ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఖమ్మం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొంగులేటితో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పొంగులేటి నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించారు.
అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజన్న ఆశయ సాధన కోసమే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతాయని అన్నారు. గత నెల 5న ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ నేపథ్యంలోనే నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ప్రజలందరూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు బానోతు మదన్‌లాల్, యడవల్లి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు నిరంజన్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోరుగా నామినేషన్లు...
ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు మూడోరోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఖమ్మం ఎంపీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాల్లో నామినేషన్లు బోణీ అయ్యాయి. . భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు మూడురోజులైనా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎంపీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఖమ్మం నగరానికి చెందిన బానోతు లక్ష్మానాయక్, కాంగ్రెస్ అనుబంధ సంఘమైన గాంధీపథం నుంచి బూసిరెడ్డి శంకర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం శాసనసభ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి.
వాటిలో ఖమ్మం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరపున కూరాకుల నాగభూషణం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కర్నాటి హరీష్ సక్సేనా, కొత్తగూడెం నియోజకవర్గానికి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, మధిర నియోజకవర్గానికి సీపీఎం తరఫున లింగాల కమల్‌రాజ్, పాలేరు నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్, వైరా నియోజకవర్గానికి లోక్‌సత్తా పార్టీ నుంచి తేజావత్ నరసింహారావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున భూక్యా బూదేష్, సత్తుపల్లి నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
9న తుది గడువు...
సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు ఈనెల 9 చివరి తేదీ కావడంతో ఆ రోజు నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 6న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణను నిలిపివేశారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు మాత్రం రిటర్నింగ్ అధికారుల నుంచి ఇప్పటికే నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ముహూర్తం చూసుకుని నామినేషన్‌లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానం జాబితా ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులకు బీఫామ్‌లు అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పార్టీ టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేలా ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు, అఫిడవిట్‌లు సిద్ధం చేసుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగాపొంగులేటి నామినేషన్
Published Sat, Apr 5 2014 2:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement