ఖమ్మం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుకావడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఉమ్మడి జిల్లాకు సంబంధించి మధిర నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.
మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోని కొన్నింటిలో బహుముఖ పోటీ నెలకొనగా... దరఖాస్తుల పరిశీలన అనంతరం జాబితాను పీఈసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేసింది. కాగా, బుధవారం ఈ జాబితాను హైదరాబాద్ గాంధీభవన్‌లో పరిశీలించి అధిష్టానానికి తుది జాబితా అందజేసే అవకాశముంది. ఈ నేపథ్యాన స్క్రీనింగ్ కమిటీకి వెళ్లిన జాబితాలో తమ పేరు ఉందా, లేదా అనే ఆందోళన ఆశావహుల్లో నెలకొనగా.. పలువురు హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇక్కడా పోటాపోటీ..
రిజర్వ్ స్థానమైన ఇల్లెందు నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. అయితే పీఈసీ స్థాయిలోనే వడబోత అనంతరం ఇద్దరు నుంచి ముగ్గురినే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక సత్తుపల్లి, వైరా, పినపాక, అశ్వారావుపేట స్థానాల్లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు నుంచి నలుగురి వరకు అభ్యర్థులను పరిమితం చేసిన పీఈసీ.. జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపించింది.
దరఖాస్తులు ఇచ్చి ప్రదక్షిణలు చేస్తూ..
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు టీపీసీసీకి 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి 32 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇక పినపాక నుంచి 17, వైరా నుంచి 15, పాలేరు నుంచి 14, సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి పది మంది చొప్పున, ఖమ్మం నుంచి తొమ్మిది మంది, అశ్వారావుపేట నుంచి ఎనిమిది మంది, భద్రాచలం నుంచి ముగ్గురు, మధిర నుంచి ఇద్దరు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. అన్నింటినీ పరిశీలించి పీఈసీ ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వగా, ఆ కమిటీ పరిశీలించి అధిష్టానానికి పంపించనుంది.
మధిర, భద్రాచలం ఓకే..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మధిర, భద్రాచలం నియోజకవర్గాలకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి, కోట రాంబాబు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బలమైన అభ్యర్థి అయినందున కమిటీలో అభ్యంతరం ఎదురుకాకపోవడంతో ఆయన పేరు ఖరారు చేశారని సమాచారం. ఇక భద్రాచలం నుంచి మూడు దరఖాస్తులు అందగా, సిట్టింగ్ ఎమ్మెల్యే, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడైన పొదెం వీరయ్య వైపే కమిటీ మొగ్గు చూపింది.
జనరల్ స్థానాలపై ఆసక్తి..
ప్రధానంగా జనరల్ స్థానాల్లో ఎవరికి టికెట్ వస్తుందనే అంశంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం ఖరారు కావడంతో ఆయన ప్రధానంగా పాలేరు టికెటే ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యాన పొంగులేటిని అధిష్టానం ఎక్కడి నుంచి బరిలోకి దింపుతుందనే చర్చ జరుగుతోంది. మూడు జనరల్ స్థానాల్లో బహుముఖ పోటీ నెలకొనడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.
రాజధానికి ఉరుకులు..
స్క్రీనింగ్ కమిటీకి వెళ్లిన జాబితాలో తమ పేరు ఉంటుందని భావిస్తున్న ఆశావహులు టికెట్ సాధన కోసం రాజధాని బాట పట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అనుచరులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు.
వీరిలో కొందరి పేర్లను పీఈసీ ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి పంపించింది. దీంతో ఆశావహులు గాంధీభవన్‌కు క్యూ కట్టారు. తమ నేతల ద్వారా సిఫారసు చేయించుకుని టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ బుధవారం అభ్యర్థుల వడపోత కార్యక్రమం నిర్వహించనుండగా.. అక్కడే మకాం వేసిన ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment