సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం పోటాపోటీ నెలకొంది. పలువురు ఆశావహులు ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీ నేత వి.హన్మంతరావు, రేణుకాచౌదరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, ఇంకా పలువురు ముఖ్యనేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే టీపీసీసీ ఏఐసీసీకి ప్రతిపాదన పంపింది. అయితే ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న హేమాహేమీల్లో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది.
గెలుపు సులువనే భావన..
రాష్ట్రంలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలతో పాటు ఖమ్మం సీటు రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హీటెక్కిస్తోంది. ఇక్కడి టికెట్ దక్కించుకుంటే విజయం నల్లేరుమీద నడకేనన్న భావన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయఢంకా మోగించాయి. అంతేకాకుండా అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఆరు అసెంబ్లీ స్థానాల పరిధిలో కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఐకి కలిపి మొత్తంగా 7,33,293 ఓట్లు, బీఆర్‌ఎస్‌కి 4,67,639 ఓట్లు పోలయ్యాయి.
ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య 2,65,654 ఓట్ల తేడా ఉంది. ఈ విశ్లేషణతో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు ఖమ్మం పార్లమెంట్ టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. టికెట్ దక్కితే విజయం సునాయసంగా వరిస్తుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆపార్టీ నేతలే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన నేతలు కూడా తమ సామాజిక వర్గం ఓట్లను పరిగణనలోకి తీసుకొని పోటీకి సై అంటున్నారు.
దరఖాస్తు అయితే చేశాం..
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ గత నెల 30 నుంచి శనివారం వరకు గాంధీభవన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ నేత రేణుకాచౌదరి టికెట్ మళ్లీ తనకే ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, వి.హన్మంతరావు, ప్రముఖ వ్యాపారవేత్త వంకాలయపాటి రాజేంద్రప్రసాద్, నాగా సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తులు సమర్పించిన వారిలో ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న నేతలంతా సోనియాగాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేయకపోతే తమకే టికెట్ దక్కాలన్న ప్రయత్నాల్లో ఏఐసీసీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్య నేతల కుటుంబీకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేయడంతో.. పార్టీ ఎవరికి టికెట్ కట్టబెడుతుందోనని కేడర్‌లో చర్చ ప్రారంభమైంది.
సోనియా కాకపోతే మరెవరు..?
ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పార్టీ అగ్రనేత సోనియాగాంధీని బరిలోకి దింపాలని టీపీసీసీ ఇటీవల ఏఐసీసీకి ప్రతిపాదన పంపింది. దీనిపై ఏఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆశావహ నేతలంతా సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీకి దిగేందుకు జై కొడుతూనే.. తమ నేత ఈ స్థానం నుంచి పోటీ చేయకపోతే తామే బరిలో ఉంటామని ఎవరికివారు ఆశల పల్లకీలో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పోలైన ఓట్లను బేరీజు వేసుకుని సోనియాగాంధీని ఈ స్థానం నుంచి పోటీ చేయిస్తే గెలుపు కోసం అంతగా కష్టపడాల్సిన అసవరం లేదన్న చర్చ ఆపార్టీ ముఖ్య నేతల్లో జరిగింది. అయితే సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్తారన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలతో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే బరిలో దింపాల్సిన బలమైన నేత ఎవరన్నది ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారనుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతల కుటుంబీకులతో పాటు, పార్టీ పట్ల తొలి నుంచి విధేయత చూపుతున్న ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు కూడా ఈ టికెట్ ఆశిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment