స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు గరంగరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బ్యాలెట్ పోరులో ప్రజా తీర్పే ఇక మిగిలిఉంది. అధికార పార్టీకి అడ్డాగా ఉన్న ఘనపూర్ లో ఆ పార్టీలోనే గడబిడ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. కడియం టార్గెట్ గా విపక్షాలతో పాటు..స్వపక్షం నేతలు కూడా కొందరు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ అడ్డా మీద కీ రోల్ పోషిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న కడియం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బిఆర్ఎస్ కు చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఉపఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ దక్కక మొదట్లో కాస్త ఆందోళన చెందిన రాజయ్యను చివరకు కేటిఆర్ సముదాయించి రైతుబంధు సమితి చైర్మెన్ పదవి ఇవ్వడంతోపాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి కడియంతో సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ ప్రగతి భవన్ లో కలిసిపోయినా బయట మాత్రం అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు.
ఇతర పార్టీలో బలమైన నాయకులు లేకపోవడం అనేది అధికార పార్టీకి కలిసివచ్చే అంశమే అయినా వర్గపోరు పార్టీని ఆగం చేస్తోంది. విపక్షాలు దాన్ని క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు ఘనపూర్ లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బిజేపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర, బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు బరిలో దిగారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారం ముమ్మరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి తొలిదశలో మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య దూరంగా ఉన్నారు. తన టిక్కెట్ కడియం తన్నుకుపోయారనే ఆవేదనతో ఉన్న రాజయ్య, బయట ఆయనతో కలిసిపోయినట్లు వ్యహరిస్తున్నా అంతర్గతంగా మాత్రం కడియంకు చుక్కలు చూపించేందుకే సిద్ధమయ్యారు.
నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరుసార్లు, టిడిపి మూడు సార్లు, బిఆర్ఎస్ నాలుగు సార్లు గెలుపొందాయి. వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో ఈసారి అభ్యర్థిని మార్చారనే ప్రచారం సాగుతోంది. కడియం ఇదివరకు రెండు సార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా టిఆర్ఎస్ హయాంలో రాజయ్య తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనపై సదభిప్రాయం ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపద్యంలో మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను కాదని కడియంకు టికెట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గం కడియంకు ప్రతికూలంగా మారే పరిస్తితులు కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఓటములను రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇక కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన సింగపురం ఇందిరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రజలతో మమేకమై ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో పనిచేసిన విజయరామారావు బిజేపిలో చేరి టికెట్ తెచ్చుకున్నప్పటికి ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి కడియం పేరు ఖరారై చాలా కాలమైంది. కాంగ్రెస్, బిజేపి పార్టీలు తమ అభ్యర్థులను ఇటీవలనే ఖరారు చేశాయి. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుభూతి ఉన్నా ఆయన వ్యవహారశైలి పార్టీకి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. ఇక కడియం శ్రీహరి మీద ఎలాంటి అవినీతి మరకా లేనప్పటికీ..రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు...స్వపక్షంలోనే కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి సీనియర్ అయినప్పటికీ ఆయన పేరు పెద్దగా వినిపించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment