సీ–విజిల్ యాప్ పనితీరును వివరిస్తున్న కలెక్టర్ గౌతమ్
ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యాన ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు యత్నించే అవకాశముంది. ఈ నేపథ్యాన వీరికి చెక్ పెట్టేందుకు, ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సీ–విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోలు, వీడియోల ఆధారంగా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
డౌన్‌లోడ్ ఇలా..
ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్ నుంచి సీ–విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఫొటో, వీడియో, ఆడియో మూడు రకాల ఆప్షన్లు వస్తాయి. లైవ్ లొకేషన్ ఆన్ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆప్షన్ ఎంపిక చేసుకుని ప్రొసీడ్ కొడితే నేరుగా సంబంధిత అధికారులకు విషయం చేరిపోతుంది.
వంద నిమిషాల్లోనే..
ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మద్యం, డబ్బు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నట్లయితే సీ–విజిల్ యాప్ ద్వారా ఫొటో, వీడియో ఆధారంగా ఫిర్యాదు చేయొచ్చు. ఈ వివరాలు అధికారులకు చేరిన 100నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అంతేకాక బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ఫిర్యాదుదారులకు చేరవేస్తారు. అంతేకాక ఫిర్యాదు చేసిన వారి వివరాలను బయటకు వెల్లడించబోమని అధికార యంత్రాంగం చెబుతోంది. కాగా, సీ విజిల్ యాప్‌ను ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకునేలా, ప్రలోభాలపై ఫిర్యాదు చేసేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment