సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలన్న విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎన్ భర్ నుంచి గురువారం లేఖ అందింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న పార్టీలో తీర్మానించి, కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పేరు మార్పిడికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ కార్యక్రమం
టీఆర్‌ఎస్ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)’గా మార్చేందుకు ఈసీ అంగీకరించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన అధికారిక లేఖపై ఈ ముహూర్తంలోనే సంతకం చేసి పంపిస్తారు. దీనితోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరిట అధికారిక కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు.
తెలంగాణ భవన్ ఆవరణలో బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలందరూ శుక్రవారం మధ్యాహ్నంలోగా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
లాంఛన ప్రక్రియలు పూర్తిచేసి
జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు వీలుగా ఈ ఏడాది అక్టోబర్ 5న టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ పార్టీ జనరల్ బాడీ సమావేశం తీర్మానించింది. అక్టోబర్ 6న ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. ఆ తీర్మానాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నవంబర్ 7న పబ్లిక్ నోటీసు జారీ చేశారు.
టీఆర్‌ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నందున కొత్త పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అందులో కోరారు. అభ్యంతరాలను తగిన కారణాలతో 30రోజుల్లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి (రాజకీయ పార్టీలు)కి అందజేయాలని సూచించారు.
ఈ గడువు గురువారం ముగిసింది. అభ్యంతరాలు వ్యక్తంకాకపోవడంతో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్పునకు అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాసింది. దీంతో రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరిట రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment