సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేటలో టిఆర్‌ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాదించారు. దీంతో ఆయన రెండుసార్లు గెలిచినట్లు అయింది. ఆ తర్వాత మళ్లీ కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. జగదీష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి ఆర్. దామోదరరెడ్డిపై 5941 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగదీస్ రెడ్డికి 66742 ఓట్లు రాగా, దామోదరరెడ్డికి 60801ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుకు 39 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
జగదీష్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో జగదీష్ రెడ్డి సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుపై 2219 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ ఐ నేత దామోదర రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. సంకినేని గతంలో తుంగతుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. దామోదరరెడ్డి తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి గెలుపొందారు. ఈయన ఒకసారి ఇండిపెండెంటుగా గెలవగా, మిగిలిన నాలుగుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు.
1992లో నేదురుమల్లి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా 2007 నుంచి పనిచేశారు. 2009లో గెలిచిన తర్వాత ఈయనకు పదవి దక్కలేదు. ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలుపొందారు. వెంకటరెడ్డికి మంత్రి అవకాశం దక్కడంతో ఈయనకు ఛాన్స్ రాలేదు. సూర్యాపేట నుంచి పిడిఎఫ్ మూడుసార్లు, సిపిఐ ఒకసారి, సిపిఎం ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్ రెండు సార్లు గెలిచాయి.
కడవరకు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శప్రాయుడు అనిపించుకున్న ఉప్పుల మన్సూర్ సూర్యాపేటలో నాలుగుసార్లు గెలిచారు. టిడిపి నేత ఆకారపు సుదర్శన్ రెండుసార్లు శాసనసభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఎన్నికైన బొమ్మగాని ధర్మభిక్షం తర్వాత నకిరేకల్‌లో 1957లో, నల్గొండలో 1962లో గెలిచారు.
1957లో ఇక్కడ గెలిచిన భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి 1967లో తుంగతుర్తిలో కూడా గెలిచారు. బీమ్‌రెడ్డి మూడుసార్లు లోక్‌సభకు మిర్యాలగూడెం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో ఆయన సిపిఎంను వదలి సొంత పార్టీని పెట్టుకున్నారు. సిపిఐ నాయకుడు దర్మభిక్షం రెండుసార్లు నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సూర్యాపేట నాలుగుసార్లు రెడ్లు, ఒక గౌడ్ నేత ఎన్నికయ్యారు. మిగిలినసార్లు ఇది రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది.
సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment