
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే.. అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నేతలపైన కేసీఆర్ మండిపడ్డారు.
‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించ దగ్గ విషయం’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు.
కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు హామీలను అమలు చేసాం. పంట బోనస్ , రైతు భరోసా పెంపు , 55 వేల ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టింగులు ఇలా చెప్పుకుంటే పోతే అనేకం చేశాం. ఇంకా చేస్తాం.
కేసీఆర్ వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనబడటం లేదు. అధికారం దరిదాపుల్లో కనబడక పోవడంతోనే కేసీఆర్‌లో అసహనం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తారు... ఇది పక్కా.
ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పాత పథకాలను ఒక్కటి కూడా రద్దు చేయకుండా ,మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కేంద్రం ఇంకా సహకరిస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కలసి రావాల్సిందేనని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్.
Comments
Please login to add a commentAdd a comment