ఢిల్లీ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం పుట్టి, రాష్ట్రంలో అధికారం చేపట్టి తన ప్రస్థానాన్ని ఘనంగా చాటుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి తన మరో ప్రస్థానాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యింది. జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసేందుకు, సత్తాను చాటేందుకు, గళం వినిపించేందుకు వీలుగా బుధవారం హస్తినలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆరంభించనుంది. సర్దార్ పటేల్ మార్గ్‌లోని ఈ తాత్కాలిక కార్యాలయాన్ని మధ్యాహ్నం 12.37 గంటల నుంచి 12.47 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు.
పూజా కార్యక్రమాలు మొదలు
బీఆర్‌ఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 9.15 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజలతో ఇవి మొదలవ్వగా పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. శృంగేరీ నుంచి వచ్చిన రుత్వికుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగగా, బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాజశ్యామల యాగం, నవ చండీయాగం ప్రారంభం కానున్నాయి.
మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ యాగ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. యాగం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించిన తర్వాత కార్యాలయ ఆవరణలో బీఆర్‌ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత 12:37–12:47 గంటల మధ్య పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
హాజరు కానున్న జాతీయ నేతలు..
బీఆర్‌ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను పార్టీ ఆహ్వానించింది. జేడీయూ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలను ఆహ్వానించినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలను ఆహ్వానించామని చెప్పారు.
మరోవైపు రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు భారీగా ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు నేతలు బుధవారం ఉదయానికి ఢిల్లీ చేరుకుంటారని, మొత్తంగా 400 నుంచి 500 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జాతీయ విధానం వెల్లడి!
కార్యాలయం ప్రారంభించిన తర్వాత.. పార్టీ జాతీయ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. నదీ జలాలు, సరిహద్దు వివాదాలు, ఆర్ధిక రంగ పురోభివృధ్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, విద్యుత్ సంస్కరణలు, విదేశాంగ విధానం, జాతీయ సంస్థల తీరు, సమాఖ్య స్ఫూర్తి, జాతీయ స్థాయిలో పొత్తులు వంటి అంశాలపై కేసీఆర్ తమ విధానాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు.
కేసీఆర్ మీడియా భేటీకి సంబంధించిన గదిని మంగళవారం రాత్రికే సిద్ధం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ, వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలకు సంబంధించి సైతం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శాశ్వత కార్యాలయం పనుల పరిశీలన
సోమవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి మంగళవారం మధ్యాహ్నం వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అన్ని అంతస్తులను కలియతిరిగిన ఆయన ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ మార్గ్‌లోని తాత్కాలిక కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఆఫీసును పరిశీలించి పలు సూచనలు చేశారు.
పూజలు జరుగుతున్న ప్రదేశంతో పాటు, యాగాలు జరిగే ప్రాంతాన్ని కేసీఆర్ సందర్శించారు. ఆయన వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాగా బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పటేల్ మార్గ్‌లో పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్‌ఎండీసీ అధికారులు తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment