దేవరుప్పుల: అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో చెన్నూరు (పాలకుర్తి) నియోజకవర్గంలో అప్పట్లో పలు కారణాలతో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యే బరిలో నిలిచే అర్హత కోల్పోయిన యతి రాజారావు అనూహ్యంగా తన సతీమణి విమలాదేవిని నిలిపి విజయం సాధించిన ఘటన నేడు పునరావృతం కావడం సర్వత్రా చర్చించుకుంటున్నారు. 1967లో సోషలిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యతి రాజారావు పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన తరుణంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి ఆశించిన ఆయనకు పార్టీ టికెట్ కేటాయించిన చిక్కులు రావడంతో పట్టువీడని యతి తన భార్య విమలాదేవికి టికెట్టు సంపాదించారు.
ప్రత్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విస్నూర్ దేశముఖ్‌ల విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సింహస్వప్నంగా పేరొందిన నల్లా నర్సింహ్ములు (కడవెండి)పై ఆమె విజయం సాధించడం సంచలనాన్ని కలిగించింది. తాజాగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రత్యర్థి పార్టీ నుంచి ఎదురులేదనుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానికురాలుగా ఎన్‌ఆర్‌ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని ఆరు నెలల కిందట రంగంలోకి దింపడంతో రాజకీయ రణరంగం మొదలైంది.
అయితే నామినేషన్ ప్రక్రియ నాటికి ఝాన్సీరెడ్డికి పౌరసత్వం చిక్కులతో ఎన్నికల బరిలో నిలువని పరిస్థితి వచ్చిన విధితమే. ఈ సంఘటనతో ఇక పాలకుర్తిలో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి కరువనుకున్న తరుణంలో అనూహ్యంగానే తన కోడలు మామిడాల యశస్వినిరెడ్డికి టికెట్టు సంపాందించి తన రాజకీయ అరంగేట్రాన్ని చాటడంతో నిరాశనిస్పృహలకు గురైన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ అందుకుంది.
పదిహేను రోజుల్లోనే ఎర్రబెల్లికి దీటుగా విస్తృత ప్రచారం చేపట్టే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా రాజకీయ ఆధిపత్యపోరులో నాడు ఎన్నికల బరిలో నిలిచే అర్హత కోల్పోయిన యతి బాటలో నేడు ఝాన్సీరెడ్డి చేసిన పాలిటిక్స్ తీరు ఫలించడంతో వరుస విజయాలతో రాజకీయ సంచలన చరిత్ర కలిగిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కాంగ్రెస్ హవాతో చుక్కెదురు తప్పలేదు. గత ఎన్నికల్లో ఆయన గెలిచిన మెజార్టీతో దగ్గరలో మామిడాల యశస్వినిరెడ్డి గెలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment