ఖమ్మం: ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన ఆర్టీసీకి చెందిన 1.7 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఏసీ కన్వెన్షన్ హాల్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. 72 ఏళ్ల కాలంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖమ్మంలో మరో బస్టాండ్ నిర్మాణానికి ఆలోచన చేయలేదని, నాటి పాలకులు, ప్రజాప్రతినిధులు దాని ఊసే ఎత్తలేదని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత తాను రవాణా శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత బస్టాండ్ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమించానని, కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టినా.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా బస్టాండ్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొందరు వస్తున్నారని, మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌ను గద్దె దింపుతామని, బంగాళాఖాతంలో కలుపుతామని మాట్లాడుతున్న వ్యక్తి ఖమ్మంలో ఏ ఒక్క అభివృద్ధి పనికై నా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. ఎక్కడైనా శిలాఫలకంపై ఆయన పేరు ఉందా అన్నారు. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులని, ఇక్కడ వామపక్ష అభ్యుదయ భావాలతో ప్రజలు ఉన్నారని, వారంతా ఆలోచించాలని కోరారు. మంత్రిగా నాలుగేళ్లలోనే ఇంత అభివృద్ధి చేసుకున్నామని, మరోసారి అవకాశం వస్తే మరింతగా అభివృద్ధి చేసే వీలు కలుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో రెండో ఆర్టీసీ కన్వెన్షన్ హాల్..
ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన 1.7 ఎకరాల్లో రూ.40 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ హాల్ రాష్ట్రంలోనే రెండోదని మంత్రి పువ్వాడ అన్నారు. హైదరాబాద్‌లో కన్వెన్సన్ హాల్ ఉన్నా.. అది నాన్ ఏసీ అన్నారు. 2 వేల మంది కూర్చునేలా ఈ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ సంస్థపై భారం తగ్గించేందుకు ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి, సర్కారు ఖజానా నుంచి వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ ఆస్తులను దోచుకుంటున్నారని కొందరు మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఆస్తులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఒక్క ఖమ్మంలోనే నూతన బస్టాండ్ నిర్మాణం ద్వారా రూ.200 కోట్ల ఆస్తి సమకూరిందని, ఇక కన్వెన్షన్ హాల్ ద్వారా మరో రూ.100 కోట్ల ఆస్తి సమకూరనుందని తెలిపారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, కరీంనగర్ ఈడీ వినోద్‌కుమార్, ఈడీ కమర్షియల్ కృష్ణకాంత్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమ జొహరా, ఆర్టీసీ ఆర్‌ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment