ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలినుంచీ కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ చేదు అనుభవాలే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనను ధిక్కరించిన ఇద్దరు నేతలను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. ఆ రెండు చోట్లా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం ఏమరుపాటు లేకుండా ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్‌కు కోపం తెప్పించిన ఆ ఇద్దరు ఎవరు?
గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పునాదులు వేసుకోలేకపోయింది. రెండుసార్లు కూడా ఒక్కో సీటు మాత్రమే గెలవగలిగింది. ఏదైతేనేం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరిగింది. ఈసారి పదికి పది స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో తమతో కలిసి ప్రయాణించిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరి బరిలో నిలవడంతో వారిద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కేసీఆర్. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అదేవిధంగా పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం అభ్యర్థిగా నిలుస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్తితుల్లోనూ బీఆర్ఎస్ చేజారనీయకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు గులాబీ బాస్.
తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులు. జిల్లా అంతటా ఇద్దరికీ అనుచర బలగం ఉంది. రెండు బలమైన సామాజికవర్గాలకు చెందిన వీరిద్దరు జిల్లా అంతటా తమ ప్రభావం చూపగలుగుతారు. గులాబీ పార్టీలో సీట్లు రావని తేలడంతో ఇద్దరు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దిరికీ టిక్కెట్లు కేటాయించింది. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓడించడం ద్వారా గులాబీ పార్టీ బలోపేతం అయిందని.. కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో... పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డితోను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తూ...అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
రెండు నియోజకవర్లాల్లోనూ నెలకొన్న పరిస్తితులపై నిత్యం తెలుసుకుంటూ అక్కడి నేతలకు మార్గదర్శనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ తాజా ఎన్నికల్లో కూడా గెలిచి హ్యట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అటు తుమ్మల కూడ ఈ ఎన్నికలతో పువ్వాడ అజయ్ పొలిటికల్ చాప్టర్ ముగిసిపోతుందని ప్రచారం చేస్తున్నారు. పాలేరులో సైతం కందాల, పొంగులేటి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. పొంగులేటికి పాలేరులో బలమైన క్యాడర్ ఉండటం బాగా కలిసివస్తుందని అంటున్నారు. అయినప్పటికీ కందాలను ఏమాత్రం లైట్ తీసుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమాగా చెబుతూ ఊరూరా ప్రచారం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఆపరేషన్ ప్రారంభించగా...అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఆపరేషన్ తీవ్రం చేసింది. కేసీఆర్ ప్లాన్స్ తిప్పికొట్టడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. రెండు పక్షాల నుంచీ ఢీ అంటే ఢీ అని పరిస్థితి ఏర్పడటంతో ఖమ్మం జిల్లాలో పోరు యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జిల్లాలో పొలిటికల్ వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment