‘పార్టీ ఆదేశానుసారం' టికెట్‌ ఎవరికిచ్చినా.. మేం పార్టీకే పనిచేస్తాం! | - | Sakshi
Sakshi News home page

‘పార్టీ ఆదేశానుసారం' టికెట్‌ ఎవరికిచ్చినా.. మేం పార్టీకే పనిచేస్తాం!

Nov 5 2023 12:14 AM | Updated on Nov 5 2023 1:22 PM

- - Sakshi

సాక్షి, ఖమ్మం: అశ్వారావుపేట నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ ఇవ్వడంతో ప్రచారంలో జోరు పెంచారు. కొద్ది నెలలుగా కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారంటీ కార్డుల పేరుతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రచారం చేశారు. మారుమూల గ్రామాల్లో సైతం కాంగ్రెస్‌ పార్టీ వాణి వినిపించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఆశావాహులు నాయకులు శ్రమించారు.

కాంగ్రెస్‌ పార్టీ లో 2007 నుంచి క్రియాశీల కార్యకర్తగా మొదలుపెట్టి దమ్మపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నామినేటెడ్‌ పదవి పొంది, ప్రస్తుత ముల్కలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్న సున్నం నాగమణి 2018లోనే కాంగ్రెస్‌ పార్టీ బీఫాం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో మహాకూటమి ఒప్పందంలో భాగంగా అశ్వారావుపేట సిగ్మెంట్‌ టీడీపీకి కేటాయించడంతో ఆమె నిరాశకు గురయ్యారు. కానీ, పార్టీ నిర్ణయం మేరకు మెచ్చా గెలుపుకు కృషి చేశారు.

ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశీస్సులతో అశ్వారావుపేట టికెట్‌ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్‌ నుంచి బయటకొచ్చి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అశ్వారావుపేట తొలి ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కుటుంబం నుంచి వచ్చి న వగ్గెల పూజ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన ముఖ్య నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనతోపాటు జారే ఆదినారాయణ, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆశావాహుల అంచనాలు తారుమారయ్యాయి.

ఎవరికిచ్చినా పనిచేస్తారా?
‘పార్టీ ఆదేశానుసారం టికెట్‌ ఎవరికిచ్చినా.. మేం పార్టీకే పనిచేస్తాం. అందరి సమన్వయంతో అశ్వారావుపేట స్థానాన్ని మొ దట గెలుచుకుంటాం..’ అని వేదికలపై ఉపన్యాసాలు చేసిన వారు ఇప్పుడు కనిపించడం లేదనే ప్రచారం నడుస్తోంది. నామినేషన్‌ దాఖలుకు ఆఖరి క్షణం వరకు తాను నమ్ముకున్న పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తూ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఆ తర్వాత రెబెల్‌, ఇండిపెండెట్లుగా బరిలో ఉండటం అన్నిచోట్లా సహజంగా జరిగేదే. కానీ, టికెట్‌ వస్తేనే ప్రచారంలోకి దిగుతాం.

లేదంటే అప్పటిదాకా మిన్నకుంటాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా..? వారికి స్వప్రయోజనాలు తప్ప పార్టీ మనుగడ అవసరం లేదా..? హస్తం గుర్తుపై పోటీ చేసే అవకాశం కల్పిస్తేనే పార్టీకి పని చేస్తారా..? లేకుంటే పార్టీ కోసం పనిచేయరా? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. టికెట్‌ ఎవరికి దక్కినా.. బూత్‌ స్థాయి నుంచి పార్టీ ప్రచారం, ఇతర బాధ్యతలను నెరవేరుస్తామని చెబుతున్నా అందులో నిజం ఎంత ఉంటుందోనని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్‌ టికెట్‌ ఖరారు చేస్తే ప్రచారంలో దూసుకుపోతామని ఆశావహులు సైతం చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టికెట్‌ కోసం ప్రదక్షిణలు..
కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఢిల్లీ మొదలుకుని పార్టీలోని సీనియర్లు, సబ్‌ జూనియర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు. ఓవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించే వారికంటే వారికోసం పట్టుపట్టే వారు ఢిల్లీలో ఉంటే సరిపోతుందట. కానీ. వారం రోజుల కిందటి వరకు జోరుగా ప్రచారం చేసిన ఆశావాహులు నియోజకవర్గంలో కనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత అధికార పార్టీ అభ్యర్థి ప్రచారం.. ప్రచారరథాలు చక్కర్లు కొడుతున్నా.. అప్పటిదాకా ఆరు గ్యారెంటీ కార్డులని.. చంటిపిల్లలను ఎత్తుకుని.. ముసలి వాళ్లతో ముచ్చటించి.. ఇలా పరురకాల ప్రచార ఎత్తుగడను పాటించిన ఆశావాహులేమయినట్లని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ‘మాకు టికెట్‌ ఇవ్వకున్నా ఫర్వాలేదు.. ఫలానా వ్యక్తికి మాత్రం ఇవ్వొద్దు’ అని అధిష్టానం ఎదుట ఇద్దరు అన్నారని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది.
ఇవి చదవండి: ‘మూడు’ ఎలా ఉంటుందో..? చివరి నిమిషం వరకు చిక్కుల్లో సీపీఐ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement