‘దశాబ్ది’ స్కాన్‌!  | BRS Leaders focus on underperforming MLAs | Sakshi
Sakshi News home page

‘దశాబ్ది’ స్కాన్‌! 

Published Wed, May 31 2023 1:11 AM | Last Updated on Wed, May 31 2023 1:11 AM

BRS Leaders focus on underperforming MLAs - Sakshi

మూడో వంతు నియోజకవర్గాలపై  నిశిత పరిశీలన.. 
ఓ వైపు మారుతున్న రాజకీయ పరిణామాలు.. మరోవైపు దగ్గరపడుతున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇలాంటి కీలకమైన సమయంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. ఇటీవలి వరకు జరిగిన ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించిన తీరు ఆధారంగా ఎమ్మెల్యేలపై ఓ అంచనాకు వచ్చిన ఆయన.. కొందరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారన్నది పరిశీలించి.. పనితీరు మార్చుకోనివారిపై వేటు వేయాలని, తీవ్ర అవినీతి ఆరోపణలున్న వారిని పక్కనపెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడో వంతు నియోజకవర్గాల్లో నిశిత పరిశీలన జరుపుతున్నారని అంటున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. ఈ కార్యక్రమాన్ని ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. 21రోజుల పాటు సాగే దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు మమేకమయ్యే తీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కేటాయించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్, మేలో రెండు నెలల పాటు నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు జరిగిన విధానం, ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ ఇన్‌చార్జులు కేసీఆర్‌కు నివేదికలు అందజేశారు.

వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ యంత్రాంగాన్ని కలుపుకొనిపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పనితీరుపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. ఈ క్రమంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణలోనూ ఎమ్మెల్యేల తీరును మదింపు చేసి.. టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 
 
 గ్రేటర్‌ హైదరాబాద్‌ అనుభవంతో.. 
2020లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలక మండలికి జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ కార్పోరేటర్లపై వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడైనా.. సిట్టింగులకే టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత మొగ్గు చూపారు. కానీ ఆ వ్యతిరేకతకు తోడు మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు కూడా.. పలువురు పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల ఫలితాలు తేల్చాయని, అదే తరహాలో నిఘా సంస్థల నుంచి కేసీఆర్‌కు నివేదికలు అందాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది.

ఇక పార్టీలోనే ఉంటూ తలనొప్పులు సృష్టిస్తున్నవారు, అవకాశాలు దక్కినా అసంతృప్త స్వరం వినిపిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారిపై కేసీఆర్‌ దృష్టి సారించారని.. అవసరమైతే వారిని బయటికి పంపాలని భావిస్తున్నారని సమాచారం. 40 పర్సెంట్‌ కమిషన్‌ వివాదంతో కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిసింది. 
 
సుమారు 40 నియోజకవర్గాలపై ఫోకస్‌! 
నకిరేకల్, ఇల్లెందు, తాండూరు, పాలేరు, బెల్లంపల్లి, తుంగతుర్తి, జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్, జహీరాబాద్, నాగార్జునసాగర్, ఎల్లారెడ్డి, ఉప్పల్, కొత్తగూడెం, ఖానాపూర్, జగిత్యాల, హుస్నాబాద్, షాద్‌నగర్, మహబూబాబాద్, కోదాడ, వరంగల్‌ తూర్పు, మెదక్, అలంపూర్‌ సహా సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ, ఎమ్మెల్యేల పనితీరును కేసీఆర్‌ నిశితంగా పరిశీలిస్తున్నట్ట బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

ఆయా నియోజకవర్గాల్లో పలుచోట్ల టికెట్‌ కోసం తీవ్ర పోటీ ఉండగా.. మరికొన్ని చోట్ల స్థానిక నేతల అసంతృప్తి, ఇంకొన్ని చోట్ల అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాయని అంటున్నాయి. మొత్తం నియోజకవర్గాల్లో మూడో వంతు చోట్ల టికెట్ల కేటాయింపు ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని తెలంగాణ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ.. 
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తోంది. 119 సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యులు ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తామని పలు సందర్భాల్లో కేసీఆర్‌ ప్రకటించారు.

అయితే ఈ 103 మందిలో 46 మంది వరుసగా రెండుసార్లు, మరో 18 మంది మూడు కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారే. ఈ క్రమంలో సహజంగానే వారిపై నెలకొనే ప్రతికూలత.. పార్టీ విజయావకాశాలను దెబ్బతీయకుండా ఉండేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement