తెలంగాణ ఏర్పడిన తరువాత శాసనసభకు జరిగిన మూడో ఎన్ని కలు బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యేకమైనవి. ఈ ఎన్ని కలలో ప్రజలు ఆయన ధోరణిని ఓడించారనడం సబబు. రంగం నుంచి బీజేపీ తప్పుకొన్న విషయం ఎన్నికల సంరంభానికి ముందే వెల్లడైంది. మునుగోడు ఉప ఎన్నిక వరకూ అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీదే అన్నంత ధీమా ఉందన్నది నిజం. ఈ ఎన్నికలు ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్‌ను తొలిసారి అధికారంలో నిలబెట్టాయి. బీజేపీ కూడా స్వయంకృత అప రాధాలకు అతీతం కాదన్న విషయాన్ని రుజువు చేశాయి. కానీ కేసీఆర్‌కు మాత్రం ఈ ఎన్నికలు గొప్ప గుణపాఠాలు. నిజానికి ప్రజాస్వామ్యానికి దూరంగా జరిగే నేతలకు మిగిలే అంతిమ అనుభవం ఇదేనని చాలా గొప్పగా చెప్పాయి.
‘నిధులు, నీళ్లు, నియామకాలు’ అన్న నినాదం ఉద్య మానికి ఊపిరి ఇచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముమ్మాటికీ ఆత్మగౌరవం అనే నినాదం మీద నిర్మితమైందని మరచిపోలేం. అయితే కేసీఆర్ ఈ రకమైన సెంటిమెంట్‌ను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గౌరవించిన తీరు ముందు నుంచి ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఆయన మొదటి మంత్రిమండలి మహిళా ప్రాధాన్యం లేకుండానే చిరకాలం నడిచింది. కేసీఆర్ ఉద్యమ నేత స్థాయి నుంచి సీఎం పదవికి వెళ్లిన వ్యక్తేనా అనిపించేలా చేయడానికి ఇది చాలు.
అప్పటి నుంచి 2023 ఎన్నికలలో ఆయన పార్టీ ఓటమి వరకూ జరిగిన కొన్ని పరిణామాలు కేసీఆర్ వ్యక్తిత్వం గురించి ప్రశ్నించుకునేటట్టు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ ఈ ఎన్నికలలో ఎమ్మె ల్యేగా గెలిచిన తరువాత చేసిన వ్యాఖ్యలలో ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఉంది. తాను తొమ్మిదేళ్లలో అసలు కేసీఆర్ ఇంటర్వ్యూ కూడా సంపాదించలేక పోయానని బయటపెట్టారు. అలా అని సొంత పార్టీ నాయకులనూ, ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ప్రగతి భవన్‌లోకి నేరుగా అనుమతించారని అనుకుంటే పొరపాటు. ఈటెల రాజేందర్ బీఆర్‌ఎస్‌ను వీడుతూ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఉద్యమ నేత స్థాయి నుంచి ముఖ్యమంత్రి పీఠానికి వెళ్లిన కేసీఆర్ ఈ విషయాన్ని అసలు గుర్తించారా? ముమ్మా టికీ లేదు. అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ తాత్వికతనే విస్మరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి హైదరాబాద్‌తో సహా తెలంగాణ ఇతర ప్రాంతాలలోనూ నివాసం ఏర్పరుచు కున్నారు. కానీ తెలంగాణ సమాజం ఆత్మగౌరవం గురించి ఆలోచింపచేసినవారు కొందరు ఆంధ్ర ప్రాంతీయులేనన్న వాదన ఉంది.
అలాంటి అవమానాలను తెలంగాణ సమాజం భరించలేదు. నిజానికి ఏ సమాజమూ భరించదు. ఏదో ఒకరోజు ప్రశ్నిస్తుంది. మద్రాసు ప్రెసిడెన్సీలో తమి ళుల నుంచి అవమానాలను ఎదుర్కొన్న తెలుగ భాషా ప్రాంతాల వారు, నిజాం రాజ్యంలో తెలుగు ప్రాంతాల వారి పట్ల కూడా అదే ధోరణి ప్రదర్శించారంటే సత్యదూరం కాబోదు. అంతకంటే పెద్ద వాస్తవం కేసీఆర్ కూడా సీఎం హెూదాలో అవమానకరమైన ధోరణిలోనే వ్యవహరించడం!
విలేకరుల సమావేశాలలో ఆయన వ్యవహరించిన తీరు అసలు ప్రజాస్వామ్యానికి శోభను కూర్చేదని ఎవరైనా అన గలరా? పత్రికా స్వేచ్ఛ గురించి ఆయన ఏనాడూ గౌరవంగా లేరు. ప్రశ్న ఎంత లోతైనదైనా ఆయన దానికి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దేశ ప్రజలకు అనుభవమే. దీనికి మించినది ఎన్నికల ప్రచార సభలలో ఆయన ప్రదర్శించిన ధోరణి. ‘నేను చెప్పేది నేను చెప్పాను. నాకు ఓటేయకపోతే మీ ఖర్మ’ అనే దాకా ఆయన వెళ్లారు. ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకమున్న ఏ నాయకుడూ చేయడు, చేయకూడదు! తనకు ఓటు వేయమని అడగ డానికి వెళ్లి, సభలో చప్పట్లు చరిచిన వారిపై కూడా విరుచు కుపడే స్వభావం ఆయన స్థాయిని నిజంగానే దిగజార్చించింది.
‘వాడిని ఇలా గుంజుకు రండి’, ‘కిరికిరిగాళ్లు’ వంటి మాటలు తరచు వాడడం సభా మర్యాద కూడా కాదన్న సంగతి ఆయన పూర్తిగా విస్మరించారు. గుజరాత్ వాళ్లకీ, ఢిల్లీ వాళ్లకీ ఇక్కడేం పని అంటూ ఆయన అత్యంత హేయంగా మాట్లాడారు. టీఆర్‌ఎస్ రూపు మార్చి బీఆర్‌ఎస్ అయిన తరువాత మహారాష్ట్రకు ఈయన ఎన్నిసార్లు పోయి రాలేదు! మహారాష్ట్ర వాసుల నుంచి ఆయనకు ఇలాంటి ప్రశ్నే వస్తే దానికి ఎలా స్పందించి ఉండేవారు? అవతలి పక్షం, అంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రయోగించిన భాష దారుణం. దానికి ఆ పార్టీల నాయకుల నుంచి కూడా అలాంటి స్పందనే వచ్చింది. ఈ ధోరణి ఎక్కడో ఒకచోట ఆగి ఉండవలసింది. ఈ రకమైన చొరవ విపక్షాల నుంచి మొదలై ఉంటే కేసీఆర్‌కు మంచి గుణపాఠం అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు.
ఇది అహంకార ధోరణి అని నిస్సంశయంగా చెప్ప డానికి ప్రజాస్వామ్య వాదులు వెనుకాడరు. దానికి తెలంగాణ సమాజం పెద్ద మూల్యమే చెల్లించింది. తెలంగాణ సాధనకు ఉపయోగపడిన నినాదంలోని నీళ్ల కోసం వృథాగా కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం, మేడిగడ్డల దగ్గర ఎదురైన అనుభవాలు ఇవే. అక్కడ కేసీఆర్ ఇంజనీర్ అవతారం కూడా ఎత్తారని ఇప్పుడు జనం చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంలో కూడా ఆయన మాటే అంతిమంగా ఉండేదన్న విమర్శ కూడా కొద్దికాలం వినిపించింది.
కేసీఆర్ నియంతృత్వ ధోరణి ఈ ఎన్నికలలో ఓటమి తరువాత కూడా కొనసాగడం ప్రజలను నిశ్చేష్టులను చేసింది. పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు స్వయంగా వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పించడం మర్యాద. ఇది రాజకీయ సంప్రదాయం కూడా. తెలంగాణతో పాటే ఎన్నికలు జరుపుకొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ మర్యాదను పాటించిన ఉదాహరణ ఎదురుగానే ఉంది. కానీ కేసీఆర్ తన ఓఎస్‌డీ ద్వారా గవ ర్నర్‌కు రాజీనామా లేఖను పంపించి గజ్వేల్‌లోని ఫామ్ హౌస్‌కు వెళ్లిపోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పక తప్పదు.
గెలిస్తే సరే, ఓడినా కూడా రెండు దఫాలు ముఖ్య మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన సొంత పార్టీ కార్యకర్తల పట్ల చూపవలసిన కనీస బాధ్యతను కూడా కేసీఆర్ ఎందుకు చూపలేకపోయారు? ఆయన కాకుండా పార్టీ నేతగా ఆయన కుమారుడు కేటీఆర్ ధన్యవాదాలు తెలియచేసే బాధ్యతను స్వీకరించడం కూడా సరైనది కాదు. ఇది అహంకారం కాదు అని ఆ పార్టీ నాయకులు ఎవరైనా చెబితే అది కూడా చాలదు.
ఎందుకంటే అహంకారమేనన్న వాస్తవాన్ని అప్పుడు కేసీఆరే రూఢి చేసినట్టు అవుతుంది. కేసీఆర్‌కూ గవ ర్నర్‌కూ విభేదాలు ఉండవచ్చు. అయినా ఒక ప్రజా నాయ కునిగా కేసీఆర్ తన బాధ్యతను తాను నిర్వర్తించి ఉండవల సింది కాదా! రాజస్థాన్‌లో కూడా సొంత పార్టీ నియమించిన గవర్నర్ లేరు. అధికారం నుంచి దిగిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ కేంద్రంలో బీజేపీ నియమించినవారే. మరి ఆయన ఆ మర్యాద ఎందుకు చూపించారు?
ఆత్మ గౌరవం అంటే అహంకార ప్రదర్శన కాదు. ఈ సంగతి కేసీఆర్‌కు ఎవరైనా ఇంకా ముందే గుర్తు చేసి ఉండ వలసింది. ఈ ఎన్నికలలో కేసీఆర్–బీఆర్‌ఎస్ ఓటమి రాష్ట్రాన్ని ‘అభివృద్ధి చేయనందుకు’ అని ఒక్కమాటలో చెప్పలేం. అందుకు ఆ పార్టీ అంతో ఇంతో చేసింది. మన్ను తిన్న పాములా పడి ఉన్న కాంగ్రెస్ ఆరేడు మాసాలలోనే ఇంత ఫలితం సాధించడానికీ, బీఆర్‌ఎస్ ఓడిపోవడానికీ కారణం కేసీఆర్ అహంకార ధోరణి! అది బీఆర్‌ఎస్ గుర్తించ వలసి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయ కుడు అంటే, ప్రజానీకాన్ని గుర్తించని నాయకుడనే. ఇక్కడ ఓడిపోయినది అలాంటి నాయకుడే! ప్రజలకు దూరమైన నాయకుడే!!
పి. వేణుగోపాల్ రెడ్డి
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్
ఈ–మెయిల్: pvg@ekalavya.net
ప్రజాస్వామ్యానికి దూరమైతే మిగిలేది ఇదే!
Published Thu, Dec 7 2023 12:18 AM | Last Updated on Thu, Dec 7 2023 12:18 AM
Comments
Please login to add a commentAdd a comment