‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్‌ | BRS Leader KCR Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్‌

Published Tue, May 7 2024 12:59 AM | Last Updated on Tue, May 7 2024 12:59 AM

సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

నేను నిలదీస్తేనే కాంగ్రెస్‌ సర్కారు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది 

ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడుతాం.. కాంగ్రెస్‌ మెడలు వంచుతాం 

నిజామాబాద్‌ రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

రుణమాఫీ కావాలన్నా, ఇతర హామీలు అమలు కావాలన్నా బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలి 

దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు.. తప్ప రేవంత్‌ చేసేదేమీ లేదు 

సీఎంఆర్‌ఎఫ్‌ సాయం, కేసీఆర్‌ కిట్లు, విదేశీ విద్యానిధి.. ఇలా అన్నీ ఆగిపోయాయి 

తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఓటెందుకు వేయాలి? 

ఈసారి కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే 

తెలంగాణకు శక్తి, గళం, బలం బీఆర్‌ఎస్సే 

పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది మేమే.. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి  

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్‌ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్‌లలో కేసీఆర్‌ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలో రోడ్‌ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..  ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. 

అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్‌ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. 

రేవంత్‌ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్, అంబేడ్కర్‌ ఓవర్సీస్, సీఎంఆర్‌ఎఫ్, కేసీఆర్‌ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్‌ అడ్డుకోలేకపోతున్నారు. 

బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి.. 
కేసీఆర్‌ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్‌ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్‌ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే.  మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాలి. 

కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే
బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్‌ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్‌ తెలంగాణకు కేసీఆర్‌ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. 

గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి 
యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

రాకేశ్‌ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్‌
నిజామాబాద్‌ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్‌ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్‌ సోమవారం రాత్రి నిజామాబాద్‌లో అందజేశారు. నగరంలో రోడ్‌ షో ముగిసిన అనంతరం కేసీఆర్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్‌కు రాకేశ్‌ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు మహేశ్‌ బిగాల, రాజారాం యాదవ్‌ పాల్గొన్నారు.

కేసీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు
జగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్‌.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్‌గల్‌ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement