ఖమ్మం: వచ్చే ఏప్రిల్‌లో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ముగ్గురూ బీఆర్ఎస్ నేతలే కాగా, వీరిలో జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రతో పాటు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్ ఉన్నారు. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా.. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనున్నాయి. అయితే, గతంలోనే కేసీఆర్ మరోమారు వద్దిరాజుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చినందున ఆయనకే పదవి దక్కుతుందని అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలోనూ రవిచంద్రకే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఇరవై నెలలు పదవిలో...
బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను కేసీఆర్ రంగంలోకి దించారు. బీఆర్‌ఎస్‌కు అప్పుడు ఉన్న సంఖ్యాబలంతో ఆయన మే 2022లో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఇరవై నెలల కాలంలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ పరంగా తనదైన ముద్ర వేయడమే కాక మున్నూరుకాపు సామాజిక వర్గం ముఖ్యనేతగా బీఆర్‌ఎస్‌లోకి ఆ సామాజిక వర్గ నేతలను చేర్పించడంలో కీలకపాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ ఆయనకు అప్పగించారు. ఇక పార్లమెంట్‌లో ఉమ్మడి జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలే కాక విభజన సమస్యలపైనా తన గళం వినిపించారు.
హామీ నెరవేర్చాలని..
బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రతోపాటు మరో ఇద్దరి పదవీకాలం పూర్తి కానుండగా.. ఈసారి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూస్తే ఒక్క స్థానం దక్కనుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. బీఆర్‌ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కడం ఖాయమనే చెప్పాలి. కాగా, రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి వద్దిరాజుకు అవకాశం దక్కుతుందని కేసీఆర్ గతంలో పలు వేదికలు, సమావేశాల్లో ప్రస్తావించడంతో ఈ హామీ నెరవేర్చాలని ఆయన అనుచరుల నుంచి విన్నపాలు వస్తున్నాయి.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్‌లో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు ఏర్పాటుచేయగా.. వద్దిరాజు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ఆశీర్వదిస్తే ఇదే సభలో అడుగు పెడతానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలంలో చరిత్రలో నిలిచిపోయే ఘటనల్లో భాగస్వామిని కావడానికి అవకాశమచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.
అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు!
రాజ్యసభకు ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈనెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల స్వీకరణ గడువు 15వరకు ఉండగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
అసెంబ్లీ బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం దక్కనుండడంతో రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరుగుతుండగా.. బీఆర్‌ఎస్ తరఫున మాత్రం వద్దిరాజుకే ఖాయమని ప్రచారం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment