ఖమ్మం: బీజేపీ శ్రేణులు ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించేందుకు నాలుగేళ్లుగా ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్కో సీటుకే పరిమితం కావడంతో.. బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా ఇక్కడ పాగా వేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెబుతూ ‘గులాబీ’ వ్యతిరేక ఓటును తమ ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో పావులు కదిపారు.
ఈమేరకు స్థానికంగా పార్టీ నేతలు బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ పలు సందర్భాల్లో ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ అధ్యక్ష హోదాలో బండి సంజయ్ మే నెల ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్నారు. పలుమార్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోపాటు పలువురు బీజేపీ అగ్రనేతలు సైతం జిల్లాలో పర్యటించారు. మరోవైపు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కూడా తరచుగా వచ్చివెళ్తూ కార్యకర్తలతో సమావేశమై చాపకింద నీరులా పార్టీ బలోపేతానికి కృషిచేశారు.
అమిత్‌షా సభకు ఖమ్మం వేదిక..
మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన సంపర్క్ అభియాన్ పేరుతో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలో నిర్వహించే సభల్లో మొదటగా ఖమ్మంను ఎంచుకున్నారు. అయితే, జూన్ 15నే ఈ సభ జరగాల్సి ఉన్నా తుపాను కారణంగా వాయిదా పడింది.
ఈ సభను గత నెల 27న నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొ నడంతో పాటు ప్రజలు భారీగా తరలిరావడంతో పార్టీ కేంద్ర, రాష్ట్రస్థాయి నేతలతోపాటు స్థానిక నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీజేపీ లేదనే వారికి ఇదే తమ సమాధానమని వెల్లడించారు. ఈ సభ విజయవంతంతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలం పెరిగిందంటూ నేతలు చెప్పుకొచ్చారు.
క్షేత్రస్థాయిలో స్తబ్దత..
నిన్నమొన్నటి వరకు కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రం క్షేత్రస్థాయిలో డీలాగా కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టులు కూడా కొంత మేరకు బలంగా ఉన్నారు. వీరిలో బీఆర్‌ఎస్ ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు.
ఇక కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉండగా.. కొత్త నేతల చేరికలతో బలం పుంజుకుంది. బీఆర్‌ఎస్‌కు దీటుగా ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. బీజేపీ మాత్రం అమిత్‌షా సభ తర్వాత అదే రీతిలో ముందుకు వెళ్లలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కేడర్‌కు దిశానిర్దేశం కరువు కాగా.. ముఖ్యనేతలు వచ్చినప్పుడు హడావుడి చేస్తూ, పార్టీ బలోపతంపై సారించడం లేదనే చర్చ జరుగుతోంది.
చేరికల్లో వెనుకంజ..
ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ ఆ స్థాయిలో చేరే వారు లేక బలం పుంజుకోలేకపోయింది. బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. నడ్డా, అమిత్‌షా ఆదేశాల మేరకు ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినా ఫలితం రాలేదు.
ప్రజాకర్షణ కలిగిన నేతలు లేకపోవడం ఉమ్మడి జిల్లాలో బీజేపీకి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం టికెట్ల కోసం బీజేపీ దరఖాస్తులను ఆహ్వానిస్తే, పలువురు దరఖాస్తు చేసుకుంటున్నా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు దీటైన అభ్యర్థులను బరిలో నిలపడం ఆ పార్టీకి కష్టంగా మారుతుందనే విశ్లేషణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment