సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇదే సమయంలో గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, కడియం శ్రీహరి గురువారం స్టేషన్ ఘనపూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకత్వం మీద నమ్మకం లేకనే రాజీకీయ వలసలు జరుగుతున్నాయి. రాజకీయ వలసలు మీరు చేస్తే ఒకటి.. వేరే వాళ్లు చేస్తే మరొకటా?. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పెరిగింది. 2014కు ముందు వారి ఆస్తులు ఎంత.. 2024 తర్వాత ఎంతో ప్రజలకు చెప్పాలి.
బీఆర్‌ఎస్ పార్టీ నేతలు నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయబోతున్నాం. యువతను రెచ్చగొడుతున్న బీజేపీని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏడాదికి లక్ష ఉద్యోగాలు అన్న బీజేపీ ఎక్కడ భర్తీ చేశారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు ఆలోచించుకోవాలి. కుటుంబానికే పరితమై అవినీతి, అహంకారం వల్లే బీఆర్‌ఎస్ ఓడిపోయింది.
రాజకీయ పార్టీలను విలీనం చేసుకుని, రాజకీయ విలువలు లేకుండా చేసి భ్రష్టు పట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ కుమార్ ఆస్తులు 2014కు ముందు.. ఇప్పటికీ.. ఎన్నో ప్రజల ముందు చెప్పండి. ముందు బీఆర్‌ఎస్.. పార్టీ కార్యాచరణపై దృష్టి పెట్టండి. ఇంటిని చక్కపెట్టుకునే ప్రయత్నం చేయండి. నాయకత్వం మీద నమ్మకం లేకనే బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికైనా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టండి.. లేకపోతే బీఆర్‌ఎస్ కనుమరుగవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గ అభివృద్ధిపైన సీఎం రేవంత్‌కు విన్నవించాను. వివిధ పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని రేవంత్ రెడ్డికి అందించాను. నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరాను. రెవెన్యూ డివిజన్‌లో డివిజనల్ కార్యాలయాలు పనిచేసే విధంగా సౌకర్యాలు లేవు. అందుకే 15 కార్యాలయాలు గుర్తించడం జరిగింది.
అన్నీ ఒకే చోట పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ డివిజనల్ కార్యాలయాల ఏర్పాటుకు వినతి పత్రం ఇచ్చాను. సాగునీటి కోసం స్టేషన్ ఘనపూర్ నుండి నవాబుపేట రిజర్వాయర్‌కు కాలువ నిర్మాణం చేపట్టాలి. కనీసం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోతున్నాం. ఆర్ అండ్ బీలో ఆరు ప్రధాన రోడ్లను రూ.125 కోట్లతో నిర్మించాలని కోమటి రెడ్డికి వినతి పత్రం ఇచ్చాము’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment