ్డి, ఆ స్థానం పేరు మునుగోడు. ఇది ఆయనొక్కడికే కాదు..చాలామందికి వర్తిస్తుంది. దాదాపు అన్ని పార్టీలూ అలా ఖాళీల్ని ఉంచి, అభ్యర్థుల రాక కోసం వెయిట్ చేసేవే, చేస్తున్నవే. ఫుట్‌బోర్డు మీద ప్రయాణం ప్రమాదకరం... కొందరు నేతలుంటారు. దశాబ్దాలపాటు పార్టీకి సేవలందిస్తారు. జీవితమంతా పార్టీకే ధారబోస్తారు. కీలకమైన ప్రభుత్వ, పార్టీ పదవులు చేపట్టి ఉంటారు. పాపం... తీరా ఎలక్షన్ టైముకు టికెట్ రాదు. కొందరు రాజీనామా చేస్తారు. మరికొందరు చెయ్యరు. ఇక వీళ్లంతా సీటు దొరకని ప్రయాణికుల్లా ఉంటారు. సీటు దొరకనందుకు అసహనంగా ఉంటారు. ఫుట్‌బోర్డు మీద ప్రయాణికుల్లా కనిపిస్తారు. అప్పుడు పొరుగు పార్టీ అధినేతనో లేదా మరో పార్టీలోని పెద్ద నేతనో కండక్టర్‌లా వస్తాడు. లోనికి రమ్మంటాడు. ఫుట్‌బోర్డు మీద నుంచి బస్సులోకి తీసుకెళ్లినట్టుగా..తమ పార్టీలోకి పట్టుకుపోతాడు. ఒక్కటే తేడా. కండక్టర్ హార్ష్‌గా తిట్టి తీసుకుపోతాడూ... కీలకనేతల్ని గౌరవం నటిస్తూ పట్టుకుపోతారు. డిఫరెన్స్ ఇంతే. ఉదాహరణకు పొన్నాల లక్ష్మయ్య గానీ ఇలాంటివారు ఎందరో నేతలూ!...ఎన్నో పార్టీలూ!! ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం ఈ నినాదం ఎలక్షన్స్‌కు ఎలా వర్తిస్తుందో చూద్దాం. దీనర్థం ఏమిటంటే..మా పార్టీలోనే మీకు తగిన ప్రాధాన్యముంటుంది. ప్రైవేటు బస్సుల్లాంటి ఇతర పార్టీల్లో మీకంత ప్రయారిటీ ఉండకపోవచ్చు అని సూచించేలాంటిదే ఈ నినాదం. ‘‘అన్నీ నాయకులకేనా, సామాన్యులకేమీ సందేశాలు లేవా?’’ అడిగాడు మా బావ. ‘‘ఎందుకు లేవూ... ‘లైట్లు ఆర్పి సెల్ఫ్ కొట్టవలెను’ అని కూడా రాసి ఉంటుంది. ఇది డ్రైవరుకు సంబంధించిన సూచన. ఓటర్లంతా మామూలు ప్రయాణికుల్లాంటివారు. వాళ్లంతా బస్సెక్కాక..అంటే ఓటేశాక..తమ దారి స్పష్టంగా ఉండటం కోసం డ్రైవర్లలాంటి నేతలంతా బస్సులో దీపాలార్పేసి జనాల బతుకులు చీకటి చేస్తారు. ఇది నేతలకు ఓ సూక్తి!..జనాలకో హెచ్చరిక!! -
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం.. జిల్లా ఎన్నికల అధికారి
నల్లగొండ: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు డబ్బు, మద్యం సరఫరా, ఉచితాలపై పోలీస్, సర్వేలెన్స్ బృందాల ద్వారా పటిష్ట నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ తెలిపారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌హెచ్ అజయ్ బందూ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్, ఐటీ, వాణిజ్య, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఎస్పీ అపూర్వరావుతో కలిసి కలెక్టర్ కర్ణన్ హాజరై మాట్లాడారు. పోలీసులు, ఇతర సర్వే లెన్స్ టీమ్‌ల ద్వారా మొత్తం రూ.42,00,46,385 విలువైన నగదు, బంగారం, మద్యం, వస్తువులు సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో రూ.11,02,1319 నగదును, రూ.27,01,35,625 విలువ గల బంగారు, వెండి, ఆభరణాలు.. రూ.2,89,22,622 విలువ గల 1,27,548 లీటర్ల మద్యం, 6,66,37 డ్రగ్స్, 22,77,398 విలువైన ఉచితాలకు సబంధించిన సొమ్మును తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్సులో ఎస్.పి.అపూర్వ రావు,ఎం.సి.సి.నోడల్ అధికారి, స్పెషల్ కలెక్టర్(భూ సేకరణ) హరి సింగ్ , ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్,ఇతర అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ కేంద్రాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. స్ట్రాంగ్‌రూముల వద్ద భద్రత విషయమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట పీఆర్ ఎస్ఈ తిరుపతయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
Alampur: తుది నిర్ణయం చెప్పేసిన కేసీఆర్.. ఇక అంతా కేటీఆర్ చేతిలో..
మహబూబ్‌నగర్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగానే శాసనసభ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. పలు నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెల్లుబికినా.. అధిక మొత్తంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. నాటకీయ పరిణామాల క్రమంలో అలంపూర్‌ను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. అసమ్మతి జ్వాల ఎగిసిపడడంతో బీఫాం ఇవ్వకుండా వాయిదా వేశారు. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం మొదలై మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా అలంపూర్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ పదునైన ఆలోచన, పకడ్బందీ ప్రణాళికతో నిక్కచ్చిగా తన నిర్ణయాలను అమలుపరిచే కేసీఆర్.. ఈ సెగ్మెంట్లో చివరి వరకు ఉత్కంఠ రేపుతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ముందే పసిగట్ట లేకపోయారా.. బీఆర్ఎస్లో ఇది వరకే మాజీ ఎంపీ మందా జగన్నాథం, అబ్రహం మధ్య విభేదాలు ఉండగా.. చల్లా రాకతో ముచ్చటగా మూడు వర్గాలయ్యాయి. ఆధిపత్య పోరులో అబ్రహంపై చల్లా పైచేయి సాధించారు. అబ్రహంకు టికెట్ ఖరారు చేసిన క్రమంలో చల్లా వర్గీయులు పెద్ద ఎత్తున అసంతృప్తి రాజుకోవడంతో అబ్రహంకు బీఫాం ఇవ్వకుండా ఆపిన కేసీఆర్.. నియోజకవర్గ పరిస్థితిపై పూర్తి స్థాయిలో ఆరాతీశారు. ఈ సందర్భంగా మీరంతా ఏం చేస్తున్నారంటూ ముఖ్య నేతలకు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఎందు కు ముందుగా పసిగట్టలేక పోయారని ప్రశ్నించడంతో పాటు సీరియస్‌గానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎవరి పట్టు వారిదే.. అలంపూర్‌కు సంబంధించి అబ్రహంతోపాటు ఎమ్మెల్సీ చల్లా, మాజీ ఎంపీ మందాతో చర్చించాకే సమష్టి నిర్ణయంతో అసమ్మతిని చల్లార్చి ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ పక్షం క్రితమే సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు వారు పలుమార్లు ముగ్గురు నేతలతో చర్చించినా.. ఎవరికివారు పట్టు వీడకపోవడంతో క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో ఆది నుంచి పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో ఆంధ్రా నాయకులతో యుద్ధమే చేశానని..తన కుమారుడు మందా శ్రీనాథ్‌కే టికెట్ ఇవ్వాలని మందా జగన్నాథం పట్టుబడుతుండడం మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది. గులాబీ శ్రేణుల్లో అయోమయం.. సీఎం కేసీఆర్ టికెట్ తనకే ఇస్తారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం ప్రారంభించగా, ఆయనకు దీటుగా ఎమ్మెల్సీ చల్లా తన అనుచరుడైన విజయుడిని సైతం రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టారు. మరోవైపు బెట్టు వీడని మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథంతో పాటు కొత్తగా రిటైర్డ్ ఎంఈఓ మేరమ్మ, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ మనోరమ పేర్లు తెరపైకి రావడం గులాబీశ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. అలంపూర్ నేతలు ముగ్గురితో వేర్వేరుగా జరిపిన చర్చలో వారు వెల్లడించిన అంశాలను ఇరువురు నేతలు ముఖ్యమంత్రికి చేరవేయగా.. అబ్రహంతో పాటు ఎమ్మెల్సీ చల్లా ప్రతిపాదించిన అభ్యర్థి విజయుడిపై ఆయన ఇటీవల ప్రత్యేకంగా సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వే ఫలితాలు అబ్రహంకే అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో తదితర పరిణామాలు బేరీజు వేసిన కేసీఆర్ తుది నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కేటీఆర్‌కు సరైన అభ్యర్థి పేరును సూచించడంతో పాటు ఆ ముగ్గురి మధ్య సయోధ్య కుదుర్చాలని చెప్పినట్లు తెలిసింది. ఈనెల 19న అలంపూర్‌లోనే సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో ఈలోపే ఫైనల్ చేసిన అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థికి పార్టీ బీఫారం అందే అవకాశం ఉంది. -
TS Elections 2023: పరిశ్రమ వాడలో పాగా వేసేది ఎవరు..?
జడ్చర్ల: పరిశ్రమల వాడగా గుర్తింపు పొందిన జడ్చర్ల నియోజకవర్గంలో పాగ వేసేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలవాలని బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి సారిగా బరిలో నిలిచిన అనిరుధ్‌రెడ్డి విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. 1961లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడగా, 1962లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఐదు సార్లు టీడీపీ విజయం సాధించగా.. నాలుగు సార్లు కాంగ్రెస్, మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ మద్ధతుతో బీఆర్ఎస్ గెలుపొందగా, 2008లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2009లో బీఆర్ఎస్ మద్ధతుతో టీడీపీ గెలుపొందగా.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థుల విజయం.. 1962లో కొత్త కేశవులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా.. 1967లో ఎల్ఎన్.రెడ్డి (లక్ష్మీనర్సింహారెడ్డి) ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1983లో ఎం.కృష్ణారెడ్డికి టీడీపీ బీఫాం సకాలంలో అందకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. అత్యధిక, అత్యల్ప మెజార్టీలు.. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మరాఠి సత్యనారాయణకు 72,758 ఓట్లు పోలవ్వగా, 53,779 మెజార్టీతో విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం.కృష్ణారెడ్డిపై కేవలం 1,051 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హ్యాట్రిక్ దక్కేనా? జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎవరూ గెలుపొందలేదు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినా.. వరుసగా విజయం సాధించకపోవడంతో ఎవరికీ హ్యాట్రిక్ దక్కలేదు. టీడీపీ నుంచి ఎం.చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్) 1996, 1999, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా సి.లక్ష్మారెడ్డి 2004, 2014, 2018 ఎన్నికల్లో గెలపొందారు. ఈ విడత ఎన్నికల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపొందితే హ్యాట్రిక్ దక్కుతుంది. తొలి ఎమ్మెల్యే కొత్త కేశవులు.. జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1962లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పట్టణానికి చెందిన కొత్త కేశవులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త కేశవులు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి కె.జనార్దన్‌రెడ్డిపై 4,830 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొత్త కేశవులుకు 17,927 ఓట్లు రాగా, జనార్దన్‌రెడ్డికి 13,097 ఓట్లు వచ్చాయి. రెండు ఉప ఎన్నికలు.. జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి రెండు సార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1996లో టీడీపీకి చెందిన ఎం.సత్యనారాయణ హత్యకు గురి కావడంతో ఉపఎన్నిక రాగా, అతడి సోదరుడు ఎం.చంద్రశేఖర్ మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి విజయం సాధించారు. బీసీ నియోజకవర్గంగా గుర్తింపు.. నియోజకవర్గంలో బీసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బీసీ అభ్యర్థులకు మొదటి నుంచి కలిసి వస్తోంది. మొదటి నుంచి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. 1972, 1978లలో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన బీసీ అభ్యర్థి నర్సప్ప ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్ర సత్యనారాయణ విజయం సాధించారు. ఆయన మరణాంతరం ఆయన సోదరుడు ఎర్ర శేఖర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన ఎం.కృష్ణారెడ్డి ఒకసారి ఇండిపెండెంట్‌గా, మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు. వీరి తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. భౌగోళిక స్వరూపం.. జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉండగా, మిగతా ఐదు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయి. అదేవిదంగా ఓ వైపు 44వ జాతీయ రహదారి ఉండగా.. మరో వైపు 167వ నంబర్ జాతీయ రహదారి ఉంది. నియోజకవర్గంలో జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట, మిడ్జిల్, ఊర్కొండ మండలాలు ఉన్నాయి. -
TS Elections 2023: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సైలెంట్ ఓటుతో ఓడిస్తా.. చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ : విలువలతో కూడిన రాజకీయం చేస్తే సమాజం గౌరవిస్తుందని, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ‘అందరం ఒకటే ఉర్లో పుట్టి పెరిగినోళ్లం.. నేను 1995లో రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మెల్యే స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో నాకు అవకాశం వచ్చింది. ఆనాడు మీ సహకారం తీసుకున్నా. మీకు మాకు రాజకీయ విభేదాలు లేవు. రాజకీయ పరిస్థితుల వల్ల, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను. ఆనాడు మీరు, మేము కలిసి టీఆర్ఎస్లోకి వెళ్దామని నిర్ణయానికి వచ్చాం. కానీ, మీ కోతి చేష్టల వల్ల సీఎం కేసీఆర్ మీమ్మల్ని తీసుకోలేదు’ అని లింగయ్య అన్నారు. తాను ఓడిపోయిన తర్వాత తన మీద కొందరు దాడులు చేయాలనే ప్రయత్నాలు చేశారని, కార్యకర్తలపై కేసులు పెట్టించారని అన్నారు. సీఎం పిలుపు మేరకు కొంత మంది సంప్రందించి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పారు. గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన వేముల వీరేశంను ఇప్పుడు వెంట వేసుకుని తిరుగుతూ విలువలు లేని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులను నల్లగొండ జిల్లా నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండలో, మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సైలెంట్ ఓటుతో ఓడిస్తానని అన్నారు. తన కార్యకర్తలు ఇక్కడ ప్రచారం చేస్తారు.. నేను వారి నియోజకవర్గాలకు వెళ్లి వారి ఓటమి కోసం ప్రచారం చేస్తా అన్ని చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
TS Elections 2023: బ్రాహ్మణవెల్లంల గ్రామం ప్రత్యేకత.. ఏమిటి..?
నార్కట్‌పల్లి : మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామానికి ఓ ప్రత్యేక ఉంది. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు నేతలు 2009 నుంచి వివిధ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ, మునుగోడు స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ నుంచి నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య బరిలో ఉంటున్నారు. వీరు గత ఎన్నికల్లోనూ వీరు ఇవే స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉండడం విశేషం. వీరి రాజకీయ ప్రస్థానం ఇలా.. ● బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఆయన 1999 ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అక్కడి నుంచే బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో మినహా మిగతా నాలుగు సార్లు ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ● కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంట్ బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఓటమి పాలయ్యారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున మునుగోడులో పోటీ చేసి విజయం సాధించారు. 2022లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ● ఇదే గ్రామానికి చెందిన చిరుమర్తి లింగయ్య 2009 శాసనసభ ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి నకిరేకల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. -
నేడు బీజేపీ మలి జాబితా!
న్యూఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన బీజేపీ మలి జాబితాపై స్పష్ట త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరుగను న్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన 66 మంది తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కీలక నాయకులు సిద్ధం చేసిన జాబితాకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. ఇప్పటికే జనసేనతో పొత్తులు సహా తుది జాబితాపై బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. కాగా మంగళవారం తుది జాబితాపై కిషన్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపై సమీక్షతో పాటు జనసేనతో పొత్తుకు సంబంధించిన అంశాలపై నడ్డాతో కిషన్‌రెడ్డి చర్చించారని సమాచారం. 66 స్థానాలపై వడపోత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన సీఈసీ రెండు జాబితాల్లో కలిపి 53 మంది అభ్యర్థిత్వాన్ని ఆమోదం వేసింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడింది. రెండో జాబితాలో మహబూబ్‌నగర్ నుంచి ఏపీ మిథున్‌రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిగతా 66 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో... గత వారం ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా రాష్ట్ర నాయకత్వం పలుమార్లు భేటీ అయి అభ్యర్థుల వడపోతను పూర్తి చేసింది. అక్కడ వచ్చి న తుది నిర్ణయాల మేరకు పోటీదారుల జాబితాను సీఈసీకి నివేదించనుంది. నేటి సీఈసీ సమావేశానికి మోదీ, అమిత్ షా బుధవారం జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే సీఈసీ సమావేశానికి పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా సహా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఇతర సభ్యులు హాజరుకానున్నారు. వీరితో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ భన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్లు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. బుధవారం సాయంత్రం జరుగనున్న ఈ భేటీ అనంతరం తెలంగాణ మలి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం ఏ క్షణమైనా విడుదల చేయనుంది. -
TS Election 2023: కారు స్పీడు పెంచేలా.. సీఎం కేసీఆర్ చర్యలు..!
నల్గొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారానికి పదును పెట్టారు. కారు స్పీడు పెంచేలా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన మంగళవారం మరోమారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రానున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు, పార్టీ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌ను నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్నగర్ చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించిన అనంతరం.. మధ్యాహ్నం 2 గంటలకు మిర్యాలగూడకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు దేవరకొండ చేరుకుంటారు. ఇక్కడ సభ ముగిశాక నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు. సభలకు భారీ ఏర్పాట్లు.. ● హుజూర్నగర్ పట్టణం ఫణిగిరి గుట్ట రోడ్డులో 50 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వేదికకు ఎడమ వైపున హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి కుడి వైపు నుంచి జనం రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. సభకు 80 వేల మందిని తరలించేలా ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఒక అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 11 మంది ఇన్స్పెక్టర్లు, 45 మంది ఎస్ఐలు మొత్తం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని సోమవారం ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ● మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు నుంచి సుమారు 70 వేలకు పైగా ప్రజలు సభకు రానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వర్షం వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో పట్టణంలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ● దేవరకొండలోని ముదిగొండ రోడ్డులో ప్రజా ఆశీర్వాద సభకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. ఈ సభకు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుంచి దాదాపు 80వేల మంది తరలివస్తారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆయా మండలాలకు బాధ్యులను నియమించి సభ సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. సోమవారం ఆయన గుత్తా అమిత్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ ఎస్పీ నల్లగొండ ఎస్పీ అపూర్వరావు సోమవారం మిర్యాలగూడ, దేవరకొండలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ అంశాలపై సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. మిర్యాలగూడలో నలుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 110 మంది ఏఎస్ఐలు, మరో 300 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులతో, దేవరకొండలో ఒక ఎస్పీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలతో పాటు ఎస్ఐలు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి 530 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బందోబస్తులో విధులు నిర్వహించనున్న పోలీసు సిబ్బందికి ఆమె పలు సూచనలు ఇచ్చారు. -
TS Speceal: కుర్చీలు విరగగోట్టి.. ఫ్లెక్సీలు చించివేశి.. కాంగ్రెస్ కార్యాలయంలో ఉద్రిక్తత
మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. దేవరకద్ర నియోజకవర్గ కార్యకర్తలు హంగామా చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌గౌడ్ విలేకరుల సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా దేవరకద్రకు చెందిన నాయకులు, కార్యకర్తలు కుర్చీలు పగులగొట్టడంతోపాటు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో కార్యాలయంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రదీప్‌గౌడ్ తదితరులు వారిస్తున్నప్పటికీ కార్యకర్తలు వినకుండా ఎక్కడికక్కడ కుర్చీలను పగులగొట్టారు. దీంతో స్థానిక నాయకులు, దేవరకద్ర నియోజకవర్గ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అందరినీ కార్యాలయం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకొని అక్కడికి చేరుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్‌కుమార్ దేవరకద్ర నియోజకవర్గ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కుర్చీలను పగులగొట్టి రచ్చ చేయడం సరికాదని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అలాగే ఈ సంఘటనపై స్థానిక నాయకులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతకుముందు దేవరకద్ర నాయకులు, కార్యకర్తలు కార్యాలయం పార్టీ ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వతంత్రంగా పోటీ చేస్తా.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడం తగదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని అంటుంటే దానికి భిన్నంగా పీసీసీ జాబితా ఉందన్నారు. రెండు జాబితాల్లో బలహీనవర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రతి పార్లమెంట్లో రెండు బీసీలకు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీల పరిస్థితి కాంగ్రెస్‌లో దయనీయంగా మారిందని, తమ గోడు పట్టించుకునే నాథుడే లేరని ఆరోపించారు. 3 నుంచి నామినేషన్లు ప్రారంభమవుతుందని, ఆలోగా దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థిని మార్చే నిర్ణయాన్ని అధిష్టానం తీసుకుపోతే నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు స్వతంత్రంగా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. అయితే డీసీసీ కార్యాలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. కొంతమంది కార్యకర్తలు క్షణికావేశంలో ఇలాంటి చర్యలకు దిగారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, జిల్లా ఓబీసీసెల్ అధ్యక్షుడు బాల్‌చందర్‌గౌడ్, నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
హుజురాబాద్ నియోజకవర్గానికి ఘన చరిత్ర
హుజూరాబాద్: ఉద్యమాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ 1957లో (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గంగా ఏర్పడి మూడేళ్లకే జనరల్ స్థానంగా మారింది. ఇందులో హుజూరాబాద్, భీమదేవరపల్లి తాలూకాలుగా ఉండేవి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగుసార్లు, టీడీపీ, స్వతంత్రులు మూడుసార్లు చొప్పున, ఇక బీఆర్ఎస్ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. 2021లో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రులుగా పని చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గకేంద్రంతోపాటు ఆ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట(కొత్తగా ఏర్పడిన మండలం), హుజూరాబాద్ (మొత్తం ఐదు మండలాలు)తో కలిపి ముఖచిత్రంగా మారింది. ఇక కమలాపూర్ నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైంది. 1957లో ఏర్పడిన హుజూరాబాద్‌కు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఈ నియోజకవర్గంలో ఉన్న సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో.. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు జమ్మికుంట, వీణవంక మండలాలను హుజూరాబాద్‌లో కలిపారు. అప్పటివరకు ఉన్న శంకరపట్నం, మానకొండూర్ మండలాలను విడదీసి కొత్తగా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గంలో కలిపారు. హుజూరాబాద్ నుంచి 1957లో ఇద్దరు స్వతంత్రులే బరిలో దిగగా.. పోలుసాని నర్సింగరావును గెలిపించారు. 1962లో గాడిపల్లి రాములు (కాంగ్రెస్), 1967లో తిరిగి పోలుసాని నరసింగరావు (కాంగ్రెస్), 1972లో వొడితెల రాజేశ్వరరావు (కాంగ్రెస్), 1978లో దుగ్గిరాల వెంకట్రావు (కాంగ్రెస్), 1983లో కొత్త రాజిరెడ్డి (స్వతంత్ర), 1985లో దుగ్గిరాల వెంకట్రావు (టీడీపీ), 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు. ఇక 1994, 1999లో వరుసగా ఇనుగాల పెద్దిరెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఆదరించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. పునర్విభజన అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈటల ఘన విజయం సాధించారు. 2014, 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004వరకు జమ్మికుంటలో నామినేషన్ వేసే ఇక్కడి అభ్యర్థులు.. 2009 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే వేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఇలా 1957 పి.నరసింగరావు స్వతంత్ర గాడిపెల్లి రాములు స్వతంత్ర 1962 గాడిపెల్లి రాములు కాంగ్రెస్ నాయిని దేవయ్య సీపీఐ 1967 పి.నరసింగరావు కాంగ్రెస్ కొత్త రాజిరెడ్డి స్వతంత్ర 1972 వి.రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ ఎ.కాశీవిశ్వనాథరెడ్డి స్వతంత్ర 1978 డి.వెంకట్రావు కాంగ్రెస్ ఎ.కాశీవిశ్వనాథరెడ్డి జనతా 1983 కొత్త రాజిరెడ్డి స్వతంత్ర డి.వెంకట్రావు స్వతంత్ర 1985 డి.వెంకట్రావు టీడీపీ భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ 1989 కేతిరి సాయిరెడ్డి స్వతంత్ర డి.వెంకట్రావు టీడీపీ 1994 ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ బి.లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ 1999 ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ కేతిరి సాయిరెడ్డి కాంగ్రెస్ 2004 బి.లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ 2008 వి.లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ కె.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ 2009 ఈటల రాజేందర్ టీఆర్ఎస్ వీ.కృష్ణమోహన్‌రావు కాంగ్రెస్ 2010 ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఎం.దామోదర్‌రెడ్డి టీడీపీ 2014 ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కే.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ 2018 ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ 2021 ఈటల రాజేందర్ బీజేపీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రత్యేకతలు నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం. ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే కాకతీయకాలువ ద్వారా ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 59 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జమ్మికుంటలోని పత్తిమార్కెట్ ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. సీడ్ ఉత్పత్తిలోనూ హుజూరాబాద్ దేశంలోనే పేరుగాంచింది. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వ్యవసాయంలో సూచనలు చేస్తూ కొత్త వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. జమ్మికుంట, ఉప్పల్, బిజిగిర్షరీఫ్లో ఉన్న రైల్వేస్టేషన్ ద్వారా ప్రయాణికులకు రవాణా సులువవుతోంది. మొత్తం ఓటర్లు 2,44,514 హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 106 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా, మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,44,514 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,19,676 మంది పురుషులు, 1,24,833 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. -
ఇజ్జత్ కా సవాల్
ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలినుంచీ కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ చేదు అనుభవాలే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనను ధిక్కరించిన ఇద్దరు నేతలను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. ఆ రెండు చోట్లా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం ఏమరుపాటు లేకుండా ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్‌కు కోపం తెప్పించిన ఆ ఇద్దరు ఎవరు? గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పునాదులు వేసుకోలేకపోయింది. రెండుసార్లు కూడా ఒక్కో సీటు మాత్రమే గెలవగలిగింది. ఏదైతేనేం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరిగింది. ఈసారి పదికి పది స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో తమతో కలిసి ప్రయాణించిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరి బరిలో నిలవడంతో వారిద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కేసీఆర్. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అదేవిధంగా పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం అభ్యర్థిగా నిలుస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్తితుల్లోనూ బీఆర్ఎస్ చేజారనీయకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు గులాబీ బాస్. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులు. జిల్లా అంతటా ఇద్దరికీ అనుచర బలగం ఉంది. రెండు బలమైన సామాజికవర్గాలకు చెందిన వీరిద్దరు జిల్లా అంతటా తమ ప్రభావం చూపగలుగుతారు. గులాబీ పార్టీలో సీట్లు రావని తేలడంతో ఇద్దరు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దిరికీ టిక్కెట్లు కేటాయించింది. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓడించడం ద్వారా గులాబీ పార్టీ బలోపేతం అయిందని.. కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో... పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డితోను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తూ...అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రెండు నియోజకవర్లాల్లోనూ నెలకొన్న పరిస్తితులపై నిత్యం తెలుసుకుంటూ అక్కడి నేతలకు మార్గదర్శనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ తాజా ఎన్నికల్లో కూడా గెలిచి హ్యట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అటు తుమ్మల కూడ ఈ ఎన్నికలతో పువ్వాడ అజయ్ పొలిటికల్ చాప్టర్ ముగిసిపోతుందని ప్రచారం చేస్తున్నారు. పాలేరులో సైతం కందాల, పొంగులేటి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. పొంగులేటికి పాలేరులో బలమైన క్యాడర్ ఉండటం బాగా కలిసివస్తుందని అంటున్నారు. అయినప్పటికీ కందాలను ఏమాత్రం లైట్ తీసుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమాగా చెబుతూ ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఆపరేషన్ ప్రారంభించగా...అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఆపరేషన్ తీవ్రం చేసింది. కేసీఆర్ ప్లాన్స్ తిప్పికొట్టడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. రెండు పక్షాల నుంచీ ఢీ అంటే ఢీ అని పరిస్థితి ఏర్పడటంతో ఖమ్మం జిల్లాలో పోరు యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జిల్లాలో పొలిటికల్ వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా?
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు గరంగరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బ్యాలెట్ పోరులో ప్రజా తీర్పే ఇక మిగిలిఉంది. అధికార పార్టీకి అడ్డాగా ఉన్న ఘనపూర్ లో ఆ పార్టీలోనే గడబిడ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. కడియం టార్గెట్ గా విపక్షాలతో పాటు..స్వపక్షం నేతలు కూడా కొందరు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ అడ్డా మీద కీ రోల్ పోషిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న కడియం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బిఆర్ఎస్ కు చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఉపఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ దక్కక మొదట్లో కాస్త ఆందోళన చెందిన రాజయ్యను చివరకు కేటిఆర్ సముదాయించి రైతుబంధు సమితి చైర్మెన్ పదవి ఇవ్వడంతోపాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి కడియంతో సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ ప్రగతి భవన్ లో కలిసిపోయినా బయట మాత్రం అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలో బలమైన నాయకులు లేకపోవడం అనేది అధికార పార్టీకి కలిసివచ్చే అంశమే అయినా వర్గపోరు పార్టీని ఆగం చేస్తోంది. విపక్షాలు దాన్ని క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు ఘనపూర్ లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బిజేపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర, బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు బరిలో దిగారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారం ముమ్మరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి తొలిదశలో మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య దూరంగా ఉన్నారు. తన టిక్కెట్ కడియం తన్నుకుపోయారనే ఆవేదనతో ఉన్న రాజయ్య, బయట ఆయనతో కలిసిపోయినట్లు వ్యహరిస్తున్నా అంతర్గతంగా మాత్రం కడియంకు చుక్కలు చూపించేందుకే సిద్ధమయ్యారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరుసార్లు, టిడిపి మూడు సార్లు, బిఆర్ఎస్ నాలుగు సార్లు గెలుపొందాయి. వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో ఈసారి అభ్యర్థిని మార్చారనే ప్రచారం సాగుతోంది. కడియం ఇదివరకు రెండు సార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా టిఆర్ఎస్ హయాంలో రాజయ్య తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనపై సదభిప్రాయం ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపద్యంలో మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను కాదని కడియంకు టికెట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గం కడియంకు ప్రతికూలంగా మారే పరిస్తితులు కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఓటములను రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన సింగపురం ఇందిరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రజలతో మమేకమై ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో పనిచేసిన విజయరామారావు బిజేపిలో చేరి టికెట్ తెచ్చుకున్నప్పటికి ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి కడియం పేరు ఖరారై చాలా కాలమైంది. కాంగ్రెస్, బిజేపి పార్టీలు తమ అభ్యర్థులను ఇటీవలనే ఖరారు చేశాయి. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుభూతి ఉన్నా ఆయన వ్యవహారశైలి పార్టీకి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. ఇక కడియం శ్రీహరి మీద ఎలాంటి అవినీతి మరకా లేనప్పటికీ..రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు...స్వపక్షంలోనే కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి సీనియర్ అయినప్పటికీ ఆయన పేరు పెద్దగా వినిపించడంలేదు. -
అసమ్మతి స్వరాన్ని తట్టుకోగలరా?
ఇల్లందు బీఆర్ఎస్ అసమ్మతి మంటలు కాకరేపుతున్నాయి.. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి మధ్య వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యా గొడవతో హైకమాండ్ సీన్లోకి ఎంటరైంది. అసమ్మతి నేతల బుజ్జగింపులూ మొదలయ్యాయి. ఇంతకీ అసలక్కడ ఇంత రచ్చ జరగటానికి కారణం ఎవరు?. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఇల్లందు నియోజకవర్గం అధికార పార్టీలో అసమ్మతి రాగం సెగలు రేపుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ తీరుపై అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. ఇల్లెందులో ఇంటిపోరుకు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు నాయకత్వం వహిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఎమ్మేల్యే దంపతుల వల్ల పార్టీ బద్నాం అయిందని అందుకే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు అధిష్టానం వద్ద పెద్ద పంచాయతీ పెట్టారు. షాడో ఎమ్మెల్యేగా పని చేస్తోన్న హరిసింగ్ కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్లు, సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ లో వాటాల వసూళ్లు మొదలెట్టారని సొంతపార్టీ నేతలు హైకమాండ్‌కు కంప్లయింట్ చేశారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ 120 మంది స్థానిక నేతలతో కలసి మంత్రి హరీష్‌ను కలిశారు. అసమ్మతి నేతల ఫిర్యాదులతో హరిప్రియ వర్గం తెగ టెన్షన్ పడిపోయింది. బీ ఫామ్ దక్కకపోతే ఏట్లా ఆని ఆలోచించింది. అయితే లాస్ట్ మినిట్‌లో లక్కీగా టికెట్ హరిప్రియకే దక్కింది. ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ మెంబర్ రవిచంద్ర బుజ్జగింపులు మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేదని లోకల్ టాక్. తాము వద్దన్నా హరిప్రియకే టికెట్ ఇవ్వటం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న దమ్మాలపాటి తన అసమ్మతి స్వరం మరింత పెంచారు. దీనికి తోడు హరిప్రియ భర్త హరి సింగ్ తో వస్తున్న తలనొప్పులను సర్దుబాటు చేయటం రవిచంద్రకు తలకు మించిన భారంగా మారింది.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఆరు నెలల్లోనే అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే హరిప్రియ...ఇల్లందు నియోజకవర్గానికి బస్ డిపో, సివిల్ ఆస్పత్రి అప్ గ్రేడ్, మినహా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇల్లందులో మూతపడ్డ రైల్వే స్టేషన్ పున ప్రారంభం, సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ లాంటి హామీలు అలాగే మిగిలిపోవడంతో జనం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఇవే కీలక అంశాలు కాబోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు అధికార పార్టీ లో వ్యవహారం ఇలా ఉంటే ... కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంతకంటే ఎక్కువే ఉంది. నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్ బ్యాంకు ఉన్నా పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్ లేకపోవటం పెద్ద మైనస్ పాయింట్. పొంగులేటి అనుచరుడు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం ఉపయోగకరమే అంటున్నారు. ఆయనకే టికెట్ ఖాయం కానుందన్న ప్రచారం మొదలవడంతో కనకయ్య గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. అఫిషియల్‌గా హైకమాండ్ నుంచి బిఫామ్ పుచ్చుకున్నాక ప్రచారంలో స్పీడు పెంచాలని కనకయ్య ప్లాన్. మొత్తానికి ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన ఖాయమంటున్నారు స్థానికులు.