సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్ సాధన కోసం ఆశావహులు పలువురు హస్తినలో మకాం వేసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
మొదటి జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రెండు స్థానాలున్నాయి. మిగిలిన స్థానాలకు జాబితా ఒకటి, రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు తెలిసింది. అయితే, సీపీఎం, సీపీఐతో పొత్తు వ్యవహారంలో పీటముడి వీడకపోగా.. ఉమ్మడి ఖమ్మంలో ఒక్కో స్థానాన్ని సీపీఐ, సీపీఎంకు కేటాయించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు అంగీకరించినట్లు తెలిసింది. అయితే చర్చలు పూర్తికాకున్నా వైరా స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.
తుది దశకు కసరత్తు..
కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు అంశం తుది దశకు చేరగా.. తొలి దశ టికెట్ల ప్రకటన సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అసంతృప్తులను బుజ్జగించాకే రెండో జాబితా విడుదల చేయనున్నట్లు తెలిసింది. రెండో జాబితాలో కీలకమైన స్థానాలు ఉండనున్నందున అధిష్టానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పలుమార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ గెలుపు గుర్రాల ఎంపికకు కసరత్తు పూర్తి చేసింది. సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా గెలిచే వారిని ఎంపిక చేయాలని గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం.
సాధనాశూరులు
ఉమ్మడి జిల్లా నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జనరల్ స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారైన నేపథ్యాన రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ తీవ్ర పోటీ ఉన్నందున అభ్యర్థులపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే మధిర, భద్రాచలం రిజర్వ్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్‌లనే ప్రకటించింది. జనరల్ స్థానా లైన ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి పేర్లు ఖరారైనట్లే. ఇక కొత్తగూడెం సీపీఐకి కేటాయిస్తే.. సత్తుపల్లి, వైరా, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈనేపథ్యాన సీఎల్పీ నేత భట్టి, పొంగులేటి ఢిల్లీలో ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
సత్తుపల్లిలోనూ ఇదే సీన్..
సత్తుపల్లి టికెట్ కోసం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మట్టా దయానంద్, మానవతారాయ్, మట్టా రాగమయి, కొండూరు సుధాకర్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎవరికి వారే టీపీసీసీ నుంచి ఏఐసీసీ వరకు ప్రయత్నాలు చేశారు.
ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో మాదిగలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. పార్టీని అంటిపెట్టుకున్న కుటుంబానికే టికెట్ కేటాయించాలన్న ప్రతిపాదనలను ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. భట్టి, పొంగులేటి, రేణుకా చౌదరి వర్గాలకు చెందిన నేతలు ఇక్కడి నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో చివరకు ఎవరి పేరు ఖరారు చేస్తారనే అంశంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ స్థానాల్లో హాట్.. హాట్!
ప్రధానంగా వైరా, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లెందు నుంచి ఏకంగా 32 మంది దరఖాస్తు చేసుకోగా.. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికే టికెట్ ఇవ్వాలన్న ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక వైరా నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి వర్గీయులు ఎవరికి వారు తమకే టికెట్ అన్న ధీమాతో ఉన్నారు.
ఆయా నేతలు సైతం తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేలా ఏఐసీసీ స్థాయిలో పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీపీఐ, సీపీఎంతో పొత్తు ఖాయమన్న సమాచారంతో కొత్తగూడెం సీపీఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భద్రాచలం స్థానాన్ని తొలి జాబితాలోనే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించడంతో సీపీఎం ఆశించిన స్థానాన్ని కోల్పోయినట్లయింది. దీంతో ఉమ్మడి జిల్లాలో వైరా నియోజకవర్గాన్ని సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం మొదలుకావడంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment