సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం మార్కెట్ యార్డు సభా ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కొమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మణుగూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని అన్నారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు.
కాంగ్రెస్‌కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని అన్నారు రేవంత్. మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదని చెప్పారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటేనని గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టారని దుయ్యబట్టారు.
పేదవారితో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కేంద్రం 1200 చేసిందని విమర్శించారు. ఏ ఊర్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారో అక్కడే బీఆర్‌ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో.. ఆ ఊళ్లోనే మేము ఓట్లు అడుగుతామని..ఈ ఛాలెంజ్‌కు బీఆర్‌ఎస్ రెడీనా అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment