Banda Prakash
-
కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!?
ఖమ్మం: వచ్చే ఏప్రిల్‌లో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ముగ్గురూ బీఆర్ఎస్ నేతలే కాగా, వీరిలో జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రతో పాటు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్ ఉన్నారు. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా.. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనున్నాయి. అయితే, గతంలోనే కేసీఆర్ మరోమారు వద్దిరాజుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చినందున ఆయనకే పదవి దక్కుతుందని అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలోనూ రవిచంద్రకే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షిప్రతినిధి, ఖమ్మం ఇరవై నెలలు పదవిలో... బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను కేసీఆర్ రంగంలోకి దించారు. బీఆర్ఎస్కు అప్పుడు ఉన్న సంఖ్యాబలంతో ఆయన మే 2022లో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇరవై నెలల కాలంలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా తనదైన ముద్ర వేయడమే కాక మున్నూరుకాపు సామాజిక వర్గం ముఖ్యనేతగా బీఆర్ఎస్లోకి ఆ సామాజిక వర్గ నేతలను చేర్పించడంలో కీలకపాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ ఆయనకు అప్పగించారు. ఇక పార్లమెంట్లో ఉమ్మడి జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలే కాక విభజన సమస్యలపైనా తన గళం వినిపించారు. హామీ నెరవేర్చాలని.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రతోపాటు మరో ఇద్దరి పదవీకాలం పూర్తి కానుండగా.. ఈసారి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూస్తే ఒక్క స్థానం దక్కనుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కడం ఖాయమనే చెప్పాలి. కాగా, రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి వద్దిరాజుకు అవకాశం దక్కుతుందని కేసీఆర్ గతంలో పలు వేదికలు, సమావేశాల్లో ప్రస్తావించడంతో ఈ హామీ నెరవేర్చాలని ఆయన అనుచరుల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్‌లో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు ఏర్పాటుచేయగా.. వద్దిరాజు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ఆశీర్వదిస్తే ఇదే సభలో అడుగు పెడతానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలంలో చరిత్రలో నిలిచిపోయే ఘటనల్లో భాగస్వామిని కావడానికి అవకాశమచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు! రాజ్యసభకు ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈనెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల స్వీకరణ గడువు 15వరకు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కనుండడంతో రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరుగుతుండగా.. బీఆర్ఎస్ తరఫున మాత్రం వద్దిరాజుకే ఖాయమని ప్రచారం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇవి చదవండి: పురుమల్లకు షోకాజ్ నోటీసు జారీ.. -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాశ్ నామినేషన్
-
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్: నేడు బండా ప్రకాష్ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బండా ప్రకాశ్‌లో శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సీఎం కేసీఆర్.. పార్టీ నాయకులకు సూచించారు. -
‘మండలి’ డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్!
సాక్షి, హైదరాబాద్: సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుండగా, 11వ తేదీన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తదితరాలు పూర్తి చేస్తారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి బాధ్యతలు అప్పగిస్తారు. కాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆయన పేరును బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఈ నెల 11న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు బండా ప్రకాశ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్ 2021 జూన్ 3న ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగకపోవడంతో సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఇదిలా ఉంటే 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్ ఎంపీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేయకుండానే 2021 నవంబర్‌లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు. అనంతరం 2021 డిసెంబర్ మొదటి వారంలో బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్, మరో రెండు విప్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ముగిశాక మండలి చీఫ్ విప్, విప్ పదవుల భర్తీ జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
ఆఖరి నిమిషంలోనే ‘పెద్దల’ పేర్లు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను చేపట్టింది. బండా ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12 నుంచి 19 వరకు కొనసాగనుంది. వచ్చే నెల 21న రాజ్యసభ సభ్యులుగా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ, సామాజికవర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ ఉపఎన్నిక స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని ఈ నెల 17 లేదా 18న, మరో రెండు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ నెల 25న ప్రకటించే అవకాశముంది. అయితే అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా, ఎంపికైనవారికే నేరుగా సమాచారం అందిస్తామని ఆశావహ నేతలకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవలి శాసనమండలి ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల ఎంపికలోనూ గోప్యత పాటించి చివరి నిమిషంలో అభ్యర్థులకు సమాచారం అందించారు. అదే వ్యూహాన్ని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ పాటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్థానాలకు వివిధ రంగాల ప్రముఖులు కూడా టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రతిపాదకుల జాబితాలు సిద్ధం రాజ్యసభ అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కో నామినేషన్ సెట్‌పై తప్పనిసరిగా పదిమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా సంతకాలు చేయాలి. అభ్యర్థుల ఎంపికపై ఓ వైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండగా ప్రతిపాదకుల జాబితాను పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం ద్వారా సిద్ధం చేసి నామినేషన్ సెట్లపై పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో అభ్యర్థి తరఫున కనీసం 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. టీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. రాజ్యసభ ఉపఎన్నిక స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి 2024 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయాలి. కొత్తగా ఎన్నికయ్యే మరో ఇద్దరు సభ్యుల పదవీకాలం 2028 జూన్‌లో ముగుస్తుంది. ఆరేళ్ల పదవీ కాలపరిమితి ఉన్న స్థానాల నుంచే తమను ఎంపిక చేయాలని ఆశావహులు కోరుతున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన ఓ మాజీ ఎంపీ ఇదే వి షయాన్ని కేటీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. -
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్.. మండలికి రాజ్యసభ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనదైన శైలిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆశావహుల జాబితాలో లేని వారిని తెరపైకి తెచ్చి అందరినీ విస్మయానికి గురిచేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వరుసగా రెండో పర్యాయం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటా కింద మంత్రివర్గం సిఫారసు చేసిన పాడి కౌశిక్‌రెడ్డి.. అభ్యర్థిత్వం ఆమోదం పొందక పోవడంతో ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను అనూహ్యంగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సుమారు దశాబ్దంన్నర క్రితం పార్టీలో చేరిన ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావును ఎంపిక చేయడం ద్వారా గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. అలాగే సోమవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్యే కోటాలో అవకాశం చేజిక్కించుకుని నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషం వరకు గోప్యత మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందనగా.. ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల జాబితాపై గోప్యత పాటించారు. చివరకు ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎలాంటి జాబితా విడుదల చేయకుండా నేరుగా అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్ల్లపల్లి రవీందర్రావు అభ్యర్థిత్వం సోమవారమే ఖరారు కాగా, మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి సోమవారం అర్ధరాత్రి వరకు పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులందరూ మంగళవారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకోగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం అభ్యర్థులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయకపోవడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురి కానున్నాయి. ఇతర పార్టీలేవీ బరిలో నిలవలేదు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉండటంతో, బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి, మరొకరు వెలమ (తక్కల్లపల్లి) సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం కాగా, బండా ప్రకాశ్ ముదిరాజ్ బీసీ, కడియం శ్రీహరి ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారు. ఆరు స్థానాలకు గాను రెడ్లు, బీసీలకు రెండు చొప్పున, వెలమ, ఎస్సీ కేటగిరీలో ఒకటి చొప్పున అవకాశం దక్కుతుందని తొలుత అంచనా వేశారు. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆశావహులపై ప్రభావం చూపింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి అవకాశం దక్కుతుందని భావించారు. బీసీ కేటగిరీలో మున్నూరు కాపు కులానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్ కూడా సీటు ఆశించారు. కానీ వీరికి అవకాశం లభించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నా ఎంపిక కాలేదు. అయితే మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను స్థానిక సంస్థల (మెదక్) కోటాలో ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కాంగ్రెస్ నిర్ణయం చివరి వరకు ఎదురుచూపులే! -
‘కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలి’
సాక్షి, హైదరాబాద్: కరెన్సీ నోట్లపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ కేంద్ర ప్రభుతాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి చర్చించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. అంబేడ్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైదర్‌గూడలోని ప్రకాష్ ముదిరాజ్ కార్యాలయంలో జరిగింది. అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, బొల్లిస్వామి, జాతీయ అధికార ప్రతినిధి మబ్బు పరశురాం, నాయకులు రవి, జి.కష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో బీసీ కోటాపై మీ చిత్తశుద్ధి ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై మీ చిత్తశుద్ధి ఏంటని కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నించింది. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ బండ ప్రకాశ్ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారాలను రాష్ట్రాలకు దఖలుపరుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. పొరపాటును సరిదిద్దుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పునరుద్ధరించడం అభినందనీయం. బీసీ జాబితాలో పలు కులాలను చేర్చాలంటూ వివిధ రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఎస్సీ జనాభా పెరిగినప్పుడు.. బీసీ రిజర్వేషన్ తగ్గుతూ వస్తోంది. 50 శాతం పరిమితి కారణంగా బీసీలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. 50 శాతం ఏ డేటా ఆధారంగా నిర్ణయిస్తున్నారు? సుప్రీంకోర్టు ఏ డేటాను అనుసరించి నిర్ణయిస్తోంది? శాస్త్రీయ ప్రాతిపదిక ఏముంది? 1931 నుంచి దేశంలో కులాల జనగణన లేదు. ఓబీసీ జనగణన చేస్తామని 2018లో అప్పటి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. రోడ్‌మ్యాప్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణ లేదు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలి. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు, చివరకు పీహెచ్డీ ప్రవేశాల్లో కూడా రిజర్వేషన్లు సరిగా అమలు కావ డం లేదు. సమానత్వం కోసం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాజకీయంగా కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిని కేంద్రానికి పంపారు. కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లపై మీకున్న చిత్తశుద్ధి ఏంటి? లోక్‌సభలో, రాజ్యసభలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయండి’అని డిమాండ్ చేశారు. క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ‘న్యాయ వ్యవస్థ వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇస్తోంది. వెనకబడిన తరగతుల విషయానికి వచ్చేసరికి వారు పరిమితి గురించి ఆలోచిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విషయంలో వారు ఎందుకు పరిమితి ఆలోచించరు? కేంద్రం స్వయంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ 50 శాతం పరిమితిని ఉల్లంఘించింది. సుప్రీంకోర్టు ఎం దుకు మౌనంగా ఉంది? మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం బీసీల విషయంలోనే క్రీమీలేయర్ గురిం చి ఆలోచిస్తారు. ఇతర విషయాల్లో ఎందుకు ఇలా చేయరు? ఈ క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? రాజ్యాంగంలో ఉందా? మైనా రిటీలు, మహిళలు, ఎస్సీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఉండదు? బీసీల అభ్యున్నతి లేనప్పుడు దేశాభివృద్ధి కూడా సాధ్యం కాదు’అని బండ ప్రకాశ్ చెప్పారు. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాంరాం!
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా.. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలని సూచించారు. బుధవారం రాజ్యసభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు అందించామని రైల్వే శాఖ మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దని రైల్వే మంత్రి పేర్కొన్నారు. కోచ్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు. భారీగా పెరిగిన ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే శాఖలో నాణ్యమైన ఎల్‌హెచ్‌పీ కోచ్‌ల సంఖ్య 2,500 కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 25 వేలకు చేర్చామని చెప్పారు. 2018లో తమ ప్రభుత్వం ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని పూర్తిగా నిలిపేసిందని పేర్కొన్నారు. 2014 వరకు రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క కోచ్‌ను కూడా తయారు చేయలేదని, 2018లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్ ఫ్యాక్టరీ పర్యటన తర్వాత కోచ్‌లు రెట్టింపు స్థాయిలో సిద్ధమవుతున్నాయని తెలిపారు. -
‘మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. మేడారాన్ని అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. సంప్రదాయ బద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ముదిరాజ్ కేంద్రాన్ని కోరారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించనున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు ఇదని తెలిపారు. గతంలో వెనుకబాటుతనం అనేది సామాజిక అంశాల్లో విన్నామని తొలిసారి ఆర్థికపరమైన వెనుకబాటుతనం అంశాన్ని వింటున్నామని చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో కూడా ఆర్థికంగా వెనుకబాటుతనం ఉందని ఈ బిల్లు తెచ్చామంటే అన్నేళ్ల పాటు ఈ దేశాన్ని పాలించిన పాలకుల వైఫల్యమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే ప్రాతిపదికగా ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానించి కేంద్రానికి పంపి తే కేంద్రం సానుకూలంగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ముస్లింల జనాభా 12 శాతంగా, ఎస్టీల జనాభా 10 శాతంగా ఉందని, జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి పార్లమెంటును స్తంభింపజేసినా కేంద్రం స్పందించలేదన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు తెలంగాణలో స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని ముదిరాజ్ తెలిపారు. ఈబీసీ రిజర్వేషన్ల అమలులో సామాజిక రిజర్వేషన్లకు అన్యాయం జరగకుండా జాగ్రత్త పడాలని కోరారు. -
పాలమూరును పరుగులెత్తిస్తాం
కొత్తూరు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరుగులెత్తించే దిశగా సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించినట్లు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్ తెలిపారు. కొత్తూరు మండలంలోని జేపీ దర్గాలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రార్థనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోనే రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమనేతగా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ఇబ్బందులు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసమే వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఎత్తిపోతలపై ప్రత్యేక దృష్టి సీఎం కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు, నిధుల వ్యయం విషయంలో ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నట్లు వివరించారు. పవిత్రమైన జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి తమ వంతు కృషి చేయనున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దర్గా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వక్ఫ్‌బోర్డు అధికారులు దర్గా అభివృద్ధికి సంబంధించిన నివేదికలను, మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. తుది మ్యాప్ అనంతరం సీఎం సూచన ప్రకారం దర్గాలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. -
ఉద్యమ నాయకుడు : బండా ప్రకాష్
సాక్షి ప్రతినిధి, వరంగల్ :జిల్లా ప్రజలకు సూపరిచితులైన సామాజిక వేత్త, విద్యావేత్తగా పేరొంది న బండా ప్రకాష్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 1969 ఉద్యమం నుంచి ప్రజా జీవితంలో మమేకమయ్యారు. చదువు వద్దంటూ అజ్ఞాతంలోకి వెళ్లారు... తిరిగి వచ్చి డాక్టర్ పట్టా పొందారు. అజ్ఞాతాన్ని వీడినా.. సామాజిక సృహ కోల్పోలేదు. సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ఇటీవల రాజ్య సభకు ఎన్నికయ్యారు. తన జీవన ప్ర స్థానంలో ముఖ్య అంశాలను ‘సాక్షి’తో ఆయన పంచుకున్నారు. బండా ప్రకాష్ ఆమంటున్నారో ఆయన మాటల్లోనే.. ఉద్యమ నేపథ్యం 1969లో పదో తరగతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 1970లో జరిగిన ఎన్నికల్లో ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారంలో ఉదృతంగా పాల్గొన్నాను. సీకేఎం కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడినయ్యాను. ఆర్ఎస్యూ వ్యవస్థాపకుడిలో ఒకడిగా ఉన్నాను. అప్పుడు ఉస్మానియాలో విద్యార్థి నాయకుడుజార్జిరెడ్డి హత్యకు నిరసనగా వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించాను. ఆ రోజుల్లో హైకోర్టు జడ్జిగా ఉన్న వ్య క్తిని ఉస్మానియా వర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలు బహిష్కరించాం. ఓ ర కంగా డిగ్రీ చదివే రోజుల్లో సీకేఎం కాలేజీని ఉద్యమా ల అడ్డాగా మార్చేశాం. అప్పటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు సీకేఎం కాలేజీకి వస్తున్నారని తెలుసుకుని వరవరరావును జైలు నుంచి విడుదల చేయాలంటూ హోరెత్తించాం. దీంతో మమ్మల్ని కాలేజీలో నిర్బంధించారు. చుట్టూ పోలీసులు ఉన్నా రు. వీళ్లందరినీ ఛేదించుకుంటూ కాలేజీ గేటు దగ్గరికి వచ్చి సబ్‌జైలు–దేశాయిపేట అని రాసి నిరసన తెలి పాం. సుమారు మూడు సార్లు కాలేజీ నుంచి తొలగి స్తే.. కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. ఈ ఉద్యమాలు చేస్తూనే డిగ్రీ మధ్యలో వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లాను. కొండపల్లితో అనుబంధం అజ్ఞాతంలో ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్యతో ఎనిమిది నెలలు కలిసి పని చేశాను. హైదరాబాద్‌లో పార్సిగుట్ట, రాంనగర్ ఏరియాల్లో ఒకే ప్రాంతంలో కలిసి ఉన్నాం. ఆ సమయంలో కొండపల్లి చెప్పే పొలిటికల్ క్లాసులు శ్రద్ధగా వినేవాన్ని. సీతారామయ్యకు సమాచారం చేరేవేసే పని ఎక్కువగా నేనే చేసేవాడిని. 1977లో నాగ్‌పూర్‌లో జరిగిన ప్లీనరీకి వెళ్లాను. ఆ ప్లీనరీకి గణపతి, మల్లావఝల కోటేశ్వరరావు వచ్చారు. తర్వాత కాలంలో వాళ్లు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. వామపక్ష సాహిత్యంలో కృష్టా జిల్లాలో జరుగుతున్న సంస్కరణ పోరాటాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి తగిన ప్రా«ధాన్యం ఇవ్వకపోవడాన్ని ఆ ప్లీనరీలో నిరసించాను. ఎమర్జెన్సీ తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాను. మేనమామ మాటలతో.. ‘గొప్పగొప్ప వాళ్లు జైలులో ఉంటూ చదువుకున్నారు. గొప్ప పుస్తకాలు రాశారు. నువ్వు కూడా ప్రపంచ చరిత్ర ను అధ్యయనం చేయి. చదువు ఆపొద్దు’ అంటూ మేనమామ చెప్పిన మాటలు నాపై గొప్ప ప్రభావం చూ పించాయి. దీంతో ఆజ్ఞాతం నుంచి బయటకు రాగానే తిరిగి డిగ్రీలో జాయిన్ అయ్యాను. మావో సేటూంగ్ను పూర్తిగా అధ్యయనం చేశాను. ప్రపంచ చరిత్ర చదివా ను. విప్లవ సాహిత్యం విరివిగా చదివాను. కమ్యునిస్టు మెనిఫెస్టో, దాస్ కాపిటల్, అమ్మ, ఏడుతరాలు వంటి పుస్తకాలు చదివాను. ఇదే స్ఫూర్తితో ఎంఏలో గోల్డ్‌మెడల్ సాధించాను. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. గ్రామీణాభివృద్ధిపై పీహెచ్‌డీని పూర్తి చేశాను. రాజకీయాల్లోకి.. 1981లో ఏంఏ థర్డ్ సెమిస్టర్లో ఉండగా నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాజుల జనార్దన్‌పై ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిచాను. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న రెండు గ్రూపుల కారణంగా నాతో పాటు గెలిచిన 16 మంది ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్‌లో చేరి వైస్ చైర్మన్ పదవి చేపట్టాను. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను ఆధారాలతో పట్టించి మూడేళ్లు బ్లాక్‌లిస్టులో పెట్టాను. ఆ తర్వాత కేయూ, ‘కుడా’ పాలకమండలి సభ్యుడిగా పని చేశాను. 1996 నుంచి 2001 వరకు జయశంకర్ సార్‌తో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టాను. సామాజిక దృక్పథం.. అజ్ఞాతంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టింది, చేతికి డబ్బులు ఇచ్చింది సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలే. అందువల్లే ఎక్కడ ఉన్నా సామాజిక సృహతోనే పని చేశాను. కార్మిక నాయకుడిగా ఆజాంజాహి మిల్లు పరిరక్షణ కోసం ప్రయత్నించాను. కాంగ్రెస్‌లో ఉంటూనే ముదిరాజ్ మహాస భ పేరుతో ముదిరాజ్‌లను సమీకరించి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యేలా శ్ర మించాను. సకల జనుల సమ్మె,లో కీలక పాత్ర పోషించాం. తెలంగాణ వచ్చాక అభివృద్ధిలో ముదిరా జ్ల వాటా కోసం ప్రయత్నించాం. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. -
బండా ప్రకాష్ @ఎంపీ
హన్మకొండ : సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ నేత బండా ప్రకాష్ రాజస్యభకు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 33 ఓట్లు పొంది సునాయాసంగా విజయం సాధించారు. బండా ప్రకాశ్ విజయంతో జిల్లా నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇందులో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గరికపాటి మోహన్‌రావు, బండా ప్రకాష్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పసునూరి దయాకర్ (వరంగల్), ఆజ్మీరా సీతారాం (మహబూబాబాద్) లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో కమిటీ హాల్ నంబర్ 1లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 117 మంది ఓటర్లు ఉండగా.. 108 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో బండా ప్రకాశ్‌కు 33 ఓట్లు పోలయ్యాయి. రాజ్యసభకు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో బండా ప్రకాశ్‌కు అత్యధిక ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు 10 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఓటుపై టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు దొంతి ఓటు చెల్లదని ప్రకటించారు. బండా ప్రకాశ్ రాజ్యసభకు ఎన్నికవడంతో జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముదిరాజ్‌ల హర్షం సుదీర్ఘ కాలంగా ముదిరాజ్‌ల హక్కుల కోసం పోరాడుతున్న ముదిరాజ్ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్‌కు రాజ్యసభలో సభ్యత్వం అవకాశం రావడంతో ఆ కులస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మేయర్ అభినందనలు వరంగల్ అర్బన్ : రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాష్, లింగయ్య యాదవ్‌ను గ్రేటర్ వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కలిశారు. పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందనలు తెలిపారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటా.. రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధికంగా జనాభా ఉన్న ముదిరాజ్ కులస్తుల ప్రతినిధిగా గుర్తించి రాజ్యసభలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని బండా ప్రకాష్ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. – బండా ప్రకాష్ -
‘పెద్దల’ బరిలో మనోళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పెద్దల సభకు జరగనున్న పోరులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున ఇద్దరు నేతలు పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి బండా ప్రకాష్, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పోటీలో నిలిచారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థి బండా ప్రకాష్ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే ఓటింగ్‌ను బట్టి సాంకేతిక అంశాలు లేవనెత్తి అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసనసభ్యుల కోటాలో తెలంగాణ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్ జారీ కాగా.. 23న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు స్థానాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని అంతా భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ పోటీకి రావడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. టీఆర్ఎస్ నుంచి బండా ప్రకాష్ వరంగల్ జిల్లా నుంచి రాజ్యసభ ఆశావహులు ఎక్కువ మంది ఉన్నా.. అనూహ్యంగా విద్యాధికుడు, సామాజికవేత్తగా గుర్తింపు పొంది రాజకీయాల్లో రాణిస్తున్న డాక్టర్ బండా ప్రకాష్ పేరును రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన చిన్నప్పటి నుంచే చదువుతోపాటు రాజకీయాల్లో ఆసక్తి చూపారు. 1981 నుంచి 1986 వరకు వరంగల్ మునిసిపాలిటీ కౌన్సిలర్, వైస్ చైర్మన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ మెంబర్‌గా వివిధ పదవుల్లో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయంగా చెప్పుకోతగ్గ పదవులు చేపట్టలేదు. సామాజిక కార్యక్రమాల్లో క్రీయాశీలంగా వ్యవహరించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అ«ధ్యక్షుడి ఉన్నారు. తాజాగా రాజ్యసభకు వెళ్లేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ప్రస్తుతం శాసన సభలో టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఈ గెలుపు లాంఛనప్రాయం. ‘బల’ ప్రయోగం రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తొలుత అంటీముట్టనట్లుగా వ్యవహరించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. అధికార పార్టీ అభ్యర్థులను ఇరుకున పెట్టేందుకు రాజ్యసభ బరిలో ఉండాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల బరిలో జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ చేత నామినేషన్ దాఖలు చేయించింది. ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పు, ఉప్పు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ పేర్కొంటున్న ఎమ్మెల్యే సంఖ్యలో ఉన్న ‘ఫిరాయింపుల’ను చర్చకు తెచ్చి మైలేజ్ పొందే వ్యూహంలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ ఒకటి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలోకి దిగారు. ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణ శాసనసభలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం మూడు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశముంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ తమ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి విప్ జారీ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను చిక్కుల్లో పడేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇంకా ప్రకటించలేదు. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న మజ్లిస్.. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని తెలిపింది. -
జాతీయస్థాయి జూడో పోటీల అబ్జర్వర్‌గా ప్రకాష్
వరంగల్ స్పోర్ట్స్ : జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో బుధవారం నుంచి ఈనెల 11 వరకు కేరళలోని కొచ్చి రాజీవ్‌గాంధీ ఇండోర్‌స్టేడియం లో జరుగనున్న 17వ ఏషియన్ జూనియర్ జూడో చాంపియన్ పోటీలకు అబ్జర్వర్‌గా జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ వెళ్లనున్నా రు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముఖేష్‌కుమార్, మన్మోహన్ జైస్వాల్ ఆహ్వానాన్ని పంపిం చినట్లు బండా ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏషియన్ దేశాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొనే పోటీలకు అబ్జర్వర్ గా తెలంగాణ నుంచి తన కు ఆహ్వానం అందడం సం తోషంగా ఉందన్నారు. -
బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరం
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : బీసీ సామాజికవర్గం నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరమని పీసీసీ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌హాల్ లో మంగళవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ పసునూటి లింగస్వామి, పరకాల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు, బీసీ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడా రు. పొన్నాల లక్ష్మయ్య జిల్లా రాజకీయాల్లోకి రాకముందే దేశ్‌ముఖ్, దొరలు, గడీల పాలనకు వ్యతిరేకంగా బీసీలు పోరాడి ఆనాడే మూడు నుంచి నాలుగు స్థానాలు సాధించుకున్నారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నా ఓడిన దాఖ లాలు లేవని తెలిపారు. 2004లో టీఆర్ఎస్ పొత్తులో భాగంగా బీసీలు మూడు చోట్ల గెలిచారని వివరించారు. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బీసీలకు సీట్లు కేటాయించిందని, ఎవరి ఒత్తిడితో మూడు నుంచి రెండు స్థానాలకు కుదించారో చెప్పాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌పై ఉందని అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు 32 సీట్లను కేటాయించడం అన్యాయమన్నారు. రెండేళ్ల వరకు ఎవరో తెలియని అనామకుడికి టికెట్ కేటాయించడం సరైంది కాదని పరకాల అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పొన్నాల లక్ష్మయ్య మనసు మార్చుకుని బీసీలకు మరో స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే బీసీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పరకాల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు మాట్లాడుతూ 2014 ఎన్నికల టికెట్ తనకే అని హామీ ఇచ్చారని.. ఇప్పుడు హామీని మరిచి, 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఏడాది క్రితం వరకు ఎవరికి తెలియని వ్యక్తికి సీటు కేటాయించడం సరికాదని వివరించారు. పరకాల టికెట్ తనకే కేటాయిస్తానని హామీ ఇవ్వలేదని అంటే.. భద్రకాళి గుడిలో తన భార్య, పిల్లలతో ప్రమాణం చేస్తానని, లేదంటే మాటిచ్చిన నాయకులు చేస్తారా అని సవాల్ విసిరారు. పరకాల టికెట్ పొందిన వ్యక్తి తాను కింది నుంచి పై వరకు అందరికి ముడుపులు చెల్లించాలని బాహాటంగా చెబుతున్నాడు.. అది పార్టీకి అపఖ్యాతి తీసుకురాదా అని ప్రశ్నించారు. చైతన్య వంతులైన బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉల్లెంగుల యాదగిరి, నారగోని కుమార్‌గౌడ్, పులి శ్రీనివాస్, ఏదునూరి రాజమొగిలి, పరకాల నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.