Khammam Parliament
-
Khammam: ఆమె కాదంటే టికెట్ ఎవరికో..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం పోటాపోటీ నెలకొంది. పలువురు ఆశావహులు ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీ నేత వి.హన్మంతరావు, రేణుకాచౌదరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, ఇంకా పలువురు ముఖ్యనేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే టీపీసీసీ ఏఐసీసీకి ప్రతిపాదన పంపింది. అయితే ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న హేమాహేమీల్లో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది. గెలుపు సులువనే భావన.. రాష్ట్రంలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలతో పాటు ఖమ్మం సీటు రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హీటెక్కిస్తోంది. ఇక్కడి టికెట్ దక్కించుకుంటే విజయం నల్లేరుమీద నడకేనన్న భావన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయఢంకా మోగించాయి. అంతేకాకుండా అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఆరు అసెంబ్లీ స్థానాల పరిధిలో కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఐకి కలిపి మొత్తంగా 7,33,293 ఓట్లు, బీఆర్ఎస్కి 4,67,639 ఓట్లు పోలయ్యాయి. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య 2,65,654 ఓట్ల తేడా ఉంది. ఈ విశ్లేషణతో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు ఖమ్మం పార్లమెంట్ టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. టికెట్ దక్కితే విజయం సునాయసంగా వరిస్తుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆపార్టీ నేతలే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన నేతలు కూడా తమ సామాజిక వర్గం ఓట్లను పరిగణనలోకి తీసుకొని పోటీకి సై అంటున్నారు. దరఖాస్తు అయితే చేశాం.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ గత నెల 30 నుంచి శనివారం వరకు గాంధీభవన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ నేత రేణుకాచౌదరి టికెట్ మళ్లీ తనకే ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, వి.హన్మంతరావు, ప్రముఖ వ్యాపారవేత్త వంకాలయపాటి రాజేంద్రప్రసాద్, నాగా సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తులు సమర్పించిన వారిలో ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న నేతలంతా సోనియాగాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేయకపోతే తమకే టికెట్ దక్కాలన్న ప్రయత్నాల్లో ఏఐసీసీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్య నేతల కుటుంబీకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేయడంతో.. పార్టీ ఎవరికి టికెట్ కట్టబెడుతుందోనని కేడర్‌లో చర్చ ప్రారంభమైంది. సోనియా కాకపోతే మరెవరు..? ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పార్టీ అగ్రనేత సోనియాగాంధీని బరిలోకి దింపాలని టీపీసీసీ ఇటీవల ఏఐసీసీకి ప్రతిపాదన పంపింది. దీనిపై ఏఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆశావహ నేతలంతా సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీకి దిగేందుకు జై కొడుతూనే.. తమ నేత ఈ స్థానం నుంచి పోటీ చేయకపోతే తామే బరిలో ఉంటామని ఎవరికివారు ఆశల పల్లకీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పోలైన ఓట్లను బేరీజు వేసుకుని సోనియాగాంధీని ఈ స్థానం నుంచి పోటీ చేయిస్తే గెలుపు కోసం అంతగా కష్టపడాల్సిన అసవరం లేదన్న చర్చ ఆపార్టీ ముఖ్య నేతల్లో జరిగింది. అయితే సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్తారన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలతో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే బరిలో దింపాల్సిన బలమైన నేత ఎవరన్నది ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారనుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతల కుటుంబీకులతో పాటు, పార్టీ పట్ల తొలి నుంచి విధేయత చూపుతున్న ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు కూడా ఈ టికెట్ ఆశిస్తుండడం గమనార్హం. -
ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం
-
లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 1.32 కోట్లు
ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్థుల వ్యయ వివరాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 21 మంది అభ్యర్థులు మాత్రమే ఖర్చుల వివరాలను అందజేశారు. వీరు మొత్తం రూ.1,32,67,835లను ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పరిమితికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులతో పాటు వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యయ పరిశీలకులనూ నియమించింది. ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 డిపాజిట్‌గా, ఇతర అభ్యర్థులకు రూ.25 వేలుగా నిర్ణయించింది. చాలా మంది అభ్యర్థులు డిపాజిట్ చేసిన మేరకు కొద్దిగా అటూఇటుగా ఖర్చు చేసినట్లు చూపించారు. 153 మంది వ్యయ వివరాలిచ్చారు.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్రీనరేశ్ ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన 170 మంది అభ్యర్థులకు 153మంది వ్యయ వివరాలను సమర్పించారని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పి.కె.డ్యాస్ జిల్లా ఎన్నికల అధికారి, వ్యయ పరిశీలకులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో ఖర్చుల వివరాలు అందించాలని ఆదేశించామన్నారు. మిగిలిన వారిని సైతం నివేదికలు ఇచ్చేలా మళ్లీ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. మీడియా సర్టిఫికెట్, మానిటరింగ్ కమిటీ గుర్తించి పెయిడ్ న్యూస్, పత్రికా ప్రకటనలకు సంబంధించి అభ్యర్థులకు నోటీ సులు ఇచ్చామన్నారు. సదరు ఖర్చులను వారి ఖాతాలో జమచేశామని తెలిపారు. డెరైక్టర్ జనరల్ మాట్లాడుతూ అభ్యర్థులు అందిం చిన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిపోర్టులను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు ఖర్చుల వివరాలను అందించని అభ్యర్థుల నుంచి వెంటనే వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏయే అంశాల్లో మెరుగ్గా వ్యవహరించారో వివరాలు అందించాలని సూచించారు. వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమైన అంశాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్ట్రానిక్ మెయిల్ పంపాలని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ వ్యయ పరిశీలకులకు రాజ్‌కుమార్, ముత్తు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి శ్రీనివాస్, ఎన్నికల తహశీల్దార్ యూసుఫ్‌అలీ పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా తాను సాధించిన విజయం జిల్లా ప్రజలదేనని ఖమ్మం ఎంపీగా వైఎస్ఆర్ సీపీ నుంచి ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. తనను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 14 నెలల పాటు తాను చేసిన ఈ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రజలు తన పట్ల తిరుగులేని ఆదరణ చూపించారని, దీన్ని ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆశించిన విధంగా జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కొన్ని శక్తులు వైఎస్సార్సీపీపై కక్ష కట్టి తనకు ఆశించిన స్థాయిలో మెజారిటీ రాకుండా కుట్ర చేశాయని అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా జిల్లాలో వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేకపోయారన్నారు. రాజన్న దీవెనలు, జగనన్న సహకారం, జిల్లా ప్రజల ఆదరణతో లోక్‌సభ సీటుతో పాటు జిల్లాలో మూడు శాసనసభ స్థానాలు గెలిచామన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని, సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. 2019లో సీమాంధ్ర, తెలంగాణలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు తెచ్చిన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మద్దతు కోరే అర్హత సీపీఐకి లేదు: తమ్మినేని
కాంగ్రెస్‌ను వదిలేస్తేనే ఖమ్మంలో నారాయణకు మద్దతు: తమ్మినేని సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వదిలి రానంత వరకు సీపీఐకి తమ మద్దతు కోరే అర్హత లేదని సీపీఎం వ్యాఖ్యానించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేసే సీపీఐకి.. పార్లమెంట్ విషయంలో తామెలా సహకరిస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వదిలేస్తేనే ఖమ్మం పార్లమెంట్ బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు తమ మద్దతు ఉంటుందని, లే కపోతే ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ఎవరు పొత్తు పెట్టుకున్నా, కూటమిగా జట్టుకట్టినా వారిని ఓడించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తుందని తేల్చిచెప్పారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. సీపీఎం ప్రకటించిన ముగ్గురు ఎంపీ, 38 మంది అసెంబ్లీ అభ్యర్థులకు రాష్ట్ర కమిటీ ఆమోదం లభించినట్లు వెల్లడించారు. మరో పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ భావించిందని, మొత్తమ్మీద తమ అభ్యర్థులు 42 స్థానాలకు మించరన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఏవైనా పార్టీలు కలిసొస్తే వీటిలో పోటీ నుంచి తమ అభ్యర్థులను తగ్గించుకుంటామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి ఏ పార్టీతో కూడా రాష్ట్రస్థాయిలో పొత్తులు లేకపోవచ్చన్నారు. కాంగ్రెస్, బీజేపీ కూటములకు వ్యతిరేకంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ఏదైనా రాజకీయపార్టీ లేదా స్వతంత్రులకు మద్దతిస్తామని చెప్పారు. ఇప్పటివరకు మందకృష్ణ నేతృత్వంలోని ఎంఎస్పీ(వరంగల్ వరకు మాత్రమే), టీఆర్ఎస్ (నల్లగొండ వరకు), వైఎస్సార్సీపీ నుంచి కొన్ని చోట్ల మద్దతు కోసం ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటి విషయంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగాలు పెంచే విధానం వారికుందా? ‘‘కొన్ని రాజకీయ పార్టీలు ఇంటికొక ఉద్యోగమంటున్నాయి. అది అమలు చేసే విధానం ఆ పార్టీకి ఉందా అనేది మా ప్రశ్న. ఉద్యోగాలను పెంపొందించే విధానం వారికుందా? సబ్సిడీ ఇవ్వాలంటే దాన్ని ఆమోదించే విధానం ఆర్థిక రంగం లో ఉండాలి. కానీ పార్టీలన్నీ ఆర్థిక విధానాల పట్ల సరళీకృత విధానాలను అవలంబిస్తున్నాయి’’ అని తమ్మినేని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరు రాష్ట్రాల్లో సహృద్భావ వాతావరణమనే అంశాలతో వెళ్లనుందని చెప్పారు. -
నామినేషన్ల జోరు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం 26 నామినేషన్లు దాఖల య్యాయి. ఖమ్మం పార్లమెంట్‌కు నాలుగు, అసెంబ్లీ స్థానాలకు 22 నామినేషన్లు వేశారు. మధిర రెండు, పినపాక మూడు, ఇల్లెందు రెండు, పాలేరు నాలుగు, కొత్తగూడెం నాలు గు, వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో ఒక్కొక్క టి చొప్పున దాఖలయ్యాయి. అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పార్లమెంట్ అభ్యర్థులు.. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా గోకినపల్లి వెంకటేశ్వరరావు, బీఎస్పీ అభ్యర్థిగా దొడ్డా రాంబాబుయాదవ్, పోలవరం వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థులుగా కనకం తిరుమలరావు, కందుల రాములు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ అభ్యర్థులు వీరే.... జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు తొమ్మిదింటిలో నామినేషన్లు వేశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ చంద్ర, వైరాస్థానానికి లోక్‌సత్తా అభ్యర్థిగా తేజావత్ నర్సింహారావు, సత్లుపల్లికి స్వతంత్ర అభ్యర్థిగా లింగాల రవికుమార్, కొత్తగూడెం సెగ్మెంట్‌కు పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గునిపాటి సుధాకర్, బీజేపీ అభ్యర్థిగా మహ్మద్ అబ్దుల్మజిద్, స్వతంత్ర అభ్యర్థులుగా అరుద్ర సత్యనారాయణ, నమోజు గోవిందాచారి, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్ (రెండోసారి), స్వతంత్ర అభ్యర్థిగా మోతే మల్లయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా మలీదు నాగేశ్వరరావు, బీఎస్పీ నుంచి చైతన్య చేకూరి, ఇల్లెందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బోగ నందకిశోర్, బాణోత్ రవీంద్రనాయక్, పినపాక పిరమిడ్ పార్టీఆఫ్ ఇండియా అభ్యర్థిగా భూక్యా చిట్టిబాబు, స్వతంత్ర అభ్యర్థిగా ముక్తి సత్యం, బీఎస్పీ అభ్యర్థిగా చిన్న భద్రయ్య, మధిర నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా దారేల్లి అశోక్, టీఆర్ఎస్ అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్‌సత్తా అభ్యర్థిగా రవిమారుత్, స్వతంత్ర అభ్యర్థులుగా ఎస్కే బడేసాహేబ్, అక్కిరాల వెంకటేశ్వర్లు, బీఎస్పీ అభ్యర్థిగా అబ్దుల్కరీం షేక్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు చివరి తేదీ... సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారం నాటికి ముగుస్తుంది. ఆరోజు సాయంత్రం 3 గంటల వరకే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల స్క్రూటినీ, 12వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. కానీ కొన్ని పార్టీలు ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ తొందరపడి నామినేషన్ వేస్తే పార్టీ బీఫాం రాకుంటే ఇబ్బందుల్లో పడతామేమోనని ఆలోచిస్తున్నారు. నేడు అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించే అవకాశం ఉంది. ‘తొమ్మిది’ సెంట్మెంట్..! అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ సిట్టింగ్ అభ్యర్థులు కొందరు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. 9 సంఖ్య కలిసి వస్తుందనే నానుడి ఉండడంతో అందరూ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు 9వ తేదీ చివరిది కావడంతో అదే రోజు అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వేచి చూస్తున్నారు. 9 సంఖ్య కలిసి వస్తుందని, ఆరోజు నామినేషన్ దాఖలు చేస్తే విజయం వరిస్తుందనే ఆశలో అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగాపొంగులేటి నామినేషన్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఖమ్మం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొంగులేటితో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పొంగులేటి నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజన్న ఆశయ సాధన కోసమే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతాయని అన్నారు. గత నెల 5న ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తనను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ నేపథ్యంలోనే నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ప్రజలందరూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు బానోతు మదన్‌లాల్, యడవల్లి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు నిరంజన్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోరుగా నామినేషన్లు... ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు మూడోరోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఖమ్మం ఎంపీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాల్లో నామినేషన్లు బోణీ అయ్యాయి. . భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు మూడురోజులైనా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎంపీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఖమ్మం నగరానికి చెందిన బానోతు లక్ష్మానాయక్, కాంగ్రెస్ అనుబంధ సంఘమైన గాంధీపథం నుంచి బూసిరెడ్డి శంకర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం శాసనసభ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఖమ్మం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరపున కూరాకుల నాగభూషణం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కర్నాటి హరీష్ సక్సేనా, కొత్తగూడెం నియోజకవర్గానికి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, మధిర నియోజకవర్గానికి సీపీఎం తరఫున లింగాల కమల్‌రాజ్, పాలేరు నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్, వైరా నియోజకవర్గానికి లోక్‌సత్తా పార్టీ నుంచి తేజావత్ నరసింహారావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున భూక్యా బూదేష్, సత్తుపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. 9న తుది గడువు... సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు ఈనెల 9 చివరి తేదీ కావడంతో ఆ రోజు నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 6న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణను నిలిపివేశారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు మాత్రం రిటర్నింగ్ అధికారుల నుంచి ఇప్పటికే నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ముహూర్తం చూసుకుని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానం జాబితా ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులకు బీఫామ్‌లు అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పార్టీ టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేలా ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు, అఫిడవిట్లు సిద్ధం చేసుకుంటున్నారు. -
వైఎస్ఆర్ సీపీ గెలుపును ఆపలేరు
పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పొంగులేటి శ్రీని వాసరెడ్డి, పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ బుధవారం పాల్వంచ మండలంలోని పాండురంగాపురం, రెడ్డిగూడెం, పునుకుల, పుల్లాయిగూడెం తదితర గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చారు. జడ్పీటీసీ అభ్యర్థి బాలినేని నాగేశ్వరరావును, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పొంగులేటి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు మల్లయ్య (పాండురంగాపురం), బి.జ్యోతి (సూరారం), బండి వెంకటేశ్వర్లు (పాయకారియానంబైల్), నాయకులు జాలే జానకిరెడ్డి, తుమ్మల శివారెడ్డి, పిట్టల వెంకటనర్సయ్య, మోహన్‌రావు, కె.నాగిరెడ్డి, సండ్రుపట్ల శ్రీనివాసరెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవీ లాల్, భద్రయ్య, సలీమున్నీసాబేగం, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
తొందర పడ్డామా...?
ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: ఖమ్మం పార్లమెంటు స్థానానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అభ్యర్థిత్వ ప్రతిపాదన ఇప్పుడు ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ సీటుకు నారాయణ పేరును ప్రతిపాదించి తొందరపడ్డామా అనే అంతర్మథనం పార్టీలోని కొందరు నేతల్లో ప్రారంభమైంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, వారిని సంప్రదించకుండా నారాయణ పేరును ప్రతిపాదించారనే విమర్శలూ వస్తున్నాయి. కాగా, నారాయణ అభ్యర్థిత్వం పట్ల కొందరు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కూడా సమాచారం. నారాయణ ఖమ్మం వస్తే జిల్లాలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని, దీనివల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని, తమకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. దీనికి తోడు నారాయణ తెలంగాణకోసం ఎంత పోరాటం చేసినా సీమాంధ్రకు చెందిన వ్యక్తిగానే పరిగణిస్తున్నారని, దీనివల్ల ఆయన పోటీలో నిలబడితే జిల్లాలోని తెలంగాణవాదులు ఆయనకు ఓటేస్తారా అనే సందేహం కూడా పార్టీలో మొదలైంది. ఇప్పటి వరకు సీపీఐ నుంచి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీచేసిన వారంతా స్థానికులే కావడంతో పొత్తులో భాగంగా వచ్చే ఎంపీ స్థానానికి కూడా స్థానికులనే అభ్యర్థిగా నిలబెట్టాలనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది. నారాయణ అభ్యర్థిత్వం వ్యవహారం ఇలా ఉంటే.... పార్లమెంటు స్థానానికి తానే పోటీకి దిగుతానని పువ్వాడ నాగేశ్వరరావు తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో పార్టీని అంచెలంచెలుగా అభివృద్ధిచేయడంలో కీలకపాత్ర పోషించిన తనను కనీసం సంప్రదించకుండా స్థానికేతరులకు సీటు ఇవ్వాలని పార్టీలో కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పార్టీలోని సీనియర్‌ను నేతలంతా పువ్వాడ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించినట్టు సమాచారం. మరో గందరగోళం.... ఇదిలా ఉంటే.. అసలు తన అభ్యర్థిత్వంపై స్వయంగా నారాయణ చేసిన వ్యాఖ్యలు జిల్లా పార్టీ వర్గాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి తన అభ్యర్థిత్వం విషయంపై బుధవారం తిరుపతిలో మీట్‌దిప్రెస్‌లో నారాయణ మాట్లాడుతూ... అసలు ఖమ్మం అనేది తమ స్థానం కానే కాదని, తాము నల్లగొండ అడిగితే కాంగ్రెస్ వాళ్లు ఖమ్మం ఇస్తానన్నారని వ్యాఖ్యానించారు. దీంతోపాటు అసలు తన అభ్యర్థిత్వం గురించి తనకు తెలియదని, అంతా మీడియా వాళ్లే రాస్తున్నారని, జిల్లా నాయకులెవరూ తనను అడగలేదని ఆయన చెప్పారు. పైగా మరి ఈ వార్తలను మీరు ఖండిస్తారా అని ప్రశ్నిస్తే తానేమీ ఆ వార్తలను ఖండించబోనని చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు నారాయణ అభ్యర్థిత్వం ప్రతిపాదించే ముందు జిల్లా నాయకత్వం కనీసం ఆయన అభిప్రాయం తీసుకోలేదనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని సీనియర్ నాయకులకు చెప్పకుండా, అసలు నారాయణనే సంప్రదించకుండా అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రతిపాదిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం తమ స్థానం కానే కాదని చెప్పడం ద్వారా రేపటి రోజున ఎన్నికల బరిలో ఉంటే... కార్యకర్తల మనోస్థైర్యాన్ని ఆ వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని నేతలంటున్నారు. మొత్తం మీద నారాయణ అభ్యర్థిత్వం వ్యవహారం జిల్లా సీపీఐ నేతలకు చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి.