ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్‌ఎస్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కలహాలు ఎంతకూ చల్లారడం లేదు. అసమ్మతి వాదులు, అభ్యర్థుల మధ్య సయోధ్య కుదరకపోగా.. సమన్వయం కోసం అధిష్టానం నియమించిన ఇన్‌చార్జిలు పూర్తిస్థాయిలో పని మొదలుపెట్టలేదు. దీంతో ఇరువర్గాల నడుమ దూరం కొనసాగుతోంది. ఇక వైరా నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలపై బీఆర్‌ఎస్ అధి ష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీలోని జిల్లాస్థాయి నాయకులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో విభేదాలు సమసిపోకపోగా... పార్టీ కేడర్‌లో ఆందోళన నెలకొంది.
కలిసి రాక.. చొరవ లేక..
బీఆర్‌ఎస్ అధిష్టానం గత 21న అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రచారానికి సమయం లభించడమే కాక అసమ్మతి నేతలను సమన్వయం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని భావించారు. కానీ ప్రకటన వచ్చి ఇరవై రోజులు గడుస్తున్నా.. అసమ్మతి చల్లారకపోగా శృతి మించుతోంది. వ్యతిరేకిస్తున్న వారితో కలిసిపోయేందుకు అభ్యర్థులు చొరవ తీసుకోకపోవడం, అసమ్మతివాదులు కూడా పట్టు వీడకపోవడంతో రోజురోజుకూ విభేదాలు ముదిరి పాకాన పడి కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి.
వైరా తీరే వేరు..
వైరా నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బీఆర్‌ఎస్ అధిష్టానానికి ఆగ్రహం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, పార్టీ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ మధ్య విభేదాలు రచ్చకెక్కడంపై పార్టీ అధినేత సీరియస్ అయినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మదన్‌లాల్‌ను ప్రకటించాక రాములునాయక్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకపోగా, సహకరిస్తానని పేర్కొన్నారు.
కానీ ఆతర్వాత దళితబంధు జాబితా ఇరువురి నడుమ దూరాన్ని పెంచడంతో తాము నలిగిపోతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములునాయక్, పార్టీ అభ్యర్థి మదన్‌లాల్ నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కాగా, ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించిన ఎంపీ నామ నాగేశ్వరరావు ఇప్పటివరకు అడుగు పెట్టలేదు.
ఇల్లెందుపై వద్దిరాజు నజర్..
రాజ్యసభ్య సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించగా.. ఇల్లెందులో హరిప్రియ నాయక్‌తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఎడముఖం, పెడముఖంగానే ఉంటుండగా, పలుమార్లు చర్చలు జరిపినా ఏకతాటిపైకి రాలేదు.
కానీ సోమవారం నాటి ర్యాలీలో మాత్రం నేతలు భారీగానే పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేయాలని వద్దిరాజు సదరు నేతలకు చెప్పినట్టు సమాచారం. ఇన్‌చార్జిగా రెండు నియోజకవర్గాల్లో పర్యటించిన వద్దిరాజు... అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
కొలిక్కిరాని భద్రాద్రి పంచాయితీ..
భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తెల్లం వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడంతో టికెట్ ఆశించిన బోదెబోయిన బుచ్చయ్యకు చుక్కెదురైంది. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అనుచరుడిగా ఉన్న బుచ్చయ్యకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు నైరాశ్యంలో ఉన్నారు.
ఆతర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాలసానిని తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించడంతో మరింత అసహనంతో రగిలిపోతున్నారు. ఇరువర్గాల మధ్య ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్చలు జరగకపోగా.. సయోధ్య కోసం ఎమ్మెల్సీ తాతా మధు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఉమ్మ డి జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర, కొత్తగూడెం, పినపాక,అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచార దూకుడు పెంచారు. ఇక భద్రాచలం, ఇల్లెందు, వైరాలో నేతల కీచులాటలు సమసిపోతేనే ఎన్నికల హడావుడి మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment