హన్మకొండ : సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్‌ఎస్ నేత బండా ప్రకాష్ రాజస్యభకు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 33 ఓట్లు పొంది సునాయాసంగా విజయం సాధించారు. బండా ప్రకాశ్ విజయంతో జిల్లా నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇందులో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గరికపాటి మోహన్‌రావు, బండా ప్రకాష్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పసునూరి దయాకర్ (వరంగల్), ఆజ్మీరా సీతారాం (మహబూబాబాద్) లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శాసనసభలో కమిటీ హాల్ నంబర్ 1లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 117 మంది ఓటర్లు ఉండగా.. 108 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో బండా ప్రకాశ్‌కు 33 ఓట్లు పోలయ్యాయి. రాజ్యసభకు టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో బండా ప్రకాశ్‌కు అత్యధిక ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు 10 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఓటుపై టీఆర్‌ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు దొంతి ఓటు చెల్లదని ప్రకటించారు. బండా ప్రకాశ్ రాజ్యసభకు ఎన్నికవడంతో జిల్లాలో టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ముదిరాజ్‌ల హర్షం
సుదీర్ఘ కాలంగా ముదిరాజ్‌ల హక్కుల కోసం పోరాడుతున్న ముదిరాజ్ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్‌కు రాజ్యసభలో సభ్యత్వం అవకాశం రావడంతో ఆ కులస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
మేయర్ అభినందనలు
వరంగల్ అర్బన్ : రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాష్, లింగయ్య యాదవ్‌ను గ్రేటర్ వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కలిశారు. పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందనలు తెలిపారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధికంగా జనాభా ఉన్న ముదిరాజ్ కులస్తుల ప్రతినిధిగా గుర్తించి రాజ్యసభలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని బండా ప్రకాష్ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. – బండా ప్రకాష్
Comments
Please login to add a commentAdd a comment