హనమకొండ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్‌లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారన్నారు.
ఇతర పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తనకు రాజకీయ జన్మనిచ్చి ఆదరించిన తీరుగానే తన బిడ్డ డాక్టర్ కడియం కావ్యను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీలు యువతను మోసం చేశాయన్నారు. వర్ధన్నపేటలో భూములను కబ్జా చేసిన అరూరి రమేశ్‌ను నియోజకవర్గ ప్రజలు చెంప చెల్లుమనిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోను తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు హన్మంతరావు, రాజు, రవి, రమేష్, రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment