TS Kamareddy Assembly Constituency: TS Election 2023: ఎన్నికల బరిలో గల్ఫ్‌ బాధితులు!
Sakshi News home page

TS Election 2023: ఈసారి కేసీఆర్‌ పోటీగా గల్ఫ్‌ మృతుల భార్యలు..!

Published Mon, Sep 18 2023 1:04 AM | Last Updated on Tue, Sep 19 2023 11:11 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఏళ్లుగా తమ సమస్యలపై పోరాడుతున్న గల్ఫ్‌ బాధితులు ఈసారి ఎన్నికల గోదాలో నిలవాలని యోచిస్తున్నారు. సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం లక్షలాది మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఆర్థికంగా చితికిపోయారు.

ఈ నేపథ్యంలో గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలంటూ ఆందోళనలూ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే గల్ఫ్‌ కార్మికులు సంఘాలుగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గల్ఫ్‌ కష్టాలు తీరుతాయన్న భావనతో రాష్ట్ర సాధనోద్యమంలోనూ పాల్గొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడచినా గల్ఫ్‌ బాధితుల కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వారిలో ఆగ్రహం పెరుగుతోంది.

గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని గల్ఫ్‌ జేఏసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్నికల బరిలో నిలవాలని, తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు.

రోడ్డునపడ్డ కుటుంబాలెన్నో..
కామారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వలసవెళ్లారు. నాలుగైదు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. నియోజకవర్గానికి చెందిన 30 వేల మందికిపైగా ఎడారి దేశాలలో ఉన్నారని అంచనా వేస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది గల్ఫ్‌ బాధితులు కూడా ఉన్నారు. గల్ఫ్‌కు వెళ్లిన వారిలో చాలా మంది అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు ప్రమాదవశాత్తూ మరణించారు. వాళ్ల కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి.

కామారెడ్డి మీదే దృష్టి..
సీఎం కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని గల్ఫ్‌ జేఏసీ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌ దేశాల్లో 1,800 మంది మరణించారని గల్ఫ్‌ కార్మిక సంఘాల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. కనీసం చనిపోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 100 మందిని బరిలో దింపాలని భావిస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లి అక్కడ చనిపోయిన వారి భార్యలను పోటీలో నిలపాలని యోచిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన గల్ఫ్‌ కార్మికులంతా తలా కొంత జమ చేసి, నామినేషన్‌ రుసుము చెల్లిస్తారని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో పసుపు రైతులు నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేసినట్టే ఇక్కడ కూడా నామినేషన్లు వేస్తారని స్పష్టం చేస్తున్నారు.

హామీలు నెరవేర్చాలి..
తెలంగాణ సాధనోద్యమం నుంచి రాష్ట్రం ఏర్పడేదాకా సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు పలుమార్లు గల్ఫ్‌ కార్మికులు, గల్ఫ్‌ బాధితుల కోసం హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రమొచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1,800 మంది గల్ఫ్‌ కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికై నా ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల కోసం నిధి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దిగిరాకుంటే ఎన్నికల బరిలో నిలుస్తాం. కామారెడ్డినుంచి వంద మందిని బరిలో నిలుపుతాం. – సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గల్ఫ్‌ జేఏసీ రాష్ట్ర నాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement