ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగేందుకు బీఆర్‌ఎస్ టీమ్ సిద్ధమైంది. అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. మారిన రాజకీయ సమీకరణలు, సర్వేల ఆధారంగా సిట్టింగ్‌లకు, మిగతా చోట్ల గతంలో పోటీ చేసిన వారినే మళ్లీ బరిలోకి దింపేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం వైరా మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు లేకుండా టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం.
వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ను పక్కన పెట్టి సర్వేల ఆధారంగా బానోతు మదన్‌లాల్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈనెల 21న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ఒక స్థానం మినహా అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగే వారి పేర్లు వెల్లడవుతాయని సమాచారం. అయితే, ప్రాథమికంగా జాబితా ఖరారైనా చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
ఒక్కరు మినహా సిట్టింగ్‌లకు సై..
తాజా సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఒక్కరు మినహా బీఆర్‌ఎస్‌లోని సిట్టింగ్‌లకు టికెట్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, పినపాక నుంచి రేగా కాంతారావు, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు నుంచి బానోతు హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు మళ్లీ బరిలో దిగనున్నట్లు తెలిసింది.
అలాగే, మధిర, భద్రాచలం నుంచి గతంలో పోటీ చేసిన ఓడిపోయిన లింగాల కమల్‌రాజు, తెల్లం వెంకట్రావు పోటీకి దిగనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఈ విషయమై స్పష్టత వచ్చింది. పలుమార్లు చేయించిన సర్వేల ఆధారంగా వీరే బలమైన అభ్యర్థులుగా తేలడంతో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది.
రెండు స్థానాలపై ఆచితూచి..
ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు నుంచి బానోతు హరిప్రియనే పోటీలో దింపేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీఆర్‌ఎస్‌లో చేరిన వీరికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యాన మళ్లీ పోటీకి సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
ఇల్లెందులో గ్రూపుల కారణంగా సిట్టింగ్‌పై వ్యతిరేకత ఉన్నా ప్రతిపక్ష పార్టీకి హరిప్రియ మాత్రమే పోటీ ఇవ్వగలరనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు సమాచా రం. అయితే, ఈ స్థానానికి సంబంధించి చివరి నిమిషంలో మార్పులకు అవకాశం లేకపోలేదన్న ప్రచారం కూడా కొనసాగుతోంది.
ఇప్పటికైతే భద్రాచలం ఓకే..
కాంగ్రెస్ నుంచి ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావే పార్టీ అభ్యర్థిగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం, సీపీఐతో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఎంకు కేటాయించి, బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెల్లంకు ఉన్నత పదవి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు ఉభయ కమ్యూనిస్టులతో పొత్తుపై బీఆర్‌ఎస్ ఎటూ తేల్చకపోగా, తొలి జాబితా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యాన చర్చలు ఎప్పుడు జరుగుతాయో తెలియడం లేదు. తొలి జాబితా విడుదలయ్యేలోగా రెండు పార్టీలతో చర్చలు మొదలైతే భద్రాచలం స్థానాన్ని పెండింగ్‌లో పెట్టే అవకాశముంది. ఏదిఏమైనా కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు అధిష్టానం త్వరలోనే తెరదించనుంది.
రాములునాయక్‌కు షాక్..
ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం వైరా నుంచి సిట్టింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను కాదని బానోత్ మదన్‌లాల్‌ను బరిలో దింపాలని సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నారు. రాములునాయక్ గత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాక బీఆర్‌ఎస్‌లో చేరారు.
బానోత్ మదన్‌లాల్ గత రెండు పర్యాయాలు వైరా నుంచి పోటీ చేయగా.. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018లో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే, ప్రస్తుతం చేయించిన సర్వే ఆధారంగా మదన్‌లాల్ వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment