
వరంగల్: అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి.. అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు.. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి తోటలో పార్టీ ఘన్‌పూర్ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
రెచ్చిపోయిన కడియం..
ముందుగా బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి పలువురు కడియం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. 'ఏనాడు తప్పుడు పనులు చేయలేదు.. ప్రజలకు తలవంపులు కూడా తేలేదు. 30 ఏళ్లుగా నియోజవకర్గ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో పాలుపంచుకున్నాను.. ఇకపై నేను వస్తున్నానంటే గోకుడు గీకుడు బంద్ అవుతాయి.. అక్రమార్కులు హడలిపోతున్నారని' కడియం చెప్పారు.
కడియం వ్యాఖ్యలకు నిరసనగా..
నిన్న కడియం శ్రీహరి పలికిన మాటలకు నిరసనగా వేలేరు మండల కేంద్రంలో రాజయ్య వర్గీయులు ర్యాలీ తీశారు. 'తాను వస్తున్నాడంటే గోకుడు గీకుడు బంద్ అవుతాయా..! అక్రమార్కులు హడలిపోతున్నారా.." అంటూ కడియం చేసిన వ్యాఖ్యలకు రెచ్చిపోయిన రాజయ్య అనుచరులు నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. 'కడియం వద్దు రాజయ్య ముద్దు', అంటూ కడియంకు వ్యతిరేక నినాదాలు చేశారు. స్టేషన్ ఘనపూర్ అన్నీ మండల కేంద్రాల్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.