
మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్‌ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్‌ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్‌రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.
సంపత్‌రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్‌రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment