TS Khammam Assembly Constituency: 'పువ్వాడ' పూలు కావాల్నా..? 'తుమ్మల' ముల్లు కావాల్నా..? : సీఎం కేసీఆర్‌
Sakshi News home page

'పువ్వాడ' పూలు కావాల్నా..? 'తుమ్మల' ముల్లు కావాల్నా..? : సీఎం కేసీఆర్‌

Published Mon, Nov 6 2023 12:06 AM | Last Updated on Mon, Nov 6 2023 12:48 PM

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మంచి చెడు ఆలోచించి ఓటు వేస్తే మంచి జరుగుతది. పువ్వాడ అజయ్‌ను గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు. అదే తుమ్మల తుప్పలను తెచ్చుకుంటే ముల్లు గుచ్చుకుంటది. తుమ్మ ముల్లు కావాల్నా.. పువ్వాడ పూలు కావాల్నా.. తేల్చాల్సింది ఖమ్మం ప్రజలే. ప్రభుత్వానికి ఉన్న విజన్‌, అజయ్‌ మిషన్‌ తోడైతే ఖమ్మం నేడు ఎట్ల ఉందో మీ కళ్ల ముందుంది. వీటన్నింటినీ విచారించి.. ఆలోచించి మీ అమూల్యమైన ఓటును అజయ్‌కుమార్‌ కారు గుర్తుపై వేసి గెలిపించాలి.’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన ప్రజా ఆశీ ర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కావడంతో నేతల కృషి ఫలించి భారీ ఎత్తున ప్రజ లు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సత్తుపల్లి, పాలేరు సభల్లో మాదిరిగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

మీ మంత్రి పనిచేస్తేనే ఇవన్నీ..
ఇదే జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ రాకముందు 70 ఏళ్ల క్రితం ‘నా తల్లి తెలంగాణరా.. వెలలేని నందనోద్యానమురా’ అని పాట రాశారు. ఇప్పుడు ఖమ్మం పట్టణం చూసి గర్వపడుతున్న. ఒకనాడు ఇక్కడ పాదయాత్ర చేశా. నాడు గోళ్లపాడు మురికిగా ఉండె. లకారం చెరువు వికారంగా ఉంది. ఇవ్వాళ ఎంత సుందరంగా తయారైంది.

అజయ్‌ను వెంటపెట్టుకుని తిరిగి రూ.100 కోట్లు ఇచ్చి ప్రత్యేకంగా పనులు చేయమని చెప్పా. ఇరుకు సందులు, మురికి కాల్వలు, దుర్గంధం, ట్రాఫిక్‌ కష్టాలు ఉండె.. ఈరోజు ఖమ్మం అంటే సిక్స్‌ లైన్‌ రోడ్డు, సందుల్లో వైట్‌టాప్స్‌ రోడ్లు, దారి పొడవునా లైట్లు, పచ్చని చెట్లు. ఇది మంత్రం, మాయ చేస్తే జరగలేదు.. మీ మంత్రి పనిచేస్తే జరిగింది.

తీగల వంతెన కట్టాలని..
ధంసలాపురం బ్రిడ్జి, మున్నేరు పొంగితే వరదలు వచ్చే ప్రాంతాలు, మున్నేరు రెండువైపులా బ్యూటిఫి కేషన్‌ గురించి నాతో కొట్లాట పెట్టుకున్నడు అజయ్‌. నీకే ఎన్ని డబ్బులయ్యా అంటే.. కాదు సార్‌ మాకు కావాలని పట్టుపట్టి రూ.700కోట్లు మంజూరు చేయించుకున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే మున్నేరుపై తీగల వంతెన కావాలని. ఈ బ్రిడ్జి అయి తే ఇంకా అందం వస్తుందని ఆయన ప్రయత్నం.

ఐటీ టవర్‌ను ఊహించామా?
ఖమ్మంలో ఐటీ టవర్‌ కలలో కూడా ఊహించామా. అజయ్‌కి ఇక్కడ సొంతంగా మెడికల్‌ కాలేజీ ఉంది. అయినా పట్టుపట్టి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ తెప్పించుకున్నడు. రవాణా మంత్రిగా ఉన్నందుకు హైటెక్‌ బస్టాండ్‌ కట్టించాడు. రూ.40 కోట్లతో కల్యాణమండపం కట్టిస్తుండు. పద్ధతి ప్రకారం.. కమిట్‌మెంట్‌తో చేస్తే ఈ పనులన్నీ తయారవుతాయి.

నీళ్ల కష్టాలు తప్పాయి..
పక్కనే పాలేరు రిజర్వాయర్‌ ఉన్నా.. వారానికి ఒకరోజు నీళ్లు వచ్చేవి. బిందెలు పట్టుకుని యుద్ధాలు జరిగేవి. ఈ రోజు 75 వేల నల్లా కనెక్షన్లు ఖమ్మంలో ఇచ్చాం. రూ.1కి కనెక్షన్‌తో బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చాం. ఆడబిడ్డలు ఇంట్లోనే ట్యాప్‌లు తిప్పుతున్నరని అజయ్‌ చెబుతున్నడు. గతంలో కరెంట్‌ ఎట్ల ఉండె. ఈరోజు ఎలా ఉందో దయచేసి ఆలోచించాలి. గతంలో ప్రతీ ఇంట్లో ఇన్వర్టర్‌, కన్వర్టర్‌, స్టెబి లైజర్‌ ఉండగా, ఇప్పుడు అవేవీ లేవు.

మట్టిరోడ్డు లేదు..
మీకు మంచి ఎమ్మెల్యే, మంచి ఎంపీ ఉన్నరు. ఎమ్మెల్యే ఒక్క రఘునాథపాలెం మండలాన్ని రూ.300 కోట్ల తో అభివృద్ధి చేసిండు. వెతుకుదామ న్నా మట్టిరోడ్డు లేదు. ఇరవై కొత్త పంచాయతీలు చేయించి తీర్చిదిద్దాడు. మైనార్టీల కోసం ఖమ్మంలో మీ ఎమ్మెల్యే అన్నీ చేసినందుకే ప్రేమతో అజయ్‌ ఖాన్‌ అని పిలుస్తారు.

వాడవాడలా సైకిల్‌పై తిరిగిండు..
వాడవాడలో పువ్వాడ అని పేపర్లలో చదివి మేము చర్చ చేసే వాళ్లం. సైకిల్‌ వేసుకుని, ప్రజల్లో కలిసిపోయి.. బ్రహ్మాండంగా కష్టం చేస్తే ఇవన్నీ జరిగాయి. నాడు ఖమ్మంలో ఉన్న 400 కి.మీ. రోడ్లను 1,115 కి.మీ.కు, డ్రెయిన్లను 205 కి.మీ. నుంచి 1,592 కి.మీ.కు తీసుకుపోయింది పువ్వాడ కాదా ప్రజలు ఆలోచించాలి. గోళ్లపాడు కట్ట మీద ఉన్న వారికి వెలుగుమట్లలో పునరావాసం కల్పించాం. గోళ్లపాడు చానల్‌, లకారం చెరువు చిటికేస్తే కాలేదు. ఏడేళ్లు కష్టపడితే రూపు కనపడుతోంది. హెలీకాప్టర్‌ నుంచి చూస్తే సుందరంగా ఉంది.

వాళ్లిద్దరు కరటక దమనకులు..
జిల్లాలో ఇద్దరు కరటక, దమనకులు ఉన్నారు. పరవస్తు చిన్నయసూరి రాసిన కథ చదివితే వాళ్లేంటో తెలుస్తది. ఇవ్వాళ వాళ్ల పీడ వదిలి ఖమ్మం శుభ్రంగా ఉంది. జిల్లాలో మంచి రిజల్ట్స్‌ రాబోతున్నాయి. దీంట్లో అనుమానం లేదు. తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? అది కాదు రాజకీయం.

అరాచకంగా మాట్లాడుతున్నరు. బీఆర్‌ఎస్‌ వారిని అసెంబ్లీ గడప తొక్కనీయనని ఒక అర్భకుడు మాట్లాడుతున్నాడు. ఖమ్మంను గుత్తకు పట్టినవా.. జిల్లానే కొనేశావా.. జిల్లా ప్రజలు.. ప్రజాస్వామ్యవాదులు దీన్ని సహిస్తరా? ఎంత వరకు ధర్మం. చైతన్యవంతమైన జిల్లా ఖమ్మం. పోరాటాల ఖిల్లా. కమ్యూనిస్టు పార్టీలు ఎంతో చైతన్యం తెచ్చాయి. వీటన్నింటినీ ప్రజలు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు అజయ్‌కు వేయాలి.

ఈ సభలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, లింగాల కమల్‌రాజ్‌, బానోతు మదన్‌లాల్‌, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, వివిధ సంస్థల చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్‌, రాయల శేషగిరిరావు, దోరేపల్లి శ్వేత, మేయర్‌, డిప్యూటీ మేయర్లు పునుకొల్లు నీరజ, ఫాతిమా, జెడ్పీటీసీ మాలోత్‌ ప్రియాంక, నేతలు బొంతు రాంమోహన్‌, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, నల్ల మల వెంకటేశ్వరరావు, కృష్ణచైతన్య, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, పులి పాటి ప్రసాద్‌, ఖమర్‌, షౌకత్‌అలీ, జహీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: అభ్యర్థులూ.. అలర్ట్‌! ప్రచారానికి ఎన్నికల సంఘం నిబంధనలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement