బీఆర్‌ఎస్ అధినేతపై మంత్రి పొంగులేటి విమర్శలు
కానీ మేము 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకోవట్లేదు
రైతు రుణమాఫీపై 2, 3 రోజుల్లో విధివిధానాలు
ధరణి విషయంలో ఆచితూచి వెళుతున్నాం
జీవో 59, ఎల్‌ఆర్‌ఎస్‌లను క్లియర్ చేసేపని ప్రారంభిస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని, కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అచ్చోసిన ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ రంకెలు ఆగిపోగానే వలసలు ముగించేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుందనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దు. 2018 ఎన్నికల్లో కేసీఆర్‌కు 88 సీట్లు ఇస్తే తృప్తి పడలేదు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే ఐదుగురిని ఉంచాడు. అప్పుడు అక్కడ ఉండి అదంతా చూసిన ఎమ్మెల్యేలే ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని అనలేదు.
కానీ మేం గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కేసీఆర్ ప్రారంభించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈయన ముందుండి నడిపించాలని చూశాడు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను చుట్టూ కూర్చోబెట్టుకుని కేబినెట్‌లో నువ్వు మంత్రి, నువ్వు మంత్రి అని చెప్పాడు. అలా మంత్రుల లిస్టు రాసుకున్న వారిని ఏమనాలి?’ అని పొంగులేటి ప్రశ్నించారు. అసలు ప్రభుత్వాన్ని కూల్చడం అన్న పదమే అప్రజాస్వామికమని, ఇప్పుడు వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
– రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రెండుమూడు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తాం. ఇప్పటికే రూ.9వేల కోట్లు వ్యవసాయశాఖకు బదిలీ చేశాం. మిగిలిన నిధులు కూడా సమీకరించి రుణమాఫీ చేసి తీరుతాం.
– రైతు భరోసాపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వెళతాం.కౌలు రైతులను కాపాడుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది.
– సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరణి పోర్టల్‌ను సంస్కరిస్తాం ఒకే మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకుంటే అది ఎలా పరిష్కరించాలో అధికారులు నిర్ణయించాలి. వీలున్నంత త్వరలోనే ధరణి పెండింగ్ దరఖాస్తులను జీరో చేస్తాం. అలాగని అడ్డగోలుగా ధరణి దరఖాస్తులను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటాం.
– ఈ ఏడునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. అయినా అన్ని విషయాలను ప్రజల ముందు పెట్టలేకపోయాం. మేం అధికారంలోకి వచ్చాకే హెదరాబాద్‌లో కమర్షియల్ లీజ్ బాగా పెరిగింది. ఎలాంటి సమస్యా రాకుండా టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం చేసిన రూ. 6.82లక్షల కోట్ల అప్పుకుగాను షెడ్యూల్‌కు మించి అప్పులు కడుతున్నాం. ఇలాంటివన్నీ చెప్పుకోవాలి.
– రాష్ట్రంలో చాలామంది అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు రావాల్సి ఉంది. కొన్ని బోగస్ కార్డులు కూడా ఉన్నాయి. ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ కోసం కార్డులు రాయించుకుంటున్నారు. అందుకే రేషన్‌కార్డుకు, ఆరోగ్యానికి లింకు తీసేయాలని, రేషన్‌కార్డును, హెల్త్‌కార్డును వేర్వేరుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం.
– 2021–22 ఆర్థిక సంవత్సరంలో భూముల విలువలు రెండుసార్లు సవరించారు. అప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. ఇప్పుడు మేం శాస్త్రీయంగా చేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భూముల విలువల సవరణ ఆగస్టు1 నుంచా ఆగస్టు 15 నుంచా అన్నది ఇప్పుడే చెప్పలేం.
– జీఓ 59 దరఖాస్తులు, ఎల్‌ఆర్‌ఎస్‌లను మేం కావాలని ఆపడం లేదు. పేదలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఆ రెండు అంశాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నాం. అవి మళ్లీ జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టేస్తాం. ధరణి అంశం పూర్తికాగానే జీఓ 59, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్లియర్ చేస్తాం. ఇప్పటికే జీఓ 59 కింద చిన్న చిన్న స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలిచ్చాం.
– కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న బడ్జెట్ పెడుతుంది. అందులో రాష్ట్ర కేటాయింపులు చూసుకొని ఆ తర్వాత 1,2 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా పెడతాం. జూలై 31లోపే రెగ్యులర్ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తుంది.
– కేసీఆర్ అంటే నాకేం కోపం లేదు. ఆయన అంటే నాకు లవ్వు ఎక్కువ. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా? తన అనుభవాన్ని రంగరించి పాలన గురించి ఎప్పుడు సూచనలిస్తారా అని ఎదురుచూస్తున్నా. కానీ ఆయన రావడం లేదు.
– తుదిదశలో నిర్మాణాలు ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి నిరుపేద లబ్ధిదారులను గుర్తించి కేటాయిస్తాం. అతి తక్కువ మొత్తం ఖర్చు చేస్తే గృహప్రవేశాలకు సిద్ధమయ్యే స్థాయిలో ఉన్న ఇళ్లను తొలుత ఎంపిక చేస్తాం.
– అమ్ముడు కాకుండా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లకు కొత్తగా ధరలు నిర్ణయించి ప్రజలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
– స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్లు చేయించుకోలేని వారి డబ్బులు నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. ఇలా రూ.32 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. వాటిని 2,3 రోజుల్లో విడుదల చేస్తాం. సీఎస్‌ఆర్ నిధులతో అత్యాధునిక హంగులతో సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తాం. ప్రతి గ్రామంలో సమగ్ర రెవెన్యూ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కచి్చతంగా ఇస్తాం. జేఎన్‌జే సొసైటీ అంశాన్ని 2,3 రోజుల్లోనే పరిష్కరిస్తాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విలేకరులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment