సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియగా, ప్రధాన పార్టీల అభ్యర్థులకు చాలా వరకు రెబల్స్ బెడద తప్పింది. చెప్పుకోదగిన స్థాయిలో సొంత పార్టీ నేతలు బరిలోకి దిగకపోవడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, టికెట్ దక్కని ఆశావహులు ఆవేదనకు గురైనా అధినాయకత్వాలు బుజ్జగించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
మరికొందరు అసంతృప్త నేతలు పార్టీ మారినా అభ్యర్థుల ప్రకటన పూర్తికావడంతో పోటీ చేసే పరిస్థితి లేదు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలామంది సాహసించలేదు. కొత్తగూడెంలో మాత్రం బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు చివరకు రాజీనామా చేసి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్‌బీ) పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కలిసొచ్చిన ముందస్తు ప్రకటన!
బీఆర్‌ఎస్ అభ్యర్థులను రెండున్నర నెలల ముందుగానే ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ మినహా మిగిలిన చోట్ల సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించారు. దీంతో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన ఆశావహులు కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియపై కొందరు నేతలు, వైరా అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ భగ్గుమన్నప్పటికీ మంత్రులు పువ్వాడ, కేటీఆర్ బుజ్జగించడంతో శాంతించారు.
భద్రాచలంలో తెల్లం వెంకట్రావుకు టికెట్ కేటాయించడాన్ని స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. మరికొన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉన్నా బయటపడలేదు. కాగా, అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతో అసంతృప్త నేతలకు నచ్చజెప్పేందుకు అగ్ర నాయకత్వానికి సమయం దొరికినట్టయింది. కొన్నిచోట్ల అభ్యర్థులకు మద్దతు ప్రకటించినా మరికొన్ని చోట్ల పార్టీ మారారు. ఇదే క్రమంలో పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు.
దఫదఫాలుగా కాంగ్రెస్..
కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేసింది. సర్వే నివేదికలు, గెలుపు అవకాశాలు కలిగిన అభ్యర్థులను వడపోసిన తర్వాతే జాబితా సిద్ధం చేసింది. దీనికి చాలా సమయం పట్టడంతో ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ తిరిగారు. తొలుత ఎలాంటి ఇబ్బంది లేని మధిర నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల, పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లును ప్రకటించింది.
ఇక ఇల్లెందు టికెట్ కోసం ఎక్కువ మంది పోటీపడగా, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట అభ్యర్థుల ప్రకటనలోనూ ఆలస్యమైంది. ఈనెల 6న రాత్రి కాంగ్రెస్ పార్టీ వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అసంతృప్తులు ఆందోళనలు చేపట్టారు. కాగా, పొత్తులో భాగంగా కొత్తగూడెం టికెట్‌ను సీపీఐకి కేటాయించడంతో అక్కడి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకే ఒక్కడు..
టికెట్ దక్కని అసంతృప్తుల్లో చాలామంది ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగానే ఉన్నారు. ఈ అంశం ప్రధాన పార్టీల అభ్యర్థులకు కలిసొస్తుందని నమ్ముతున్నారు. టికెట్ దక్కని వారు రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యేవారు. కానీ ఈసారి కాంగ్రెస్‌లోని అసంతృప్తులు బీఆర్‌ఎస్‌లో చేరారే తప్ప బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపలేదు.
గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావుకు ఈసారి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి నామినేషన్ వేశారు. కొత్తగూడెంలో జలగం మినహా ఎక్కడ కూడా రెబల్ అభ్యర్థులు చెప్పుకోదగిన స్థాయిలో లేకపోగా.. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం చాలా మంది నామినేషన్ వేయడం గమనార్హం.
అసంతృప్త నేతలు బీఆర్‌ఎస్ వైపు!
కాంగ్రెస్‌లో టికెట్ దక్కని అసంతృప్త నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, ఇల్లెందుకు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్‌గౌడ్, కొత్తగూడేనికి చెందిన ఎడవల్లి కృష్ణ, సత్తుపల్లికి చెందిన మానవతారాయ్, కొండూరి సుధాకర్, ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి తదితరులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షాన బీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు.
ఇవి చదవండి: పొలిటికల్ పటాకులు.. పేలుతున్న డైలాగులు!
Comments
Please login to add a commentAdd a comment