కమ్యూనిస్టుల కోటలో హస్తం హవా.. 11 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు! | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టుల కోటలో హస్తం హవా.. 11 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు!

Published Thu, Nov 2 2023 5:26 AM | Last Updated on Thu, Nov 2 2023 12:02 PM

- - Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలో చైతన్యవంతమైన నియోజకవర్గంగా, ఉద్యమ స్ఫూర్తి కలిగిన ప్రాంతంగా పాలేరు నిలుస్తోంది. పాలేరు నియోజకవర్గం అనగానే జిల్లా రైతాంగానికి కల్పతరువైన రిజర్వాయర్‌.. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన జవహర్‌ నవోదయ విద్యాలయ, రాష్ట్రంలోనే తొలి మత్స్య పరిశోధనా కేంద్రం గుర్తుకొస్తాయి. ఈ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటంలోనేకాక ప్రజా ఉద్యమాల్లోనూ ముందుండి పోరాడారు.

దళిత, గిరిజన, బీసీ కులాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో గెలుపోటముల్లోనూ వారే కీలకమవుతున్నారు. ఇకపోతే ఇక్కడి నుంచి గెలిచిన సంభాని చంద్రశేఖర్‌, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించగా.. ఉప ఎన్నికలు సహా 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 11సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించడం విశేషం.

తొలుత రిజర్వ్‌డ్‌.. ఆతర్వాత జనరల్‌
1962కు ముందు పాలేరు నియోజకవర్గం ఖమ్మంలో కలిసి ఉండేది. 1962లో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలతో నియోజకవర్గం ఏర్పడగా 2004 వరకు ఎస్సీ రిజర్వ్‌ డ్‌ స్థానంగా కొనసాగింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్‌స్థానంగా మారింది. ఆ సమయాన ముదిగొండ మండలం పక్కనే ఉన్న మధిర నియోజకవర్గంలో కలవగా, ఖమ్మం నియోజ కవర్గం నుంచి ఖమ్మం రూరల్‌ మండలాన్ని పాలేరులో కలిపారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్‌ నియోజకవర్గాల్లో ఇదొ కటి కావడంతో ఇక్కడ పోటీ చేయడానికి నేతలు పోటీ పడుతుంటారు.

ఓటర్లు..
నియోజకవర్గంలో 2,32,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో1,12,607 మంది పురుషులు, 1,19,994 మంది మహిళా ఓటర్లు ఉండగా, ఇతరుల కేటగిరీ నుంచి ఐదుగురు ఉన్నారు. కాగా, మొత్తం ఓటర్లలో 56,992 మంది యువత ఉండడం ఈ నియోజకవర్గం మరో ప్రత్యేకత.

కాంగ్రెస్‌కు కంచుకోట..
పాలేరు నియోజకవర్గాన్ని ఆది నుంచి కాంగ్రెస్‌ కంచుకోటగానే భావిస్తారు. ఇక్కడ కమ్యూనిస్టులకు పట్టు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రంగా నిలుస్తున్నా, కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. కాగా, నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా ఉంది. ఇక్కడి నుంచి గతంలో రెండు సార్లు సీపీఎం, ఓసారి సీపీఐ అభ్యర్థి గెలుపొందారు. కాలక్రమేణా కమ్యూనిస్టుల ప్రాబవం తగ్గి వారు గెలిచే పరిస్థితి లేకున్నా గెలుపోటముల్లో కీలకంగా మారుతున్నారు.

స్థానికేతరులను ఆదరించిన గడ్డ!
నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేసే వారికి, పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారే తప్ప వ్యక్తులకు కాదని పలుమార్లు నిరూపితమైంది. అంతేకాక వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వారికే జై కొడతామని చాటారు. స్థానికులు కాకున్నా పలువురిని ఇక్కడ గెలిపించడం ఇందుకు నిదర్శమని చెప్పాలి. ఈ నియోజకవర్గం నుంచి స్థానికేతరులైన భీమపాక భూపతిరావు, సంభాని చంద్రశేఖర్‌, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పోటీకి దిగితే గెలిపించారు.

అనూహ్యంగా తీర్పులు!
ఇక్కడి నుంచి గెలిచి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సంభాని చంద్రశేఖర్‌, రాంరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. 2016 ఉప ఎన్నికలో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టు అయిన భక్త రామదాసు తన గెలుపును సునాయాసం చేస్తుందని ఆయన భావించినా, 2018 ఎన్నికల్లో ప్రజలు నియోజకవర్గ వాసి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డిని గెలిపించారు. ఈసారి పాలేరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

ఇప్పటి వరకు ఎన్నికై న ఎమ్మెల్యేలు..
1962 - కత్తుల శాంతయ్య, కాంగ్రెస్‌
1967 - కత్తుల శాంతయ్య, కాంగ్రెస్‌
1972 - కత్తుల శాంతయ్య, కాంగ్రెస్‌
1978 - పొట్టపింజర హుస్సేనయ్య, కాంగ్రెస్‌
1981 - (ఉప ఎన్నిక) సంభాని చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌
1983 - భీమపాక భూపతిరావు, సీపీఐ
1985 - బాజీ హన్మంతు, సీపీఎం
1989 - సంభాని చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌
1994 - సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం
1999 - సంభాని చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌
2004 - సంభాని చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌
2009 - రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌
2014 - రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌
2016 - (ఉప ఎన్నిక) తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌
2018 - కందాళ ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌

మంత్రులుగా స్థానం!
పాలేరు నియోజకవర్గం నుండి గెలిచిన వారిలో పలువురికి మంత్రివర్గాల్లో స్థానందక్కంది. ఇక్కడి నుండి గెలిచిన సంభాని చంద్రశేఖర్‌ 1981, 1989, 2004ల్లో ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, దేవాదాయ, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యుత్‌ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

2009 లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాంరెడ్డి వెంకటరెడ్డి సహకార, ఉద్యానవన, బాయిలర్స్‌ లాంటి కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. ఇక 2016 ఉప ఎన్నికలో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆర్‌అండ్‌బీ, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ మంత్రి పదవులు దక్కాయి.
ఇవి చదవండి: 'సొంత సైన్యం..!' అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే పరిస్థితి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement