Station ghanpur constituency
-
కడియం శ్రీహరికి బుద్ధి చెప్తాం: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం(సెప్టెంబర్2) కేటీఆర్‌తో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదీ చదవండి.. రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికి మోసమే: కేటీఆర్ -
బీఆర్ఎస్ను ఆగం చేస్తున్న వర్గపోరు.. ట్రబుల్ షూటర్ మంత్రం పనిచేస్తుందా?
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్ ఈసారి హాట్ హాట్‌గా మారింది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే అధికార పార్ఠీలో అంతర్గత కలహాలు అక్కడి అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం..ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలా ఈ నియోజకవర్గంకూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచీ ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని పార్టీల నేతలంతా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు..టీడీపీ మూడు సార్లు.. గులాబీ పార్టీ ఉప ఎన్నికలతో సహా నాలుగుసార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో తాడికొండ రాజయ్య గులాబీ పార్టీ తరపున విజయం సాధించి.. కేసీఆర్ తొలి క్యాబినెట్లో తొలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2018లో కూడా డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకే రెండోసారి అధికారం దక్కింది. ఉపఎన్నికతో కలిపి వరుసగా 4 సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి రగలిపోతున్నారు. రాజయ్య తీరుతో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి నష్టమని గ్రహించిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ స్వయంగా రాజయ్యతో మాట్లాడి బుజ్జగించారు. కడియంతో కలిసి పనిచేయమని రాజయ్యకు సూచించారు. పెద్దల ముందు తలాడించినా గాని...ఆ తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజయ్య అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొదట్లో కడియం నిర్వహించిన అత్మీయ సమ్మేళనాలకు రాజయ్య హాజరుకాలేదు. ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం బలమైన నేతగా భావిస్తున్నా.. వర్గపోరు పార్టీని ఆగం చేస్తోందనే భావన అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇప్పటికే ఈ అంశాన్ని విపక్షాలు క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయట.. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్థనపేటకు మారింది. సభ నియోజకవర్గం మారడానికి ఘన్పూర్ పార్టీలో అంతర్గత కలహాలే కారణమంటూ ప్రచారం సాగింది. అక్కడి నుంచి వస్తున్న సర్వేలు సైతం గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఒకవైపు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఘన్పూర్ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారంచాల్సి వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీద ఎటువంటి అవినీతి మరకా లేదు. అయితే రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే కడియంకు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే..బీఆర్ఎస్లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కడియం అభ్యర్థిత్వాన్ని బలమైన మాదిగ సామాజిక వర్గం సైతం వ్యతిరేకిస్తే పార్టీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ట్రబుల్ షూటర్‌గా ఉన్న మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమ సమయంలో 2012 ఉప ఎన్నికల్లో సైతం హరీష్ రావు పూర్తి బాధ్యతలు తీసుకుని అప్పట్లో రాజయ్యను గెలిపించడానికి కృష్టిచేశారు. అప్పుడు ఎవరి ఓటమి కోసం పనిచేశారో అదే కడియం శ్రీహరి విజయం కోసం ఇప్పుడు మళ్లీ హరీష్ రావు రంగంలోకి దిగాల్సి వచ్చిందట. ఆత్మీయ సమ్మేళనం పేరుతో వచ్చిన హరిష్ రావు రాజయ్య ఇంటికి వెళ్లి నచ్చ చెప్పారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు మంత్రాంగం పనిచేస్తుందా? రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కడియం శ్రీహరి కోసం రాజయ్య మనస్పూర్తిగా పనిచేస్తారా? అనే చర్చ ఘన్పూర్ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఈ సారి నిజమవుతుందా? లేదా అనే చర్చ కూడా మొదలైంది. -
రేవంత్ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం
సాక్షి, జనగాం: కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్.. కడియంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కడియం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఓ గజదొంగ. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇందిరపై, రేవంత్‌రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. కానీ, నాపై ఒక్క కేసు కూడా లేదు అని కడియం అన్నారు. నియోజక వర్గంలోని మాదిగలపై నిజంగా ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ఇందిరకు సవాల్ విసిరారాయన. ఇందిర తన ఆస్తుల్ని రాసిచ్చిన మరు క్షణమే తాను తన ఆస్తుల్ని రాసి ఇచ్చేస్తానని కడియం తెలిపారు. 2018 ఎన్నికల్లో రాజయ్య చేతిలో ఇందిర చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గం పైన అవగాహన లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదు. ఆపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టులో ఆ కేసు నడుస్తోంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండని ఆమెకు.. ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారాయన. -
రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా?
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు గరంగరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బ్యాలెట్ పోరులో ప్రజా తీర్పే ఇక మిగిలిఉంది. అధికార పార్టీకి అడ్డాగా ఉన్న ఘనపూర్ లో ఆ పార్టీలోనే గడబిడ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. కడియం టార్గెట్ గా విపక్షాలతో పాటు..స్వపక్షం నేతలు కూడా కొందరు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ అడ్డా మీద కీ రోల్ పోషిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న కడియం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బిఆర్ఎస్ కు చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఉపఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ దక్కక మొదట్లో కాస్త ఆందోళన చెందిన రాజయ్యను చివరకు కేటిఆర్ సముదాయించి రైతుబంధు సమితి చైర్మెన్ పదవి ఇవ్వడంతోపాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి కడియంతో సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ ప్రగతి భవన్ లో కలిసిపోయినా బయట మాత్రం అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలో బలమైన నాయకులు లేకపోవడం అనేది అధికార పార్టీకి కలిసివచ్చే అంశమే అయినా వర్గపోరు పార్టీని ఆగం చేస్తోంది. విపక్షాలు దాన్ని క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు ఘనపూర్ లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బిజేపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర, బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు బరిలో దిగారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారం ముమ్మరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి తొలిదశలో మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య దూరంగా ఉన్నారు. తన టిక్కెట్ కడియం తన్నుకుపోయారనే ఆవేదనతో ఉన్న రాజయ్య, బయట ఆయనతో కలిసిపోయినట్లు వ్యహరిస్తున్నా అంతర్గతంగా మాత్రం కడియంకు చుక్కలు చూపించేందుకే సిద్ధమయ్యారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరుసార్లు, టిడిపి మూడు సార్లు, బిఆర్ఎస్ నాలుగు సార్లు గెలుపొందాయి. వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో ఈసారి అభ్యర్థిని మార్చారనే ప్రచారం సాగుతోంది. కడియం ఇదివరకు రెండు సార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా టిఆర్ఎస్ హయాంలో రాజయ్య తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనపై సదభిప్రాయం ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపద్యంలో మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను కాదని కడియంకు టికెట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గం కడియంకు ప్రతికూలంగా మారే పరిస్తితులు కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఓటములను రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన సింగపురం ఇందిరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రజలతో మమేకమై ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో పనిచేసిన విజయరామారావు బిజేపిలో చేరి టికెట్ తెచ్చుకున్నప్పటికి ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి కడియం పేరు ఖరారై చాలా కాలమైంది. కాంగ్రెస్, బిజేపి పార్టీలు తమ అభ్యర్థులను ఇటీవలనే ఖరారు చేశాయి. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుభూతి ఉన్నా ఆయన వ్యవహారశైలి పార్టీకి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. ఇక కడియం శ్రీహరి మీద ఎలాంటి అవినీతి మరకా లేనప్పటికీ..రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు...స్వపక్షంలోనే కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి సీనియర్ అయినప్పటికీ ఆయన పేరు పెద్దగా వినిపించడంలేదు. -
ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ హాట్ కామెంట్‌తో వార్తల్లోకెక్కారు. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనో వేదన చెందుతున్నారు. ధర్మసాగర్ మండలంలో బీసీ బంధు.. లక్ష రూపాయల చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. ఆ సమయంలో పక్కన ఉన్న అనుచరులు సైతం నవ్వులు చిందించారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు... రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. తాజా కామెంట్లు ఆయన పార్టీ మారరనే సంగతి స్పష్టం చేస్తున్నా.. ఆయన కార్యచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కడియంకే టికెట్.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
TS Election 2023: ‘కడియం వద్దు.. రాజయ్య ముద్దు’!
వరంగల్: అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి.. అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు.. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి తోటలో పార్టీ ఘన్పూర్ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. రెచ్చిపోయిన కడియం.. ముందుగా బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి పలువురు కడియం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. 'ఏనాడు తప్పుడు పనులు చేయలేదు.. ప్రజలకు తలవంపులు కూడా తేలేదు. 30 ఏళ్లుగా నియోజవకర్గ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో పాలుపంచుకున్నాను.. ఇకపై నేను వస్తున్నానంటే గోకుడు గీకుడు బంద్ అవుతాయి.. అక్రమార్కులు హడలిపోతున్నారని' కడియం చెప్పారు. కడియం వ్యాఖ్యలకు నిరసనగా.. నిన్న కడియం శ్రీహరి పలికిన మాటలకు నిరసనగా వేలేరు మండల కేంద్రంలో రాజయ్య వర్గీయులు ర్యాలీ తీశారు. 'తాను వస్తున్నాడంటే గోకుడు గీకుడు బంద్ అవుతాయా..! అక్రమార్కులు హడలిపోతున్నారా.." అంటూ కడియం చేసిన వ్యాఖ్యలకు రెచ్చిపోయిన రాజయ్య అనుచరులు నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. 'కడియం వద్దు రాజయ్య ముద్దు', అంటూ కడియంకు వ్యతిరేక నినాదాలు చేశారు. స్టేషన్ ఘనపూర్ అన్నీ మండల కేంద్రాల్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. -
TS Election 2023: ఆశీర్వదించి అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..! : కడియం శ్రీహరి
వరంగల్: అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి.. అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు.. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి తోటలో పార్టీ ఘన్పూర్ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి పలువురు కడియం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా నియోజవకర్గ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో పాలుపంచుకున్నాను.. ఏనాడు తప్పుడు పనులు చేయలేదు.. ప్రజలకు తలవంపులు తేలేదని కడియం అన్నారు. పేదరికం నుంచి వచ్చిన తనకు వారి కష్టాలు తెలుసుని, పార్టీ పదవులు, ప్రభుత్వ పథకాల ఆశచూపి ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. పక్కనే ఉన్న పాలకుర్తి, వర్ధన్నపేట బాగా అభివృద్ధి చెందాయని, తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిపి మున్సిపాలిటీ చేయించి అభివృద్ధి చేస్తానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్నగుప్తా, నీల గట్టయ్య, పోగుల సారంగపాణి, పురమాని రజాక్‌యాదవ్, గన్ను నర్సింహులు, తెల్లాకుల రామక్రిష్ణ, సింగపురం జగన్, రాజేష్‌నాయక్, డాక్టర్ జైహింద్‌రాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక ఆరోపణలు.. కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య..
సాక్షి, ఉమ్మడి వరంగల్:జనగామ జిల్లా స్టేషన్ ఘపపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు. తన బాధను చెప్పుకుంటూ బోరున విలపించారు. కరుణాపురంలో జరిగిన ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. తనపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని ఎమ్మెల్యే సవాలు విసిరారు. అయితే ఏ సర్వే చూసిన తాను ముందు వరుసలో ఉన్నానని, తనను నిజాయితీగా ఎదుర్కోలేక కొందరు శవ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఎంతో ఆత్మీయంగా తాను మమత అనురాగాలు పంచిపెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని, వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను మత కన్నెల చేతుల్లో, వారి ఒళ్లో పెరిగినవాణ్ణి అని, ఆడవాళ్ళను గౌరవించే వ్యక్తినని తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘనపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షిగా రాజయ్య ప్రతినభూనారు. చదవండి: పెళ్లిలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు -
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్లో వర్గ పోరు
వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. ఇద్దరూ దళిత నేతలే. కాని వారిద్దరికి అసలు పడదు. మాటల తూటాలతో గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు. తప్పు చేయలేదు.. తలవంచను అని ఒకరంటే, సీఎం కేసిఆర్‌కు వీరవిధేయుడిని తానేనంటు మరో నాయకుడు అంటున్నారు. ఓరుగల్లు గులాబీ కోటలో రాజకీయ దుమారం రేపుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఏమిటా కథ? ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు..ప్రతి విమర్శలు సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు కామనే. కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార బీఆర్ఎస్ నేతల మధ్యనే కొంతకాలంగా పొలిటికల్ కోల్డ్ వార్ సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. గతం నుంచీ రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార బిఆర్ఎస్లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఒకరిపై ఒకరు సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు. కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తు అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు. లింగాల ఘనపురంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయను, ఎవరికి తలవంచను.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పాదాభివందనం చేయనని స్పష్టం చేశారు. ఇటీవల కేసిఆర్‌కు రాజయ్య పాదాభివందనం చేయడంతో.. తప్పు చేసిన వాళ్ళే తలవంచి పాదాభివందనం చేస్తారంటూ చేసిన కామెంట్స్.. రాజయ్యను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత రాజయ్య సైతం తానేమి తక్కువ కాదని కొత్తకొండలో శ్రీహరిని ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ నాదే... గెలుపు నాదేనని స్పష్టం చేశారు. కేసిఆర్ నిర్ణయాలకి.. ఆయనకు వీరవిధేయుడు ఎవరంటే తానేనని, త్యాగం చేసిన వ్యక్తిని కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేసిఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మచ్చలేని నేత కడియం శ్రీహరికే స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి చరిష్మా ఉన్న నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మింగుడుపడటం లేదు. టార్గెట్ స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ అన్నట్లుగా కడియం శ్రీహరి పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా సార్కే టికెట్ వస్తుందంటూ కడియం వర్గీయులు బహిరంగగానే వ్యాఖ్యానిస్తున్నారు. కడియం రాజకీయ వైఖరి, ధోరణి కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగానే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడమే కాదు.. అన్ని కార్యక్రమాల్లోనూ కడియం హవా కనిపిస్తోంది. రాజయ్య వర్గం నుంచి కొంతమందిని ఇటీవల కడియం వైపు తిప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుకూలతలను అధిష్ఠానానికి చాటేందుకే కడియం అవుట్ రైట్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచినట్లుగా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇద్దరి రాజకీయ పరిస్థితి తయారైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆధిపత్య ప్రదర్శనలకు దిగుతుండడంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. వీరివల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఆ నియోజకవర్గ కేడర్ కోరుతోంది. -
ఏ ఒక్కరు వేలు పెట్టినా సహించను..
ఎమ్మార్పీఎస్‌పై టీడీపీ దాడి సరికాదు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రఘునాథపల్లి : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నా నాయకుడు కేసీఆర్.. నా నియోజకవర్గ ప్రజలే దేవుళ్లు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశా. ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా ఓటమి వెనుక గెలుపుంటుదని కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద, టీఆర్ఎస్ మండల క న్వీనర్ గొరిగె రవి, అడ్‌హక్ కమిటీ సభ్యులు నామాల బుచ్చయ్య, మారుజోడు రాంబాబు, గోపాల్‌నాయక్, గాదె సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కుమార్‌గౌడ్, ఎంపీటీసీలు గవ్వాని నాగేశ్వర్, దొనికల రమాదేవి, మాలోతు నర్సింహా, యమున, సర్పంచ్‌లు పెండ్లి మల్లారెడ్డి, గాదె అరుణ, అక్కనపల్లి సత్యనారాయణ, నాయకులు గూడ సునిత, బొల్లపల్లి మధుసూదన్, చెంచు రమేష్, కాసర్ల లక్ష్మయ్య పాల్గొన్నారు.