ఇల్లందు బీఆర్ఎస్ అసమ్మతి మంటలు కాకరేపుతున్నాయి.. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి మధ్య వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యా గొడవతో హైకమాండ్ సీన్‌లోకి ఎంటరైంది. అసమ్మతి నేతల బుజ్జగింపులూ మొదలయ్యాయి. ఇంతకీ అసలక్కడ ఇంత రచ్చ జరగటానికి కారణం ఎవరు?. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది?
ఇల్లందు నియోజకవర్గం అధికార పార్టీలో అసమ్మతి రాగం సెగలు రేపుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ తీరుపై అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. ఇల్లెందులో ఇంటిపోరుకు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు నాయకత్వం వహిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఎమ్మేల్యే దంపతుల వల్ల పార్టీ బద్నాం అయిందని అందుకే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు అధిష్టానం వద్ద పెద్ద పంచాయతీ పెట్టారు. షాడో ఎమ్మెల్యేగా పని చేస్తోన్న హరిసింగ్ కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్లు, సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ లో వాటాల వసూళ్లు మొదలెట్టారని సొంతపార్టీ నేతలు హైకమాండ్‌కు కంప్లయింట్ చేశారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ 120 మంది స్థానిక నేతలతో కలసి మంత్రి హరీష్‌ను కలిశారు.
అసమ్మతి నేతల ఫిర్యాదులతో హరిప్రియ వర్గం తెగ టెన్షన్ పడిపోయింది. బీ ఫామ్ దక్కకపోతే ఏట్లా ఆని ఆలోచించింది. అయితే లాస్ట్ మినిట్‌లో లక్కీగా టికెట్ హరిప్రియకే దక్కింది. ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ మెంబర్ రవిచంద్ర బుజ్జగింపులు మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేదని లోకల్ టాక్. తాము వద్దన్నా హరిప్రియకే టికెట్ ఇవ్వటం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న దమ్మాలపాటి తన అసమ్మతి స్వరం మరింత పెంచారు. దీనికి తోడు హరిప్రియ భర్త హరి సింగ్ తో వస్తున్న తలనొప్పులను సర్దుబాటు చేయటం రవిచంద్రకు తలకు మించిన భారంగా మారింది..
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఆరు నెలల్లోనే అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే హరిప్రియ...ఇల్లందు నియోజకవర్గానికి బస్ డిపో, సివిల్ ఆస్పత్రి అప్ గ్రేడ్, మినహా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇల్లందులో మూతపడ్డ రైల్వే స్టేషన్ పున ప్రారంభం, సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ లాంటి హామీలు అలాగే మిగిలిపోవడంతో జనం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఇవే కీలక అంశాలు కాబోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇల్లందు అధికార పార్టీ లో వ్యవహారం ఇలా ఉంటే ... కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంతకంటే ఎక్కువే ఉంది. నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్ బ్యాంకు ఉన్నా పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్ లేకపోవటం పెద్ద మైనస్ పాయింట్. పొంగులేటి అనుచరుడు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం ఉపయోగకరమే అంటున్నారు. ఆయనకే టికెట్ ఖాయం కానుందన్న ప్రచారం మొదలవడంతో కనకయ్య గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. అఫిషియల్‌గా హైకమాండ్ నుంచి బిఫామ్ పుచ్చుకున్నాక ప్రచారంలో స్పీడు పెంచాలని కనకయ్య ప్లాన్. మొత్తానికి ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన ఖాయమంటున్నారు స్థానికులు.
Comments
Please login to add a commentAdd a comment