మద్దతు కోరే అర్హత సీపీఐకి లేదు: తమ్మినేని
కాంగ్రెస్‌ను వదిలేస్తేనే ఖమ్మంలో నారాయణకు మద్దతు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వదిలి రానంత వరకు సీపీఐకి తమ మద్దతు కోరే అర్హత లేదని సీపీఎం వ్యాఖ్యానించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేసే సీపీఐకి.. పార్లమెంట్ విషయంలో తామెలా సహకరిస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వదిలేస్తేనే ఖమ్మం పార్లమెంట్ బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు తమ మద్దతు ఉంటుందని, లే కపోతే ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ఎవరు పొత్తు పెట్టుకున్నా, కూటమిగా జట్టుకట్టినా వారిని ఓడించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తుందని తేల్చిచెప్పారు.
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. సీపీఎం ప్రకటించిన ముగ్గురు ఎంపీ, 38 మంది అసెంబ్లీ అభ్యర్థులకు రాష్ట్ర కమిటీ ఆమోదం లభించినట్లు వెల్లడించారు. మరో పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ భావించిందని, మొత్తమ్మీద తమ అభ్యర్థులు 42 స్థానాలకు మించరన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఏవైనా పార్టీలు కలిసొస్తే వీటిలో పోటీ నుంచి తమ అభ్యర్థులను తగ్గించుకుంటామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి ఏ పార్టీతో కూడా రాష్ట్రస్థాయిలో పొత్తులు లేకపోవచ్చన్నారు. కాంగ్రెస్, బీజేపీ కూటములకు వ్యతిరేకంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ఏదైనా రాజకీయపార్టీ లేదా స్వతంత్రులకు మద్దతిస్తామని చెప్పారు. ఇప్పటివరకు మందకృష్ణ నేతృత్వంలోని ఎంఎస్‌పీ(వరంగల్ వరకు మాత్రమే), టీఆర్‌ఎస్ (నల్లగొండ వరకు), వైఎస్సార్‌సీపీ నుంచి కొన్ని చోట్ల మద్దతు కోసం ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటి విషయంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఉద్యోగాలు పెంచే విధానం వారికుందా?
‘‘కొన్ని రాజకీయ పార్టీలు ఇంటికొక ఉద్యోగమంటున్నాయి. అది అమలు చేసే విధానం ఆ పార్టీకి ఉందా అనేది మా ప్రశ్న. ఉద్యోగాలను పెంపొందించే విధానం వారికుందా? సబ్సిడీ ఇవ్వాలంటే దాన్ని ఆమోదించే విధానం ఆర్థిక రంగం లో ఉండాలి. కానీ పార్టీలన్నీ ఆర్థిక విధానాల పట్ల సరళీకృత విధానాలను అవలంబిస్తున్నాయి’’ అని తమ్మినేని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరు రాష్ట్రాల్లో సహృద్భావ వాతావరణమనే అంశాలతో వెళ్లనుందని చెప్పారు.