సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగియలేదని, అసలు యాత్ర ఇప్పుడే మొదలైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్నలకు నమస్కరిస్తూ ప్రసంగం ప్రారంభించారు.
వివరాలు జేపీ నడ్డా మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా విఫలమయ్యారు. బండి సంజయ్ రూపంలో కరీంనగర్ నియోజకవర్గం ప్రజ లకు సమర్థుడైన నాయకుడు దొరికాడు. సంజయ్ నేతృత్వంలో ఐదు విడతల్లో చేపట్టిన పాదయాత్ర 56 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,403 కిలోమీటర్ల పాటు సాగింది. వాస్తవానికి ఇది ముగింపు కాదు. ఇదే ఉత్సాహంతో కేసీఆర్ పాలనా వైఫల్యాలను ‘సాలు దొర.. సెలవు దొర’ అన్న నినాదంతో ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రజల్లో భరోసా కలి్పంచే బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలదే.
కేసీఆర్ సర్కారుది దమననీతి
రెండు, మూడో విడతల యాత్ర సమయంలోను, ఇప్పుడు కూడా నా పర్యటనను సైతం కేసీఆర్ సర్కారు ఆపే ప్రయత్నం చేసింది. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో అని కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలాంటి దమననీతిని ప్రజలు చెత్తకుప్పలో వేస్తారని గుర్తించాలి. దేశంలో మోదీ నేతృత్వంలోని సర్కారు బీసీలు, దళితులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల వారికి అండగా నిలుస్తోంది. కానీ కేసీఆర్ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలతో పాలన చేస్తున్నారు. ఇలాంటి సర్కారుకు కొనసాగే హక్కు లేదు. వారికి విశ్రాంతి ఇచ్చి.. మాకు అధికారం ఇవ్వాల్సిన సమయం వచి్చంది. మేం సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్ అన్న నినాదంతో సాగుతున్నాం. ఏ రోజైనా ఆదివాసీ మహిళ, దళితుడు రాష్ట్రపతి అవుతారని అనుకున్నారా? ఎప్పుడైనా 8 మంది ఆదివాసీలు, 30 మంది బలహీనవర్గాలవారు కేబినెట్ మంత్రులు అవుతారని ఊహించారా? వీటన్నింటినీ నరేంద్ర మోదీ సుసాధ్యం చేశారు. సెపె్టంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని నిర్వహించారు. మేం అధికారంలోకి వస్తే మరింత గొప్పగా వేడుకలు చేస్తాం.
తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు
కేంద్రం తెలంగాణ అభివృద్ధి కోసం రూ.1.04 లక్షల కోట్ల వ్యయంతో 4,996 కిలోమీటర్ల పొడవైన హైవేలు నిర్మించింది. అంతేకాకుండా నాలుగు వరుసల ఫ్‌లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లకు సహకరించాం. జల్ జీవన్ మిషన్‌కు భారీగా నిధులిచ్చాం. కేసీఆర్ చెప్పినట్టుగా 8 ఏళ్ల కింద తెలంగాణ ధనిక రాష్ట్రమే.. కానీ దాన్ని రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను నడిపిస్తానన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్నారు. కానీ కుటుంబ, రాచరిక పాలన చేస్తున్నారు. పెద్ద స్థాయిలో సీఎం, కిందిస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు ద్రోహం చేశారు. భూములను లూటీ చేసేందుకు ధరణి పోర్టల్‌ను ఆయుధంగా మలుచుకున్నారు. ఇలాంటి నాయకులను కొనసాగనీయాలా?
బీజేపీతో చేతులు కలపండి..
సీఎం కేసీఆర్‌కు ఫాంహౌస్ కట్టుకునే సమయం ఉంది. కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చే తీరిక లేదా? రైతుల రుణమాఫీ ఏమైంది? దళితులకు మూడెకరాలు, యువతకు నిరుద్యోగ భృతి ఇప్పటికీ అమలు కాలేదు. కేజీ టు పీజీ పథకం ఏమైందో అందరికీ తెలుసు. కేంద్రం ప్రవేశపెట్టిన వెల్‌నెస్ సెంటర్ల పేర్లు మార్చి బస్తీ దవాఖానాలుగా ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ అవినీతి పాలన, దమనకాండ దూరం కావాలనుకునే వారంతా బీజేపీతో చేతులు కలపండి. తెలంగాణలో అవినీతి వ్యతిరేక ప్రభుత్వంపై పోరాడండి’’ అని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.
ఫుల్ జోష్ ఉంది.. కీపిటప్
బండి సంజయ్‌ను అభినందించిన జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇక్కడి ప్రజల్లో ఫుల్ జోష్ ఉంది. బండి సంజయ్ కీపిటప్. పాదయాత్ర కంటిన్యూ చెయ్యండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. గురువారం కరీంనగర్ సభలో ప్రసంగించిన నడ్డా అనంతరం స్టేజ్ దిగుతూ సంజయ్ భుజం తట్టి ప్రశంసించారు. సభ ఆలస్యంగా జరిగి చీకటిపడటంతో జేపీ నడ్డా హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment