బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరం | reducing the seats is sad for bc's | Sakshi
Sakshi News home page

బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరం

Published Wed, Apr 9 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

reducing the  seats is sad for bc's

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : బీసీ సామాజికవర్గం నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరమని పీసీసీ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌హాల్ లో మంగళవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ పసునూటి లింగస్వామి, పరకాల ఇన్‌చార్జ్ సాంబారి సమ్మారావు, బీసీ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడా రు.
 
పొన్నాల లక్ష్మయ్య జిల్లా రాజకీయాల్లోకి రాకముందే  దేశ్‌ముఖ్, దొరలు, గడీల పాలనకు వ్యతిరేకంగా బీసీలు పోరాడి ఆనాడే మూడు నుంచి నాలుగు స్థానాలు సాధించుకున్నారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నా ఓడిన దాఖ లాలు లేవని తెలిపారు. 2004లో టీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా బీసీలు మూడు చోట్ల గెలిచారని వివరించారు. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బీసీలకు సీట్లు కేటాయించిందని, ఎవరి ఒత్తిడితో మూడు నుంచి రెండు స్థానాలకు కుదించారో చెప్పాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌పై ఉందని అన్నారు.
 
52 శాతం ఉన్న బీసీలకు 32 సీట్లను కేటాయించడం అన్యాయమన్నారు. రెండేళ్ల వరకు ఎవరో తెలియని అనామకుడికి టికెట్ కేటాయించడం సరైంది కాదని పరకాల అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పొన్నాల లక్ష్మయ్య మనసు మార్చుకుని బీసీలకు మరో స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే బీసీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.  
 
కాంగ్రెస్ పార్టీ పరకాల ఇన్‌చార్జ్ సాంబారి సమ్మారావు మాట్లాడుతూ 2014 ఎన్నికల టికెట్ తనకే అని హామీ ఇచ్చారని.. ఇప్పుడు హామీని మరిచి, 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఏడాది క్రితం వరకు ఎవరికి తెలియని వ్యక్తికి సీటు కేటాయించడం సరికాదని వివరించారు. పరకాల టికెట్ తనకే కేటాయిస్తానని హామీ ఇవ్వలేదని అంటే.. భద్రకాళి గుడిలో తన భార్య, పిల్లలతో ప్రమాణం చేస్తానని, లేదంటే మాటిచ్చిన నాయకులు చేస్తారా అని సవాల్ విసిరారు.
 
పరకాల టికెట్ పొందిన వ్యక్తి తాను కింది నుంచి పై వరకు అందరికి ముడుపులు చెల్లించాలని బాహాటంగా చెబుతున్నాడు.. అది పార్టీకి అపఖ్యాతి తీసుకురాదా అని ప్రశ్నించారు. చైతన్య వంతులైన బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉల్లెంగుల యాదగిరి, నారగోని కుమార్‌గౌడ్, పులి శ్రీనివాస్, ఏదునూరి రాజమొగిలి, పరకాల నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement