ఖమ్మం: కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్‌షా ఖమ్మం పర్యటన కమలం శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపింది. పార్టీ అగ్రనేత, అదీ కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ సభలో ప్రసంగించడం బీజేపీ చరిత్రలోనే ఇదే ప్రథమం. దీంతో పార్టీ నేతలు ఉమ్మడి ఖమ్మంతోపాటు పరిసర జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను ‘రైతుగోస – బీజేపీ భరోసా’ పేరుతో ఏర్పాటు చేసిన సభకు తరలించారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడితో పాటు జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ షా ప్రసంగం కొనసాగింది. ఎన్నికల వేళ అమిత్‌షాతోపాటు పార్టీ ముఖ్యనేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ చేసిన ప్రసంగాలు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి.
రజాకార్లకు ఎదురొడ్డిన కేశవరావు..
స్వాతంత్య్ర సంగ్రామం, నిజాం పాలనలో ఖమ్మానికి చెందిన జమలాపురం కేశవరావు రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడారని.. ఆయనకు నివాళులర్పిస్తున్నానని అమిత్‌షా ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అలాగే రజాకార్ల దాష్టీకాలకు తెలంగాణ సమాజం తిరగబడిందని, మరోమారు నాటి రజాకార్ల పార్టీ ఎంఐఎంతో అంటకాగుతున్న కేసీఆర్‌కు కూడా ఇదే తిరుగుబాటు తప్పదని ఖమ్మం వేదికగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సైతం తమ ప్రసంగాల్లో ఖమ్మం చైతన్య గడ్డ అని, రైతుగోస–బీజేపీ భరోసా వేదికగానే కేసీఆర్ పీఠం కదులుతుందని వెల్లడించారు. కేసీఆర్ దొంగ దీక్షను ఖమ్మం ప్రజలు బయటపెట్టారంటూ విమర్శలు చేశారు.
కదలివచ్చిన కమలదళం..
‘రైతు గోస–బీజేపీ భరోసా’ సభకు ఉమ్మడి జిల్లాతోపాటు పరిసర జిల్లాల నుంచి శ్రేణులు కదిలివచ్చా యి. జన సమీకరణపై బీజేపీ నేతలు వారం రోజు లుగా కసరత్తు చేశారు. తొలుత కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఖమ్మం వచ్చి ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానాన్ని పరిశీలించడంతోపాటు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర నేతలు ఖమ్మం వచ్చి సభా ఏర్పాట్లు, జన సమీకరణపై దృష్టి సారించారు.
ఈటల రాజేందర్ రెండు రోజులపాటు ఖమ్మంలోనే ఉండి నేతలకు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టారు. వెయ్యి ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాలను కూడా జనాన్ని తరలించేందుకు ఉపయోగించారు. మధ్యాహ్నం 12గంటల నుంచి ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి జనం సభకు తరలివచ్చారు.
రెండు గంటలకు పైగా ఖమ్మంలో..
షెడ్యూల్ ప్రకారమే అమిత్‌షా పర్యటన సాగింది. ఆయన సీఆర్‌పీఎఫ్ హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఖమ్మానికి చేరుకున్నారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం 3.35 గంటలకు హెలికాప్టర్ ల్యాండ్ కాగా.. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం 4.20 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు.
ఆ తర్వాత సాయంత్రం 4.53 గంటల నుంచి 5.22 వరకు సుమారు అరగంట ప్రసంగించారు. అమిత్‌షా, ముఖ్యనేతలు ప్రసంగం చేస్తున్నంతసేపు జై శ్రీరామ్, బీజేపీ జిందాబాద్ నినాదాలు మార్మోగాయి. సభ ముగిశాక వేదిక వెనుక గ్రీన్‌రూమ్‌లో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న షా.. సాయంత్రం 5.56 గంటలకు హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు.
ఈ సభలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్, మరో ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఉప్పల శారద, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గెంటెల విద్యాసాగర్, కుంజా సత్యవతి, ఊకె అబ్బయ్య, విజయరామారావు, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, దేవకి వాసుదేవరావు, సన్నె ఉదయ్‌ప్రతాప్, రుద్ర ప్రదీప్, డాక్టర్ శీలం పాపారావు తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ కాఫీ మాత్రమే..
ఖమ్మంలో జరిగిన రైతు గోస–బీజేపీ భరోసా సభకు హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హెలికాప్టర్‌లో సర్దార్‌పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఫ్రెష్ అయ్యాక మళ్లీ సభా వేదిక వద్దకు వచ్చారు. సభ అనంతరం వేదిక వెనుక ఏర్పాటుచేసిన గ్రీన్‌రూమ్‌కు వెళ్లిన అమిత్‌షాకు స్నాక్స్‌గా బాదం, పిస్తా, జీడిపప్పుతో పాటు కాఫీ ఏర్పాటుచేశారు. అయితే, ఆయన తినుబండారాలు ఏమీ తీసుకోకుండా బ్లాక్ కాఫీ మాత్రం తాగారు. పది నిమిషాల పాటు గ్రీన్ రూమ్‌లో గడిపాక హెలిప్యాడ్‌కు వచ్చారు.
అటు భద్రాద్రి.. ఇటు స్తంభాద్రి..
అమిత్‌షా ప్రసంగంలో భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి, ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని తలుచుకున్నారు. తొలుత తిరుమల వెంకన్న, ఆ తర్వాత ఖమ్మంలో స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణలో, ఖమ్మంలో అడుగు పెట్టానని ఆయన ప్రసంగం ఆరంభించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడికి అనాదిగా పట్టువస్త్రాలను పాలకులు సమర్పిస్తారని, ఆ సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎంఐఎం అధినేత ఒవైసీ చేతిలో కేసీఆర్ కారు స్టీరింగ్ ఉండటంతోనే భద్రాద్రి రాముడిని కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే భద్రాద్రి రాముడి పాదపద్మాల వద్ద తమ పార్టీ ముఖ్యమంత్రి కమల పుష్పాలు పెడతారని, పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. దీంతో పాటు ఆయన ప్రసంగంలో జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment