యువతకు కోటి ఉద్యోగాలు.. కోటి మంది లఖ్‌పతి దీదీలు
పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు గ్యారంటీ
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల సాయం
‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన ఎన్డీయే
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌కు వారం రోజుల ముందు అధికార ఎన్డీయే రాష్ట్ర ప్రజలకు ‘కోటి’ వరాలు ప్రకటించింది. సంకల్ప పత్రం పేరిట తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. వలసలకు పేరుగాంచిన బిహార్‌లో యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచి్చంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేసింది.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తామని వెల్లడించింది. ఉచిత రేషన్, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తామంటూ హామీలు గుప్పించింది.
యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకొనేలా వరాల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజధాని పటా్నలో సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ జనశక్తి(రామ్‌విలాస్) పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, జేడీ(యూ)తోపాటు కూటమి నేతలు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
→ బిహార్ యువతకు కోటి ప్రభుత్వ ఉద్యో గాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.
→ కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య
→ ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందేలా కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దడం.
→ మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం.
→ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈబీసీ) రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు.
→ కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్(కేటీకేఎస్) నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9 వేల చొప్పున పెట్టుబడి సాయం. ఈ మొత్తం ఏటా మూడు విడతల్లో చెల్లింపు.
→ బిహార్‌లో 7ఎక్స్‌ప్రెస్ రహదారుల నిర్మాణం, 4 నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు.
→ ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక పార్కుల స్థాపన.
→ పేదలకు 50 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం
→ రూ.5,000 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
→ 100 ఎంఎస్‌ఎంఈ పార్కులు, 50 వేలకుపైగా కాటేజీ పరిశ్రమలు
→ ప్రతి డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు
→ ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున సాయం
→ అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు గ్యారంటీ


