సీఎం కేసీఆర్‌తో జోగినపల్లి సంతోష్ కుమార్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్‌ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో పాటు రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్), సీఎం రమేశ్ (టీడీపీ) రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏప్రిల్‌తో ముగుస్తోంది. వీరి స్థానంలో కొత్తగా ముగ్గురు తెలంగాణ నుంచి ఎన్నికవాల్సి ఉంది. ఒక్క ఎంపీని గెలిపించుకునేంత సంఖ్యా బలం కూడా మిగతా ఏ పార్టీకీ లేనందున మూడు స్థానాలనూ టీఆర్‌ఎస్సే ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. వీటిలో ఒకటి టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు దాదాపుగా ఖరారైనట్టేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దశాబ్దన్నర కాలంగా కేసీఆర్ వెన్నంటి ఉండటంతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన సంతోష్‌కు బెర్తు ఖాయమని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. కేసీఆర్ ఖమ్మంలో నిరాహార దీక్ష చేసిన సందర్భంలోనూ, నిజాం వైద్య విజ్ణాన సంస్థ (నిమ్స్)లో ఆమరణ దీక్ష చేసినప్పుడు సంతోష్ ఆయనతో పాటే ఉన్నారు. పార్టీలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య సమన్వయం సాధించడంలో సంతోష్ సమర్థంగా వ్యవహరించారన్న పేరుంది.
దీనికి తోడు ఆయన్ను రాజ్యసభకు పంపాలంటూ పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా కొంతకాలంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సంతోష్ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్ అధినేత ఆమోదం తెలిపే అవకాశముందని పార్టీ అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఇక, మరో రాజ్యసభ సీటు ఇటీవల సీఎం ప్రకటించిన మేరకు యాదవ సామాజికవర్గానికి దక్కనుంది. ఈ కోటాలో మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్‌తో పాటు టీఆర్‌ఎస్ నేత రాజయ్య యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నోములకే అవకాశాలు ఎక్కువని పార్టీ వర్గాలంటున్నాయి. మిగతా సీటును ఎస్సీ లేదా మైనారిటీ వర్గాలకు కేటాయించవచ్చని తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయ సలహాదారు షేరి సుభాష్‌రెడ్డి పేరూ ప్రచారంలో ఉంది. ఆయనను రాజ్యసభకు గానీ, మండలికి గానీ పంపే ఆలోచన ఉందని చెబుతున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని బీసీ కోటాలో డి.శ్రీనివాస్‌కు, మరోటి బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు టీఆర్‌ఎస్ కేటాయించడం తెలిసిందే. ఈసారి రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పించాల్సి వస్తే సుభాష్‌రెడ్డికి దక్కవచ్చని టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment