పదేళ్లలోనే.. వందేళ్ల అభివృద్ధి
జూన్ 2 నుంచి 21 వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలి. ఈ దశాబ్ది కాలంలో శతాబ్ది కాలంలో చేయాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేశాం. బతుకమ్మ పండుగను తలపించే రీతిలో ఈ ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించడంతోపాటు అన్ని అంశాలను ప్రజలకు వివరించాలి. మిషన్ కాకతీయ విజయాన్ని చాటేలా కట్ట మైసమ్మ పండుగలు చేయాలి. రైతు వేదికలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ఆసరా పింఛన్ల లబ్ధిదారులతో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. సంప్రదాయ కళాకారులతో ఊరేగింపులు, కవి సమ్మేళనాలు నిర్వహించాలి. వీటికి ఎమ్మెల్యేలు నాయకత్వం వహించాలి. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్నను ఆహ్వానించాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలి.
– సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తున్నామనడంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు అందరూ పనిచేస్తే.. కచ్చితంగా ప్రతీ ఒక్కరికి 50 వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది..’’ అని పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు చెప్పుకోలేక పోవడం మైనస్‌గా మారిందన్నారు.
వందకు వంద శాతం సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇవ్వాలన్నదే తన అభిమతమని.. జాగ్రత్తలు చెప్పినా సర్దుకుపోకుండా నష్టం చేసుకుంటే తాను మాత్రం ఏం చేయగలనని వ్యాఖ్యానించారు. ఏమరుపాటుగా ఉంటే అందరమూ మునుగుతామని, పార్టీ మునిగితే అందరూ నష్టపోతారని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ భేటీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘ఎమ్మెల్యేల పనితీరును చాలా నిశితంగా గమనిస్తున్నా. వారు ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేక విఫలమవుతున్నారు. ఎమ్మెల్యేలు పిల్లల కోడిలా ఉంటూ అందరినీ కాపాడుకోవాలి. అంశాల వారీగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో మన శక్తిని ఏకీకృతం చేసుకునేలా ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కీలక నేతలందరినీ కలుపుకొని ఐక్యతను చాటాలని పదే పదే చెప్తున్నాం. చిల్లర మల్లర విషయాల మీద రాజకీయాలు చేయకూడదు. కుత్సిత మనసుతో రాజకీయాలు ఫలితాన్ని ఇవ్వవు. కేవలం పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు సొంత కార్యక్రమాలకు కూడా ప్రణాళికలు వేసుకోవాలి. కులం, మతం ఎజెండాగా ఏ పార్టీ కూడా విజయం సాధించదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నాం. అదే మన విజయ రహస్యం.
బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సబిత, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, నామా, శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, కేకే, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, తలసాని
చేసింది చెప్పుకుందాం..
బోగస్ గుజరాత్ మోడల్‌తో నరేంద్ర మోదీ భారతదేశాన్ని మోసం చేశారు. కానీ మనం పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించాం. అందువల్లే దేశం తెలంగాణ మోడల్‌ను కోరుకుంటోంది. మనం ఆచరించిన మోడల్ వల్లే మహారాష్ట్రలోనూ ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారు. దేశంలో ఎవరూ చేయని రీతిలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినా మనం ఆదుకునేందుకు ముందుకు వచ్చాం. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామంటూ దేశంలో ఏ ప్రభుత్వం చేయనిది ఆచరణలో చూపిస్తున్నాం. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలి. వడగళ్లు, అకాల వర్షాలతో జరిగే నష్టాన్ని తగ్గించేందుకు మార్చి 31లోగా వరికోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యపరచాలి.
వజ్రపు తునకలా తెలంగాణ.. ఊరూరా ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని వజ్రపు తునకలా మార్చుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాల షెడ్యూల్‌ను గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం ప్రకటిస్తాం. షెడ్యూల్‌ను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో ప్రభుత్వ విభాగంలో.. మన ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజలకు వివరించేలా బ్యానర్లు, పోస్టర్లు కట్టి కార్యక్రమాలు నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, ప్రజలను భాగస్వాములను చేయాలి.
విజయగాథలకు సంబంధించిన డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. మన ప్రాంత వైతాళికులను గుర్తించి గౌరవించాలి. భాగ్యరెడ్డివర్మ, బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, సురవరం ప్రతాపరెడ్డి ఇలా ఎక్కడికక్కడ వైతాళికులను గుర్తించి వారిని కీర్తించాలి..’’ అని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు స్వాగతోపన్యాసం చేయగా.. మారిన తెలంగాణ ముఖచిత్రాన్ని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరించారు. తెలంగాణ వైభవాన్ని చాటేందుకు దశాబ్ది ఉత్సవాలను సువర్ణావకాశంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సూచించారు.
నియోజకవర్గంపై అవగాహన లేకుంటే ఎట్లా?
తెలంగాణ భవన్‌లో సమావేశం సందర్భంగా.. జనగాం నియోజకవర్గంలో రైతు వేదికల సంఖ్య గురించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని, తుంగతుర్తిలో గురుకుల కాలేజీల సంఖ్య గురించి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పడానికి తడబడగా.. ‘‘ఎమ్మెల్యేలకు నియోజకవర్గంపై సమగ్ర అవగాహన ఉండాలి. లేకుంటా ఎట్లా? మనం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలి. లేదంటే బయటి వారు చెప్పే అబద్ధాలను ప్రజలు నిజాలుగా నమ్మే అవకాశం ఉంది..’’ అని కేసీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment