
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
సీఎం అసమర్థతతో ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరిందని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దివ్యంగా ఉన్న రాష్ట్రం 15 నెలల కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతతో రాష్ట్ర ఆర్థికలోటు గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని దుయ్యబట్టారు. తన చేతగానితనంతో కేవలం ఒక్క ఏడాదిలోనే అన్ని రంగాలనూ సీఎం చావుదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు.
శనివారం తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ఒక ఎజెండా ప్రకారం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని కేన్సర్‌తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పరువు తీస్తున్నాడు. రేవంత్‌రెడ్డి అబద్ధాలను బట్టబయలు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్‌ను విడుదల చేశారు. సీఎం చెబుతున్న అబద్ధాలను తిప్పికొడుతూ సమగ్ర నివేదిక ద్వారా వాస్తవాలు బయట పెట్టారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందనే భయంతో వెబ్‌సైట్ నుంచి ఈ నివేదికను ప్రభుత్వం తొలగించింది’అని కేటీఆర్ ఆరోపించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి
సీఎం రేవంత్ రంకెలు వేయడం మాని పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. ఆరు గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న చోటే సీఎం ఓట్లు అడగాలని సూచించారు. ‘రాబోయే రోజుల్లో రేవంత్ ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపోతాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణలో రేవంత్ ఉన్నాడు.
రేవంత్, బండి సంజయ్‌ను ఆర్‌ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారు. బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.150 వసూలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ‘ఆర్‌ఆర్ టాక్స్’విధిస్తోందని గతంలో ప్రధాని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతోందో చెప్పాలి. బీజేపీలో చేరేందుకు రేవంత్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారా? సుంకిశాల ప్రమాదంలో రేవంత్ ఎవరిని కాపాడుతున్నారో తెలుసు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం డిమాండ్ చేస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నాడు. కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అసెంబ్లీ వేదికగా ఎండగడతాం. తెలంగాణను ఎవరు తక్కువ చేసి దూషించినా అదే స్థాయిలో సమాధానం ఇస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment