త్వరలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే యోచన
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతున్న ఒత్తిడి
తెలంగాణతో పేగుబంధం తెగిపోతుందనే భావన
సరైన కారణాలు చూపితే ‘టీఆర్‌ఎస్’కు మార్గం సుగమం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది.
పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్‌ఎస్‌గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్‌ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది.
‘టీఆర్‌ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్
‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్‌ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్‌ఎస్‌గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది.
ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు.
జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్‌ఎస్’..
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్‌ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్‌మార్టమ్‌లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment