ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: ఖమ్మం పార్లమెంటు స్థానానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అభ్యర్థిత్వ ప్రతిపాదన ఇప్పుడు ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ సీటుకు నారాయణ పేరును ప్రతిపాదించి తొందరపడ్డామా అనే అంతర్మథనం పార్టీలోని కొందరు నేతల్లో ప్రారంభమైంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, వారిని సంప్రదించకుండా నారాయణ పేరును ప్రతిపాదించారనే విమర్శలూ వస్తున్నాయి. కాగా, నారాయణ అభ్యర్థిత్వం పట్ల కొందరు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కూడా సమాచారం.
నారాయణ ఖమ్మం వస్తే జిల్లాలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని, దీనివల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని, తమకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. దీనికి తోడు నారాయణ తెలంగాణకోసం ఎంత పోరాటం చేసినా సీమాంధ్రకు చెందిన వ్యక్తిగానే పరిగణిస్తున్నారని, దీనివల్ల ఆయన పోటీలో నిలబడితే జిల్లాలోని తెలంగాణవాదులు ఆయనకు ఓటేస్తారా అనే సందేహం కూడా పార్టీలో మొదలైంది. ఇప్పటి వరకు సీపీఐ నుంచి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీచేసిన వారంతా స్థానికులే కావడంతో పొత్తులో భాగంగా వచ్చే ఎంపీ స్థానానికి కూడా స్థానికులనే అభ్యర్థిగా నిలబెట్టాలనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది.
నారాయణ అభ్యర్థిత్వం వ్యవహారం ఇలా ఉంటే.... పార్లమెంటు స్థానానికి తానే పోటీకి దిగుతానని పువ్వాడ నాగేశ్వరరావు తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో పార్టీని అంచెలంచెలుగా అభివృద్ధిచేయడంలో కీలకపాత్ర పోషించిన తనను కనీసం సంప్రదించకుండా స్థానికేతరులకు సీటు ఇవ్వాలని పార్టీలో కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పార్టీలోని సీనియర్‌ను నేతలంతా పువ్వాడ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించినట్టు సమాచారం.
మరో గందరగోళం....
ఇదిలా ఉంటే.. అసలు తన అభ్యర్థిత్వంపై స్వయంగా నారాయణ చేసిన వ్యాఖ్యలు జిల్లా పార్టీ వర్గాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి తన అభ్యర్థిత్వం విషయంపై బుధవారం తిరుపతిలో మీట్‌దిప్రెస్‌లో నారాయణ మాట్లాడుతూ... అసలు ఖమ్మం అనేది తమ స్థానం కానే కాదని, తాము నల్లగొండ అడిగితే కాంగ్రెస్ వాళ్లు ఖమ్మం ఇస్తానన్నారని వ్యాఖ్యానించారు. దీంతోపాటు అసలు తన అభ్యర్థిత్వం గురించి తనకు తెలియదని, అంతా మీడియా వాళ్లే రాస్తున్నారని, జిల్లా నాయకులెవరూ తనను అడగలేదని ఆయన చెప్పారు. పైగా మరి ఈ వార్తలను మీరు ఖండిస్తారా అని ప్రశ్నిస్తే తానేమీ ఆ వార్తలను ఖండించబోనని చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు నారాయణ అభ్యర్థిత్వం ప్రతిపాదించే ముందు జిల్లా నాయకత్వం కనీసం ఆయన అభిప్రాయం తీసుకోలేదనే చర్చ జరుగుతోంది.
జిల్లాలోని సీనియర్ నాయకులకు చెప్పకుండా, అసలు నారాయణనే సంప్రదించకుండా అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రతిపాదిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం తమ స్థానం కానే కాదని చెప్పడం ద్వారా రేపటి రోజున ఎన్నికల బరిలో ఉంటే... కార్యకర్తల మనోస్థైర్యాన్ని ఆ వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని నేతలంటున్నారు. మొత్తం మీద నారాయణ అభ్యర్థిత్వం వ్యవహారం జిల్లా సీపీఐ నేతలకు చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి.
తొందర పడ్డామా...?
Published Thu, Apr 3 2014 2:29 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement