Hanamakonda
-
అభివృద్ధి కాంక్షతోనే.. పార్టీ మారా! : కడియం శ్రీహరి
హనమకొండ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్‌లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారన్నారు.ఇతర పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్లోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తనకు రాజకీయ జన్మనిచ్చి ఆదరించిన తీరుగానే తన బిడ్డ డాక్టర్ కడియం కావ్యను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు యువతను మోసం చేశాయన్నారు. వర్ధన్నపేటలో భూములను కబ్జా చేసిన అరూరి రమేశ్‌ను నియోజకవర్గ ప్రజలు చెంప చెల్లుమనిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోను తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు హన్మంతరావు, రాజు, రవి, రమేష్, రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఫిర్యాదు
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ చినికిచినికి గాలివానగా మారి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేతోపాటు తన భర్త ప్రవీణ్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌లపై బుధవారం సాయంత్రం ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య.. గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైసా ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ.100 బాండ్ పేపర్‌పై అప్పుగా రూ.20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టాలని ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తన భర్తపై కూడా ఆరోపణలు చేసిన నవ్య.. ఆయనతో కలిసే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం కొసమెరుపు. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేశారు.. సర్పంచ్ నవ్య.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. ‘జానకీపురం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న నన్ను ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా వేధిస్తున్నారు. గతంలో నా భర్త ప్రవీణ్ కుమార్ ద్వారా నన్ను బలవంతగా ఒప్పించి, రాజీపడే విధంగా చేసి.. ఎమ్మెల్యే రాజయ్య స్వయంగా మా ఇంటికి వచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. మీడియా ముఖంగా జానకీపురం గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులనుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన మాటలను నమ్మి రాజీపపడ్డాం. కానీ నేటికీ ఎలాంటి నిధులు మంజూరు చేయకపోగా రూ.25 లక్షలు మాకే ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం ఎమ్మెల్యే చేయించాడు. నెలరోజుల కింద నా భర్త ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాస్ గ్రామానికి నిధులు ఇస్తామని నన్ను హనుమకొండకు రప్పించి నా దగ్గరికి రెండు అగ్రిమెంటు పేపర్లను తీసుకువచ్చారు. ఒకటి గతంలో ఎమ్మెల్యేపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని, నేను తప్పుగా రాజకీయ లబ్ధి కోసం వాటిని చేసినట్లు ఒప్పుకున్నట్టుగా స్టాంపు పేపరుపైన రాయించుకొచ్చారు. మరో పేపర్‌పై రూ.20 లక్షలు నాకు అప్పుగా ఇచ్చినట్లు, తిరిగి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే విధంగా ఒప్పుకున్నట్లు రాసుకొని వచ్చారు. వాటిపై సంతకం పెట్టాలని బలవంతం చేశారు. దీనిని నేను వ్యతిరేకించా. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేసి, సంతకం పెడితేనే గ్రామానికి ఒప్పుకున్న నిధులు రూ.25 లక్షలు మంజూరు చేస్తామని వేధింపులకు గురి చేస్తున్నారు. మార్చి 8న జరిగిన వేధింపుల ఘటనలో మధ్యవర్తిత్వం వహించిన ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత ఆ రోజు క్షమించమని ప్రాధేయపడితే.. పోనీ, ఎవరి పాపం వారిది అని పేరు బయట పెట్టలేదు. అయినా నా భర్తకు డబ్బు ఆశచూపి ఒప్పంద పత్రంపై సంతకం చేయించడానికి పన్నాగం పన్నారు. నిజాయితీగా ఉండాలనుకున్న నేను సంతకం చేయకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నందున ఎమ్మెల్యే, ఆయన పీఏ, ఎంపీపీ, నా భర్తపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నా’అని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. భర్తతో కలసి నవ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు, బుధవారం రాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎమ్మెల్యే, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలతో పాటు తనభర్తపైనా నవ్య చేసిన ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ కంటెంట్ లేనందున కేసు నమోదు చేయలేదని, న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత చర్యలు చేపడతామని ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్ తెలిపారు. -
కరుణాపురం ‘క్రీస్తుజ్యోతి’కి అంతర్జాతీయ గుర్తింపు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం శివారులోని ‘క్రీస్తుజ్యోతి’ప్రార్థన మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కరుణాపురంలో 40 వేల మంది కూర్చొని ఏకకాలంలో ప్రార్థనలు చేసే అతిపెద్ద చర్చి నిర్మాణం చేపట్టినందుకు డెన్నీ కె.డెవిస్ పీస్ 2023 అవార్డును సాధించింది. అమెరికన్ మల్టీ ఎత్నక్ కోయలిషన్ 7వ కాంగ్రేషనల్ మల్టీ ఎత్నక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్ క్రైస్ట్ ప్రెసిడెంట్ క్రీస్తుజ్యోతి మినిస్ట్రీ ఫౌండర్ డాక్టర్ సంగాల పాల్సన్‌కు ఆదివారం ఆ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పాల్సన్ మాట్లాడుతూ..తమను గుర్తించి అవార్డు ఇచి్చన సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఈ అవార్డు రావడంపై సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ డాక్టర్ జయప్రకాశ్ గోపు హర్షం వ్యక్తం చేశారు. -
చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ మూడు రంగులు..
శాయంపేట: చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ.. సమయాన్నిబట్టి రంగులు మారుతోంది. అదే మందార ముటాబిలిసి పువ్వు ప్రత్యేకత. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు తన ఇంటి ఆవరణలో దక్షిణ చైనా, తైవాన్ దేశాలకు చెందిన మందార ముటాబిలిసి అనే మొక్కను నాటాడు. దీనిని కాన్ఫెడరేట్ గులాబీ, డిక్సీ రోజ్‌మల్లో, కాటన్ రోజ్ లేదా కాటన్ రోజ్‌మల్లో అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఆదివారం ఈ మొక్కకు అరుదైన పుష్పం వికసించింది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారడం ఈ పువ్వు ప్రత్యేకత. ఒకేరోజు మూడు రంగుల్లో వికసించడంతో స్థానికులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ -
జాతీయవాద ఉద్యమానికి తీరని లోటు
ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, ఆలిండియా స్థాయిలో ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులుగా గణనీయమైన స్థాయిలో సేవలు అందించారు. నర్సయ్య తన 81 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్ 24 హన్మకొండ హంటర్ రోడ్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం మండలగూడెంలో 1942 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభిం చారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను సులభ శైలిలో బోధించి వారిలో ఇంగ్లిష్ భాష అధ్యయనం పట్ల ఆసక్తి పెంచే మెలకువలు నేర్పించిన ఉత్తమ అధ్యాపకులుగా గుర్తింపు పొందారు. 1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో జరిగిన అనేక సంఘర్షణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల జిల్లాల్లో విశేష పర్యటనలు చేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తల్లో జాతీయవాద దృక్పథాన్ని ప్రేరేపించారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. కొంతకాలం వరంగల్ విభాగ్ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏబీవీపీ సంస్థకు పూర్తి సమయ కార్యకర్తగా వరంగల్ నుండి దేశ నలుమూలల పని చేయడానికి వెళ్లారు. క్లిష్ట పరిస్థితులలో జాతీయవాద వ్యాప్తి కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు నర్సయ్య. బిహార్ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్‌గా కూడా ఆయన చాలాకాలం సేవలు అందించారు. 2001లో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇంగ్లిష్ లెక్చరర్‌గా నర్సయ్య వడ్డేపల్లిలోని పింగిలి కాలేజీలో, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేశారు. పలు జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సేవాపతకం శిబిరాల్లో జాతీయ పునర్నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై అనర్గళంగా ఉపన్యసించి యువతలో సేవాభావం, దేశభక్తి, సంకల్పబలం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసిన సామాజిక చైతన్యశీలి ఆయన. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ చౌరస్తాలోని వేదికపై ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా సాగేవి. నక్సలైట్ల చేతిలో ఏబీవీపీ కార్యకర్తలు మరణించిన సమయంలో నర్సయ్య మొక్కవోని ధైర్యంతో వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో విద్యార్థులను జాగృతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏబీవీపీ చేపట్టిన పాదయాత్రకు పాటలు, మాటలు అందించారు. గుజ్జుల నర్సయ్యసార్ మరణం విద్యారంగానికి, సామాజిక చైతన్యానికి తీరని లోటు. వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళి. (క్లిక్: సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ) - నేదునూరి కనకయ్య వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం -
Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. చదవండి: చీమ.. బలానికి చిరునామా.. -
డబ్బులివ్వలేదని తల్లిపై హాకీస్టిక్‌తో దాడి
హసన్‌పర్తి: డబ్బులు ఇవ్వనందుకు ఓ కుమారుడు హాకీ కర్రతో తల్లిపై దాడి చేశాడు. గొడవను నివారించడానికి వచ్చిన మరో ఇద్దరిని చితకబాదాడు. ఈ సంఘటనలో తల్లి చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండ్లసింగారానికి చెందిన అప్పల రమ్య (45) కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటోంది. వ్యక్తిగత అవసరం కోసం కుమారుడు రోహిత్ రోజూ డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. లేవని చెప్పడంతో క్షణికావేశానికి గురైన రోహిత్.. హాకీ కర్రతో తల్లి కడుపు, తల, వీపుపై బలంగా కొట్టాడు. అడ్డువచ్చిన మామ సతీశ్, అమ్మమ్మ, అక్కలను చితకబాదాడు. ఈ ఘటనలో రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శనివారం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
హన్మకొండ ఆర్డీవో కార్యాలయం కడిపికొండలో..
మహిళా సమాఖ్య భవనాన్నిఎంపిక చేసిన అధికారులు మినీ మునిసిపాలిటీలో తహసీల్దార్ కార్యాలయం హన్మకొండ అర్బన్ : నూతన జిల్లాల ముసాయిదా ప్రకటన ప్రకారం ప్రస్తుత జిల్లా కేంద్రంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. వరంగల్ కలెక్టరేట్ కోసం నక్కలగుట్టలోని నీటి పారుదల శాఖ భవనం ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హన్మకొండ ఆర్డీవో కార్యాలయం, కాజీపేట తహసీల్దార్ కార్యాలయం భవనాలు ఫైనల్ çచేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కడిపికొండలో ఆర్డీవో ఆఫీస్ కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ రెవెన్యూ డివిజన్ నూతన జిల్లాల ముసాయిదా కార్యాలయాన్ని హన్మకొండ మండలం కడిపికొండలోని ఐకేపీ మండల సమా ఖ్య కార్యాలయ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఈజీఎస్ ఎపీవో కార్యాలయం కోసం ఈ భవనాన్ని నిర్మించగా.. ఈ గ్రామం గ్రేటర్లో కలవడంతో హన్మకొండ ఏపీవో కార్యాలయం అవసరం లేకుండా పోయింది. దీంతో ఈ భవనాన్ని ఐకేపీ మండల సమాఖ్య కోసం కేటాయిం చారు. కానీ, మండల సమాఖ్య కూడా పూర్తిగా మెప్మా పరిధిలోకి రావడంతో ప్రస్తుతం కార్యాలయం ఖాళీగా ఉంటోంది. దీంతో ప్రభుత్వం భవనమైన ఇందులో హన్మకొండ ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుచేస్తే ఇబ్బందులు ఉండవన్న అంచనాతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అలాగే, కాజీపేట మునిసిపల్ కాంప్లెక్స్‌లో కాజీపేట తహసీల్దార్ కార్యాలయంను తాత్కాలికంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ రెండు కార్యాలయాల ప్రతిపాదనలకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. కాగా, ప్రస్తుతం ఉన్న వరంగల్ ఆర్డీవో కార్యాలయాన్ని అదే భవనంలో కొంతకాలం కొనసాగిస్తారు. -
‘స్విమ్మింగ్‌పూల్’లో అవినీతి చేపలు..?
అడ్మిషన్ల ఆదాయాన్ని పంచుకున్న సిబ్బంది చర్యలపై డీఎస్డీఓ మీనమేషాలు ‘సాట్’ దృష్టికి వెళ్లినట్లు సమాచారం! వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కి ప్రధాన ఆదాయ వనరైన స్విమ్మింగ్ పూల్‌లో అవినీతి చేపలు తిష్ట వేశాయి. అయితే అవినీతి చేపలను స్వయంగా డీఎస్ఏ ఉన్నతాధికారులే పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల కనుసన్నలలో యథేచ్ఛగా కొనసాగుతుండడం తో ఆ చేపల అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఆదాయ వివరాలను పొందుపరచడంలో లొసుగులను ఆసరా చేసుకున్న అవినీతి చేపలు పెద్ద మొత్తంలో వెనుకేసినట్లు సమాచారం. సమకూరిన అవినీతి సొమ్మును తలా ఇంతా పంచుకుతింటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. డీఎస్ఏ ఆధ్వర్యంలో.. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో బాలసముద్రంలో స్విమ్మింగ్‌పూల్ కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినది కావడంతో స్విమ్మింగ్‌పూల్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహణతో పాటు ప్రతిరోజు నగరంలోని సుమారు 200 మంది స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ సంఖ్య వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో త్రిబుల్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అడ్మిషన్‌తో పాటు నెలనెలా ఫీజు డీఎస్ఏ స్విమ్మింగ్‌పూల్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేందుకు అడ్మిషన్ తీసుకోవా లి. అందుకు ప్రతి వ్యక్తి నుంచి రూ. 1500ల అడ్మిషన్ ఫీజును డీఎస్ఏ వసూ లు చేస్తోంది. ఇక ప్రతినెల రూ.600 రూ పాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అడ్మిషన్ ఫాం రూ.100 వె చ్చించి కొనుగోలు చేయాలి. రెగ్యులర్ కాకుండా కేవలం వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు, వేసవి సెలవుల్లో పిల్లలకు ఈత నేర్పించేందుకు మరికొందరు స్విమ్మింగ్‌పూల్ బాటపడుతుంటారు. రెండు నెలల పాటు కిక్కిరిసిపోయే స్విమ్మింగ్‌పూల్‌లో ఒక దశలో అడ్మిషన్ల కోసం పైరవీలు చేయాల్సి వ స్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వేసవిలో డిమాండ్ వేసవి డిమాండ్ ను ఆసరాగా చేసుకున్న సదరు పూల్ సిబ్బంది అడ్మిషన్ల ఆదాయాన్ని పక్కదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో పదిలక్షల రూపాయలను డీఎస్ఏ అకౌంట్లో జమచేసినట్లు సిబ్బంది చెబుతుండగా, ఆ ఆదాయం గత ఏడాదితో పోల్చితే చాలా తక్కువని, సంఖ్య పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెరగకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 200 ఉన్న సంఖ్య ఏప్రిల్, మే నెలలో 800ల నుంచి 1000 మంది వరకు పెరిగినట్లు తెలిసింది. అడ్మిషన్ పత్రాలు మాయం అడ్మిషన్ల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేస్తుంటారు. అయితే వేసవిలో నమోదైన అడ్మిషన్లలో 110 పత్రాలు మాయమైనట్లు సమాచారం. ఒక్కో అడ్మిషన్‌కు రూ.1500, నెల ఫీజు 600, అడ్మిషన్ ఫాం 100 రూపాయలు ఈ లెక్కన రూ.2.42 లక్షల ఆదాయాన్ని పూల్‌లో పనిచేసే ముగ్గురు కాంట్రాక్టు సిబ్బంది పంచుకున్నట్లు తెలుస్తోంది. నా దృష్టికి రాలేదు స్విమ్మింగ్‌పూల్‌లో అడ్మిషన్లు మిస్సైన విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. గత ఏడాది జిల్లాలో జరిగిన పైకా క్రీడల వివరాలను కేంద్రానికి అత్యవసరంగా పంపించాల్సి ఉంది. ఆ పని పూర్తయ్యాక పూల్ అకౌంట్స్ పరిశీలిస్తా. అక్రమాలకు జరిగినట్లు తేలితే బాధ్యులపై తప్పవు. – ఇందిర, డీఎస్డీఓ -
మెుక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ అర్బన్l: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులతో హరితహారం, విద్యాశాఖ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో 1.75 లక్షల మొక్కలు నాటామని, బాలల హరితహారం ద్వారా పిల్లలకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. పిల్లలకు ఇచ్చిన మొక్కల సంరక్షణపై అధికారులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నాన్ ఈజీఎస్ కింద నాటిన మొక్కలకు నీరు పోయడం, ఫెన్సింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుపుతూ సంబంధిత అధికారి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఒక్కో మొక్క ఫెన్సింగ్‌కు రూ.9, నీరు పోసేందుకు రూ.120 మంజూరు చేయనున్నట్లు తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యం... పిల్లల విద్యా, వివాహ విషయాల్లో తలిదండ్రులు రాజీ పడటం లేదని, ఈ విషయం గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, సర్దుబాటులో భాగంగా ఇతర ప్రాంతాలకు కేటాయించగా, విధుల్లో చేరని వారి వివరాలు అందజేయాలని డీఈఓను ఆదేశించారు. ఎంఈఓలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఆంగ్ల బోధనపై ప్రభుత్వ టీచర్లకు వచ్చే నెలలో శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో డీఈఓ రాజీవ్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
14న వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య పరీక్ష
విద్యారణ్యపురి : ‘విజ్ఞాన భారతి అన్వేషిక’ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య ప్రిలిమినరీ టెస్ట్‌ను ఆగస్టు 14న హన్మకొండలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా కన్వీనర్ సత్తు రామనాథం తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి.వర్మ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేయడంలో విద్యార్థులకు మెలకువలను నేర్పడమే దీని లక్ష్యమన్నారు. జిల్లాలో 9వతరగతి నుంచి డిగ్రీ ఫైనలీయర్ వరకు చదువుతున్న విద్యార్థులు పరీక్షకు అర్హులన్నారు. ప్రతి పాఠశాల, కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థుల చొప్పున ఆగస్టు 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు 9866856373, 9948099462, 9177571379 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఎంపికయ్యే వారు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శాస్త్రవేత్త జితేందర్‌సింగ్, విజ్ఞాన భారతి రాష్ట్ర కార్యదర్శి నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, ఆనందం, సదానందం, రామయ్య, శశికళాధర్, సంతోష్, కుమారస్వామి, దామోదర్ పాల్గొన్నారు. -
4 చెక్‌పోస్టులు ఎత్తివేత
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అటవీశాఖ చెక్‌పోస్టుల్లో అక్రమాలను సంస్కరించే చ ర్యల్లో భాగంగా.. జిల్లాలో అక్రమాలకు అ డ్డాగా మారాయనే ఆరోపణలు ఎదుర్కొం టున్న నాలుగు చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ జిల్లా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేశారు. దీంతో సౌత్ ఫారెస్ట్ విభాగానికి చెందిన నర్సంపేట చెక్‌పోస్టు, నార్త్ విభాగానికి చెందిన చెల్పూరు, జంగాలపల్లి చెక్‌పోస్టులు, వన్యప్రాణి భాగానికి చెందిన కొత్తగూడ చెక్‌పోస్టులను ఎత్తివేశా రు. కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, వరంగల్ ఎస్పీ, ఐటీడీఏ పీఓ, డీఎఫ్ఓ సభ్యులు గా ఉంటారు. కాగా జిల్లాలో చెక్‌పోస్టుల అవీనీతి, సంస్కరణల కోసం పరిశీలన సిఫారసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రసుతం మూతపడ్డ చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని అవసరం ఉన్న బీట్లకు కేటాయించారు. -
ఎయిమ్స్‌లో సత్తా చాటిన చందనా దీప్తి
న్యూశాయంపేట : జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్షలో హన్మకొండకు చెందిన రాపోలు చందనాదీప్తి 37వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. ఈ మేరకు ఆమె ఎయిమ్స్ భూపాల్‌లో సీటు సంపాదించింది. చందనా దీప్తి నగరంలోని తేజస్వీ పాఠశాలలో పదో తరగతి, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కార్డియాలజిస్టును అవుతానని ఆమె పేర్కొన్నారు. -
జూన్ 15 నుంచి కరెంటోళ్ల సమ్మె
-ఆందోళనతో ఏర్పడే ఇబ్బందులకు ప్రభుత్వానిదే బాధ్యత -టీ టఫ్ రాష్ట్ర చైర్మన్ పద్మారెడ్డి, కన్వీనర్ శ్రీధర్ హన్మకొండ (వరంగల్ జిల్లా) : విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు జూన్ 15 నుంచి సమ్మె చేయనున్నట్లు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్(టీ టఫ్) రాష్ట్ర చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ చెప్పారు. శుక్రవారం హన్మకొండలో వారు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత నెల 13న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి టీటఫ్ ప్రతినిధులతో చర్చలు జరిపారని, తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరామని అన్నారు. అయితే నెల రోజులు దాటినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 19న విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. జూన్ 15లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలోని 40 వేల మంది విద్యుత్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులంతా సమ్మె చేస్తారని హెచ్చరించారు. తమ ఆందోళనతో విద్యుత్ వినియోగదారులకు కలిగే అంతరాయూనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 31 నుంచి జూన్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సన్నాహక సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 31న సిద్దిపేట, తూఫ్రాన్. జూన్ 1న భువనగిరి, జనగామ. సూర్యాపేట. 3న సత్తుపల్లి, కేటీపీఎస్ కొత్తగూడెం, 4న మహబూబాబాద్, కేటీపీపీ ములుగు. 7న కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్. 8న మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్. 10న గద్వాల, వనపర్తి, జడ్చెర్ల. 11న రంగారెడ్డి, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం సమ్మె పోస్టర్లు విడుదల చేశారు. -
నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య దూరం ఒక్క ఫోన్‌కాలే!
సంపత్ నంది... హన్మకొండ కుర్రాడు. బీఫార్మసీ టాపర్. ఎంఫార్మసీ డిగ్రీ హోల్డర్. డిగ్రీలు చదవడమే కాదు... పుస్తకాలూ అమితంగా చదివే సృజనశీలి. సినిమా మీద ప్రేమతో పోసాని దగ్గర రచయితగా మొదలై దర్శకుడయ్యారు. రెండు పెద్ద హిట్స్... సెట్స్‌పై ఇప్పుడు రవితేజతో ‘బెంగాల్ టైగర్’. ఇవాళ బర్తడే చేసుకొంటున్న ఈ మీడియా షై మ్యాన్‌తో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... *** మీ తాజా ‘బెంగాల్ టైగర్’ ఎందాకా వచ్చింది? 60 శాతమైంది. ఆపకుండా షూటింగ్ చేస్తున్నాం. *** హీరో రవితేజతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్నం అందరూ పెడతారు. కానీ, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం గొప్ప. ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్ట్ ఆగి, నేను డౌన్లో ఉన్నప్పుడు చాన్సిచ్చిన రవితేజకు ఋణపడ్డా. రవితేజ బంగారు కొండ. *** సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు? అవును. రెండూ సమాన ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రలే. ఒకటి తమన్నా, రెండోది రాశీ ఖన్నా చేస్తున్నారు. తమన్నా ఎంత కో-ఆపరేటివో, అంతకు మించి ప్రొఫెషనల్. రేపటి సీన్ డైలాగుల్ని ఇవాళే నా మాడ్యులేషన్లో రికార్డు చేయించుకొనెళ్ళి, పొద్దుట కల్లా ప్రిపేరై వస్తుంది. *** రిలీజ్ డేటూ ముందే చెప్పేశారే! అదృష్టమో, దురదృష్టమో నేను చేయాల్సిన ‘గబ్బర్‌సింగ్-2’ ఆగిపోవడంతో గ్యాపొచ్చింది. దాంతో కథ, లొకేషన్లు, బడ్జెట్‌తో సహా అన్నీ ఈ స్క్రిప్టుకు ముందే సిద్ధమయ్యాయి. అందుకే, రిలీజ్ డేట్ (సెప్టెంబర్ 18)తో సహా ప్లాన్ చేసి చెప్పేశా. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరుగుతోంది. *** బొమన్ ఇరానీని ఎలా ఒప్పించారు? ‘అత్తారింటికి దారేది’ తర్వాత ఆయన ఎవరికీ ఓ.కె చెప్పలేదు. కానీ, ‘బెంగాల్ టైగర్’ కథ విని, విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు నటనంటే పిచ్చి ప్రేమ. రాసుకొనే ప్రతి స్క్రిప్ట్‌లో ఆయనకు వేషం ఇవ్వాలనిపించేంతగా సెట్స్‌లో ఫ్రెండైపోయారు. *** ‘గబ్బర్‌సింగ్2’ ఆగడం డిస్ట్రబ్ చేసిందా? ఈ విషయంపై మీడియాలో ఏవేవో వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదు. ‘గబ్బర్‌సింగ్2’కు వర్క్ చేయడం తీపి జ్ఞాపకం. ఎంతో నేర్చుకున్నా. నాలో క్రమశిక్షణ పెరిగింది. పుస్తకపఠనం రెట్టింపైంది. *** ఇంతకీ, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది? (గంభీరంగా...) కొన్నిటికి వ్యక్తులు కాదు, పరిస్థితులే కారణం. మా ప్రాజెక్ట్ ఆగడానికీ అంతే! *** పవన్‌కల్యాణ్‌తో మీకిప్పటికీ సత్సంబంధాలున్నాయా? (నవ్వేస్తూ...) మా మధ్య ఎంతో స్నేహానుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య దూరమల్లా - ఒక్క ఫోన్ కాలే! త్వరలోనే తప్పకుండా ఆయనతో ఒక సినిమా చేస్తా. అందుకు ఆయన కూడా సిద్ధమే. ఆ మాటకొస్తే, ‘ఏ మైంది ఈ వేళ’ (2010) అనే చిన్న సినిమా తీసిన నాకు రామ్‌చరణ్ ‘రచ్చ’ అవకాశమిచ్చిన చిరంజీవి గారినీ, ‘మెగా’ ఫ్యామిలీనీ ఎప్పుడూ మర్చిపోను. ‘మెగా’ ఫ్యాన్‌గా చిరు సినిమాను డెరైక్ట్ చేయడం నా డ్రీమ్. *** ‘గబ్బర్ సింగ్2’కి చేసుకున్న స్క్రిప్టే ‘బెంగాల్ టైగ’రా? దానికీ, దీనికీ సంబంధమే లేదు. ఒక్క రెండు ఫైట్ సీక్వెన్స్ మాత్రం వాడుతున్నా. ఈ స్క్రిప్ట్ పూర్తిగా రవితేజకు అతికినట్లు సరిపోయేలా అల్లుకున్నదే. *** పవన్‌కల్యాణ్ ‘ఖుషి’ డైలాగుల ఇన్స్పిరేషన్ ఉందా? (నవ్వేస్తూ..) ‘టైగర్... బెంగాల్ టైగర్!’ అనే ‘ఖుషి’ డైలాగ్, ఆ సీన్, ఆయన మాట్లాడే విధానం స్ఫూర్తి ఉంది. ఆ ప్రేరణతో ఈ లైన్, టైటిల్ పుట్టాయి. కానీ, చాలామంది అనుకుంటున్నట్లు ఇది పోలీసు కథా కాదు, కలకత్తా నేపథ్యంలో నడిచే కథ అంతకన్నా కాదు. హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్‌ప్లే బేస్డ్ మాస్ ఎంటర్టైనర్. *** రవితేజ ఈ సినిమా కోసం బాగా సన్నబడ్డారేంటి? ఈ సినిమా కొద్దిగా స్టైలిష్డ్గా, మోడరన్ టచ్‌తో వెళుతుంది. ఆ మేరకు రవితేజను కొత్తగా చూపేందుకు ప్రయత్నించా. పైగా, ఏణ్ణర్ధంగా రవితేజలో ఫిట్నెస్ స్పృహ పెరిగింది. అందుకే, స్లిమ్‌గా కనిపిస్తున్నారు. *** 2010 మొదలైనా ఇది 3వ సినిమానే. ఇంత గ్యాపేం? ఇవాళ పెద్ద హీరోలతో సినిమా ఏడాది చిల్లర పడుతుందని అందరికీ తెలుసు. ఆ మధ్యలో ‘గాలిపటం’ అనే చిన్న సినిమా నిర్మించా. ఏమైనా, ఇకపైన దర్శకుడిగా ఎక్కువ గ్యాప్ రాకుండా సినిమాలు చేస్తా. *** ఇంతకీ మీరెందుకు నిర్మాతగా మారారు? సహజీవనం లాంటి సమకాలీన అంశాలతో సినిమా తీయాలని నేను, నా మిత్రులు అనుకొని ‘గాలిపటం’ తీశాం. మా ఫ్రెండ్ నవీన్ దర్శకుడు. ఇకపైనా యువ దర్శకులతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తాం. *** పోసాని దగ్గర శిక్షణ మీకు ఉపయోగపడిందా? పోసాని గారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేసిన మూడేళ్ళలో నేర్చుకున్నది ఎమోషనల్‌గా, స్క్రీన్‌ప్లే పరంగా సీన్లు రాయడంలో బాగా హెల్ప్ అయింది. ఇక, దర్శకుడిగా ప్రపంచ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నా. *** రచన, దర్శకత్వాల్లో ఎక్కడ సంతృప్తిగా అనిపించింది? నిజం చెప్పాలంటే, నేనింకా అసంతృప్తిగానే ఉన్నా. దర్శక, రచయితగా నా సామర్థ్యం చూపే సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. ఆ వివరాలన్నీ ఈ సినిమా తరువాతే! ఇప్పటికైతే, నా దృష్టి అంతా ఈ ‘బెంగాల్ టైగర్’ మీదే! ఇది నా కెరీర్లో హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ అవుతుంది. - రెంటాల జయదేవ -
బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరం
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : బీసీ సామాజికవర్గం నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరమని పీసీసీ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌హాల్ లో మంగళవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ పసునూటి లింగస్వామి, పరకాల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు, బీసీ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడా రు. పొన్నాల లక్ష్మయ్య జిల్లా రాజకీయాల్లోకి రాకముందే దేశ్‌ముఖ్, దొరలు, గడీల పాలనకు వ్యతిరేకంగా బీసీలు పోరాడి ఆనాడే మూడు నుంచి నాలుగు స్థానాలు సాధించుకున్నారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నా ఓడిన దాఖ లాలు లేవని తెలిపారు. 2004లో టీఆర్ఎస్ పొత్తులో భాగంగా బీసీలు మూడు చోట్ల గెలిచారని వివరించారు. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బీసీలకు సీట్లు కేటాయించిందని, ఎవరి ఒత్తిడితో మూడు నుంచి రెండు స్థానాలకు కుదించారో చెప్పాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌పై ఉందని అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు 32 సీట్లను కేటాయించడం అన్యాయమన్నారు. రెండేళ్ల వరకు ఎవరో తెలియని అనామకుడికి టికెట్ కేటాయించడం సరైంది కాదని పరకాల అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పొన్నాల లక్ష్మయ్య మనసు మార్చుకుని బీసీలకు మరో స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే బీసీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పరకాల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు మాట్లాడుతూ 2014 ఎన్నికల టికెట్ తనకే అని హామీ ఇచ్చారని.. ఇప్పుడు హామీని మరిచి, 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఏడాది క్రితం వరకు ఎవరికి తెలియని వ్యక్తికి సీటు కేటాయించడం సరికాదని వివరించారు. పరకాల టికెట్ తనకే కేటాయిస్తానని హామీ ఇవ్వలేదని అంటే.. భద్రకాళి గుడిలో తన భార్య, పిల్లలతో ప్రమాణం చేస్తానని, లేదంటే మాటిచ్చిన నాయకులు చేస్తారా అని సవాల్ విసిరారు. పరకాల టికెట్ పొందిన వ్యక్తి తాను కింది నుంచి పై వరకు అందరికి ముడుపులు చెల్లించాలని బాహాటంగా చెబుతున్నాడు.. అది పార్టీకి అపఖ్యాతి తీసుకురాదా అని ప్రశ్నించారు. చైతన్య వంతులైన బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉల్లెంగుల యాదగిరి, నారగోని కుమార్‌గౌడ్, పులి శ్రీనివాస్, ఏదునూరి రాజమొగిలి, పరకాల నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మెతుకుల్లేని బతుకులు
పల్లెవాసుల కూడు గోడు రోజూ రూ.8తో కడుపు నింపుకుంటున్న గిరిజనులు నిత్యం నీళ్లపులుసు, కారం మెతుకుల తిండి గ్రామీణ ప్రాంత ప్రజల దరిచేరని ప్రభుత్వ పథకాలు పౌష్టికాహార లోపంతో ఏటా 34 శాతం మరణాలు ‘జాతీయ శాంపిల్ సర్వే’లో వెల్లడి హన్మకొండ ఈ కాలంలో రూ.ఎనిమిదికి ఏం వస్తుంది... సింగిల్ చాయ్, ఒక్క మస్కా బిస్కెట్ తప్ప ఏం రాదు. అలాంటిది ఈ పైసలతో గిరిజన జీవి ఒక రోజు వెళ్లదీస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు బతికేందుకు ప్రతి రోజూ ఖర్చు పెడుతున్న సొమ్ము అక్షరాలా ఎనిమిది రూపాయలు. దొడ్డు బియ్యం, నీళ్ల పులుసు, కారం మెతుకులతో రోజులు గడుపుతున్నాడు. ఇదీ... జాతీయ శాంపిల్ సంస్థ చేసిన సర్వేలో తేలిన నిజం. ఈ సంస్థ ఢిల్లీకి చెందిన మరో రెండు సర్వే సంస్థలతో కలిసి గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, 112 గ్రామాలు, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, జనగామ మునిసిపాలిటీ పరిధిలో సర్వే చేపట్టింది. ప్రజల జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, రోజువారీ ఖర్చులు, పౌష్టికాహారం, తిండి కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వంటి అంశాలపై స్వీయ పరిశీలన చేసింది. ఒక బృందానికి 100 మంది చొప్పున మొత్తం 14 గ్రూపులు చేసిన సర్వేలో అధ్వానపు పరిస్థితులు బట్టబయలయ్యూరుు. అంతేకాదు... ప్రభుత్వం అందించే రూపాయి కిలో బియ్యం వారి దరికి చేరడం లేదనే నగ్న సత్యం వెలుగుచూసింది. సర్వేలో తేలిన మరి కొన్ని అంశాలు... పౌష్టికాహారం తీసుకుంటోంది 17 శాతమే.. 36 లక్షలున్న జిల్లా జనాభాలో పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నది కేవలం 17 శాతం మందే. ఇది కూడా... బడా వ్యాపారులు, ఉద్యోగులు, సంపాదనపరులు మాత్రమే. పౌష్టికాహారం తీసుకుంటున్న జాబి తాలో పట్టణవాసులు 11 శాతం, మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లో నివసిస్తున్న వారు 6 శాతం మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ బతికేందుకే ఎదో ఒకటి తింటూ కడుపు నింపుకుంటున్నవారే. ఏటా 34 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. 51 శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిరోజూ కేవలం రూ. 8 ఖర్చుతో కడుపు నింపుకుంటున్నారు. వారు తినే తిండి అతి దారుణంగా ఉంటోంది. స్థానికంగా దొరుకుతున్న చింతకాయలతో నీళ్ల చారు పెట్టుకుని, పచ్చడి మెతుకుల తిండి తింటున్నారు. తండాలు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు వారంలో మూడు రోజులు గంజితోనే గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. రోజు మొత్తం పనిచేసినా... వారికి పూట గడిచే పరిస్థితులు లేవు. రోజువారి సంపాదనలో తిండి కోసం ఒక్క మనిషి రూ. 8 మాత్రమే వెచ్చిస్తున్నాడని, అంతకు మించి ఖర్చు పెట్టే స్థోమత వారికి లేదని సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలు, తండాలు, అటవీ గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో ప్రతి ఏటా 34 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అరుునా... లోపమే మరో 32 శాతం మంది రోజువారి సంపాదనలో రూ. 21 నుంచి రూ.36 వరకు తిండి కోసం వెచ్చిస్తున్నారు. వీరు కూడా పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. పల్లెలు కాకుండా పెద్ద పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో నివసిస్తున్న వారే ఈ ఖర్చు చేస్తున్నారు. వీరిలో చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, రాజకీయ నేతలు ఉన్నారు. అందని పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని సర్వేలో బహిర్గతమైంది. అటవీ గ్రామాలు, గిరిజన తండాల ప్రజల కు రూపాయి కిలో బియ్యంతోపాటు జీవనోపాధి కల్పించే పథకాలు అందడం లేదు. రూపా యి కిలో బియ్యం అందనివారు పౌష్టికాహార లోపం జాబితాలో అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలింది. -
అన్యాయం వల్లే నక్సలిజం: ఎర్రబెల్లి దయాకర్‌రావు
హన్మకొండ టౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ విధానాలు, అన్యాయం వ ల్లే నక్సలిజం పుట్టిందని టీటీడీపీ క న్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో హెచ్ఎండీఏ పరిధి, హైదరాబాద్ యూటీ అంటూ కొందరు నాయకులు ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంతో ఏం ఒప్పందం చేసుకున్నారో కేసీఆర్ తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని తాను తప్పుబట్టానని పేర్కొన్నారు. చంద్రబాబు ఇద్దరిని పిలిచి మాట్లాడినా తాను అదే విషయాన్ని చెప్పినట్లు స్పష్టం చేశారు. పిటిషన్ విత్‌డ్రా చేసుకుంటే సీఎం రమేష్‌తో రాజీపడతానని బాబుకు కరాఖండిగా చెప్పానన్నారు. తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి తేల్చిచెప్పారు. భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్న సుమారు 181 కిలోమీటర్ల మేరకు గోదావరి నది పరివాహక ప్రాంతంపై సీమాంధ్రులు కన్నేశారని ఆరోపించారు. టీడీపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ దొమ్మాటి సాంబయ్య, అర్బన్ పార్టీ అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, నాయకులు పుల్లూరు అశోక్‌కుమార్, మనోజ్‌కుమార్, దేవేందర్ పాల్గొన్నారు. బ్లాక్ మెయిలింగ్‌లో కేసీఆర్, కేటీఆర్‌లు సిద్ధహస్తులు ప్రైవేట్ సంస్థలను బ్లాక్ మెయిలింగ్ చేయడంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సిద్ధహస్తులని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఎల్అండ్టీ సంస్థను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేయగా ఇప్పుడు కేటీఆర్ విద్యాసంస్థలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణపై రోజుకో మాట చెబుతున్న కాంగ్రెస్‌ను ఏమి అనని టీఆర్ఎస్ నేతలు టీడీపీని టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు భాస్కుల ఈశ్వర్, మార్గం సారంగపాణి, మనోజ్‌గౌడ్ పాల్గొన్నారు.