వరంగల్: జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్ టికెట్ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఖాయమైనట్లు సమాచారం. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయమై అధిష్టానం అధికార ప్రకటన చేయకపోగా.. ఎమ్మెల్సీలు సైతం మాట్లాడటం లేదు. దీంతో సిట్టింగ్‌లకే టికెట్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు హైదరాబాద్ బాట పట్టారు.
‘నోమా’లో ముత్తిరెడ్డి బల ప్రదర్శన..
‘పల్లా మా కొద్దు.. ముత్తిరెడ్డే ముద్దు’ అంటూ 8 మండలాలకు చెందిన సుమారు వెయ్యి మంది ముత్తిరెడ్డి వర్గీయులు గురువారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ముత్తిరెడ్డికి చెందిన ‘నోమా’ఫంక్షన్ హాల్‌లో సమావేశమై ఆయనకు మద్దతు తెలిపారు. ముత్తిరెడ్డిని కాదనుకుంటే జనగామ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాజశ్యామల యాగంలో రాజయ్య..
వివాదాల సుడిగుండంలో ఉన్న స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరగడంతో రాజయ్య ఆగమాగమై శత్రువుల నుంచి విముక్తి లభించేలా రాజశ్యామల యాగంలో నిమగ్నమయ్యారు. దీంతోపాటు రాజయ్యకే టికెట్ ఇవ్వాలని 300 మంది అనుచరులు గచ్చిబౌలిలోని మంత్రి హరీశ్‌వును కలిసి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా పల్లా, కడియం పేర్లు ఖరారయ్యాయన్న ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి.రాజయ్యలు తమ భవిష్యత్ కార్యాచరణపై నోరువిప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment