కేసీఆర్‌తో భేటీ అయిన పోచారం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జనవరి 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశమున్నా ప్రజల తీర్పును గౌరవిస్తూ హుందాగా తప్పుకున్నాం. ప్రజల తీర్పును గౌరవిస్తూ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. రాష్ట్ర రాజకీయాలు, పాలనలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’అంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు.
త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం
‘త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందాం. ఎన్నికల క్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజం. నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. అందువల్ల నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. త్వరలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని కూడా ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుందాం..’అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లకుపైగా సుస్థిర పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో చెరగని ముద్ర వేసుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టడమేగాకుండా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించి గొప్ప పరివర్తన తీసుకురాగలిగామన్నారు. బీఆర్‌ఎస్ అంటే ఒక భరోసా అనే విశ్వాసాన్ని కలిగించామని చెప్పారు. మెజారిటీ ఎంత వచ్చింది? ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఏ తరహా పోటీని ఎదుర్కొన్నారు? లాంటి కొన్ని సాధారణ అంశాలను కూడా కేసీఆర్ ఆరా తీశారని ఆయనను కలిసిన నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఆయన కుశల ప్రశ్నలు సైతం వేసినట్లు చెప్పారు.
హరీశ్, తదితరుల భేటీ
ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేటీఆర్ ఫామ్‌హౌస్ భేటీకి వెళ్లలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు కూడా కేసీఆర్‌ను కలిశారు. గజ్వేల్ ఎన్నికలో కేసీఆర్ ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ‘ఎన్నిక ధ్రువీకరణ సర్టిఫికెట్’ను అందజేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై కోలుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య స్థితిపై కేసీఆర్ వాకబు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ప్రగతిభవన్ నుంచి ఫామ్‌హౌస్‌కు..
కేసీఆర్ దంపతులు ఆదివారం రాత్రి ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఒకటి రెండు రోజుల్లో బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి మారనున్నారు. వ్యక్తిగత సామానును తరలించే పని జరుగుతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ జనవాడలోని ఫామ్‌హౌస్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment